పోర్న్ అడిక్షన్ దూరం చేసే మార్గాలు (How To Stop Watching Porn In Telugu)

పోర్న్ అడిక్షన్ దూరం చేసే మార్గాలు (How To Stop Watching Porn In Telugu)

ఏ వ్యసనమైనా ఏదో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అది అడిక్షన్‌గా మారుతుంది. పోర్న్ విషయంలోనూ అంతే. అసలు సెక్స్ (sex) అంటే ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తితో మొదలువుతుంది. ఆ కుతూహలంతోనే నీలిచిత్రాల వెబ్సైట్‌లను సందర్శించడం మొదలుపెడతారు. అక్కడ లెక్కలేనంత పోర్న్ కంటెంట్ చూస్తూ ఆ లోకంలోనే ఉండిపోతారు. దాన్నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినా.. రాలేకపోతుంటారు. ఓ రకంగా చెప్పాలంటే పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిపోతారు. మరి, ఈ పోర్న్ అడిక్షన్ (porn addiction) నుంచి బయటపడాలంటే.. ఏం చేయాలి? దానికి చికిత్స ఏమైనా ఉందా? తదితర విషయాలను కూలంకషంగా చర్చించుకుందాం.

 

Table of Contents

  అమ్మాయిలు పోర్న్ వీడియోలకు అడిక్టవుతారా? (Is Porn Addiction Real?)

  సాధారణంగా అమ్మాయిలు పోర్న్‌కు బానిసగా మారడం అనేది చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు ఎక్సిస్టెన్సియల్ సైకాలజిస్ట్ డా. హరి రాఘవ్. అమ్మాయిలు తన భాగస్వామితో మానసికంగా తోడ్పాటును కోరుకుంటారు. కానీ శారీరక అవసరాలకు అంతగా ప్రాధాన్యమివ్వరని చెబుతున్నారు. ఒకవేళ అమ్మాయిలు పోర్న్ వీడియోలు చూసినప్పటికీ వాటి వల్ల వారికి ఏమీ కలిగే ప్రయోజనం లేదనే విషయాన్ని అమ్మాయిలు త్వరగానే గుర్తిస్తారట.

  దీంతో ఈ వీడియోలను చాలా  తక్కువ సమయంలోనే చూడడం మానేస్తారని చెబుతున్నారు హరి రాఘవ్. అదే అబ్బాయిల విషయంలో దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. మొదట్లో సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ ఈ వీడియోలను చూడడం మొదలుపెట్టి.. ఆ తర్వాత వాటిని అడిక్ట్ అయిపోతారని చెబుతున్నారు. పోర్న్ వెబ్ సైట్లలో ఎన్నో రకాల సెక్స్ వీడియోలుంటాయి. ఒక రకం బోర్ కొడితే మరో రకం చూస్తూ ఉంటారు. అలా నెమ్మదిగా వాటికి అలవాటు పడిపోతారు. ఆ డార్క్ వెబ్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. బోర్ కొట్టిన ప్రతిసారి కొత్త ఎలిమెంట్ కోసం వెతుక్కొనే అవకాశం పోర్న్ వెబ్సైట్స్‌లో ఉండటం కూడా ఈ అడిక్షన్‌కు కారణమే.

  Shutterstock

  పోర్న్ అడిక్షన్ వెనక ఉన్న కారణాలేంటి? (Reasons Behind Porn Addiction)

  మన దేశంలో సెక్సువల్ ఎడ్యుకేషన్‌కు అంతగా ప్రాధాన్యమివ్వరు. లైంగికవిద్య గురించి పాఠశాల స్థాయిలోనే పాఠ్యాంశాల్లో చేర్చరు. కానీ కౌమారదశలో ఉన్నప్పుడు విద్యార్థులకు సెక్స్ అంటే ఏంటి? అందులో పాల్గొనాల్సిన అవసరం ఏముందనే విషయాలు తెలుస్తాయి. దాంతో సెక్స్ సంబంధిత విషయాలను.. అలాగే ఆరోగ్యకరమైన లైంగిక జీవితం గురించి.. వారి క్లాసు సిలబస్‌లో భాగంగా పాఠ్యాంశాల్లో చెప్పడం జరుగుతుంది. కానీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పడానికి చాలామంది ఉపాధ్యాయులు ఇష్టపడరు. దానికి ఎన్నో కారణాలున్నాయి. కనీసం రుతుక్రమం గురించి చెప్పడానికి కూడా ఇష్టపడరు.

  అలాగే మన దేశంలో సెక్స్ గురించి మాట్లాడుకోవడం చాలా తప్పుగా భావిస్తారు. మనలో చాలామంది కూడా ఇది తప్పు అని భావించి సెక్స్ గురించి వచ్చే ఆలోచనలను, దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను అదిమిపెట్టి ఉంచుతారు. కానీ మన శరీరంలో ఉండే హార్మోన్లు మాత్రం సెక్స్ దిశగా మనల్ని నడిపిస్తాయి. అది సహజంగా జరిగే ప్రక్రియ. పైగా టీనేజ్‌లో ఉండే ఉత్సుకత కారణంగా.. అసలు సెక్స్ గురించి తెలుసుకోవడానికి యువత పోర్న్ వీడియోలు చూడటం మొదలుపెడతారు. ఇలా జరగడానికి హార్మోన్ల ప్రభావం కూడా ఓ కారణమే. ఆ ఉత్సాహం ఒకటి రెండు వీడియోలతో సరిపెట్టుకుంటే ఓకే. చాలామంది ఈ విషయంలో విచక్షణతో వ్యవహరించి వాటిని చూడటం కంట్రోల్ చేసుకుంటారు.

  కానీ కొంతమంది మాత్రం అలా చేయరు. దాని వల్ల తమకు ఎలాంటి నష్టం కలగడం లేదని భావిస్తూ.. ఆ హాబీని కొనసాగిస్తుంటారు. డా. హరి రాఘవ్ ప్రకారం ‘మనం ఏ పని చేసినా దానికి సమాజం నుంచి అంగీకారం ఉందా లేదా? మనం చేస్తున్న పని వల్ల మనకు శారీరకంగా బాధ ఏమైనా కలుగుతుందా? అనే రెండు విషయాలను కొందరు పరిగణనలోకి తీసుకొంటారు. సాధారణంగా సమాజం అంగీకరించకపోయినా.. తమకు బాధకు గురి చేయని పనులు, సంతోషాన్ని కలిగించే పనులను ఎలాగైనా చేయాలని భావిస్తుంటారు. వాటిని ఎవరికీ తెలియకుండా చేయడానికి ఇష్టపడుతుంటారు. పోర్న్ వీడియోలు చూడటం కూడా అలాంటిదే. నీలిచిత్రాలు చూడటం వల్ల వారికి శారీరకంగా ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. పైగా అది వారికి ఆనందాన్నిస్తుంది. ఇదే పోర్న్ అడిక్షన్‌కు దారి తీస్తుంది. పైగా ఇది ఆన్‌లైన్‌లో సులువుగా దొరుకుతుండటంతో దీనికి యువత అడిక్టవుతున్నారు.

  ఇటీవలి కాలంలో పోర్న్  వీడియోలకు (porn video)  టీనేజ్‌లో ఉన్నవారు సైతం అడిక్టవుతున్నారు. చిన్న పిల్లలు సైతం కొన్ని సందర్భాల్లో యానిమేటెడ్ సెక్స్ కంటెంట్ ఉన్న వీడియోలు చూస్తున్నారు. దీనికి ఒక రకంగా పెద్దలే కారణం. కంప్యూటర్లలో ఎవరైనా నీలిచిత్రాలు చూసి తర్వాత కుకీస్ ఆధారంగా.. వాటికి సంబంధించిన ప్రకటనలు  మనం బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారి వెల్లువెత్తుతాయి. యూట్యూబ్‌లో వీడియోలు చూసినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది.

  అలాంటి వాటిని అనుకోకుండా క్లిక్ చేయడం వల్ల పిల్లలు సైతం వాటిని వీక్షించడం మొదలుపెడుతున్నారు. తప్పొప్పులు బేరీజు వేసుకొనే పరిపక్వత వారిలో లేకపోవడం వల్ల వాటిని చూడటం కొనసాగిస్తున్నారు. పొరపాటున తల్లిదండ్రుల కంటబడి వారి చేతిలో చీవాట్లు తిన్నా.. వాటిపై ఆసక్తి పెరిగిపోవడం వల్ల తల్లిదండ్రులకు తెలియకుండా చూస్తున్నారు. కాబట్టి కంప్యూటర్ లేదా మొబైల్లో నీలిచిత్రాలు చూసేటప్పుడు కొన్ని ఫిల్టర్లు వాడటం మంచిది. అలాగే వాటిని చూసిన తర్వాత హిస్టరీ, కుకీస్ వంటి వాటిని డిలీట్ చేయడం ద్వారా ఇలా జరగకుండా చూసుకోవచ్చు.

  పోర్న్ ఫ్రీ లైఫ్ హ్యాపీ లైఫ్ అని చెప్పొచ్చా? (Is Porn Free Life A Better Life)

  ఈ విషయంలో సైతం డా. హరి రాఘవ్ వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించారు. పోర్న్ చూడటం వల్ల ఆ వీడియోల్లో చేసిన మాదిరిగా అసహజమైన రీతిలో సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక పెరుగుతుంది. తాము కూడా అలా చేయాలనే ఉద్దేశంతో పురుషులు తమ భార్యలను ఇబ్బంది పెడుతుంటారు. ఒకవేళ ఆమె సమ్మతం తెలపకపోతే తన కోరికను తీర్చుకోవడానికి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొనే అవకాశం కూడా ఉంటుంది.

  తాను అక్రమ సంబంధం పెట్టుకొన్న అమ్మాయి దగ్గర తాను కోరుకున్నది దొరక్కపోతే మరొకరి దగ్గరకు వెళతారు. ఇలా చేయడం వల్ల ఎస్టీడీ, హెచ్ఐవీ వంటివి సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇన్ని అనర్థాలు జరుగుతుంటే పోర్న్ చూడటం వల్ల మనకొరిగే ప్రయోజనం ఏముంటుంది? పైగా దాని వల్ల విలువైన సమయం వ్యర్థం అవడం తప్ప. కాబట్టి పోర్న్ చూడకుండా ఉండటం వల్ల అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హాయిగా సంసారిక జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

  పోర్న్ అడిక్ట్ అయ్యామని గుర్తించడమెలా? (Symptoms Of Pornography Addiction)

  Shutterstock

  ఎవరైనా పోర్న్ అడిక్ట్ అయ్యారా? లేదా? అనేది కనుక్కోవడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే పోర్న్ వీడియో చూడటం చాటుగా చేసే పని. అయితే ఈ విషయాన్ని ఎవరికి వారు తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం మనల్ని మనమే ఎసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • పోర్న్ చూసే సమయం రోజురోజుకీ ఎక్కువ కావడం
  • పోర్న్ చూడటం వల్లే ఆనందం దొరుకుతుందని భావించడం.
  • చేయాల్సిన పనులను వదిలేసి పోర్న్ చూడటానికే ఇష్టపడటం.
  • నిద్ర పోకుండా రాత్రంతా నీలిచిత్రాలు చూస్తూ గడపడం
  • మీ సెక్స్ ఫాంటసీలను మీ పార్టనర్ పై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం. వారిని కూడా పోర్న్ చూడమని బలవంతం చేయడం
  • పోర్న్ చూస్తేనే తప్ప సెక్స్ ఎంజాయ్ చేయలేకపోవడం
  • ఇతర పనులు చేసే సమయంలోనూ పోర్న్ చూడాలనే ఆలోచన రావడం

  ఈ లక్షణాలు సాధారణంగా పోర్న్ చూసేవారిలో కనిపిస్తాయి. ఒకవేళ మీ భాగస్వామిలో ఈ లక్షణాలు గమనిస్తే వారిని పోర్న్ అడిక్ట్‌గా గుర్తించవచ్చు.

  పోర్న్ అడిక్షన్‌ను దూరం చేసుకోవడానికి ఏం చేయాలి? (How To Stop Watching Porn In Telugu)

  నీలిచిత్రాలు చూడాలనే కోరికను అదుపు చేసుకోవడానికి లేదా వాటిని చూడటం చూడకపోవడమనేది మీ నియంత్రణలో ఉండాలనుకొంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏ పని చేయాలన్నా సంకల్పం ముఖ్యమంటారు కదా. నీలి చిత్రాలు చూడటం తగ్గించే విషయంలోనూ అదే సంకల్పం ఉండాలి. లేదంటే ఈ సారికి కానిచ్చేద్దాంలే.. ఇదే లాస్ట్.. అని మీకు మీరు సర్ది చెప్పుకుంటూ పోర్న్ వీడియోలు చూస్తూనే ఉంటారు. ఒక్కసారిగా పోర్న్ వీడియోలు చూడకుండా ఉండటం కష్టమే. కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.

  Shutterstock

  1. పోర్న్‌కి దూరంగా జరిగే విషయంలో మీరు చేయాల్సిన మొదటి పని మీ ఫోన్లో ఉన్న అశ్లీల వీడియోలను డిలీట్ చేయడం. అలాగే మీ దగ్గర ఉన్న కంప్యూటర్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, సీడీలు.. ఇలా మీ దగ్గర ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల్లో ఉన్న పోర్నోగ్రఫీ మొత్తాన్ని డిలీట్ చేసేయండి.
  2. మీ దగ్గర ఉన్న పోర్న్ మొత్తం డిలీట్ చేసుకుంటే సరిపోదు. పోర్న్ వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్లు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లను చూసి మళ్లీ వాటిని చూడాలనిపించవచ్చు. అందుకే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను బ్లాక్ చేయాలి. బుక్ మార్క్స్‌ని సైతం డిలీట్ చెయ్యాలి. అలాగే అకౌంటబిలిటీ సాఫ్ట్‌వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
  3. మెదడు ఖాళీగా ఉంటే మళ్లీ పరిస్థితి మొదటికే రావచ్చు. కాబట్టి ఏదో ఒక పని చేయడానికి ప్రయత్నించండి. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం ఓ వ్యాపకంగా పెట్టుకోండి. లేదా మీ ఆసక్తులకు పదును పెట్టండి. ఖాళీగా మాత్రం ఉండొద్దు. పని చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోతే నిద్రపోండి. కానీ మళ్లీ పోర్న్ వీడియోలు చూడటానికి మాత్రం ప్రయత్నించవద్దు.
  4. నిజం చెప్పండి.. నలుగురిలో ఉన్నప్పుడు వారికి తెలియకుండా పోర్న్ వీడియో చూడటం ఎంత ఇబ్బందిగా ఉంటుంది? అదే వారితో ఏదో ఒకటి మాట్లాడండి. పిచ్చాపాటి కబుర్లైనా సరే. అనవసరమైన టెన్షన్ ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది.
  5. పోర్న్ అతిగా చూడటానికి కారణమేంటి? మన దగ్గర స్మార్ట్ పోన్ ఉండటం,  దాంట్లో 4జీ డేటా ఉండటం. కాబట్టి కొన్ని రోజుల పాటు స్మార్ట్ ఫోన్‌కి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. దానికి బదులుగా కొన్ని రోజుల పాటు బేసిక్ మోడల్ ఫోన్ ఉపయోగించండి. స్మార్ట్ ఫోన్ ఉపయోగించాల్సి వస్తే దానిలో అకౌంటబిలిటీ సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేసుకోండి.
  6. ఫోన్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ కంప్యూటర్లలో యాంటీ పోర్నోగ్రఫీ సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేయండి. ఇది కొంత మేర పోర్న్ అడిక్షన్ నుంచి బయటపడడానికి ఉపయోగపడొచ్చు.
  7. పోర్న్ చూడకూడదని ఎంత సిన్సియర్‌గా ప్రయత్నించినా కొన్నిసార్లు మనసు అటువైపు మళ్లొచ్చు. ఆ సమయంలో మీ భాగస్వామి లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని హెచ్చరించే ఏర్పాటు చేసుకోండి.
  8. పోర్న్ చూడకుండా ఉండటానికి మీ అంతట మీరుగా కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాలి. మీకు ఇష్టమైన పనిని గుర్తించేంత వరకు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్లిపోవాలి. కానీ ఆ పనుల వల్ల ఇతరులకు ఇబ్బంది ఎదురవకుండా చూసుకోవడం మాత్రం మీ బాధ్యతే.
  9. పోర్న్ అడిక్షన్ నుంచి బయటపడాలంటే.. మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని మీతో నిజాయతీగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తితో గడపండి. వారైతేనే మీరు పోర్న్ వీడియోలు చూడటానికి ప్రయత్నిస్తున్నా, వాటి కోసం పరితపించిపోతున్నా.. నిర్మొహమాటంగా మిమ్మల్ని హెచ్చరించి తిరిగి దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు.
  10. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి ప్రయత్నించండి.
  11. ఖాళీ సమయంలో గ్యాడ్జెట్స్‌తో ఆడటానికి బదులు పజిల్స్, సుడోకు వంటివి పూర్తిచేయడానికి ప్రయత్నించండి.

  పోర్న్ అడిక్షన్ నుంచి బయటపడటానికి నిపుణుల సాయం తీసుకోవడం అవసరమా? (Need Expert Help To Get Out Of Porn Addiction?)

  పోర్న్ అడిక్షన్ మానసికపరమైన సమస్య మాత్రమే కాదు.. మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాలు సైతం పోర్న్అడిక్షన్‌కు కారణమవుతాయి. అప్పటి వరకు పోర్న్‌కి బాగా అలవాటు పడి ఒక్కసారిగా మానేయడం వల్ల మానసికంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆత్రుత, ఒత్తిడి, కుంగుబాటు, ఓసీడీ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి మానసిక వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. వారు పోర్న్ అడిక్షన్ నుంచి బయట పడేసి మిమ్మల్ని సరైన దారిలో పెడతారు. పైగా వారు మీ మానసిక పరిస్థితిని బాగా అధ్యయనం చేసిన తర్వాత మీకు తగిన చికిత్సను అందించగలుగుతారు.

  పోర్న్ అడిక్షన్ నుంచి మిమ్మల్ని బయటపడేసే పద్ధతులు (Methods To Get You Out Of Porn Addiction)

  పోర్న్ అడిక్షన్ నుంచి బయటపడాలనే ఆలోచన వచ్చిందంటే మీలో మార్పు మొదలైనట్టే. అయితే ఆ మార్పుని అక్కడితో వదిలేయకుండా ముందుకు తీసుకెళ్లాలంటే దానికి నిపుణుల సహాయం అవసరం. అందుకే పోర్న్ డీ అడిక్షన్ విషయంలో మన ముందున్న మార్గాల గురించి కూడా తెలుసుకోవడం అవసరం.

  థెరపీ (Therapy)

  మీరు పోర్న్‌కు ఎంత బానిసయ్యారనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఇండివిడ్యువల్, గ్రూప్ లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ సెషన్స్‌లో మీరు పోర్న్ అడిక్షన్‌కు గురి కావడానికి గల కారణాన్ని మీరు గుర్తించగలుగుతారు. దాన్ని సరిచేసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యకరమైన సంబంధాలు పెంపొందించుకుంటారు.

  Shutterstock

  మందులు (Medicine)

  సాధారణంగా బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ ద్వారా సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. అది ఫలించకపోతే మందులు వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోర్న్ అడిక్షన్ నుంచి బయటపడే సమయంలో ఎదురయ్యే డిప్రెషన్, ఓసీడీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లైతే మెడిసిన్ వేసుకోవాల్సిందే.

  సపోర్ట్ గ్రూప్స్ (Support Groups)

  ఇతరులకు తమ ఇబ్బందులను చెప్పుకోవడం ద్వారా కోల్పోయిన మానసిక స్థైర్యాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటారు. మీలాగే పోర్నోగ్రఫీ చూడటానికి అలవాటు పడి దాన్నుంచి బయటపడాలనుకునేవారికి తోడ్పాటునందించే సపోర్ట్ గ్రూపులుంటాయి. వాటిలో మీరు కూడా చేరండి.

  ఆన్‌లైన్ హెల్ప్ (Online Help)

  ఆన్‌లైన్‌లోనూ ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో సైతం పోర్న్ నుంచి బయటపడాలనుకొనేవారికి మద్దతునిచ్చే గ్రూపులుంటాయి. వాటిలో చేరండి. వీటితో పాటుగా కొంతమంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్ ద్వారా మీరు సమస్య నుంచి బయటపడేందుకు సాయం చేస్తారు.

  పోర్న్ అడిక్షన్ నుంచి బయటపడకపోతే ఏమవుతుంది? (What Happens if You Don't Get Out Of Porn Addiction?)

  సరదాగా మొదలై అలవాటుగా ఆ తర్వాత వ్యసనంగా మారే.. పోర్న్ అడిక్షన్ వల్ల మనం ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పోర్న్‌కి అలవాటు పడినవారు భాగస్వామితో బలమైన అనుబంధాన్ని కలిగి ఉండలేరు. అలాగే లైంగికపరమైన సంతృప్తి పొందలేరు. సెక్స్‌లో ‌పాల్గొనే సమయంలో భాగస్వామి ఇష్టాలకు ప్రాధాన్యమివ్వరు. పైగా పోర్న్ వీడియోల్లో చూసినవన్నీ చేయాలనే కోరిక బాగా పెరిగిపోయి భాగస్వామితో బలవంతపు సెక్స్ చేయడం ప్రారంభిస్తారు.

  ఇది మరీ శ్రుతి మించితే అత్యాచారాలు చేయడానికి, అసహజ లైంగికచర్యలో పాల్గొనడానికి ప్రయత్నించడం వంటివి చేస్తుంటారు. కొంతమంది ఈ వీడియోలు చూసి గే, లెస్బియన్, బైసెక్సువల్‌గా మారిపోతుంటారు. అన్నింటికంటే.. ముఖ్యంగా వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఎక్కువ సమయం పోర్న్ చూడటానికి అలవాటు పడటం వల్ల కెరీర్, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన బాద్యతలను నిర్వర్తించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

  కాబట్టి పోర్న్ అడిక్ట్ అయ్యామని మీ అంతట మీరు గుర్తిస్తే దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా నీలిచిత్రాలకు బానిస అయినట్లు గుర్తించినా దాన్నుంచి వారు బయటపడేలా సాయం చేయడానికి ప్రయత్నించండి.

  Shutterstock

  తరచూ అడిగే ప్రశ్నలు (FAQ's)

  పోర్న్ చూడాలన్న కోరికను అదుపు చేసుకోవడమెలా?

  పోర్న్ చూడటానికి ముఖ్యమైన కారణం అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి. పోర్న్ చూడటం కూడా నేరమేమీ కాదు. పోర్న్ చూడటాన్ని మనం నియంత్రించుకోవాలి. కానీ అది మనల్ని నియంత్రించకూడదు. అందుకే పోర్న్ చూసే సమయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు దృష్టిని ఇతర పనులపైకి మరల్చడానికి ప్రయత్నించండి. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకోండి. అప్పటికీ పోర్న్ చూడాలనే మీ కోరికను అదుపు చేసుకోలేకపోతుంటే.. మానసిక వైద్యులను సంప్రదించండి. వారు ఈ వ్యసనం నుంచి బయటపడటానికి మీకు సాయం చేస్తారు.

  పోర్న్ చూడటం వల్ల సెక్సువల్ లైఫ్‌కు ఏదైనా ఉపయోగం ఉందా?

  పోర్న్ చూడటం వల్ల కొంత వరకు సెక్సువల్ లైఫ్‌కు కొంతమేర ఉపయోగం ఉండొచ్చు. కానీ లైంగికపరమైన ఆనందం కోసం పూర్తిగా దానిపైనే ఆధారపడితే మాత్రం కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. సెక్స్ విషయంలో కొత్తగా ప్రయత్నించాలనుకొనేవారికి పోర్న్ చూడటం వల్ల కొంతమేర ఉపయోగపడొచ్చు.

  పోర్న్ చూడటం వ్యసనంగా మారిందనే విషయాన్ని గుర్తించడమెలా?

  అప్పుడప్పుడూ పోర్న్ చూడటాన్ని అడిక్షన్‌గా భావించాల్సిన అవసరం లేదు. కానీ పోర్న్ చూడాలనుకొన్న కోరికను అదుపుచేసుకోలేకపోవడం, ఎంత సమయమైనా నీలిచిత్రాలను చూస్తూనే ఉంటే అప్పుడు పోర్న్‌కు అడిక్ట్ అయినట్టు గుర్తించాలి. పోర్న్ చూడటం వల్ల మీ వ్యక్తిగత, వృత్తిప‌ర‌మైన‌ జీవితం ప్రభావితమవుతుంటే.. మీరు పోర్న్‌కి బానిసగా మారినట్టే.

  పోర్న్ చూడాలనే నా కోరికను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. మరో వైపు పోర్న్ చూడాలని బలంగా అనిపిస్తోంది? దీన్నుంచి బయటపడటమెలా?

  మనకున్న వ్యసనాన్ని తగ్గించుకొనే క్రమంలో ఎంతో సంఘర్షణకు గురవ్వాల్సి వస్తుంది. పోర్న్ డీ అడిక్షన్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. వాటిని చూడకూడదని ఎంత బలంగా అనుకొంటామో.. అంతకంటే బలంగా చూడాలనిపిస్తుంది కూడా. అలా అనిపించిన ప్రతిసారీ మనసును మరో పని వైపు మళ్లించుకోవాలి. అలాగే మీ ఫోన్, కంప్యూటర్లలో పోర్న్‌కి సంబంధించిన వీడియోలు డిలీట్ చేయండి. అలాగే మీ బ్రౌజర్లో పోర్న్‌కి సంబంధించిన నోటిఫికేషన్లను బ్లాక్ చేయండి. వీటన్నింటితో పాటుగా సైకాలజిస్ట్‌ను సంప్రదించి సమస్య నుంచి పూర్తిగా బయటపడే ప్రయత్నం చేయండి.

  Feature Image: Shutterstock

  POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

  క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది