ఆమెను ఆ టీజర్‌లో చూసి.. మెగాస్టార్ ఫిదా అయిపోయారు..!

ఆమెను ఆ టీజర్‌లో చూసి.. మెగాస్టార్ ఫిదా అయిపోయారు..!

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నుండి ప్రశంసలు పొందడమంటే.. ఏ కథానాయికకైనా అది అదృష్టమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్తగా సినీ రంగంలోకి వస్తున్న హీరో, హీరోయిన్లు నటనలో మంచి ప్రతిభను కనబరచాలే గానీ.. వారిని చిరు బాగా ప్రోత్సహిస్తారు. ఇటీవలే తమిళ సూపర్‌హిట్‌ చిత్రం కణకి తెలుగు రీమేక్‌గా వస్తున్న ‘కౌసల్య  కృష్ణమూర్తి’ చిత్ర కథానాయిక ఐశ్వర్యా రాజేష్‌ను చిరు పొగడ్తలతో ముంచెత్తారు.

ఆమెకు ఫోన్ చేసి.. తాను టీజర్ (Teaser) చూశానని.. ఆమెలో మంచి నటి దాగుందని ఆయన తెలిపారు. ఆ ప్రశంసలకు ఐశ్వర్య నిజంగానే ఉబ్బితబ్బిబైపోయారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతూ.. తానే స్వయంగా ట్వీట్ చేశారు. చిరు తనతో మాట్లాడిన విధానానికి చాలా ఆశ్చర్యపోయానని.. తనకు దక్కిన అతి పెద్ద గౌరవంగా దానిని భావిస్తున్నానని ఆమె తెలిపారు.

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో.. కె.ఏ వల్లభ ఈ ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఇదే బ్యానర్ చిరంజీవి నటించిన అనేక చిత్రాలను నిర్మించింది. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, మరణ మృదంగం మొదలైన చిత్రాలను అందించింది. అలాగే మాతృదేవోభవ లాంటి అవార్డు సినిమాలను కూడా రూపొందించింది. 

ఈ చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు మన  తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన లెజండరీ నిర్మాతల్లో ఒకరు. ఆయనకు చిరంజీవికి మంచి అనుబంధం కూడా ఉంది. 2018 లో ఇదే బ్యానరుపై కరుణాకరన్ దర్శకత్వంలో "తేజ్  ఐ లవ్ యూ" చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. మెగా హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. కొంత గ్యాప్ తర్వాత.. ప్రస్తుతం క్రియేటివ్ కమర్షియల్స్  బ్యానరుపై ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 

ఈ రోజే ఈ చిత్ర టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అంతకు ముందే.. ఆయన హీరోయిన్‌కు ఫోన్ చేసి అభినందించారు. ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన పేద బాలిక.. పట్టుదలతో క్రికెటర్‌గా ఎలా మారిందన్నదే ఈ చిత్ర కథ.

ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయి. అయినా తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించింది. ప్రముఖ తెలుగు నటుడు రాజేష్‌ కుమార్తైన ఐశ్వర్య, హాస్యనటి శ్రీలక్ష్మికి మేనగోడలు కూడా. 2017లో "డాడీ" అనే ఓ బాలీవుడ్ సినిమాలో కూడా ఈమె నటించింది. తిరుదాన్ పోలీస్, కాక ముత్తై, లక్ష్మీ, సామి 2, వడ చెన్నై, కాదలై, ముప్పరిమనం, ధర్మ దురై మొదలైనవి ఈమె నటించిన పలు ప్రముఖ తమిళ చిత్రాలు.

కాక ముత్తైలో నటనకు గాను.. తమిళనాడు ప్రభుత్వం నుండి ఉత్తమ నటిగా కూడా అవార్డు అందుకుంది ఐశ్వర్య. అలాగే ధర్మదురై చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా సైమా పురస్కారాన్ని కైవసం చేసుకుంది. తెలుగులో కౌసల్య క్రిష్ణమూర్తి చిత్రంలో ప్రస్తుతం నటించిన ఈమె.. బ్రేకప్, మిస్ మ్యాచ్ అనే మరో రెండు తెలుగు చిత్రాలకూ సైన్ చేసింది. 

ఈ చిత్రానికి దిబు నినన్ థామస్ సంగీతం అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. హనుమాన్ చౌదరి సంభాషణలు సమకూర్చగా, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎస్. రామారావు చిత్రాన్ని సమర్పిస్తుండగా.. వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమనేని గతంలో పవన్ కళ్యాణ్ నటించిన  సుస్వాగతం, అన్నవరం చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మహిళా క్రికెట్ నేపథ్యంలో.. తొలి తెలుగు సినిమా ‘కౌసల్య కృష్ణ‌మూర్తి’

శభాష్ మిథాలీ రాజ్.. మరో చరిత్ర తిరగరాసిన క్రికెట్ దిగ్గజం

అలా అనుకొంటే ఇలా జరిగిందేంటి రవి శాస్త్రి బాబాయ్..?