మెడ అందాన్ని ఇనుమడించాలన్నా.. వేసుకున్న డ్రస్ అందం ద్విగుణీకృతం కావాలన్నా మెడలో చిన్న చెయిన్ లేదా నెక్లెస్ వంటి యాక్సెసరీస్ వేసుకోవడం సహజమే. అయితే కొందరు సింపుల్ గా ఒకటి లేదా రెండు చెయిన్స్ వేసుకుంటే ఇంకొందరు ఒకే ఒక్క నెక్లెస్ తో తమ లుక్ ని ముగిస్తారు. మరికొందరు మాత్రం నచ్చిన విధంగా లాంగ్ & షార్ట్ చెయిన్స్ ఒకేసారి వేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ లుక్ అంతగా బాగుండదు సరికదా.. చూసేవారికి కూడా కాస్త ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అందుకే నెక్లెస్ లేదా చెయిన్స్ (Necklaces and neck pieces)వేసుకున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాల్సిందే అంటున్నారు స్టైలిస్ట్ లు. అవేంటంటే..
మెడలో సన్నగా ఉన్న చెయిన్స్ రెండు కంటే ఎక్కువగా వేసుకునేటప్పుడు ఎన్ని వేసుకుంటున్నారు, అవి ఒక దానితో మరొకటి మ్యాచ్ అవుతున్నాయో, లేదో సరి చూసుకోవాలి. అలాగని మరీ ఎక్కువ సంఖ్యలో చెయిన్స్ వేసుకున్నా కూడా లుక్ అంతగా బాగోదు.
రెండు కంటే ఎక్కువ సంఖ్యలో చెయిన్స్ వేసుకుంటున్నప్పుడు వాటి మధ్య ఉండే గ్యాప్ ని కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటు చెయిన్స్ ఒకదానికి మరొకటి మరీ దగ్గరగా ఉంటే చూడడానికి అంత స్పష్టంగా కనిపించవు. ఒకదానితో మరొకటి కలిసిపోయి గజిబిజీగా కనిపిస్తాయి. అందుకే చెయిన్ కు, చెయిన్ కు మధ్య కాస్త గ్యాప్ ఉండేలా చూసుకుంటే వేటికవి స్పష్టంగా, నీట్ గా కనిపిస్తాయి.
మనం వేసుకునే చెయిన్స్ సంఖ్య మాత్రమే కాదు.. వాటి పొడవు కూడా మన లుక్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే డ్రస్ కు తగినట్లుగా మెడకు దగ్గరగా ఉన్నవి, ఛాతీ పై భాగం వరకు ఉన్నవి, పొడవుగా ఉన్నవి.. ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్లెయిన్ చెయిన్స్ పొడవును బట్టి వేసుకుంటే సరిపోతుంది.. మరి, పెండెంట్స్ ఉన్న చెయిన్స్ మాటేమిటి?? వాటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెండెంట్స్ మధ్య గ్యాప్ మెయింటెయిన్ చేస్తూ స్టోన్స్, క్రిస్టల్స్.. వంటివి కాంబినేషన్ గా వేసుకోవాలి. అప్పుడే అవి మన లుక్ ని మరింత స్టైలిష్ గా చూపిస్తాయి.
మెడలో వేసుకునే ప్రతి నెక్ పీస్ డీటెయిలింగ్ విషయంలోనూ స్పష్టత ఉండాల్సిందే! చిన్నవిగా ఉన్న నెక్ పీస్ లను మెడకు దగ్గరగా వేసుకుని, పొడవుగా ఉన్న వాటిని వాటికి జత చేయాలి. అప్పుడే రెండూ స్పష్టంగా వేటి ప్రత్యేకతను అవి కలిగి ఉండి మరింత అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలప్పుడు నెక్లెస్ , దానికి జతగా హారం.. వంటివి ధరించే మహిళలు ఈ నియమాన్ని బాగా గుర్తుంచుకోవాలి సుమా..!