ఆయిలీ స్కిన్ కలిగిన వారికి.. సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్..!

ఆయిలీ స్కిన్ కలిగిన వారికి.. సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్..!

జిడ్డు చర్మం (Oily Skin) కలిగిన వారికి వేసవిలో (Summer) చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే.. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం మరింత జిడ్డుగా మారిపోతుంది. పైగా ఈ సమయంలో వీరికి మొటిమల సమస్య సైతం ఎక్కువవుతుంది. అలాగే చెమట, జిడ్డు కారణంగా పొక్కులు రావడం, మంటగా అనిపించడం జరుగుతుంది. అందుకే వేసవిలో ఆయిలీ స్కిన్ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే చర్మం జిడ్డుగా మారకుండా ఉంటుంది.


 • ముఖం శుభ్రం చేసుకోవడానికి గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. ఎందుకంటే చల్లటి నీటితో పోలిస్తే.. గోరువెచ్చగా ఉన్న నీరు ముఖంపై ఉన్న జిడ్డును ప్రభావవంతంగా తొలగిస్తుంది. జిడ్డుతో పాటు చర్మంపై ఉన్న మురికి, మలినాలను సైతం వదిలిస్తుంది. దీనివల్ల చర్మరంధ్రాలు సైతం తెరచుకుంటాయి.

 • వేసవిలో చర్మం జిడ్డుగా ఉండకూడదంటే పాటించాల్సిన మరో చిట్కా టోనర్ ఉపయోగించడం. టోనర్‌తో నుదుటిపై, ముక్కు చుట్టూ ఉండే అధిక నూనెలను తొలగించుకోవడం మంచిది. టోనర్ చర్మంపై ఉన్న అధిక జిడ్డును తొలగించడం మాత్రమే కాకుండా.. చర్మ గ్రంథులు నూనెలు అధికంగా విడుదల చేయకుండా చేస్తుంది.

 • వేసవిలో ముఖం జిడ్డుగా కనిపించకుండా ఉండాలంటే.. రోజూ తప్పనిసరిగా రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి. దీని కోసం జెల్ బేస్డ్ క్లెన్సర్ ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగని మరీ ఎక్కువ సార్లు ముఖం శుభ్రం చేసుకోకూడదు. దీని వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంది.


1-oily-skin-summer-care


 • రోజుకి రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకొన్నప్పటికీ.. జిడ్డుగా కనబడదనే గ్యారంటీ లేదు. అలాగని ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకొంటే చర్మం పొడిబారిపోతుంది. అందుకే అప్పుడప్పుడూ టిష్యూతో ముఖం శుభ్రం చేసుకొంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు రావడం సైతం తగ్గుతుంది.

 • చర్మంపై ఉన్న మృత‌క‌ణాలు, బ్లాక్ హెడ్స్ వంటి వాటిని తొలగించుకోవడానికి వారానికి రెండు సార్లు స్క్రబ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 • చర్మంపై ఉన్న జిడ్డును తొలగించడానికి, చర్మగ్రంథులు అధికంగా నూనెలు విడుదల చేయకుండా ఉండటానికి అప్పుడప్పుడూ ముల్తానీ మట్టి లేదా చందనంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు వేసుకొంటూ ఉండాలి.

 • వేసవిలో వీలైనంత వరకు తక్కువ మేకప్ వేసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా హెవీ ఫౌండేషన్ క్రీంలను ఈ సమయంలో ఉపయోగించకపోవడమే మంచిది.

 • ఫౌండేషన్, ప్రైమర్, హైలైటర్ ఇలా వివిధ రకాల మేకప్ ఉత్పత్తులు వాడటానికి బదులుగా బేబీ క్రీం ఉపయోగించడం మంచిది.

 • ఆయిలీ స్కిన్ ఉన్నవారు వేసవిలో వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది.

 • సాధారణంగా జిడ్డు చర్మం కలిగినవారికి తరచూ తమ చర్మాన్ని చెక్ చేసుకోవడం అలవాటు. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ల ద్వారా మరింత జిడ్డు చర్మంపైకి చేరుతుంది. జిడ్డు మాత్రమే కాదు మురికి, క్రిములు సైతం చర్మంపై చేరతాయి. దీని వల్ల ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వీలైనంత వరకు మీ చేతులతో తరచూ ముఖాన్ని తాకకుండా ఉంటే మంచిది.


చర్మ తత్వం తెలుసుకోవడానికి పరీక్షలు (How To Know Your Skin Type)


2-oily-skin-summer-care


 • చర్మం జిడ్డుగా మారకుండా ఉండాలంటే మనం తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. చిలగడ దుంప, క్యారెట్, ఆకు కూరలు, కర్భూజ, మామిడి, ఆప్రికాట్ వంటివి తినడం మంచిది. తగినంత నీటిని తాగడం ద్వారా కూడా ముఖాన్ని జిడ్డుగా మారకుండా కాపాడుకోవచ్చు.

 • మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఎల్లప్పుడూ బ్లాటింగ్ షీట్స్ ఉంచుకోండి. ఎప్పుడైనా చర్మం బాగా జిడ్డుగా అనిపిస్తే.. ఈ బ్లాటింగ్ షీట్‌ను ఒకసారి ముఖంపై పూర్తిగా పరుచుకొనేలా వేయాలి. ఇది ముఖంపై ఉన్న జిడ్డును మొత్తం పీల్చేస్తుంది. ఈ బ్లాటింగ్ షీట్ వల్ల ముఖానికి వేసుకొన్న మేకప్ ఏ మాత్రం పాడవదు.

 • మూడు టీస్పూన్ల బియ్యంపిండికి చిటికెడు పసుపు, చెంచా తేనె, చెంచా కీరదోస రసం కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని కాసేపాగిన తర్వాత శుభ్రం చేసుకొంటే.. చర్మం జిడ్డుగా మారదు. ఈ ప్యాక్ వారానికోసారి వేసుకోవడం సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి సాంత్వన కలగడంతో పాటు చర్మానికి తగిన పోషణ కూడా అందుతుంది. ఈ మిశ్రమాన్ని బాడీ స్క్రబ్‌గానూ ఉపయోగించవచ్చు. దీని కోసం ఎక్కువ మోతాదులో మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.


ఇవీ ఈ వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఆయిలీ స్కిన్ కలిగిన వారు పాటించాల్సిన చిట్కాలు. ఇలా చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవడంతో పాటు.. చర్మ ఆరోగ్యాన్ని సైతం కాపాడుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:


మండు వేసవిలో మిమ్మల్ని చల్లబరిచే.. కూల్ కూల్ ఐస్డ్ టీ రెసిపీస్ మీకోసం..!


ఇది మట్టి కుండ కాదు.. ఆరోగ్య ప్రదాయిని..!


కళ్ల కింద నల్లటి వలయాలా? తేనెతో వాటిని తొలగించుకోవచ్చు..