ట్యాన్ (tan).. ఎక్కువమందిని ఇబ్బందిపెట్టే చర్మ సమస్య ఇది. కాసేపు అలా ఎండలోకి వెళ్లొస్తే చాలు.. చర్మం నల్లగా మారుతుంది. మిగిలిన కాలాల్లోనూ ఎక్కువగానే ఉన్నా.. ఎండాకాలంలో ఈ ట్యాన్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంత మంచి సన్ స్క్రీన్ లోషన్ రాసినా దాని ప్రభావం కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది. మాటిమాటికీ రాసుకోకపోతే సన్ ట్యాన్ బారిన పడి చర్మం నల్లగా కావాల్సిందే.
Table of Contents
ఈ ట్యాన్ ప్రభావం మన శరీర భాగాల్లో మెడపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం సాధారణంగా ముఖం అందంగా కనిపించాలని ముఖ చర్మం గురించి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం, ట్యాన్ ప్యాక్స్ వంటివి వేసుకుంటూ ఉంటాం. కానీ ఎండ ప్రభావం వల్ల ముఖం కంటే మెడ (Neck) మీద చర్మం తొందరగా ప్రభావితమవుతుంది.
సున్నితంగా ఉన్న ఈ చర్మం ఎండకు కమిలి నల్లగా మారుతుంది. అందుకే ఈసారి ట్యాన్ నుంచి దూరమవ్వాలని ప్రయత్నించేటప్పుడు మీ ముఖంతో పాటు మెడపై కూడా ధ్యాస ఉంచండి. ఈ చిట్కాలతో ముఖంతో పాటు మెడపై ఉన్న ట్యాన్ ని కూడా దూరం చేయండి.
ట్యాన్ ని తొలగించడానికి ఇంటి చిట్కాలు
ట్యాన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మెడపై ట్యాన్ కి గల కారణాలు (Reasons For Sun Tanning)
సాధారణంగా మిగిలిన శరీర భాగాల కంటే మెడ మీద ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పలుచగా కూడా ఉంటుంది. అందుకే మిగిలిన చర్మం కంటే సూర్యకాంతి ప్రభావం దీనిపై ఎక్కువగా పడుతుంది. చాలామందిలో ట్యాన్ (tan) కి గురైనప్పుడు ముఖం కంటే మెడ మరింత నల్లగా కనిపించడం మనం గమనిస్తుంటాం. దీనికి కారణం `మెడ చర్మం సున్నితంగా ఉండడమే. అందుకే దీనిపై ఎండ, కాలుష్యం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
దీనివల్లే మిగిలిన భాగాల కంటే మెడ నల్లగా మారిపోతుంది. కేవలం ఎండ, కాలుష్యం మాత్రమే కాదు.. వివిధ రకాల కెమికల్స్ ఉన్న పదార్థాలు, సబ్బులు, ఇతర ఉత్పత్తులు ఉపయోగించడం వంటివి కూడా మెడ వద్ద ఉన్న చర్మం నల్లగా మారేలా చేస్తాయి. వీటితో పాటు అధిక బరువు ఉన్నవారిలోనూ మెడ నల్లగా మారడం గమనిస్తుంటాం. థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా మెడ నల్లగా మారేలా చేస్తుంది.
దీనితో పాటు శుభ్రత పాటించకపోవడం వల్ల కూడా మెడ నల్లగా మారుతుంది. అయితే కారణాలేవైనా.. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రభావం మెడ దగ్గర ఉన్న చర్మంపై ఎక్కువగా పడి అది నల్లగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండ నుంచి మన మెడను రక్షించుకోవడం మెడ భాగంలో ఉన్న నలుపును వివిధ చిట్కాలు ఉపయోగించి తగ్గించుకోవడం వంటివి పాటించడం మంచిది.
ట్యాన్ ని తొలగించడానికి ఇంటి చిట్కాలు (Home Remedies To Remove Sun Tan In Telugu)
1. కలబంద గుజ్జుతో (Aloe Vera)
కలబంద మన చర్మంలో తేమను పెంచేందుకు తోడ్పడుతుంది. దీని కోసం టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, టేబుల్ స్పూన్ ఎర్రపప్పు పొడి, టేబుల్ స్పూన్ టొమాటో రసం తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకొని మెడ, ముఖానికి అప్లై చేసుకొని, అరగంట పాటు ఉంచుకొని తర్వాత ముఖం కడుక్కుంటే సరిపోతుంది. మెడపై ఉన్న ట్యాన్ తొలగిపోతుంది.
2. బాదం పప్పులతో.. (Almonds)
రెండు మూడు బాదంపప్పులను రాత్రి నానబెట్టి మర్నాడు ఉదయాన్నే మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. అందులో రోజ్ వాటర్, నిమ్మరసం వేసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసుకొని ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు వేసుకోవచ్చు.
3. బేకింగ్ సోడా (Baking Soda)
బేకింగ్ సోడా మన చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. బ్యాక్టీరియా కూడా పెరగకుండా చేస్తుంది. చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. దీంతో ముఖం, మెడ భాగాల్లో మృదువుగా మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు కొన్ని వారాల పాటు చేయడం వల్ల ట్యాన్ పోవడంతో పాటు మచ్చలు కూడా తగ్గుతాయి.
4. తేనె నిమ్మరసం (Honey And Lemon Juice)
తేనె, నిమ్మరసం.. రెండూ మంచి యాంటీఆక్సిడెంట్లే.. ఇవి మన చర్మంపై ఉండే ట్యాన్ ని తొలగించి చర్మం మెరిసేలా చేస్తాయి. దీని కోసం ముందుగా టీస్పూన్ తేనె, రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి అందులో కాస్త శెనగపిండి కూడా వేసి పేస్ట్ లా తయారుచేసి దాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. దీన్ని బాగా ఆరనిచ్చి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ట్యాన్ త్వరగా దూరమవుతుంది.
5. బంగాళాదుంప రసం (Potato Juice)
బంగాళాదుంపల రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతిమంతం చేస్తాయి. ఇది మన చర్మానికి సహజసిద్ధమైన బ్లీచ్ గా కూడా పనిచేస్తుంది. అందుకే ఒక బంగాళాదుంపను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ తురుము నుంచి రసం తీసుకొని అందులో ఒక దూది ఉండను ఉంచి దాని సాయంతో రసాన్ని ముఖమంతా రాసుకోవాలి. ఆ తర్వాత పది నుంచి ఇరవై నిమిషాల పాటు పూర్తిగా ఆరిపోయే వరకూ ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. నీటితో కడిగిన తర్వాత చర్మానికి మంచి మాయిశ్చరైజర్ రాయడం మాత్రం మర్చిపోవద్దు.
6. బొప్పాయితో (Papaya)
ట్యాన్ ని తొలగించడంలో బొప్పాయి తర్వాతే ఇంకేదైనా.. ఇది మన చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. దీని కోసం రెండు మూడు బొప్పాయి ముక్కలు తీసుకొని రెండు మూడు చుక్కల నిమ్మరసం అందులో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకొని పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగి తుడుచుకోవాలి. ఈ ప్యాక్ నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది.
7. పెరుగుతో.. (Curd)
పెరుగు సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇందులోని ఎంజైమ్స్ నిమ్మరసంలోని ఆమ్లాలతో కలిసి ఎండ వల్ల నల్లబడిన చర్మాన్ని తిరిగి మామూలుగా మారుస్తాయి. దీని కోసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకొని వాటిని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని మెడకు, ముఖానికి రుద్దుకొని ఇరవై నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
8. పుచ్చకాయ, తేనె (Watermelon And Honey)
పుచ్చకాయ వేసవిలో ప్రక్రతి అందించిన ఓ వరం అని చెప్పుకోవాలి. దాహాన్ని తగ్గించడం, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడడంతో పాటు శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుందీ పండు. వీటితో పాటు చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుందీ పండు. దీని వల్ల ఎండకు కమిలిన చర్మం చల్లదనాన్ని పొందుతుంది.
దీని కోసం పుచ్చకాయ రసం, తేనె రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకొని వాటిని బాగా కలపాలి. ఇప్పుడు ముఖం బాగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడ భాగం మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఉంచుకొని తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్ తొలగిపోతుంది.
9. కీరదోసతో.. (Cucumber)
కీరదోస కూడా మనల్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే ఆహారమే.. ఇది మన చర్మానికి తగినంత తేమను అందిస్తుంది కూడా. దీని కోసం సగం కీర దోసకాయ, టీ స్పూన్ చక్కెర తీసుకోవాలి. ముందుగా కీర దోసకాయలను బాగా గ్రైండ్ చేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి.
దీనికి ఒక టీస్పూన్ పంచదార చేర్చి ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసి తుడుచుకోండి. ఇలా తరచూ చేస్తుంటే ట్యాన్ (tan) దూరమవుతుంది.
10. చందనంతో (Sandalwood)
రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి మిశ్రమంగా చేసి.. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకొని అరగంట పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత కడిగేస్తే సరి. ట్యాన్ కొద్ది రోజుల్లోనే దూరమవుతుంది.
11. ఓట్ మీల్ తో (Oatmeal)
రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ ని, మూడు టేబుల్ స్పూన్ల మజ్జిగతో కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని గుండ్రంగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత పావుగంట పాటు ఉంచుకొని ముఖం కడుక్కోవాలి. ఇందులోని మజ్జిగ మన చర్మానికి మెత్తదనాన్ని అందించి ట్యాన్ ని తొలగిస్తాయి. ఓట్స్ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తాయి.
12. పసుపు, శెనగ పిండి.. (Turmeric)
పసుపు మంచి యాంటీ బయోటిక్.. ఇది మలినాలను తొలగించడం మాత్రమే కాదు.. ట్యాన్ ని తొలగించి చర్మానికి మంచి వర్ఛస్సును అందిస్తుంది. దీని కోసం టేబుల్ స్పూన్ శెనగ పిండి, టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ పాలు, పావు టీస్పూన్ పసుపు తీసుకోవాలి.
ముందు శెనగ పిండి, పసుపు కలుపుకొని అందులో కొద్ది కొద్దిగా పాలు, రోజ్ వాటర్ చేర్చుకుంటూ మరీ లూజ్ గా కాకుండా బజ్జీల పిండిలా ఉండేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని బాగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు బాగా అప్లై చేసుకోవాలి. దీన్ని ఇరవై నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత నీటితో తడిపి మెత్తగా అయ్యాక మసాజ్ చేస్తూ సవ్య, అపసవ్య దిశల్లో నెమ్మదిగా రుద్దుకుంటూ తొలగించాలి. తర్వాత ముఖం కడుక్కొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.
13. చందనం, కొబ్బరి నీళ్లు (Coconut Water)
టేబుల్ స్పూన్ చందనం పొడిని టేబుల్ స్పూన్ కొబ్బరి నీళ్లతో కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడలకు రుద్దుకొని బాగా ఆరేంతవరకూ ఉంచుకోవాలి. తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి మూడుసార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
14. పైనాపిల్ తో.. (Pinnaple)
పైనాపిల్ పుల్లని రుచి మాత్రమే కానీ.. అందమైన లుక్ ని అందించే పండ్ల రారాజు. ఇది మన చర్మంపై మృత కణాలను తొలగించి, ట్యాన్ ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ముడతలను తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పైనాపిల్ గుజ్జు తీసుకొని అందులో టేబుల్ స్పూన్ తేనె కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేసి పావుగంట పాటు ఉంచుకోవాలి. తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే సరి.
15. క్యాబేజీ ఆకులు (Cabbage Leaves)
క్యాబేజీ ఆకులకు ట్యాన్ ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కె లు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అవి చర్మాన్ని మెరిపిస్తాయి. దీని కోసం మనం చేయాల్సిందల్లా.. క్యాబేజీ ఆకులను మెడ, ముఖం మాత్రమే కాదు.. ట్యాన్ కి గురైన ప్రాంతాలన్నింటిలో పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకూ ఉంచుకోవాలి. దీన్ని వీలైనంత తరచూ ఉపయోగించవచ్చు.
ట్యాన్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (Effective Skincare Tips To Prevent Sun Tan)
1. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి.. (Apply Sunscreen Lotion)
సన్ ట్యాన్ బారిన పడకుండా ఉండాలంటే బయటకు వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మర్చిపోవద్దు. ఇది మన చర్మాన్ని ఎండ బారిన పడకుండా కాపాడుతుంది. అయితే సన్ స్క్రీన్ లోషన్ రాయడానికి కూడా కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఎండలో బయల్దేరడానికి కనీసం పావు గంట ముందు సన్ స్క్రీన్ లోషన్ రుద్దుకోవాలి.. దీన్ని కావాలంటే మేకప్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు.
సన్ స్క్రీన్ గుణాలున్న ఫేస్ క్రీమ్ లను కూడా రాసుకోవచ్చు. సాధారణంగా ఎస్ పీ ఎఫ్ (సన్ ప్రొటెక్టంట్ ఫ్యాక్టర్ ) 15 నుంచి 30 వరకూ ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం వల్ల మన చర్మానికి ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. ఒకవేళ మీరు ఎండలో ఎక్కువ సమయం ఉండాల్సి వస్తే గంట తర్వాత తిరిగి మరోసారి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎండలో ఎక్కువగా పనిచేసే ఉద్యోగంలో ఉంటే ఎస్పీఎఫ్ 50 ఉన్న క్రీములను ఎంచుకోవడం వల్ల మీ చర్మంపై ట్యాన్ లేకుండా జాగ్రత్త పడవచ్చు.
అయితే ఎస్పీఎఫ్ విలువ పెరుగుతున్న కొద్దీ వాటిని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంటుంది. కాబట్టి 50 కంటే ఎక్కువ ఎస్పీఎఫ్ విలువున్న క్రీములు ఉపయోగించకపోవడం మంచిది. ఉదయాన్నే లేలేత సూర్యకిరణాల నుంచి విటమిన్ డి లభిస్తుంది కాబట్టి ఆ సమయంలో మాత్రం సన్ స్క్రీన్ లోషన్ కి దూరంగా ఉండాలి. ఇందులోనూ వాటర్ ప్రూఫ్ క్రీమ్ ఎంచుకోవడం వల్ల చెమట వచ్చినా క్రీమ్ చెరిగిపోకుండా జాగ్రత్తపడచ్చు.
2. దుస్తులతో కవర్ చేయండి. (Cover You Skin With Proper Clothes)
ఎంత సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నా.. సూర్యకాంతి నుంచి మనకు పూర్తిగా రక్షణ లభిస్తుందని చెప్పలేం. అందుకే ఎండాకాలం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ఎండలో వెళ్తున్నప్పుడు చర్మం మొత్తం కవరయ్యేలా ఉండే దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
దీని వల్ల సూర్య కిరణాలలోని యూవీ కిరణాల నుంచి రక్షణ పొందవచ్చు. దుస్తులు పూర్తిగా ఉండాలి కానీ మరీ బిగుతుగా లేకుండా కాస్త వదులుగా ఉంటే సౌకర్యంగా అనిపిస్తుంది. దుస్తులతో దాదాపు శరీరం మొత్తాన్ని(tan) కవర్ చేయాలి. మెడను కూడా ఫుల్ నెక్ షర్ట్స్, టీషర్ట్స్, టాప్స్, చుడీదార్స్, బ్లౌజులు వంటివి ధరించి కవర్ చేయడం వల్ల మెడపై ట్యాన్ ప్రభావం తక్కువగా ఉంటుంది.
3. మధ్యాహ్నం బయట తిరగకండి. (Avoid Going Out During Afternoon)
వేసవిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎండ ప్రభావానికి గురి కాకుండా ఉండడం అంటే దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. అందుకే మరీ అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది.
మిట్ట మధ్యాహ్నం యూవీ కిరణాలు నేరుగా భూమిపై పడుతుంటాయి. అందుకే ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. దీంతో పాటు ఎండ వేడికి మన చర్మం కమిలిపోవడం, నల్లబడడం నుంచి కూడా రక్షణ పొందేందుకు వీలుంటుంది.
4. వీటిని ధరించండి.. (Wear Sunscreen ANsd Carry An Umbrella0
ఎండలో మరీ అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్ రుద్దుకోవడం, శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వేసుకోవడంతో పాటు హ్యాట్ లేదా గొడుగు తీసుకెళ్లడం మర్చిపోవద్దు. స్కార్ఫ్ ల వల్ల ఎండ ప్రభావం ముఖంపై పడకుండా ఉంటుంది కానీ అది చాలా తక్కువ మోతాదులోనే.. అందుకే దాని కంటే గొడుగు ఉపయోగించడం మంచిది.
అంతేకాదు.. కళ్లకు ఎండ నుంచి హానికారక కిరణాల నుంచి రక్షణ కల్పించేందుకు మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించడం మంచిది. మంచి కంపెనీ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కళ్లకు రక్షణ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి.
చర్మం పై మొండి మచ్చలా? వాటికి ఇలా చెక్ పెట్టండి..
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమైన మోము కూడా సొంతమవుతుంది..!
ఆయుర్వేదం.. మేని అందానికి చక్కటి ఔషధం..!