రంజాన్ స్పెషల్: భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

రంజాన్ స్పెషల్: భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

హైదరాబాద్ (Hyderabad)ని ఒక 'మినీ ఇండియా' గా చాలామంది అభివర్ణిస్తుంటారు. దానికి ప్రధాన కారణం ఇక్కడ అనేక రాష్ట్రాలకి చెందిన వారు ఒకరితో ఒకరు కలిసి మెలిసి జీవిస్తుంటారు. అదే సందర్భంలో ఇక్కడ హిందూ-ముస్లింలు ఎక్కువ సంఖ్యలో కలిసి జీవిస్తుండడంతో.. వీరి కలయికని 'గంగా-జెమున తెహజీబ్' అని కూడా పిలుస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ హైదరాబాద్ నగరానికి మణిహారంగా మరోదాన్ని చెప్పుకోవచ్చు. అదే హైదరబాదీ బిర్యాని (Hyderabadi Biryani). ప్రపంచంలో చాలా చోట్ల బిర్యాని లభిస్తున్నప్పటికి, హైదరాబాద్‌ బిర్యానీకి మాత్రం ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగే ఉందని చెప్పాలి.


అయితే రంజాన్ (Ramzan) ఉపవాస దీక్షల నేపథ్యంలో ఈ బిర్యానీ ఘుమఘుమలు.. నెల రోజుల పాటు తారాస్థాయికి చేరుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మిగతా సీజన్స్‌తో పోలిస్తే ఈ సమయంలో బిర్యానీ రుచి చూసేందుకు బిర్యానీ ప్రియులు మరింత ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు.


దీనికి తోడు వినియోగదారుల మనసు గెలుచుకునేందుకు.. సదరు హోటల్ నిర్వాహకులు సైతం రకరకాల బిర్యానీలతో పాటు; ఇంకొన్ని రుచికరమైన వంటకాలను సైతం అందిస్తుంటారు.


ఈ క్రమంలో రంజాన్ సీజన్‌లో హైదరాబాద్ నగరంలో రుచికరమైన, అచ్చమైన హైదరబాదీ బిర్యానీ రుచి చూడాలంటే మాత్రం ఈ  హోటల్స్‌ని సందర్శించాల్సిందే..


సార్వి హోటల్ (Sarvi Hotel)


సాధారణంగా ఈ సార్వి హోటల్‌లో లభించే ఇరానీ ఛాయ్‌కి చాలా మంచి పేరుంది. అలాంటిది ఈ రంజాన్ సీజన్‌లో లభించే బిర్యానీ కోసం కస్టమర్లు బారులు తీరి మరీ ఎంతసేపైనా వేచిచూస్తారంటే అది అతిశయోక్తి కాదు. బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి ముందు ఉన్న ఈ రెస్టరెంట్‌లో బిర్యానీతో పాటు రుచికరమైన మాంసాహార పదార్థాలు కూడా లభిస్తాయి.


చిరునామా- సార్వి హోటల్, కేర్ ఆసుపత్రి ముందు, బంజారా హిల్స్, హైదరాబాద్.


sarvi-hotel-1


Image: Zomato


షా గౌజ్ కేఫ్ & రెస్టరెంట్ (Shah Ghouse Cafe & Restaurent)


టోలిచౌకి & హైటెక్ సిటీ వద్ద ఉన్న ఈ రెస్టరెంట్ గురించి హైదరాబాద్‌లో తెలియని వారుండరు. ఈ బిర్యానీ సెంటర్ అంతగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంది. సంవత్సరం పొడవునా అత్యంత రుచికరమైన బిర్యానీ లభించే ఈ హోటల్‌లో రంజాన్ సీజన్‌లో స్పెషల్ బిర్యానీ పేరిట మరింత రుచికరమైన బిర్యానీ లభిస్తుంది. ఇక దీనికి తోడుగా హలీమ్ ఎలాగూ ఉండనే ఉంటుంది. బిర్యానీ లవర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టని రెస్టరెంట్ ఇది.


చిరునామా- షా గౌజ్ కేఫ్ & రెస్టరెంట్, ఆర్.టీ.ఏ ఆఫీసు పక్కన, టోలిచౌకి & బయో-డైవర్సిటీ సిగ్నల్ దగ్గర, రాయదుర్గం.


shah-gouse-1


Image: Zomato


 


ఆల్ఫా హోటల్ (Alpha Hotel)


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపలికి రాగానే మనకు ఈ ఆల్ఫా హోటల్ దర్శనమిస్తుంది. ఈ హోటల్‌లో స్నాక్స్ మొదలుకొని బిర్యానీ వరకు అన్నీ లభిస్తాయి. పైగా ఇక్కడ ధరలు సామాన్యులకి సైతం అందుబాటులో ఉండడంతో చాలామంది ఈ హోటల్‌కి వస్తుంటారు. దాదాపు దశాబ్దాల క్రితం నెలకొల్పబడిన ఈ హోటల్‌లో లభించే బిర్యానీ అద్భుతమనే చెప్పాలి. ఈ హోటల్‌లో బిర్యానీని ఆస్వాదించడానికి ఎంతో మంది రైలు ప్రయాణం చేసే వారు సైతం ఆసక్తి చూపుతుంటారు.


చిరునామా- ఆల్ఫా హోటల్, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్.


alfa-biriyani-1


Image: Zomato


 


కేఫ్ బహార్ (Cafe Bahar)


కేవలం రంజాన్ సీజన్‌లోనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా ఈ కేఫ్ & రెస్టరెంట్‌లో లభించే బిర్యాని రుచి అమోఘం అని చెప్పి తీరాల్సిందే. ఈ రెస్టరెంట్‌లో రంజాన్ సీజన్‌లో ప్రత్యేకంగా బిర్యానీ‌తో పాటుగా హలీమ్‌ని కూడా రుచి చూసేందుకు భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తుంటారు.


చిరునామా- ఓల్డ్ ఎమ్యెల్యే క్వార్టర్స్ రోడ్డు, అవంతి నగర్, హిమాయత్ నగర్, హైదరాబాద్.


cafe-bahar


Image: Zomato


 


బావార్చి (Bawarchi Hotel)


హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సినిమా థియేటర్స్ ఎంత ఫేమస్సో.. అదే స్థాయిలో అక్కడ ఉన్న బావార్చి రెస్టరెంట్ కూడా ఫేమస్ అని చెప్పచ్చు. ఈ హోటల్‌లో "మాకు ఇక్కడ తప్ప వేరే ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు" అనే ఒక బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. ఈ హోటల్‌కి ఎంతటి పేరు- ప్రఖ్యాతులు ఉన్నాయో; నగరంలో మిగతా హోటల్స్ వీరి ఆహారపదార్థాల తయారీ శైలిని అనుకురించేందుకు ఏ స్థాయిలో పోటీ పడతాయో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఇలాంటి బావార్చి హోటల్‌లో బిర్యానీ అంటే అసలు వంక పెట్టే వీలు కూడా ఉండదు.


చిరునామా- బావార్చి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.


bawarchi-1


Image: Zomato


 


ప్యారడైజ్ (Paradise Hotel)


ఈ హోటల్ కొద్ది రోజుల క్రితమే ఒక సంవత్సర కాలంలో అత్యధిక బిర్యానీలను విక్రయించినందుకుగానూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించి రికార్డు స్రుష్టించింది. ఒకప్పుడు కేవలం సికింద్రాబాద్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్న ఈ హోటల్ తర్వాతి కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైటెక్ సిటీ, మసాబ్ ట్యాంక్ & ప్రసాద్స్ ఐమ్యాక్స్ వద్ద కొత్త శాఖలను నెలకొల్పింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిందంటే ఈ హోటల్ లో లభించే బిర్యానీ రుచి కోసం ప్రత్యేకంగా చెప్పాలా??


చిరునామాలు- ప్యారడైజ్ సెంటర్,  మసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ (హైటెక్ సిటీ)


paradise-1


Image: Zomato



హోటల్ షాదాబ్ (Hotel Shadab)


హైదరాబాద్‌లోని పాత నగరంలో (ఓల్డ్ సిటీ) ఉన్న ఈ హోటల్‌కి దేశ, విదేశాల్లో కూడా కస్టమర్లున్నారు. ముఖ్యంగా రంజాన్ సీజన్‌లో అయితే.. ఈ రెస్టరెంట్‌లో కూర్చుని తినడానికి మనకి ప్లేస్ కూడా దొరకడం కష్టమంటే.. దీనికి ప్రజాదరణ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ నోరూరించే బిర్యానీ రుచి చూశాక కాసేపు చార్మినార్ అందాలను కూడా ఆస్వాదించి వెళ్తుంటారు పర్యటకులు, నగరవాసులు.


చిరునామా- మదీనా సర్కిల్‌కి ఎదురుగా, చార్మినార్, హైదరాబాద్.


hotel-shadab


Image: Zomato



ప్రిన్స్ రెస్టరెంట్ (Prince Restaurent)


ఈ హోటల్‌లో లభించే బిర్యానీ కోసం నగరం నలుమూలల నుంచి బిర్యానీ ప్రియులు మెహదీపట్నంకి వస్తుంటారు. ఇక్కడ బిర్యానీ అత్యంత రుచిగా ఉండడమే ఇంతటి ఫాలోయింగ్‌కి కారణం. పైగా ఈ హోటల్ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళడం కూడా చాలా సులువు కావడంతో.. అక్కడికి షాపింగ్‌కి వెళ్లేవారంతా ఇక్కడ ఆగి, బిర్యాని రుచి చూసి మరీ వెళుతుంటారు.


చిరునామా- బస్ డిపో రోడ్డు, మెహదీపట్నం, హైదరాబాద్.


biriyan-prince-1


Image: Zomato



డైన్ హిల్ రెస్టరెంట్ (Dine Hill Restaurent)


ప్రఖ్యాత అరబిక్ పద్దతిలో ఒక పెద్ద ప్లేట్‌లో బిర్యానీ అందించడం ఈ డైన్ హిల్ రెస్టరెంట్ స్పెషాలిటీ. ఈ రెస్టరెంట్‌లో సింగల్ మొదలుకుని ఫ్యామిలీ, జంబో ప్యాక్ వరకు రకరకాల పెద్ద ప్లేట్స్‌లో కస్టమర్స్‌కి బిర్యానీ వడ్డిస్తుంటారు. బిర్యానీని అరబిక్ స్టైల్‌లో రుచి చూడాలనుకునేవారు ఇక్కడకి తప్పక విచ్చేయాల్సిందే..


చిరునామా- బంజారాహిల్స్ రోడ్డు నెం- 1, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్.


dinehill


Image: Zomato


తెలుసుకున్నారుగా.. హైదరాబాద్‌లో రుచికరమైన బిర్యానీ దొరికే 9 హోటల్స్‌కు సంబంధించిన వివరాలు. మరింకెందుకు ఆలస్యం.. ఈ రంజాన్ సీజన్‌లో నోరూరించే బిర్యానీ రుచి చూసేందుకు మీరూ రడీ అయిపోండి.


Featured Image: twitter.com/samantha akkineni


 


ఇవి కూడా చదవండి


హైదరాబాదీ బిర్యానికి.. గట్టి పోటీ ఇస్తున్న మండి రైస్ ..!


రంజాన్ సీజన్ స్పెషల్.. హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??


హైదరాబాద్ కి షాన్.. "ఉస్మానియా బిస్కెట్స్" చరిత్ర మీకోసం...!