తెలంగాణలో అందరూ తప్పక చూడాల్సిన.. ప్రముఖ దేవాలయాలు ఇవే..!

తెలంగాణలో అందరూ తప్పక చూడాల్సిన.. ప్రముఖ దేవాలయాలు ఇవే..!

మన దేశం ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. ఆనాటి అద్భుతమైన సంస్కృతిని గురించి చెబుతూ.. ఎన్నో దేవాలయాలు (Temples) అప్పటి కాలం నాటి కథలను, నాగరికతను మనకు వివరిస్తుంటాయి. ముఖ్యంగా దేవాలయాలపైన కనిపించే అద్భుతమైన శిల్పాలు.. మనకు అప్పటి కళారూపాల గురించి సవివరంగా తెలియజేస్తాయి. 

మామూలుగా అయితే వాడకో గుడి తప్పనిసరిగా ఉంటుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. స్థల పురాణాలను బట్టి ఎన్నో దేవాలయాలు ఆయా ప్రాంతాలలో దర్శనిమిస్తాయి. అలా ప్రముఖ దర్శనీయ ప్రదేశాలుగా చెప్పుకునే వాటిలో తెలంగాణలోని (Telangana) కొన్ని ప్రముఖ దేవస్థానాల గురించి తెలుసుకుందాం.

1. యాదాద్రి నరసింహ స్వామి దేవాలయం

tripadvisor

హైదరాబాద్ నుంచి కేవలం 66 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ దేవస్థానం.. తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన దేవాలయాల్లో ఒకటి. హైదరాబాద్‌లోని ప్రతి బస్టాండ్ నుంచి యాదగిరి గుట్టకు బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ వరంగల్ హైవే పై ఉన్న ఈ దేవాలయంలో నరసింహ స్వామి కొలువై ఉన్నాడు.

మూడు వందల అడుగుల ఎత్తున్న కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయం పక్కనే.. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం మరో కొత్త ఆలయాన్ని నిర్మిస్తోంది. దశావతారాల్లో ఒకటైన నరసింహుడి రూపంలో ఇక్కడ కొలువై ఉన్న స్వామిని దర్శించుకునేందుకు.. రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడికి రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే భువనగిరి రైల్వే స్టేషన్‌లో దిగి.. అక్కడి నుంచి ఆటో లేదా బస్సులో వెళ్లే వీలుంటుంది.

2. భద్రాచలం రామచంద్ర స్వామి దేవాలయం

tripadvisor

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ బోర్డర్‌లో కనిపించే ఈ దేవాలయం రాష్ట్రంలో చాలా ప్రముఖమైనది. ఈ ప్రాంతాన్ని సీతారాములు నడయాడిన ప్రదేశంగా కూడా చెబుతారు. ఈ దేవాలయాన్ని చేరాలంటే.. ఖమ్మం నుంచి 115 కిలోమీటర్లు, కొత్త గూడెం నుంచి 39 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 178 కిలోమీటర్ల దూరం పడుతుంది.  గోదావరి నది ఒడ్డున ఉండే ఈ దేవాలయాన్ని భక్త రామదాసు (కంచర్ల గోపన్న) పదిహేడో శతాబ్దంలో కట్టించాడు.

ఇక్కడే రావణాసురుడు సీతను అపహరించాడట. అరణ్య వాసంలో భాగంగా సీతారాములు ఇక్కడే ఉండేవారని చెప్పేందుకు పలు ఆధారాలు కూడా ఉన్నాయట. దేవాలయాన్ని సందర్శించిన వాళ్లందరూ.. ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పర్ణశాలను, అక్కడి ఆనవాళ్లను దర్శించడం చేస్తుంటారు.

అలాగే ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చే సందర్శకులు.. పాపికొండల్లో బోటింగ్, ట్రెక్కింగ్ వంటివి ఎక్కువగా చేస్తుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి ఖమ్మం లేదా భద్రాచలం రైల్వే స్టేషన్‌లో దిగి వెళ్లే వీలుంది. లేదా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భద్రాచలంకి బస్సులు అందుబాటులో ఉన్నాయి. శ్రీ రామనవమి నవరాత్రుల్లోనూ.. ఇక్కడి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సీతారాముల కల్యాణం చూసేందుకు నవమి రోజు చాలామంది ఇక్కడికి వస్తుంటారు.

3. వరంగల్ భద్రకాళి దేవాలయం

tripadvisor

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వరంగల్ భద్రకాళి మాతను చెబుతుంటారు. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. చాళుక్య రాజులు కట్టించిన ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారి రాతి రూపం అద్భుతంగా కనిపిస్తుంది. అల్లాఉద్దీన్ ఖిల్జీ వంటి రాజులు దీన్ని కూల్చేసినా.. ఆ తర్వాత ఆలయాన్ని తిరిగి నిర్మించారట. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి అందాలను కూడా చూడవచ్చు.

కొన్నేళ్ల క్రితం వరకూ ఉగ్రకాళిగా ఉన్న అమ్మవారికి.. ప్రత్యేక పూజలు జరిపించి శాంతింపజేశారట. ఇక్కడ కోరికలు కోరుకుంటే అవి తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికి వెళ్లడానికి వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి.

4. వెయ్యి స్థంభాల గుడి

tripadvisor

అప్పటి రాజుల అద్బుతమైన శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది వరంగల్ జిల్లాలో ఉన్న ఈ వెయ్యి స్థంభాల గుడి. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్స్‌లోనూ స్థానం సంపాదించుకుంది. ఈ దేవాలయంలో విష్ణువు, శివుడు, సూర్యుడు కొలువై ఉన్నారు. పన్నెండో శతాబ్ధంలో కట్టిన ఈ గుడి ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇటీవలే ఈ దేవాలయం కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే.. దాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఇక్కడికి చేరుకోవడానికి వరంగల్, హైదరాబాద్ నుంచి బస్సు సౌకర్యం ఉంది .వరంగల్‌కి బస్సు లేదా రైలు ద్వారా చేరుకొని అక్కడి నుంచి ఇక్కడికి వెళ్లే వీలుంటుంది.

5. కీసర గుట్ట

tripadvisor

హైదరాబాద్‌కి అతి సమీపంలో ఉన్న దేవాలయాల్లో కీసర ఆలయం ప్రధానమైనది. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన దేవాలయం ఇది. శివరాత్రి, కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. నగరానికి దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఆ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ శివపార్వతులు రామలింగేశ్వర స్వామి రూపంలో కొలువున్నారు.

దీంతో పాటు భవానీ మాత గుడి, శివ దుర్గా గుడి కూడా ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కేవలం 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. కొండపై ఈ ఆలయం నెలకొని ఉంటుంది. అక్కడికి ఎక్కే మెట్ల మార్గంలో ఇటీవలే తవ్వినప్పుడు.. క్రీ. శ నాలుగు లేదా ఐదో శతాబ్ధానికి సంబంధించిన శివ లింగాలు బయటపడ్డాయి.

6. బాసర సరస్వతీ దేవి ఆలయం

tripadvisor

ఆదిలాబాద్ జిల్లాలో నెలకొని ఉన్న ఈ దేవాలయం దేశంలో అరుదుగా కనిపించే సరస్వతీ దేవాలయాల్లో ఒకటి. నిజామాబాద్ నుంచి 35 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్లు, ఆదిలాబాద్ నుంచి 158 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం ఇది. గోదావరి ఒడ్డున నెలకొని ఉన్న ఈ దేవాలయంలో అక్షరాభ్యాసాలు చేయించేందుకు చాలామంది  వస్తుంటారు. అంతేకాదు.. పరీక్షల ముందు ఇక్కడ అమ్మవారి వద్ద ఉంచి అర్చించిన పెన్నులు తీసుకొని వెళ్లి.. వాటితో పరీక్షలు రాస్తే అమ్మ ఆశీస్సులతో తప్పక పాసవుతారని చాలామంది భక్తుల నమ్మకం.

పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ప్రశాంతమైన ప్రదేశంలో నివసించాలని భావించి.. వ్యాస, విశ్వా మిత్ర మహర్షులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని జీవించారట. అందుకే ఇక్కడ గుడితో పాటు వ్యాస మహర్షి గుహ, మహంకాళి గుడి, వేదవతి శిల, దత్తాత్రేయ దేవాలయం మొదలైనవాటిని దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.

7. వేములవాడ రాజరాజశ్వర దేవాలయం

tripadvisor

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేతం ఇది. కరీంనగర్ నుంచి 36 కిలో మీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 151 కిలోమీటర్ల దూరంలో ఉందీ దేవాలయం. ఈ దేవాలయంలో శివుడు రాజరాజేశ్వర స్వామి రూపంలో కొలువున్నాడు. భక్తులు రాజన్న అని పిలుచుకునే ఈ శివుడి దేవాలయాన్ని కల్యాణీ చాళక్యులు 11, 12వ శతాబ్దంలో కట్టించారు. అద్భుతమైన నిర్మాణ రీతితో నిర్మించిన ఈ దేవాలయం అందరినీ అబ్బురపరుస్తుంది.

చాళక్యుల తర్వాత ఇక్ష్వాకులు, శాతవాహనులు.. ఇలా ఎంతోమంది వేముల వాడనే రాజధానిగా చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించారు. ఈ దేవాలయంలో శివాలయంతో పాటు అనంత పద్మనాభ స్వామి, భీమేశ్వర స్వామి, కోదండ రాముడు, కాశీ విశ్వేశ్వరుడు కూడా కొలువై ఉండడం విశేషం. హైదరాబాద్ నుంచి నేరుగా బస్సులో లేదా కరీంనగర్ వరకూ రైల్లో వెళ్లి..  అక్కడి రైల్వే స్టేషన్ నుంచి బస్సు లేదా ప్రైవేట్ వాహనాల్లో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.

8. చిలుకూరు బాలాజీ టెంపుల్

tripadvisor

హైదరాబాద్‌కి అతి సమీపంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో చిల్కూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. అందరూ వీసాల బాలాజీ దేవాలయంగా పిలిచే ఈ గుడికి వెళ్తే.. తప్పకుండా వీసా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే వీసా ఇంటర్వ్యూకి ముందు చాలామంది ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటారు. ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది.

తిరుపతి వెళ్తానని మొక్కుకొని వెళ్లలేకపోయిన వాళ్లు.. ఇక్కడికి వస్తే సరిపోతుందట. ఇక్కడ భక్తులు పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా మొక్కుకుంటే.. అది తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఏ రోజు చూసుకున్నా.. వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. శనివారం అయితే భక్తుల సందడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి కేవలం బస్సు మార్గం మాత్రమే ఉంది. సికింద్రాబాద్ లేదా నాంపల్లిలో రైలు దిగి అక్కడికి వెళ్లొచ్చు.

9. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం

tripadvisor

ఉమ్మడి కరీంగనర్ జిల్లాలో ఉన్న ఈ దేవాలయం కరీంనగర్ నుంచి 39 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 178 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందమైన కొండల మధ్య నెలకొని ఉన్న ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి గుడితో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ దేవి ఆలయం కూడా ఉంటాయి. ఇక్కడి ఆంజనేయ స్వామి నిలువెత్తు రూపాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు భక్తులు. ఈ ఆలయ చరిత్ర వెనుక ఓ కథ ఉందట.

మూడు వందల సంవత్సరాల క్రితం ఓ కాపరి.. తన తప్పిపోయిన గేదెలను వెతుక్కుంటూ ఈ కొండపై వచ్చి అక్కడే నిద్రపోయాడట. అతడికి కలలో ఆంజనేయ స్వామి కనిపించి గేదె ఎక్కడుందో చెప్పాడట. అతడు లేచి వెతగ్గా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందట. ఆ తర్వాత అతడు అక్కడే ఓ చిన్న దేవాలయాన్ని ఏర్పాటు చేశాడట. అది ఇప్పుడు పెద్దదిగా మారింది. పిల్లలు లేని వారు ఇక్కడి ఆంజనేయ స్వామిని నలభై రోజుల పాటు పూజిస్తే పిల్లలు పుడతారని చాలామంది నమ్మకం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా రైల్లో కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేట్ వాహనాల్లో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.

10. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం

tripadvisor

తెలంగాణ ప్రభుత్వం జోగులాంబ పేరుతో ఓ జిల్లానే ఏర్పాటు చేసిందంటే.. ఈ ఆలయం ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 218 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కర్నూలు నుంచి 22 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ నుంచి 126 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడో శతాబ్దంలో కట్టిన ఈ దేవాలయంలో ఏడు నుంచి పదహారో శతాబ్దం వరకూ నిర్మించిన వివిధ కట్టడాలు కనిపిస్తుంటాయి. 

ప్రముఖ శక్తి పీఠంతో పాటు ఇక్కడ నవబ్రహ్మ ఆలయం, సంగమేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి. ఓ ముని శాపం వల్ల తన శక్తులన్నింటినీ కోల్పోయిన.. బ్రహ్మ శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు తొమ్మిది రూపాల్లో ప్రత్యక్షమయ్యాడని.. ఆ తొమ్మిది రూపాలే నవ బ్రహ్మలుగా మారి ఈ ఆలయంలో కొలువయ్యారని ప్రతీతి. ఆలంపూర్ జోగులాంబ మహా శక్తి పీఠాల్లో ఐదోది. శక్తి మాత పై దంతాల భాగం ఇక్కడ పడి శక్తి పీఠంగా మారిందట. పాత ఆలయం పాడైపోతే 2005లో.. మళ్లీ కొత్త ఆలయాన్ని నిర్మించారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.