ADVERTISEMENT
home / సౌందర్యం
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. తినాల్సిన, తినకూడని ఆహారం జాబితా ఇదే.. (Best Food For Hair Growth In Telugu)

జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. తినాల్సిన, తినకూడని ఆహారం జాబితా ఇదే.. (Best Food For Hair Growth In Telugu)

జుట్టు రాలడం (hair fall).. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో చాలా ఎక్కువమందే బాధపడుతున్నారు. చిన్న వయసులోనే బట్టతల రావడం, జుట్టు పలుచగా అయిపోవడం లాంటి సమస్యలను చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనికి వాతావరణంలో మార్పులు, ఆరోగ్యపరమైన కారణాలు, పోషకాహార లోపం.. ఇలా ఏదైనా కారణం కావచ్చు. కానీ రోజురోజుకీ ఈ సమస్య తీవ్రమవుతోంది. మరి దీన్ని తగ్గించడం ఎలా? దాని కోసం మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదల(hair growth)ను ప్రోత్సహించే ఆహారం తినడం ద్వారా జుట్టు బలంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. జుట్టు పెరగడం కోసం ఎలాంటి ఆహారం(food) తీసుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి? తదితర విషయాలను తెలుసుకొందాం రండి.

జుట్టు ఒత్తుగా పెరగడానికి తినాల్సిన శాఖాహారం

జుట్టు ఒత్తుగా పెరగడానికి తినాల్సిన మాంసాహారం

జుట్టు రాలకుండా ఉండటానికి దూరంగా ఉంచాల్సిన ఆహారం

ADVERTISEMENT

జుట్టు ఒత్తుగా పెరగడానికి తినాల్సిన ఆహారం (Best Vegetarian Food For Hair Growth In Telugu)

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మనం పోషకాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సైతం ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆహారం సమతౌల్యంగా ఉన్నప్పుడే జుట్టు  ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

3-Food For Hair Growth In Telugu

పాలకూర (Spinach)

పాలకూరలో జుట్టు రాలడం తగ్గించి, వెంట్రుకలు పెరిగేలా చేసే ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. విటమిన్ ఎ స్కాల్ఫ్ పై సీబమ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ సీబమ్ మాడుకి, వెంట్రుకలకు అవసరమైన పోషణ అందించి జుట్టు బలంగా తయారయ్యేలా చేస్తుంది. ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారిలో రక్తం ద్వారా అన్ని అవయవాలకు సరిపడినంత ఆక్సిజన్, ఇతర పోషకాలు అందవు. ఈ ప్రభావం జుట్టుపై  కూడా పడుతుంది. సరైన పోషణ లభించక జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. పాలకూరలో అధికంగా ఉండే ఐరన్ రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా మారి ఒత్తుగా పెరుగుతుంది.

స్ట్రాబెర్రీ (Strawberry)

స్ట్రాబెర్రీ పండ్లలో జుట్టు పెరగడానికి అవసరమైన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రసాయనాలు, కాలుష్యం ప్రభావం నుంచి జుట్టును కాపాడతాయి. వెంట్రుకల పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని విటమిన్ సి పెంచుతుంది. కొల్లాజెన్ జుట్టును పొడిబారకుండా, చివర్లు చిట్లకుండా కాపాడుతుంది. ఆహారం ద్వారా మనం తీసుకొన్న ఐరన్ పూర్తిగా శరీరానికి అందేలా విటమిన్ సి చూస్తుంది. దీని వల్ల కూడా  జుట్టు పెరుగుతుంది.

ADVERTISEMENT

చిలగడదుంప (Sweet Potato)

చిలగడదుంపలో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ ను మన శరీరం విటమిన్ ఎ గా మార్చుకుంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. మనం ముందుగా చెప్పుకొన్నట్టుగానే విటమిన్ ఎ  స్కాల్ప్ పై సీబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా.. కురులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

1-Food For Hair Growth In Telugu

అవకాడో (Avocado)

అవకాడోలో లభించే విటమిన్ ఇ జుట్టు కుదుళ్లకు రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. అలాగే స్కాల్ప్ పీహెచ్ విలువ, సీబమ్ ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదలకు ఆటంకం ఏర్పడదు. అవకాడోల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. పైగా ఈ ఫ్యాటీ యాసిడ్స్ సైతం వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి అవకాడోను బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేసుకోండి. లేదా స్మూతీగా తయారుచేసుకొని ఆహారంగా తీసుకోండి.

నట్స్ (Nuts)

బాదం, పిస్తా, వాల్ నట్ వంటి గింజల్లో జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలుంటాయి. విటమిన్ ఇ, విటమిన్ బి, జింక్, ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఇవి కురులకు అవసరమైన పోషణ ఇచ్చి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. ఇవి వెంట్రుకల పెరుగుదలకే కాదు.. గుండె ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయి.

ADVERTISEMENT

గింజలు (Seeds)

పొద్దు తిరుగుడు గింజలు, అవిశె గింజలు, సబ్జ గింజలు.. మొదలైన వాటిలో పోషకాలు అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ ఇ, ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ బి, ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. జుట్టు బాగా పెరగాలని కోరుకొనే వారు ప్రతి రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకొంటే బాగుంటుంది. ఇవి జుట్టును అందంగా మార్చడమే కాదు.. శరీర ఆరోగ్యాన్ని సైతం పెంచుతాయి.

బీన్స్ (Beans)

 జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారంలో ప్రొటీన్లు భాగం చేసుకోవాల్సిందే. బీన్స్ లో ప్రొటీన్స్ ఉంటాయి. కాబట్టి వాటిని తరచూ ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొటీన్లు మాత్రమే కాదు.. జుట్టు పెరగడానికి అవసరమైన బయోటిన్, ఐరన్, ఫోలేట్, జింక్.. కూడా ఉంటాయి. ఇవన్నీ కురుల ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషించేవే.

సోయా బీన్స్ (Soyabean)

సోయాబీన్స్ లో స్పెరిడిమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కురుల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఇది వెంట్రుక పెరిగే దశను పొడిగిస్తుంది. అంటే వెంట్రుక మరింత  పొడవుగా పెరుగుతుంది.

సిట్రస్ కలిగి ఉన్న పండ్లు (Citrus Containg Fruits)

మనం ఆహారం ద్వారా తీసుకొన్న ఐరన్ ను శోషించుకోవడవానికి విటమిన్ సి చాలా అవసరం. రోజు ఓ నిమ్మకాయ తినడం ద్వారా రోజుకి సరిపడిన విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. ఓ గ్లాసు చల్లటి నీటిలో నిమ్మరసం పిండి కొద్దిగా తేనె కలిపి రోజూ తాగడం మంచిది. నారింజ, కమలాపండులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని  కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

ADVERTISEMENT

ముడి ధాన్యాలు (Raw Grains)

ముడి ధాన్యాల్లో ఐరన్, విటమిన్ బి, జింక్, బయోటిన్ ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలే. బయోటిన్ శరీరంలో అమైనో ఆమ్లాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇవి కురుల ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి.

క్యారెట్ (Carrot)

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని కోరుకునేవారు రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరంలోని ఇతర భాగాలతో  పోలిస్తే జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది. సరిపడినంత విటమిన్ ఎ లేకపోతే ఈ వేగం మందగిస్తుంది. శరీరంలో విటమిన్ ఎ లోపం లేకుండా ఉండాలంటే క్యారెట్ ఆహారంగా తీసుకోవాల్సిందే. విటమిన్ ఎ స్కాల్ప్ లో సీబమ్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల జుట్టు పెరుగుదల వేగవంతం అవ్వడంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటుంది. 

దాల్చినచెక్క (Cinnamon)

 మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఇది ఆహారానికి ప్రత్యేకమైన ఫ్లేవర్ ని జోడిస్తుంది. దాల్చిన చెక్క కూడా జుట్టు రాలడం తగ్గించి వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. మరి, దాల్చిన చెక్కను ఆహారంగా ఎలా తీసుకోవడం? మీరు తాగే టీ, కాఫీలపై, రోజూ ఉదయం మీరు తినే ఓట్ మీల్ పై కొద్దిగా దాల్చినచెక్క పొడి జల్లుకోండి. క్రమంగా మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది.

ఓట్ మీల్ (Oatmeal)

ఓట్స్ లో పీచు పదార్థం, ఐరన్, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, పాలీ అన్ సాచ్యురేటెడ్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టును పొడవుగా, ఒత్తుగా మారేలా చేస్తాయి. కాబట్టి రోజూ బ్రేక్ ఫాస్ట్ గా ఓట్ మీల్ తినడం అలవాటు చేసుకోండి. అలా తినడం మీకు నచ్చకపోతే.. ఓట్స్ తో ఇడ్లీలు, దోశెలు చేసుకొని తినొచ్చు.

ADVERTISEMENT

2-Food For Hair Growth In Telugu

తృణ‌ ధాన్యాలు (Whole Grain)

రాగులు, సజ్జలు, గంట్లు, బార్లీ.. మొదలైన గింజ ధాన్యాల్లో పోషకపదార్థాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇటీవలి కాలంలో ఆహారంలో వాటి వినియోగం ఎక్కువైంది. వీటిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదళ్లకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తుంది. దీని వల్ల సరిపడినంత ఆక్సిజన్ స్కాల్ప్ కు అందుతుంది. ఫలితంగా జుట్టు బలంగా తయారవుతుంది.

జామకాయ (Nutmeg)

 జామపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జుట్టును పొడిబారకుండా, చిట్లిపోకుండా కాపాడుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. కాబట్టి జామకాయల సీజన్లో వాటిని తినడానికి ప్రయత్నించండి.

పుట్టగొడుగులు (Mushroom)

జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణం ఎనీమియా. రక్తంలో ఐరన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. మష్రూమ్స్ లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలను పెంపొందించడంతో పాటు జుట్టును బలంగానూ మారుస్తుంది. పుట్టగొడుగుల్లో ఐరన్ తో పాటు కాపర్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తుంది. ఫలితంగా జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

ADVERTISEMENT

ఉసిరి కాయలు (Salted Nuts)

 పెద్ద ఉసిరి కాయలు.. వీటినే రాశి ఉసిరికాయలు అని కూడా పిలుస్తారు. వీటి వల్ల కురుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. వాటి గింజలను ఎండబెట్టి పొడిగా చేసి నూనెలో కలపడం, హెయిర్ ప్యాక్ లో కలపుకోవడం మనకు తెలిసిందే. అయితే వీటిని తినడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

జుట్టు ఒత్తుగా పెరగడానికి తినాల్సిన మాంసాహారం (Non Vegeterian Food For Hair Growth)

మన జుట్టు దేనితో తయారైందో మీకు తెలుసా? ప్రొటీన్ తో. కాబట్టి మీ ఆహారంలో సరిపడినంత ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. వాస్తవానికి ఈ ప్రొటీన్ ఎక్కువగా మాంసాహారంలో లభిస్తుంది. కాబట్టి మన ఆహారంలో నాన్ వెజ్ కి కూడా భాగం కల్పించాల్సి ఉంటుంది.

గుడ్లు (Eggs)

గుడ్డులో ప్రొటీన్ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ గుడ్డును ఆహారంగా తీసుకొంటే కురులు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. గుడ్డులో బయోటిన్, జింక్, సెలీనియం లాంటి జుట్టును ఆరోగ్యంగా ఉంచే మూలకాలుంటాయి. వీటిలో ఏ లోపమున్నా జుట్టు రాలే సమస్య పెరిగిపోతుంది. గుడ్డు తినడం ద్వారా ఇవన్నీ మనకు అందుతాయి. ఫలితంగా ఆరోగ్యంతో పాటు కురుల అందాన్నీ కాపాడుకోవచ్చు.

మాంసం (Meat)

 తగినంత ప్రొటీన్ లభించకపోతే జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుందనే విషయం మనం ముందే చర్చించుకొన్నాం. ప్రొటీన్ లోపం వల్ల జుట్టు పెరగడం ఆగిపోతుంది. రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాదు. ప్రొటీన్ లోపాన్ని పూడ్చుకోవడానికి మీ ఆహారంలో చికెన్ ని భాగం చేసుకోవాలి.

ADVERTISEMENT

4-Food For Hair Growth In Telugu

చేప (Fish)

 చేపల్లోనూ కురుల ఆరోగ్యాన్ని పెంచే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మాగ చేప(Salmon), కన్నంగదాతా చేప(mackerel).. వంటి చేపలను ఆహారంగా తీసుకోవాలి. వీటిలో ఒమెగా 3, ఒమెగా 6, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, సెలీనియం, విటమిన్ డీ3, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాబట్టి మీకు వీలు చిక్కినప్పుడల్లా చేపలను తినడానికి ప్రయత్నించండి. అలాగని అన్ని చేపలు జుట్టు పెరిగేలా చేస్తాయనుకొంటే పొరపాటే. పాదరసం కలిగి ఉండే సముద్రం చేపల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుంది.

ఆయిస్టర్స్ (Oysters)

ఆయిస్టర్స్(ముత్యపు చిప్ప) లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా జుట్టు పెరుగుదలకు అత్యవసరమైనది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా మనం తినే ఇతర ఆహార పదార్థాల్లో జింక్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జింక్ లోపం తలెత్తడం సహజం. అందుకే జింక్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాటికి బదులుగా ఆయిస్టర్స్ ను ఆహారంగా తీసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

రొయ్యలు (Shrimp)

 రొయ్యల్లో కూడా జుట్టు రాలడం ఆపే పోషకాలుంటాయి. దీనిలో ప్రొటీన్, విటమిన్ డి, విటమిన్ బి, జింక్, ఐరన్, ఉంటాయి. కొన్ని అధ్యయనాల్లో జుట్టు రాలడానికి విటమిన్ డి3 లోపం కూడా ఒక కారణమేనని తేలింది. 100గ్రా.ల  రొయ్యల్లో మన శరీరానికి అవసరమైన 38 శాతం డీ విటమిన్ లభ్యమవుతుంది. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ADVERTISEMENT

లివర్ (Liver)

మహిళల్లో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. ఆ ఐరన్ పాలకూర, ఇతర ఆకుకూరల్లోనే కాదు.. లివర్లోనూ ఉంటుంది. కాబట్టి లివర్ ను కూడా అప్పుడప్పుడూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

జుట్టు రాలకుండా ఉండటానికి దూరంగా ఉంచాల్సిన ఆహారం (Food To Avoid To Reduce Hair Loss)

ఇప్పటి వరకు మనం జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కచ్చితంగా తినాల్సిన ఆహారం గురించి తెలుసుకొన్నాం. కానీ మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు వెంట్రుకలకు హాని చేస్తాయి. కురులకు చేటు చేసే ఆహార పదార్థాలను తెలుసుకొంటే వాటికి దూరంగా ఉండటం మంచిది.

కార్బొనేటెడ్ డ్రింక్స్ (Carbonated Drinks)

కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగేవారికి మిగిలిన వారితో పోలిస్తే జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఎందుకంటే.. దీనిలో ఉండే చక్కెరలు, ఆస్పెర్టామ్ వల్ల కుదుళ్లకు అందే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీని వల్ల కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోతుంది.

ADVERTISEMENT

పంచదార (Sugar)

 చక్కెర ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్, ఆండ్రోజన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇవి రెండూ జుట్టు కుదుళ్లను బలహీనం చేసి జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. అంతేకాదు.. జుట్టుకు ప్రొటీన్ అందకుండా అడ్డుకుంటుంది. కాబట్టి పంచదారను వీలైనంత తక్కువ ఉపయోగించడం మంచిది.

మైదా (Maida)

 సాధారణంగా మనం తినే కేక్స్, పేస్త్రీ, వైట్ పాస్తా, బ్రెడ్, తదితర ఆహార పదార్థాలను మైదాతో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా వీటిపై చక్కెరతో తయారు చేసిన క్రీమ్ తో డెకరేట్ చేస్తారు. ఈ రెండూ కలసి జుట్టుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. మైదాతో పాటుగా స్టార్చ్ తో తయారైన వాటికి కూడా దూరంగా ఉండటం వల్ల  జుట్టు రాలడం తగ్గుతుంది.

5-Food For Hair Growth In Telugu

ఫాస్ట్ ఫుడ్ (Fast Food)

బర్గర్లు, ఫ్రైస్, ఆనియన్ రింగ్స్.. ఇవి తినడానికి బాగానే ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుంది.

ADVERTISEMENT

ఆల్కహాల్ (Alchol)

 ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరంలో జింక్ స్థాయులు తగ్గిపోతాయి. పైగా ఆల్కహాల్ జుట్టును డీహైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల జుట్టు పొడిబారి తెగిపోతుంది. పైగా ఇది చర్మానికి కూడా చేటు చేస్తుంది. కాబట్టి దీనికి కూడా దూరంగా ఉండాల్సిందే.

ఇవీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినాల్సిన, తినకూడని ఆహారం. మీరు రోజూ తినే ఆహారంలో కురుల సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేేసేవి ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని పెంచే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. కేవలం ఈ ఆహారం తీసుకోవడం లేదా తినకపోవడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుందనుకొంటే పొరపాటే. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలుండవచ్చు. కొన్ని సందర్భాల్లో అది అనారోగ్యానికి కూడా సూచన కావచ్చు. కాబట్టి వైద్యులను సంప్రదించి వారి సూచనలను పాటించడం మంచిది. వారు సూచించిన మందులను తీసుకొంటూ ఈ ఆహారాన్ని కూడా తీసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు చక్కగా పెరుగుతుంది. ఒత్తుగా, అందంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

చర్మ, కేశ సౌందర్యాన్ని మరింత  పెంచే పెరుగు బ్యూటీ ప్యాక్స్

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Images: Sutterstock

07 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT