షుగర్ వ్యాధి తీవ్రతను తగ్గించే ఇంటి చిట్కాలు POPxo తెలుగు | POPxo

షుగర్ వ్యాధి తీవ్రతను తగ్గించే.. ఇంటి చిట్కాలు..!

షుగర్ వ్యాధి తీవ్రతను తగ్గించే.. ఇంటి చిట్కాలు..!

మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి చేరుతుంది. అక్కడి నుంచి శరీరంలోని ప్రతి కణానికి గ్లూకోజ్ చేరుతుంది. ఆ గ్లూకోజ్‌ను కణాలు శక్తిగా మార్చుకుంటాయి. ఇలా జరగడానికి ఇన్సులిన్ (Insulin) చాలా అవసరం. కానీ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి  కాకపోవడం,  ఉత్పత్తి అయినా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల డయాబెటిస్(Diabetes) రావచ్చు.

దీన్నే మనం మధుమేహం, చక్కెర వ్యాధి, షుగర్ అని రకరకాల పేర్లతో పిలుస్తాం. అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది? దాని వల్ల ఎదురయ్యే ఇతర ఆరోగ్య సమస్యలు ఏంటి? దాని తీవ్రతను ఎలా తగ్గించుకోవాలి? మొదలైన విషయాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం.

Table of Contents

  డయాబెటిస్ రకాలు

  ‘నాకు షుగర్ ఉందండి’, ‘నాకు డయాబెటిస్’ అని చెబుతూ ఉంటారు. వారిలో చాలా మందికి తాము ఏ రకమైన డయాబెటిస్‌తో బాధపడుతున్నారో లేదా ఏ రకమైన మందులు వేసుకుంటున్నారో తెలియదు. వాస్తవానికి డయాబెటిస్‌లో వివిధ రకాలున్నాయనే అవగాహన ఉండదు. ఏ డయాబెటిస్ అయితేనేం.. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు సాధారణ పరిమితిలో ఉండడం ముఖ్యం. అయినప్పటికీ డయాబెటిస్‌లో ఎన్ని రకాలున్నాయో అవగాహన పెంచుకోవడం ముఖ్యం. డయాబెటిస్‌లో దాదాపు పన్నెండు రకాలుంటాయి. వాటిలో ఎక్కువ మంది బాధపడే వాటి గురించి తెలుసుకుందాం.

  టైప్ 1 డయాబెటిస్

  ఈ రకమైన డయాబెటిస్ రావడానికి కారణం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ క్ణీణించి క్లోమ కణాలపై ప్రభావం చూపించడం. ఇది ఏ వయసులో ఉన్నవారికైనా వస్తుంది. చిన్నారుల్లో చాలా వేగంగా పెరిగిపోతుంది. పెద్దల్లో కాస్త నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెడుతుంది.

  టైప్ 2 డయాబెటిస్

  మెటబాలిజయం ప్రక్రియలో తలెత్తిన సమస్యల కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ స్థాయిని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల.. ఈ రకమైన డయాబెటిస్ రావడానికి ఆస్కారముంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు విపరీతంగా పెరిగిపోతాయి. దీన్ని నియంత్రించకపోతే శరీరంలోని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

  టైప్ 3 డయాబెటిస్

  అల్జీమర్స్, డెమెన్షియా వంటి మెదడు సమస్యలతో బాధపడే వారిలో కనిపించే డయాబెటిస్ ఇది. టైప్ 2 డయాబెటిస్ క్రమంగా టైప్ 3 డయాబెటిస్‌గా మారుతుంది.

  జెస్టేషనల్ డయాబెటిస్

  గర్భం దాల్చిన మహిళల్లో మాత్రమే కనిపించే సమస్య ఇది. గర్భధారణ సమయంలో హార్మోన్ల ప్రభావం కారణంగా ఈ రకమైన డయాబెటిస్ వస్తుంది.

  జువైనల్ డయాబెటిస్

  పేరుకి తగినట్లుగానే చిన్నపిల్లలలో కనిపించే డయాబెటిస్ ఇది. చాలా తక్కువ సమయంలో పిల్లలపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

  ఇవే కాకుండా డయాబెటిస్ ఎల్ఎడిఎ, డయాబెటిస్ ఎమ్ఓడివై, డబుల్ డయాబెటిస్, స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ డయాబెటిస్, బ్రిట్టిల్ డయాబెటిస్, సెకండరీ డయాబెటిస్, డయాబెటిస్ ఇన్సిపిడస్ .. మొదలైన మధు మేహ వ్యాధులు ఉన్నాయి. కానీ  ఇవి రావడం చాలా అరుదనే చెప్పుకోవాలి.

  Shutterstock
  Shutterstock

  డయాబెటిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు

  డయాబెటిస్ రావడానికి ముఖ్యమైన కారణం శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గి.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడం.  కొన్ని సందర్భాల్లో తగినంత ఇన్సులిన్ ఉన్నప్పటికీ శరీరం దాన్ని సరిగ్గా వినియోగించకపోవడం వల్ల కూడా మధుమేహం రావడానికి ఆస్కారం ఉంది. రక్త పరీక్షల ఆధారంగా డయాబెటిస్ రకాన్ని గుర్తించి దానికి తగిన విధంగా చికిత్సను అందిస్తారు. ఒక్కొక్కరిలోనూ డయాబెటిస్ రావడానికి వేర్వేరు కారణాలుంటాయి. అసలు ఏ కారణం వల్ల ఏ రకమైన డయాబెటిస్ వస్తుందో తెలుసుకుందాం.

  టైప్ 1 డయాబెటిస్

  ఇది శరీరంలో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల వస్తుంది. అంటే మనల్ని రోగాల నుంచి కాపాడాల్సిన రోగనిరోధక వ్యవస్థే మన మీద దాడి చేయడం వల్ల వస్తుంది. ఇది క్లోమంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను నాశనం చేస్తుంది. పైగా క్లోమంలో ఒక్కసారి నాశనమైన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టుకురావు. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయి శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోతాయి. ఇలా మన రోగ నిరోధక వ్యవస్థే మన మీద దాడి చేయడానికి అసలు కారణమేంటో ఇప్పటి వరకూ గుర్తించలేదు. జన్యుపరమైన, పర్యావరణపరమైన, జీవనసరళిలో వస్తున్న మార్పుల కారణంగా ఈ రకమైన మధుమేహం వస్తుందని భావిస్తున్నారు.

  టైప్ 2 డయాబెటిస్

  శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ.. దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోతాయి. వాటిని అదుపు చేయడానికి క్లోమంలో బీటా సెల్స్ మరింత ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా వాటి పని తీరు దెబ్బ తిని క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి మందగిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణాలు జెనెటిక్స్, సరైన వ్యాయామం లేకపోవడం, అధిక బరువు కలిగి ఉండటం కారణాలు కావచ్చు. అలాగే హైపర్ గ్లైసీమిమాతో బాధపడేవారిలోనూ టైప్ 2 డయాబెటిస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  టైప్ 3 డయాబెటిస్

  టైప్ 2 డయాబెటిస్‌‌తో పాటు డెమెన్షియా లేదా అల్జీమర్స్ ఉన్నవారిలో టైప్ 3 డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మధుమేహాన్ని ‘డయాబెటిస్ ఇన్ బ్రెయిన్’‌గా వ్యవహరిస్తారు. టైప్ 2 డయాబెటిస్ వల్ల మెదడులో రక్తనాళాలు పాడవటం వల్ల.. అది టైప్ 3 డయాబెటిస్‌గా మారడానికి అవకాశం ఉంది.

  జెస్టేషనల్ డయాబెటిస్

  గర్భం దాల్చిన సమయంలో ఈ మధుమేహం వస్తుంది. గర్భం దాల్చిన తర్వాత తగ్గిపోతుంది. గర్భం దాల్చిన సమయంలో ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడటం వల్ల ఇది వస్తుంది.

  జువైనల్ డయాబెటిస్

  పేరుకి తగినట్లుగానే చిన్న పిల్లల్లో వచ్చే మధుమేహమిది. ఇది కూడా టైప్ 1 డయాబెటిస్ లాంటిదే. రోగ నిరోధక వ్యవస్థ క్లోమ కణాలపై దాడి చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల పిల్లలో డయాబెటిస్ వస్తుంది. దీని తీవ్రత వారిలో చాలా త్వరగా పెరిగిపోతుంది. కాబట్టి చిన్న వయసు నుంచే ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వారు తీసుకొనే ఆహారం సైతం పిల్లల్లో డయాబెటిస్ రావడానికి కారణమవుతుంది.

  Shutterstock
  Shutterstock

  డయాబెటిస్ లక్షణాలు

  రక్త పరీక్షల ద్వారానే మనకు మధుమేహం ఉందా లేదా అని గుర్తిస్తారు వైద్యులు. అయితే కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే దీన్ని గుర్తించవచ్చు.

  1. ఎక్కువ దాహంగా అనిపించడం
  2. ఆకలి ఎక్కువ వేయడం
  3. తరచూ మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడటం
  4. తల తిరుగుతున్నట్లుగా అనిపించడం
  5. నీరసంగా అనిపించడం
  6. చర్మం పొడిగా, దురదగా  అనిపించడం
  7. చూపు మసకబారడం
  8. గాయాలు త్వరగా తగ్గకపోవడం
  9. ఏ రకమైన డయాబెటిస్‌లో అయినా.. ఈ లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. వీటితో పాటు మరికొన్ని లక్షణాలను బట్టి.. అది  ఏ రకమైన మధుమేహం అనేది గుర్తించవచ్చు.

  టైప్ 1 డయాబెటిస్‌కి గురైన వారు చాలా వేగంగా బరువు తగ్గిపోతుంటారు. అలాగే పాదాల్లో నొప్పిగా అనిపించవచ్చు.

  టైప్ 2 డయాబెటిస్ వస్తే మెడ, చంకల్లో నల్లటి మచ్చలు ఏర్పడతాయి.

  పిల్లల్లో పైన మనం చెప్పుకున్న లక్షణాలతో పాటు వారి ప్రవర్తనలో మార్పు రావడం, ఈస్ట్ ఇన్ఫెక్షన్ రావడం, శరీరం నుంచి ముగ్గిన పండ్ల వాసన రావడం వంటివి కూడా కనిపిస్తాయి.

  ఈ లక్షణాలను మీరు గర్తించినప్పుడు వెంటనే మధుమేహ నిపుణులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

  మధుమేహం వల్ల ఎదురయ్యే సమస్యలు

  డయాబెటిస్‌తో బాధపడేవారిలో.. ఆరంభంలో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ.. షుగర్ కంట్రోల్లో ఉండకపోతే అది క్రమంగా ఇతర సమస్యలకు దారి తీస్తుంది. వాటిలో కొన్ని ప్రాణాంతక సమస్యలు కూడా ఉండొచ్చు. మధుమేహంతో బాధపడేవారికి సాధారణంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే..

  1. రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
  2. కంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెటినోపతి అనే సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.
  3. నరాలు దెబ్బతింటాయి.
  4. కిడ్నీలు పాడవ్వచ్చు.
  5. నరాలు, రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఇతర సమస్యలు తలెత్తచ్చు.
  6. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి అల్జీమర్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

  ఇవన్నీ రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో లేకపోతే వస్తాయి.

  గర్భం దాల్చిన వారిలో.. మధుమేహం వల్ల ఎదురయ్యే సమస్యలు

  గర్భం దాల్చిన సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువైతే అది తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదాన్ని కలిగించవచ్చు. ఈ సమయంలో సాధారణంగా ఎదరయ్యే సమస్యలు-

  1. అధిక రక్తపోటు
  2. ప్రిఎక్లాంప్సియా (గుర్రపువాతం)
  3. గర్భస్రావం జరగడం లేదా త్వరగా బిడ్డను ప్రసవించడం
  4. పుట్టిన బిడ్డలో లోపాలుండటం

  ఏ రకమైన డయాబెటిస్‌తో మీరు బాధపడుతున్నప్పటికీ.. వైద్యున్ని సంప్రదించి వారు అందించే చికిత్స తీసుకుంటూ వారి సూచనలు పాటించడం ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి.  దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆహారం తీసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం.. వీటితో పాటు మందులు సమయానికి వేసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

  Shutterstock
  Shutterstock

  మధుమేహం నివారణా మార్గాలు

  వాస్తవానికి టైప్ 1 డయాబెటిస్ రాకుండా ఆపడం మన చేతుల్లో లేదు. ఎందుకంటే మన రోగ నిరోధక వ్యవస్థ ఏ సమయంలో ఏ రకంగా మారుతుందో మన చేతుల్లో ఉండదు. కానీ టైప్ 2 డయాబెటిస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దాన్ని రాకుండా కొంత వరకు ఆపే ప్రయత్నం చేయచ్చు.

  పంచదార, కార్బోహైడ్రేట్స్ వినియోగం తగ్గించాలి

  పంచదారతో తయారు చేసిన ఆహార పదార్థాలు, కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణాశయం గ్లూకోజ్‌గా మార్చేస్తుంది. దీన్ని రక్తంలోకి చేర్చే ప్రక్రియలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీన్ని శరీరంలోని కణాలన్నీ పీల్చుకోవడానికి వీలుగా.. క్లోమం ఇన్సులిన్ విడుదల చేస్తుంది. ప్రీడయాబెటిస్ దశలో ఉన్నవారిలో ఇన్సులిన్ ఈ ప్రభావాన్ని చూపించలేదు.

  కాబట్టి శరీరం పూర్తిగా పీల్చుకోలేదు. దీనివల్ల గ్లూకోజ్ మిగిలిపోతుంది. దీంతో క్లోమం మరింతగా ఇన్సులిన్ విడుదల చేస్తుంది. అయితే రాన్రానూ ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోవడం ప్రారంభమై.. అది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. కాబట్టి ఆహారంలో కార్భోహైడ్రేట్స్, పంచదారతో తయారుచేసిన పదార్థాలు తక్కువగా తీసుకోవడం మంచిది.

  క్రమం తప్పని వ్యాయామం

  రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అంతే కాదు ఇన్సులిన్ సైతం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అయితే కొంతకాలం వ్యాయామం చేసి మానేయడం కాకుండా దాన్ని దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది.

  నీరు ఎక్కువగా తాగడం

  నీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలుంటాయో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీరు సరిపడినంత తాగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు మన దరి చేరకుండా  ఉంటాయి. అయితే కొన్నిసార్లు నీటికి బదులుగా పంచదార నిండిన కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్, ఎల్ఎడీఏ డయాబెటిస్ వచ్చే అవకాశాలున్నాయి. నీరు తగినంత తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడంతో పాటు ఇన్సులిన్ పనితీరు మెరుగుపడేలా చేస్తుంది.

  అధిక బరువు తగ్గించుకోవడం

  బరువు ఎక్కువగా  ఉన్నవారందరికీ డయాబెటిస్ వస్తుందని కాదు. కానీ స్థూల కాయం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి బరువు తగ్గించుకోవడం చాలా అవసరం. ఒక్కో కేజీ బరువు తగ్గుతుంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతూ వస్తాయి. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన బరువుని కొనసాగించడం కూడా అవసరం.

  పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం

  సాధారణంగా మనం తీసుకొనే ఆహారంలో కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. దీన్ని తగ్గించుకోవాలంటే ఆహారంలో పీచుపదార్థాలను భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు ఇన్సులిన్ ప్రభావవంతంగా పనిచేసేలా చేస్తుంది.

  విటమిన్ డి సంవృద్ధిగా

  రక్తంలో చక్కెర స్థాయులు తగ్గాలంటే విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చిన్నపిల్లలో డయాబెటిస్ రావడానికి ఇది కూడా ఓ కారణమే. కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం, రోజూ ఉదయం కాసేపు నీరెండలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.

  ప్రోసెస్డ్ ఫుడ్‌కి దూరంగా

  మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోసెస్డ్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీటిని తినడం వల్ల ఎన్నో రకాల రోగాలకు మన శరీరం ఆవాసంగా మారిపోతుంది. గుండె జబ్బులు, ఒబెసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు వీటిని తినడం ద్వారా వస్తాయి. పైగా వీటిని తయారు చేయడంలో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్ సైతం డయాబెటిస్ పెరగడానికి కారణమవుతున్నాయి.

  నేచురల్ డ్రింక్స్ తాగడం

  డయాబెటిస్ తాగడానికి నీరు తాగడం చాలా ముఖ్యం. దీనితో పాటు టీ, కాఫీ వంటివి తాగడం వల్ల కూడా.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. అలాగని మరీ ఎక్కువగా కాకుండా పరిమితుల్లో తాగడం మంచిది. వీటిని నేచురల్ డ్రింక్స్ అని ఎందుకన్నామంటే.. కాఫీ గింజలు, టీ ఆకు ప్ర‌కృతి అందించినవే కాబట్టి.  గ్రీన్ టీ, దాల్చిన చెక్క టీ, అల్లం టీ వంటివి తాగడం ద్వారా కూడా డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు.

  Shutterstock
  Shutterstock

  డయాబెటిస్ అదుపు చేసే ఆహార పదార్థాలు

  మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ విషయంలోనూ అంతే. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం ద్వారా మధుమేహం అదుపులో ఉంచుకోవచ్చు. ఈ విషయంలో మనకు ఉపయోగపడే ఆహార పదార్థాలేమిటో తెలుసుకోవడం అవసరం. వాటిని ఆహారంలో భాగం చేసుకోవడమూ అవసరమే.

  చేపలు

  చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, డీహెచ్ఏ, ఈపీఏ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. డయాబెటిస్‌తో ఇబ్బంది పడే వారికి ఈ కొవ్వులు చాలా అవసరం. ఎందుకంటే ఇవి రక్తనాళాల గోడలపై ఉన్న కణాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల డయాబెటిస్‌తో బాధపడేవారిలో గుండె ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది.

  దాల్చిన చెక్క

  దాల్చినచెక్కలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయులు తగ్గిస్తాయి. అంతేకాదు ఇన్సులిన్ ప్రభావవంతంగా పనిచేసేలా చేసి మనం తిన్న ఆహారాన్ని కణాలు శోషించుకొనేలా చేస్తాయి. అయితే రోజుకి టీస్పూన్ దాల్చినచెక్కను మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశాలుంటాయి.

  ఆకుకూరలు

  ఆకుకూరల్లో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ పెంచే కార్భోహైడ్రేట్స్ దాదాపుగా ఉండవు. వీటిలో లభించే విటమిన్ సి రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గిస్తాయి. అలాగే రక్తనాళాలు దెబ్బతినకుండా చూసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆకుకూరలు తినడం ద్వారా మనకు లభించే విటమిన్ ఇ చూపు మందగించకుండా చేస్తుంది. అంటే డయాబెటిస్‌ను తగ్గించడంతో.. పాటు దానితో సంబంధమున్న గుండెజబ్బులు, కంటి సమస్యలు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా పాలకూర తినడం ద్వారా డయాబెటిస్‌తో ఉన్నవారు మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.

  గుడ్లు

  గుడ్లు సంపూర్ణ ఆహారం అని మనకు తెలిసిందే. దీన్ని తినడం ద్వారా దాదాపు మనకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. గుడ్లు తినడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు రోజుకి రెండు గుడ్లు తినడం ద్వారా.. రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.

  సబ్జ గింజలు

  డయాబెటిస్‌తో ఇబ్బందిపడేవారు కచ్చితంగా సబ్జగింజలను.. తమ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే కార్భో‌హైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే పీచు పదార్థం.. రక్తంలోని చక్కెరలను శక్తిగా మార్చేస్తుంది. అలాగే ఆకలిని కూడా తగ్గిస్తుంది.

  పసుపు

  తెలుగింటి వంటల్లో పసుపుకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. పసుపు లేకుండా కూర వండటం మనకు తెలీదు. మనం రోజూ కూరలో వేసుకొనే చిటికెడు పసుపు రక్తంలో చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు డయాబెటిస్ కారణంగా వచ్చే కిడ్నీ సమస్యలను రాకుండా చేస్తుంది.

  గింజలు

  బాదం, వాల్ నట్, జీడిపప్పు, పిస్తా లాంటి గింజలు సైతం మధుమేహం తగ్గిస్తాయి. వీటిలో కూడా పీచుపదార్థం ఎక్కువగా.. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి.

  ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె

  రోజుకో చెంచా ఆలివ్ నూనెను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా.. మధుమేహం కారణంగా వచ్చే ఇతర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఆలివ్ నూనెలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాల్లో ఆక్సిడేషన్ ప్రక్రియ జరగకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినైల్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును సైతం తగ్గిస్తాయి.

  వెల్లుల్లి

  శాఖాహార, మాంసాహార వంటల్లో విరివిగా ఉపయోగించే వాటిలో అల్లం ఒకటి. ఇది వంటలకు ప్రత్యేకమైన ఫ్లేవర్ జోడిస్తుంది. ఇది కూడా బ్లడ్ షుగర్, బీపీ తగ్గిస్తుంది. ఈ ఫలితం పొందడం కోసం పాత వెల్లుల్లి ఉపయోగించాల్సి ఉంటుంది.

  కలబంద

  మధుమేహాన్ని తగ్గించే అంశంలో ఆయుర్వేదంలో కలబందకు చాలా ప్రాధాన్యముంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌ను సమర్థంగా తగ్గిస్తుంది. రోజూ కొంచెం కొంచెం కలబంద గుజ్జును తినడం ద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చు.

  కాకరకాయ

  మధుమేహంతో బాధపడేవారికి కాకరకాయ తినమని, కాకర కాయ జ్యూస్ తాగమని చాలామంది చెబుతుంటారు. దీనిలో ఉండే లెక్టిన్ అనే రసాయనం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

  Shutterstock
  Shutterstock

  డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహారం

  మధుమేహంతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిని తినడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం వల్ల.. మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండచ్చు.

  డ్రై ఫ్రూట్స్

  పండ్లలో విటమిన్ సి, పొటాషియంతో పాటు ఇతర ఆవశ్యక పోషకాలుంటాయి. అయితే వాటిని ఎండబెట్టినప్పుడు వాటిలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి.. పోషకాల గాఢత పెరుగుతుంది. పోషకాలు మాత్రమే కాదు. చక్కెర గాఢత సైతం పెరుగుతుంది. ఉదాహరణకు కప్పు ద్రాక్ష పళ్లలో 27 గ్రాముల కార్భోహైడ్రేట్స్ ఉంటే.. అదే కప్పు ఎండు ద్రాక్షలో 115 గ్రాములు కార్భోహైడ్రేట్స్ ఉంటాయి. ఎండు ద్రాక్షలో మూడు రెట్లు అధికంగా కార్భో హైడ్రేట్స్ ఉంటాయి. ఇదే నియమం.. ఇతర డ్రైఫ్రూట్స్‌కి కూడా వర్తిస్తుంది. అలాగని పండ్లకు దూరమవ్వాల్సిన అవసరం లేదు. వాటిని పరిమితిలో తినడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

  వైట్ బ్రెడ్

  బ్రెడ్‌తో సహా రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారైన అన్ని పదార్థాల్లోనూ కార్భోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ విషయంలోనూ ఇదే ఫలితం కనిపిస్తుంది. డయాబెటిస్‌తో ఇబ్బంది పడేవారు.. వైట్ బ్రెడ్ మాత్రమే కాకుండా పాస్తా, బన్, రస్క్ వంటి రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారైవనవి తినకూడదు.

  బియ్యం

  తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం వరి. మధుమేహంతో బాధపడేవారు మాత్రం అన్నానికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దీనిలో కార్భోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల షుగర్ కంట్రోల్ చేయలేనంత స్థాయికి పెరిగిపోతుంది. మధుమేహంతో బాధపడేవారు బియ్యానికి బదులుగా కొర్రలు, సామలు, రాగులు, వంటి తృణ ధాన్యాలు వండి వాటిని ఆహారంగా తీసుకోవడం మంచిది.

  బేక్డ్, ప్రోసెస్డ్ ఫుడ్

  మనలో ఎక్కువ మందికి బేక్డ్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. వాటిని తింటున్నామంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే వీటిలో కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటంతో పాటు వీటి తయారీకి వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు.  మధుమేహంతో బాధపడేవారు అస్సలు తినకూడదు.

  ట్రాన్స్ ఫ్యాట్స్

  ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఒక రకమైన కొవ్వులే. కానీ ఇవి సహజమైనవి కాదు. కృత్రిమంగా తయారుచేసేవే. వెజిటబుల్ ఆయిల్స్‌ కు హైడ్రోజన్ కలిపి వీటిని తయారు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే వనస్పతి నూనెలన్నమాట. ఈ ట్రాన్స్  ఫ్యాట్స్ మనం ప్రత్యక్షంగా ఉపయోగించకపోవచ్చు. కానీ మనకు తెలియకుండానే అవి మన ఆహారంలో భాగమైపోతున్నాయి. పీనట్ బటర్, క్రీమ్స్, ఫ్రోజెన్ ఫుడ్, బ్రెడ్ స్ప్రెడ్స్‌తో పాటు మఫిన్స్, క్రేకర్స్ వంటి బేక్డ్ ఫుడ్‌లోనూ ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.

  షుగర్ ఫ్రీ ఆహార పదార్థాలు

  ఇటీవలి కాలంలో షుగర్ ఫ్రీ ఫుడ్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. తియ్యగానే ఉన్నప్పటికీ మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగించదనే ప్రచారం పెరగడంతో వీటిని తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వీటితో పాటు ఆర్టిఫిషియల్ స్వీటనర్స్, షుగర్ ఫ్రీ క్యాప్సూల్స్‌ను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.

  వీటిని తినడం ద్వారా తీపి తినాలనే కోరిక పెరిగిపోవడం మొదలవుతుంది. దీంతో ఎక్కువగా తినడం మొదలుపెడతారు. ఫలితంగా అవసరమైనదానికంటే ఎక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి. దీనివల్ల సమస్య మరింత తీవ్రం కావచ్చు. వీటిని పరిమితుల్లో తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఏర్పడదు.

  వీటితో పాటుగా  ప్యాకేజ్డ్ ఫుడ్స్, తేనె, మాపుల్ సిరప్, ఫ్రూట్ జ్యూస్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ డ్రింక్స్, పంచదార వినియోగించిన ఆహార పదార్థాలకు సైతం దూరంగా ఉండటం ద్వారా మధుమేహం పెరగకుండా చూసుకోవచ్చు.

  Shutterstock
  Shutterstock

  తరచూ అడిగే ప్రశ్నలు

  పంచదార ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వస్తుందా?

  పంచదార లేదా పంచదారతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం.. ప్రత్యక్షంగా డయాబెటిస్ రావడానికి కారణం కాదు. కానీ దీని వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు పరోక్షంగా ఉన్నాయి. అదెలాగంటే.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతాం. ఒబేసిటీ వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఉంది. చక్కెర అధికంగా తినడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఒకసారి డయాబెటిస్ ఉందని గుర్తించిన తర్వాత.. పంచదారతో పాటు దానితో తయారు చేసిన పదార్థాలన్నింటికి దూరంగా ఉండాల్సిందే.

  బ్లడ్ షుగర్ లెవెల్‌ను తగ్గించుకోవడమెలా?

  రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. తగినంత నీరు తాగాలి. వైద్యుడు సూచించిన విధంగా మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే పొగ తాగడం, మద్యపానం సేవించడం, తీపి పదార్థాలు, బేకరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు.

  మధుమేహం ఉందా లేదా అనే విషయం ఇంట్లోనే తెలుసుకోవచ్చా?

  శరీరంలో వస్తున్న మార్పుల ఆధారంగా మధుమేహం ఉందో లేదో తెలుసుకోవడం కష్టం. అది తెలుసుకోవడానికి కచ్చితంగా రక్తపరీక్ష చేసుకోవడం తప్పనిసరి. సాధారణంగా తినక ముందు, తిన్న తర్వాత రక్త నమూనాలను సేకరించి పరీక్షించడం ద్వారా డయాబెటిస్ ఉందో లేదో గుర్తిస్తారు.

  అయితే ఇటీవలి కాలంలో ఇంట్లోనే బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడానికి వీలుగా బ్లడ్ గ్లూకోజ్ మీటర్స్ అనే పరికరాలు వస్తున్నాయి. వీటి సాయంతో మీ అంతట మీరు పరీక్షలు చేసుకోవచ్చు. అలాగే డిప్ స్టిక్ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్ట్రిప్‌ను మూత్రంలో ముంచడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను గుర్తించి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

  మధుమేహం లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయా?

  మధుమేహ లక్షణాలు ఒక్కోరకమైన డయాబెటిస్‌లో ఒక్కోరకంగా కనిపిస్తాయి. టైప్ 1 డయాబెటిస్‌లో అయితే చాలా తక్కువ సమయంలోనే పరిస్థితి తీవ్రంగా మారిపోయే అవకాశం ఉంది. కొన్ని రోజుల నుంచి వారాల వ్యవధిలో ఈ వ్యాధి ముదిరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  టైప్ 2 డయాబెటిస్‌లో వ్యాధి తీవ్రమవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అయితే కొన్ని లక్షణాల ఆధారంగా దాన్ని గుర్తించవచ్చు. ఆకలిగా అనిపించడం, దాహంగా అనిపించడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తే మధుమేహంగా అనుమానించి వైద్యుని సంప్రదించడం మంచిది.

  Feature Image: Shutterstock

  POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

  క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది