ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
తండ్రి ఆస్తిపై కూతురికి హక్కు ఉందా? ఆస్తిలో ఎంత భాగం దక్కుతుంది?

తండ్రి ఆస్తిపై కూతురికి హక్కు ఉందా? ఆస్తిలో ఎంత భాగం దక్కుతుంది?

ఏ తెలుగు టీవీ సీిరియల్ ఐనా చూడండి. వాటిలో కచ్చితంగా ఆస్తికి(property) సంబంధించిన తగాదాలుంటాయి. అన్నకు వాటా వెళ్లిపోతుందేమోనని చెల్లి, చెల్లికి ఆస్తి ఎక్కడిచ్చేస్తారోనని అక్క పన్నే కుట్రలకు కుతంత్రాలకు అంతే ఉండదు. అప్పుడప్పుడూ అంత రాద్ధాంతమెందుకు? చక్కగా చట్ట ప్రకారం ఆస్తులు పంచేసుకుంటే పోలా? అనిపిస్తుంది. అంతలోనే కొడుకు ఉండగా కూతురికి వాటా ఎందుకిస్తారనే ప్రశ్న కూడా ఎదురవుతుంది.

చట్టప్రకారం తండ్రి ఆస్తి కూతురికి సంక్రమిస్తుందా? వారసురాలిగా కొడుకుతో సమాన హోదాను అందుకొంటుందా? తండ్రి ఆస్తిపై అమ్మాయిలకు(daughters) చట్టబద్ధమైన హక్కు ఉందా? ఇవన్నీచాలామందికి సమాధానం తెలియని ప్రశ్నలే. వీటన్నింటికీ 1956 హిందూ వారసత్వ చట్టం(The Hindu Succession Act, 1956) సమాధానమిస్తుంది.

1956 హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతోంది?

హిందూ మతానికి చెందిన వారసులకు అంటే అబ్బాయిలకు ఆస్తి చెందేలా 1956లో భారత పార్లమెంట్ ఓ సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చింది. దానికే హిందూ వారసత్వ చట్టం అని పేరు. మరింత సరళంగా చెప్పుకోవాలంటే.. హిందూ మతానికి చెందిన వ్యక్తి ఆస్తిని తన వారసులకు చట్టబద్దంగా పంపకాలు ఎలా సాగించాలో వివరంగా చెబుతుంది ఈ చట్టం. ఈ చట్టం చెబుతోన్న కొన్ని  ముఖ్యమైన అంశాలు..

ADVERTISEMENT

1. ఈ చట్టం బౌద్ధులు, జైనులు, సిక్కులు సహా హిందువులందరికీ వర్తిస్తుంది.

2. ఆస్తుల్లో రెండు రకాలుంటాయి. మొదటి పూర్వీకుల నుంచి సంక్రమించినది అంటే వారసత్వపు ఆస్తి. రెండోది స్వార్జితం. అంటే రెక్కల కష్టంతో సొంతంగా సంపాదించుకున్న ఆస్తి.

3. ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం హిందూ మతానికి చెందని అంటే వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొన్నవారికి ఈ చట్టం వర్తించదు.

4. ఆస్తికి సంబంధించిన వారసుడు ఎవరైనా మతం మార్చుకొంటే వారికి హిందూ వారసత్వ చట్టం వర్తిస్తుంది. ఆస్తిపై హక్కు ఉంటుంది.

ADVERTISEMENT

2005 వరకు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించే ఆస్తిలో ముఖ్యంగా పూర్వీకుల నుంచి సంక్రమించే ఆస్తిలో కూతురికి వాటా ఉండేది కాదు. కానీ 2005లో హిందూ వారసత్వ చట్టానికి సవరణ చేశారు. దీంతో కూతురికి సైతం ఆ ఆస్తిలో సమాన వాటా అందుకొనే లేదా దాన్ని క్లెయిమ్ చేసుకొనే అవకాశం వచ్చింది.

1-hindu-succession-act

సవరణ తర్వాత వచ్చిన మార్పులు

2005లో చేసిన సవరణ ప్రకారం పూర్వీకుల నుంచి సంక్రమించిన వారసత్వపు ఆస్తిలో వాటాను అడగడం మాత్రమే కాదు.. తన అన్నదమ్ములతో సమానంగా దాన్ని అనుభవించే హక్కు సైతం పొందింది. ఉదాహరణకు తండ్రికి కొడుకు, కూతురు ఉంటే.. వారసత్వంగా అందుకొన్న ఆస్తిని ఇద్దరికీ సమానంగా పంచాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

ఈ ఆస్తిని పంచమని ఎప్పుడైనా అడిగే హక్కు అమ్మాయికి ఉంటుంది. ఏ కారణం చేతైనా ఆస్తి పంపకాన్ని వాయిదా వేస్తున్నా లేదా  పంపకాలపై తండ్రి ఆసక్తి చూపించకపోయినా.. వాటాలు వేయడానికి సోదరుడి అంగీకారం కోసం ఎదురు చూడాల్సి వచ్చినా.. ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఆమెకు ఉంటుంది. ఇది వారసత్వపు ఆస్తికి మాత్రమే వర్తిస్తుంది. తండ్రి స్వార్జితానికి ఈ చట్టం వర్తించదు.

హిందూ వారసత్వ చట్టం సవరణకు దారి తీసిన పరిస్థితులు:

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం దాదాపుగా 39 దేశాల్లోని స్త్రీలకు తన అన్నదమ్ములతో సమానంగా వారసత్వపు ఆస్తిని అనుభవించే హక్కు లేదు. 2005లో హిందూ వారసత్వ చట్టానికి చేసిన సవరణ కారణంగా ఆ జాబితా నుంచి మన దేశం బయటకు వచ్చింది. అసలు ఎందుకు సవరణ చేశారనేదే కదా మీ సందేహం? మనదేశంలో ఎక్కువ శాతం మంది మహిళలు తమ అవసరాలను తీర్చుకోవడానికి తండ్రి, భర్త లేదా కొడుకుపై ఆధారపడాల్సి వస్తోంది. దీని కారణంగా వారి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. దుర్భరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే ఆస్తిలో సమాన వాటా దక్కేలా సవరణ చేశారు.

సవరణ చేసినప్పటికీ.. చాలామంది మహిళలు ఇప్పటికీ వారసత్వపు ఆస్తిపై హక్కును అనుభవించలేకపోతున్నారు. ఆస్తిని కూతురికి పంచివ్వడానికి తండ్రి నిరాకరించడం, క్లెయిం చేసుకొనే అవకాశం ఉన్నా.. ఏం చేయాలో తెలియకపోవడమే దీనికి కారణం. చాలామంది మహిళలకు వారసత్వపు ఆస్తిలో తమకు భాగం దక్కుతుందనే అవగాహన లేకపోవడమూ దీనికి మరో కారణం కావచ్చు.

ADVERTISEMENT

2-hindu-succession-act

తండ్రి ఆస్తి వాటాగా అందుకొనే/అందుకోవడానికి వీల్లేని సందర్భాలు

1. వారసత్వపు ఆస్తి అయితే..

వారసులు అంటే కొడుకైనా.. కూతురైనా సరే వారికి పుట్టుకతోనే ఈ ఆస్తిపై సమాన హక్కు ఉంటుంది. కాబట్టి తండ్రికి ఈ ఆస్తిపై వీలునామా రాసే హక్కు ఉండదు. అంటే ఆ ఆస్తిని తనకు నచ్చిన వారికి  రాసే అవకాశం ఉండదు. తన కొడుకులు, కూతుర్లందరికీ జన్మత: పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిలో సమాన వాటా దక్కుతుంది.

ADVERTISEMENT

2. స్వార్జితమైతే..

తండ్రి తన స్వయంశక్తితో సంపాదించుకొన్న ఆస్తిలో భాగం కోరే హక్కు ఎవరికీ ఉండదు. అది ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలైనా సరే. తన సొంత సంపాదనతో కొన్న భూమి లేదా ఇల్లు లేదా ఇతర ఆస్తులను తనకు నచ్చిన వారికి చెందేలా వీలునామా రాసుకోవచ్చు. ఈ సందర్భంలో తండ్రి ఆస్తిలో వాటా కావాలని అడిగే హక్కు ఎవరికీ ఉండదు.

3. వీలునామా రాయకుండానే తండ్రి మరణిస్తే..

వీలునామా రాయకుండా తండ్రి మరణించినట్లయితే అతని మొత్తం ఆస్తి అంటే అది స్వార్జితమైనా లేదా పూర్వీకుల నుంచి సంక్రమించిన వారసత్వపు ఆస్తి అయినా సరే అతని వారసులందరికీ దానిపై సమాన హక్కు ఉంటుంది. ఈ వారసుల్లోనూ నాలుగు కేటగిరీలున్నాయి – క్లాస్ 1 వారసులు, క్లాస్ 2 వారసులు, దాయాదులు, ప్రభుత్వం. చనిపోయిన వ్యక్తి ఆస్తి మొత్తం క్లాస్ 1 వారసులకు చెందుతుంది. అంటే తల్లి, భార్య, కొడుకులు, కూతుర్లు. వీరందరికీ చట్ట ప్రకారం సమాన వాటా దక్కుతుంది.

ADVERTISEMENT

ఒక వేళ ఆస్తి అంతా తల్లి పేరు మీద ఉంటే.. ఆమె మరణించిన తర్వాత ఆమె ఆస్తి తన భర్త, పిల్లలు, ఇతర వారసులకు చెందుతుంది.

4. ఆస్తి పంచే సమయానికి అమ్మాయికి పెళ్లయిపోతే..

హిందూ వారసత్వ చట్టానికి 2005లో చేసిన సవరణ ప్రకారం అమ్మాయికి వివాహమైనప్పటికీ తన తండ్రి ఆస్తికి వారసురాలిగానే పరిగణిస్తారు. అది తండ్రి స్వార్జితమైనా లేదా వారసత్వంగా సంక్రమించినదైనా సరే.. కాబట్టి పెళ్లయినా కాకపోయినా తండ్రి ఆస్తిలో భాగం కోరే హక్కు అమ్మాయిలకు ఉంటుంది.

5. 2005 కంటే ముందే తండ్రి మరణిస్తే..?

ADVERTISEMENT

హిందూ వారసత్వ చట్టానికి సెప్టెంబర్ 9, 2005లో సవరణ చేశారు. కాబట్టి ఆ తేదీ నాటికి తండ్రి బతికి ఉంటే మహిళలకు తన తండ్రి ఆస్తిలో భాగం దక్కుతుంది. ఒకవేళ సెప్టెంబర్ 8, 2005 లేదా అంతకు ముందే తండ్రి మరణించినట్లైతే ఆస్తిలో ఆమెకు వాటా దక్కదు. అది వారసత్వపు ఆస్తి అయినా, స్వార్జితమైనా తండ్రి ఆస్తిలో భాగం కోరే హక్కు అమ్మాయికి ఉండదు. ఈ సందర్భంలో తండ్రి రాసిన విల్లు ప్రకారం లేదా సవరణకు ముందున్న చట్టం ప్రకారం ఆస్తి పంపకాలు జరుగుతాయి. ఒకవేళ 2005 కు ముందు కూతురు మరణిస్తే ఆమె పిల్లలకు ఆస్తిలో భాగం దక్కుతుందా? కచ్చితంగా దక్కుతుంది. ఈ సందర్భాల్లో వారసత్వపు ఆస్తి కోసం ఆమె సంతానం క్లెయిం చేసుకోవచ్చు.

మినహాయింపులూ ఉన్నాయి

ఆస్తికోసం వారసులపై లేదా తండ్రిపై హత్యాయత్నం చేసినవారికి లేదా హత్య చేసినవారికి ఆస్తిలో వాటా దక్కదు. ఆస్తి కోసం హత్య చేసి న్యాయస్థానంలో క్షమాపణ కోరినా, పశ్చాత్తాపం చెందినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అటు వారసత్వపు ఆస్తిలో ఇటు తండ్రి స్వార్జితంలో భాగం పొందే హక్కును కోల్పోతారు.

Images: Shutterstock

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

29 May 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT