పచ్చిమామిడి కాయతో పకోడీలు.. ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

పచ్చిమామిడి కాయతో పకోడీలు.. ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

వేసవిలో మాత్రమే లభించే పండు.. మామిడి. అసలు దీన్ని చూడగానే నోట్లో నీళ్లు అలా ఊరిపోతాయంతే. బంగినపల్లి, నూజివీడు రసాలు, కొత్తపల్లి కొబ్బరి.. ఇలా రకరకాల మామిడికాయలు వేసవిలో లభిస్తాయి. అందుకే ఈ సమయంలో మిగిలిన పండ్ల కంటే మామిడి పండ్లనే కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మామిడి పండు తినడంలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్. కొందరు పచ్చి మామిడి(raw mango) ముక్కలపై ఉప్పూకారం జల్లుకొని తింటే; మరికొందరు బాగా పండినవి తినడానికి ఇష్టపడుతుంటారు.


ఇంకొందరు పచ్చి మామిడితో కూరలు వండుకొని తింటూ ఉంటారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పప్పు మామిడికాయ, చికెన్ మామిడికాయ, రొయ్యలు మామిడి కాయ, మామిడి కాయ పులిహోర, ఇతర కాయగూరలతో కలిపి రకరకాల వంటలు చేసుకుని తింటూ ఉంటారు. ఆవకాయ, మాగాయ వంటి పచ్చళ్లు సైతం పెడుతుంటారు. ఇవే కాదండోయ్.. పచ్చి మామిడితో పకోడీలు, పరోటాలు కూడా చేసుకోవచ్చు. మీక్కూడా ఇవి తినాలనుంది కదా. అయితే ఈ పచ్చిమామిడి రెసిపీస్ మీ కోసమే. వాటిని ఓ సారి రుచి చూడండి మరి..


మామిడి కాయ పకోడి


1-raw-mango-dhokla


కావాల్సినవి: పచ్చిమామిడికోరు - అర కప్పు, తురిమిన బంగాళాదుంప - పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ- పావు కప్పు, శెనగపిండి - అరకప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె తగినంత


తయారు చేయు విధానం: 


పైన మనం చెప్పుకొన్న పదార్థాలన్నింటినీ గిన్నెలో వేసి సరిపడినంత నీరు వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి.. నూనె బాగా కాగిన తర్వాత ఈ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసి వేయించాలి. కొత్తిమీర చట్నీతో వేడివేడిగా ఉన్నప్పుడే తింటే ఇవి చాలా రుచికరంగా ఉంటాయి.


మామిడి-క్యారెట్ పరోటా


2-raw-mango-dhokla


కావాల్సినవి: గోధుమ పిండి - కప్పు, పచ్చి మామిడి కోరు - కప్పు, క్యారెట్ కోరు - కప్పు, పసుపు - చెంచా, వాము - చెంచా, జీలకర్ర - చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ - చెంచా, తరిగిన ఉల్లిపాయ - ఒకటి, పర్చిమిర్చి - కొన్ని, ఉప్పు-  తగినంత, తరిగిన కొత్తిమీర - కొద్దిగా, నూనె - సరిపడా.


తయారీ విధానం: గిన్నెలో గోధుమపిండి, రెండు చెంచాల నూనె, సరిపడినంత ఉప్పు, నీరు వేసి చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దపై శుభ్రమైన వస్త్రాన్ని కప్పి పావుగంట పక్కన పెట్టి ఉంచాలి. దీని వల్ల పరోటా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఈ లోపు పరోటాలోకి అవసరమైన స్టఫ్ తయారు చేసుకోవాలి.


బాణలిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, వాము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, మామిడి, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర వేసి దించేయాలి. ఇప్పుడు గోధుమపిండి ముద్దను చపాతీల మాదిరిగా కాస్త మందంగా ఒత్తుకోవాలి. అలా ఒత్తిన రెండు చపాతీల మధ్యలో కూరను ఉంచి అది బయటకు రాకుండా చుట్టూ మడిచి మరోసారి ఒత్తుకోవాలి. వీటిని పెనం మీద కాల్చితే మామడి - క్యారెట్ పరోటా రెడీ.


పచ్చిమామిడి ఢోక్లా


3-raw-mango-dhokla


కావాల్సినవి: శెనగపప్పు - కప్పు, పచ్చిమామిడి కోరు - కప్పు, నిమ్మరసం - చెంచా, సన్నగా తరిగిన పచ్చిమిర్చిముక్కలు  - చెంచా, చక్కెర - టీస్పూన్, రిఫైన్డ్ నూనె- సరిపడినంత, జీలకర్ర - టీస్పూన్, ఆవాలు - టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - సరిపడినంత, కొత్తిమీర - కొద్దిగా, ఈనో సాల్ట్ - చెంచా


తయారు చేయువిధానం: ముందుగా శెనగపప్పును రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పప్పును శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో నిమ్మరసం, ఈనో సాల్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి పచ్చిమామిడి కోరు కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు స్టీలు లేదా అల్యూమినియం గిన్నె తీసుకొని దాని లోపలి భాగంలో నూనె రాయాలి. అందులో ముందుగా కలిపి పెట్టుకొన్న ఈ మిశ్రమాన్ని వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఆవిరిపై ఉడికించాలి. పావుగంట నుంచి ఇరవై నిమిషాల తర్వాత మిశ్రమం ఉడికిందో లేదో చూడాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపి బాగా చల్లారనివ్వాలి.


ఆ తర్వాత దాన్ని మీడియం సైజ్  ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులో కరివేపాకు, చక్కెర, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి వేసి అవి కూడా వేగిన తర్వాత అర కప్పు నీరు పోయాలి. ఒక నిమిషం పాటు నీరు కాగనిచ్చి ఇందులో మనం కట్ చేసి పెట్టుకొన్న ముక్కలు వేస్తే చనా ఢోక్లా రెడీ. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి


చామంతి టీ గురించి ఎప్పుడైనా విన్నారా? దాని రుచి చూశారా?


మండు వేసవిలో మిమ్మల్ని చల్లబరిచే.. కూల్ కూల్ ఐస్డ్ టీ రెసిపీస్ మీకోసం..!


ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!