ఈ బామ్మ తయారు చేసే.. స్టైలిష్ బ్యాగులకు డిమాండ్ బాగా ఎక్కువ..!

ఈ బామ్మ తయారు చేసే.. స్టైలిష్ బ్యాగులకు డిమాండ్ బాగా ఎక్కువ..!

89 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు ఎలా ఉంటారు? బాధ్యతలన్నీ పూర్తి చేసి అలసిన శరీరాలతో ఉంటారు. మతిమరుపు, ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. 89 ఏళ్ల వయసులో కూడా ఆన్ లైన్ పద్థతిలో పొత్లీ బ్యాగుల (potli bags) వ్యాపారాన్ని ప్రారంభించి.. సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా మారింది. తానే స్వయంగా తయారు చేసే ఈ బ్యాగులకు ఫ్యాషన్ ప్రపంచంలో డిమాండ్ బాగా ఎక్కువ. జర్మనీ, న్యూజిలాండ్, ఒమన్ వంటి దేశాలనుంచి సైతం ఆమెకు ఆర్డర్లు వస్తున్నాయంటే.. తన నైపుణ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ ఈ బామ్మ పేరేంటో తెలుసా? లతిక చక్రవర్తి (Latika Chakravorty).

Instagram

అస్సాంలోని దుబ్రీలో జన్మించారు లతిక చక్రవర్తి. ఆమెకు వివిధ  వస్త్రాలను సేకరించడం హాబీ. ఆమె భర్త సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగి కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు తరచూ మారుతూ ఉండాల్సి వచ్చేది. దీనివల్ల ఆయా ప్రాంతాలకు చెందిన ప్రత్యేకమైన చీరలు, వస్త్రాలను కొనుగోలు చేసి భద్రపరచుకొనేవారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత తాను సేకరించిన చీరలను పునర్వినియోగించాలని భావించారు. అందుకే వాటితో తన పిల్లలకు దుస్తులు, స్వెట్టర్లు కుట్టేవారు. వారు పెరిగి పెద్దయిన తర్వాత వాటితో బొమ్మలు తయారుచేయడం, వాటికి దుస్తులు కుట్టడం వంటివి తయారుచేసేవారు. ఎందుకంటే లతిక తరానికి చెందినవారికి.. పాతవైపోయిన వాటిని పడేయడం ఇష్టం ఉండదు. వాటిని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తారు.

లతిక చక్రవర్తి పొత్లీ బ్యాగులు తయారుచేయడం ఐదేళ్ల క్రితమే మొదలుపెట్టారు. ఆమె కోడలు సుస్మిత తన చీరకు మ్యాచింగ్ పొత్లీ బ్యాగ్ తయారు చేయమని ఆమెను అడిగారట. లతిక తయారుచేసిన బ్యాగ్ ఆమె కోడలికి బాగా నచ్చింది. అప్పటి నుంచి లతిక తన పాత చీరలతో పొత్లీ బ్యాగులు తయారుచేసి కుటుంబ సభ్యులకు, తెలిసినవారికి బహుమతిగా అందించేవారట. ఆ తర్వాత లతిక  ఆమె మనవడు జాయ్ అందించిన ప్రోత్సాహంతో వ్యాపారం ప్రారంభించారు.

Instagram

జర్మనీలో స్థిరపడిన జాయ్ తన కుటుంబ సభ్యులను చూడటానికి వచ్చినప్పుడు.. బామ్మ తయారుచేసిన బ్యాగులను చూసి ఆన్ లైనులో లతికాస్ బ్యాగ్స్ పేరుతో ఓ వెబ్సైట్ ప్రారంభించారు. జాయ్‌తో పాటు లతిక  మనవరాలు ప్రియాంక, మరో మనవడు శ్రీజిత్ బామ్మ వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్‌లు చేసేవారు. అలా బామ్మగారి బ్యాగులకు గిరాకీ పెరగడం మొదలైంది. లతిక చేసే వ్యాపారంలో కుటుంబ సభ్యులే ఆమెకు తోడుగా ఉంటున్నారు. ఆమె కొడుకు బామ్మగారి వ్యాపార వ్యవహారాలను చూసుకుంటుంటే.. కోడలు బ్యాగులు తయారు చేసే విషయంలో ఆమెకు సాయం చేస్తుంటారు.

సాధారణంగా బ్యాగులు తయారుచేయడానికి బామ్మగారు ఎక్కువగా తన పాత చీరలే ఉపయోగిస్తుంటారు. అలాగని అన్నింటినీ దీనికోసం ఉపయోగించరు. తాను చాలా ప్రత్యేకంగా భావించే.. తను బాగా ఇష్టపడే చీరలను పొత్లీ బ్యాగులు తయారుచేయడానికి ఉపయోగించరు. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో బ్యాగులు తయారుచేస్తున్నారు కాబట్టి.. తన ఇంట్లోవారి పాత వస్త్రాలను సైతం ఉపయోగిస్తున్నారు.

Instagram

బ్యాగులు తయారుచేయడానికి లతిక చేతితో తిప్పే కుట్టుమిషన్ ఉపయోగిస్తారు. దీన్న 64 ఏళ్ల క్రితం ఆమ భర్త క్రిష్ణ లాల్ చక్రవర్తి బహుమతిగా ఇచ్చారు. ఆయన మరణించి పాతికేళ్లు పైనే అవుతోంది. అయినప్పటికీ ఈ కుట్టుమిషన్ చూస్తే తన భర్తే గుర్తుకు వస్తారట.    

బామ్మగారు తయారుచేసే బ్యాగులన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. అదెలా సాధ్యమని అడిగితే.. ‘నేను బ్యాగులు తయారుచేయడాన్ని వ్యాపారంగా మాత్రమే చూడటం లేదు. అది నా సంతోషం కోసం చేస్తున్నాను’ అంటారు. అంతేకాదు అసలు బ్యాగు తయారుచేయడానికి ముందే ఏ డిజైన్ అయితే బాగుంటుందో  ఆలోచిస్తారట.   బెస్ట్ అనిపించిన డిజైన్ మాత్రమే  ఎంచుకొంటారు. అంతేకాదు.. బ్యాగును హడావుడిగా తయారుచేయరు. ఎందుకంటే బ్యాగు తయారు చేసే విషయంలో ఆమె డెడ్ లైన్ ఏమీ పెట్టుకోరు. తనకు కావాల్సినంత సమయం తీసుకుంటారు. ఇది కూడా బ్యాగు అందంగా తయారవడానికి ఓ కారణమని చెబుతారు.

Feature Image: Instagram

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది