తన నిఖా జరిపించే మహిళ కోసం.. ఎనిమిది నెలలు వెతికిందట ఈ అమ్మాయి..!

తన నిఖా జరిపించే మహిళ కోసం.. ఎనిమిది నెలలు వెతికిందట ఈ అమ్మాయి..!

2019 జనవరి 5 తేదిన, కోల్‌కతాలోని బుర్ద్వాన్ ప్యాలెస్‌లో ఓ ముస్లిం జంటకు పెళ్లి జరిగింది. కానీ ఆ పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా నిఖాను ఖ్వాజీ (Quazi) జరిపిస్తారు. ఇక్కడ కూడా ఖ్వాజీనే వివాహం జరిపించారు. కానీ ఆ ఖ్వాజీ ఓ మహిళ. ఆశ్చర్యంగా ఉంది కదా. మిమ్మల్ని విస్మయానికి గురి చేసే మరో విషయం ఏమిటంటే.. ఒక మహిళా ఖ్వాజీ సహాయంతో పెళ్లి జరిపించుకోవడం కోసం ఆ జంట దాదాపు ఎనిమిది నెలలు ఎదురు చూసింది. ఆరు నెలల క్రితం జరిగిన ఈ పెళ్లి గురించి ఇప్పుడెందుకని ఆలోచిస్తున్నారా? అప్పుడు జరిగిన ఈ పెళ్లే ఇప్పుడు మహిళా ఖ్వాజీల (female quazis) ప్రాధాన్యం పెరగడానికి కారణమైంది.

Instagram

ముంబయిలో కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోన్న బ్రిటిష్ మహిళ మాయా రేచెల్ మెక్ మెనస్, ముంబయి‌కి చెందిన షామూన్ అహ్మద్‌కు గతేడాది నిశ్చితార్థమైంది. ఆ తర్వాత వారు తమ పెళ్లికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించారు. వారి డ్రీమ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ప్లాన్ అంతా సిద్ధమైంది.

కానీ తమ పెళ్లిని జరిపించే బాధ్యతను ఎవరికి అప్పగిస్తే బాగుంటుందనే ప్రశ్న వారిలో తలెత్తింది. అప్పటికి కొద్ది రోజుల ముందే మాయ   ఖ్వాజీలుగా శిక్షణ పొందుతున్న మహిళల గురించి ఎక్కడో చదివారట. అందుకే తన పెళ్లిని మహిళా ఖ్వాజీ సహాయంతోనే జరిపించుకోవాలని భావించారు. షామూన్ కూడా దానికి ఒప్పుకున్నారు.

అప్పటి నుంచి మహిళా ఖ్వాజీ కోసం వారి వెతుకులాట ప్రారంభమైంది. రోజులు, నెలలు గడుస్తున్నా వారికి ఒక్క మహిళా ఖ్వాజీ కూడా దొరకలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాతగానీ వారి ఎదురుచూపులకు ఫలితం దక్కలేదు. పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన  మహిళా ఖ్వాజీ 40 ఏళ్ల హకీమా ఖాటూన్ గురించి మాయ, షామూన్‌ల‌కు తెలిసింది. వెంటనే ఆమెను సంప్రదించడం, పెళ్లి తేదీని నిర్ణయించడం, పెళ్లి జరగడం టకటకా జరిగిపోయాయి. ఆ పెళ్లి తర్వాత మహిళా ఖ్వాజీల గురించి చర్చలు జరగడం మొదలయ్యాయి. ఎందుకంటే ఓ మహిళా ఖ్వాజీ చట్టబద్ధమైన రీతిలో మొదటిసారిగా జరిపించిన వివాహం ఇదే.

Instagram

సాధారణంగా ఇస్లాంలో పురుషులే ఖ్వాజీలుగా వ్యవహరిస్తారు. నిఖా, తలాక్ లాంటి వ్యవహారాలన్నీ వారే చూసుకుంటారు. కానీ వారికున్న పురుషాహంకారం, లింగ వివక్ష కారణంగా మహిళలకు చాలా విషయాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. దీనివల్ల బాల్యవివాహాలు, అర్థంతరమైన ట్రిపుల్ తలాక్‌లు జరుగుతున్నాయి. అదే మహిళా ఖ్వాజీలైతే మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తారనే భావన చాలా మందిలో పెరుగుతోంది. నిజానిజాలు తెలుసుకొని వారికున్న సందేహాలను తొలిగించుకొన్న తర్వాతే వారు వివాహం చేయడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు ఎక్కడా మహిళలకు అన్యాయం జరగని రీతిలో చూసుకొంటున్నారు. పైగా పెళ్లి జరిపించడానికి చాలా తక్కువ మొత్తం తీసుకుంటున్నారు. ఇవన్నీ మహిళా ఖ్వాజీల వైపు చూసేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం మహిళా ఖ్వాజీలు ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి దారుణాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. భారతీయ మహిళా ముస్లిం ఆందోళన్ (బీఎంఎంఏ) సంస్థ ఈ విషయంలో చేస్తున్న కృషిని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సంస్థే మహిళలు ఖ్వాజీలుగా మారడానికి శిక్షణను ఇస్తోంది. 2007లో మొదలైన ఈ సంస్థ ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, బాధిత మహిళలకు తోడుగా నిలబడుతోంది. ఈ సంస్థలో శిక్షణ పొందిన మహిళే హకీమా ఖాటూన్. 2016లో బీఎంఎంఏలో శిక్షణ పొందిన తొలి బ్యాచ్‌కు చెందిన మహిళ ఆమె. ఆమెతో పాటుగా శిక్షణ పొందిన 15 మంది మహిళలు ఖ్వాజీలుగా పనిచేస్తున్నారు. అయితే వారెవ్వరికీ ఇంత వరకు వివాహం చేసే అవకాశం రాలేదు. ఆ అవకాశం పొందిన మొదటి వ్యక్తి హకీమా. ప్రస్తుతం మరో 26 మంది మహిళలు ఖ్వాజీలుగా శిక్షణ పొందుతున్నారు.

Shutterstock

మహిళలు ఖ్వాజీలుగా బాధ్యతలు చేపట్టడాన్ని ఇస్లాం మతపెద్దల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం ఖురాన్‌ను ధిక్కరించినట్టే అని వారు చెబుతున్నారు. అయితే మహిళా ఖ్వాజీలకు తోడుగా మరో వర్గం నిలబడుతోంది. మహిళలు ఖ్వాజీలుగా వ్యవహరించడం తప్పేమీ కాదని, ఇది మత నియమాలను ఉల్లంఘించినట్టు కాదని వారు చెబుతున్నారు. మహిళ ఖ్వాజీల సంఖ్య పెరగడం వల్ల ముఖ్యంగా నిఖా హలాలా, ఏకపక్షంగా చెప్పే తలాక్‌లకు చరమ గీతం పాడొచ్చని భావిస్తున్నారు.

మహిళా ఖ్వాజీలకు శిక్షణ ఇవ్వడానికి బీఎంఎంఏ ప్రత్యేకమైన సిలబస్ తయారు చేసింది. ఇక్కడ శిక్షణ పొందే ఖ్వాజీలు ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని మహిళాకోణం నుండి అధ్యయనం చేస్తారు. అంతేకాదు భారత రాజ్యాంగంపై అవగాహన ఫెంచే విధంగా కరిక్యులమ్ ఉంటుంది. అంటే ఏ పనిచేసినా చట్టబద్ధంగా, ఖురాన్‌కు లోబడి వీరు చేస్తారన్నమాట. ప్రస్తుతం పశ్చిమ బంగ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్రాల్లో 15 మంది మహిళలు ఖ్వాజీలుగా పనిచేస్తూ వివాహ సంబంధమైన సమస్యల్లో చిక్కుకున్న మహిళలకు అండగా నిలుస్తున్నారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.