వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
శ్రీకృష్ణుడు(Sri Krishna) జగద్గురువు. గీతను బోధించి లోకానికి దారి చూపాడు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు.. తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. గోప బాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మసంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కల్యాణం కోసమే. అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించగలమా? ఇంట్లో చిన్న పిల్లలుంటే వారిని చిన్ని కృష్ణుడుతో పోలుస్తారు.
కృష్ణుడులాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు. బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు. కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే. అందుకే కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. వాడవాడలా సందడి నెలకొంటుంది. ఈ పండగ పిల్లలదే. సందడంతా వారిదే. పంచె కట్టుకొని, కొప్పులో నెమలి ఫించం, మెడలో ముత్యాల హారాలు వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలా తయారవుతారు.
శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి (Janmashtmi) జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 24 తేదిన కృష్ణాష్టమి జరుపుకుంటున్న నేపథ్యంలో కృష్ణుడి గురించి.. కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి (Janmashtami) గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శ్రీ కృష్ణ జననం (Sri Krishna Birth Secret)
కంసుడు పరమ రాక్షసుడు. కానీ అతనికి చెల్లెలు దేవకి అంటే అమితమైన ప్రేమ. ఆమెకు వసుదేవుడినిచ్చి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి సాగనంపుతున్న సమయంలో.. ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుని సంహరిస్తాడని చెబుతుంది. దీంతో కోపోద్రిక్తుడైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే సంహరిస్తుంటాడు.
అలా ఏడుగురు బిడ్డలను కోల్పోయిన దేవకీ దేవి ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది. ఈ సారి జన్మించబోయే బిడ్డే తనను సంహరిస్తాడని కంసుడికి ముందే తెలుసు. కాబట్టి చెరసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తాడు కంసుడు. అంతేకాదు.. బిడ్డ పుట్టగానే చంపాలనుకొంటాడు. నెలలు నిండటంతో శ్రావణ మాస బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రయుక్త లగ్నంలో అర్థరాత్రి పూట శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దివ్య తేజస్సు వెదజల్లుతున్న ఆ చిన్నారిని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీవసుదేవులు.
ఆ పసిబాలుడు శంఖచక్రగధాదులతో విష్ణుమూర్తిగా మారి ఏం చేయాలో చెబుతాడు. వెంటనే వసుదేవుడి సంకెళ్లు తెంచుకుంటాయి. చెరసాల తలుపులు కూడా తెరుచుకుంటాయి. కాపలాకాస్తున్న భటులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాల కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరతాడు. దారిలో కుండపోతగా వర్షం. ఆ వర్షం చిన్నికృష్ణుడిపై పడకుండా ఆదిశేషుడు పగడలా మారి గొడుగు పడతాడు.
ఆ తర్వాత వసుదేవుడు యమునా నదిని దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లను ప్రసవిస్తుంది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి.. ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. మళ్లీ చెరసాల తలుపులు మూసుకుపోతాయి. వసుదేవుడి చేతికి సంకెళ్లు వాటికవే పడతాయి.
భటులకు మెలకువ వస్తుంది. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. దేవకి ఆడపిల్లను కన్నదనే వార్తను తెలుసుకొన్న కంసుడు కాస్త ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఎనిమిదో సంతానం మగపిల్లాడు పుడతాడని ఆకాశవాణి చెప్పింది. అయినా ఆ పాపను చంపాలని బయలుదేరతాడు. ఆడపిల్ల వల్ల తనకు ఏ అపాయం రాదని, వదిలేయమని దేవకి అన్నను బతిమాలుతుంది.
అయినా వినకుండా ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ పాప యోగ మాయగా మారి.. కంసునికి దొరక్కుండా పైకి ఎగసి.. ‘నిన్ను చంపేవాడు పుట్టాడు. రేపల్లెలో పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. నందుడి ఇంట మరో మగ బిడ్డ జన్మించడంతో.. రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తాడు నందుడు. అదే గోకులాష్టమిగా (Gokulashtmi) ప్రసిద్ధికెక్కింది.
శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)
భూమి మీద అధర్మం, అరాచకత్వం పెరిగిపోయి ధర్మం కానరానప్పుడు విష్ణుమూర్తి మానవ అవతారంలో జన్మించి అసుర సంహారం జరిపించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడని హిందూమతం విశ్వసిస్తుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని సంరక్షించడానికి.. విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. తన మామ కంసుడు చేస్తున్న దాష్టీకాల నుంచి జనులను రక్షించేందుకు, అసుర సంహారం, అధర్మ వినాశనం చేయడం ద్వారా భూలోకంలో తిరిగి ధర్మస్థాపన చేశాడు. ఈ అవతారంలో కంసాది దానవులను సంహరించాడు. ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలిచి అధర్మాన్ని ఓడించాడు. గీతాకారునిగా యుద్ధరంగంలో అర్జునుడికి హితబోధ చేశాడు. పుట్టుకచావుల పరమార్థం తెలిపాడు. దాన్నే భగవద్గీతగా మనం చదువుతున్నాం.
జన్మించిన నాటి నుంచి శ్రీకృష్ణుడు దేవతామూర్తిగా పూజలందుకుంటూనే ఉన్నాడు. అల్లరి బాలకుడిగా, వెన్నదొంగగా, గోపీలోలుడిగా, గోవర్ధన గిరిధారిగా, కాళీయమర్ధనుడిగా, గీతాప్రబోధకుడిగా, అసుర సంహారిగా తాను చేసిన ప్రతి పని ద్వారా మానవాళికి అద్భుతమైన సందేశాన్నిస్తూనే ఉన్నాడు. వెన్నను దొంగిలించి గోపబాలురకు పంచిపెట్టడం ద్వారా.. మనకున్నది నలుగురికివ్వడం వల్ల కలిగే సంతోషం ఎలా ఉంటుందో చేసి చూపించాడు.
తనకు బదులుగా గోవర్ధన గిరిని పూజించారనే కోపంతో ఇంద్రుడు రేపల్లెపై ఏకధాటిగా వానను కురిపిస్తే.. ఆ దాడి నుంచి తనవారిని, పశుపక్ష్యాదులను రక్షించడానికి.. గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై నిలిపాడు. ఆ విధంగా ఇంద్రుడి మదాన్ని అణిచివేశాడు. పుట్టగానే తల్లిదండ్రులకు, యుద్ధ భూమిలో అర్జునుడికి కర్తవ్యబోధ చేశాడు. అందుకే ఆయన్ను ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అని కీర్తిస్తారు.
కృష్ణతత్వం అనంతమైనది. దాన్ని అర్థం చేసుకుంటేనే అందులోని మర్మం అర్థమవుతుంది. కుచేలుని నుంచి అటుకులు గ్రహించి అంతులేని సిరిసంపదలు ప్రసాదించిన కృష్ణుడు ప్రేమతో, భక్తితో తనకు ఏది సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు. భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు. అలాగే కర్మఫలాన్ని సైతం అనుభవించాల్సిందేనంటాడు. దీనికి కుచేలుడే ఉదాహరణ. సుధాముడు తన స్నేహితుడే అయినప్పటికీ, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ కర్మ ఫలితం తీరేదాకా అనుగ్రహించలేదు.
మహాభారత యుద్ధంలోనూ తన యుద్ధనీతిని ప్రదర్శించాడు. అధర్మాన్ని అంతమొందించడానికి మాయోపాయాలు పన్నాడు. అబద్ధమాడని ధర్మరాజు చేత ‘అశ్వత్థామ హత: కుంజర:’ అని అబద్ధమాడించాడు. కర్ణుడిని నిస్సహాయుణ్ని చేయడానికి విదురుడ్ని, భీష్ముడిని నిలువరించడానికి శిఖండిని ఉపయోగించాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చెరువులో దాక్కున్న దుర్యోధనుడిని సంహరించడానికి సైతం మాయోపాయాన్నే పన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణలీలలు ఎన్నో. ఎన్నెన్నో.
శ్రీకృష్ణాష్టమి విశిష్టత (Krishna Janmashtami In Telugu – Significance)
హిందూమతస్థులు శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి, శ్రావణగౌరి వ్రతాలు చేస్తారు. ఈ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండగ శ్రీకృష్ణాష్టమి. ఇది శ్రీకృష్ణుని జన్మదినం. దీన్నే జన్మాష్టమి (Janmashtmi), గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు. గీతాచార్యుని జన్మనదినానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజును తల్లులందరూ తమని తాము దేవకీ,యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలనే శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావిస్తారు.
తమ చిన్నారులను చిన్నారి కృష్ణుడుగా అలంకరిస్తారు. పంచె కట్టి, తలపై కొప్పు వేసి నెమలి ఫించంతో అలంకరిస్తారు. అంటే ఈ పండగకు ఎంత ప్రాధాన్యమిస్తారో అర్థం చేసుకోవచ్చు. తన లీల ద్వారా భక్తి, జ్ఞానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేశారు శ్రీకృష్ణపరమాత్మ. దుర్గుణాలను వదిలి.. ధర్మమార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరచుకోవాలని దివ్యోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు.
చెప్పడం మాత్రమే కాదు.. అనుసరించి చూపించారు. అందుకే వాసుదేవుడి బోధనలకు విలువ ఎక్కువ. ఈ రోజు శ్రీకృష్ణుణ్ని పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు.. సంతానం లేనివారు గోపాలున్ని పూజిస్తే సంతానప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.
కృష్ణాష్టమి పూజా విధానం (Pooja process)
శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు జన్మించాడు. ఆ రోజునే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. మిగిలిన పూజలన్నీ ఉదయమే ప్రారంభమైతే.. ఈ రోజు మాత్రం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమవుతాయి. కృష్ణుడు అర్థరాత్రి జన్మించాడు. కాబట్టి కృష్ణాష్టమి పూజను కూడా రాత్రి సమయంలో చేసే ఆచారం కొన్నిచోట్ల ఉంది.
కాబట్టి ఎలాంటి హడావుడి లేకుండా పూజకు అవసరమైనవన్నీ సిద్ధం చేసుకోవచ్చు. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. బాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా కృష్ణ పాద ముద్రలు వేయాలి.
జన్మాష్టమి రోజు మనం చిన్నికృష్ణుణ్ని ఆరాధిస్తాం. అంటే చిన్న పిల్లలకు ఒంటికి నూనె రాసి, నలుగు పెట్టి, స్నానం చేయించి, అలంకరించి ఎంత మురిపెంగా చూసుకుంటామో.. ఈ రోజు చిన్ని కృష్ణున్ని కూడా అలాగే ఆరాధించాలి. చిన్ని కృష్ణుడి విగ్రహానికి పంచామ పంచామృతాలతో ఆ తర్వాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేయాలి. అనంతరం నూతన వస్త్రాలు కట్టి, ఆభరణాలు అలంకరించాలి.
కృష్ణుడికి తులసీ దళాలంటే మక్కువ. కాబట్టి తులసిమాలను మెడలో వేయాలి. పూజ కోసం పొన్న పూలను వినియోగించాలి. ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఊయలలో విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ ఊయలను ఊపాలి. ముత్తయిదువలను పిలిచి వాయినాలివ్వాలి. ఆ తర్వాత కాసేపు గీతాపఠనం చేయాలి.
కృష్ణాష్టమి వ్రతం విధి విధానాలు (Sri Krishnastami Vrata Importance)
కృష్ణుడంటేనే బాలతత్వం. బాల కృష్ణుడు పుట్టిన కృష్ణాష్టమి రోజు.. కృష్ణాష్టమి వ్రతం చేయడం హిందూ సంప్రదాయంలో ఉంది. సాధారణంగా శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం ఎక్కువగా చేస్తుంటారు. వాటితో సమానమైన ప్రాధాన్యం కృష్ణాష్టమి వ్రతానికి సైతం ఉంది. అష్టమీ తిథి రోహిణీ నక్షత్రం అర్థరాత్రి సమయంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్రతాన్ని చేస్తారు.
ఆ రోజు ప్రతి తల్లి తనను తాను యశోదగా భావించుకుని.. పగలంతా కటిక ఉపవాసం ఉండాలి. కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదముద్రలు వేసుకోవాలి. అర్థ్రరాత్రి వేళ కృష్ణుడు పుడుతున్నాడనే సమయం ఆసన్నమైనప్పుడు కాయం పంచిపెడతారు. కాయం అంటే బాలింతలకు పెట్టే కారం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో కట్టెకారం అని కూడా పిల్లుస్తారు. కాల్చిన శొంఠితో దీన్నితయారు చేస్తారు. ఆ తర్వాత ఆ కాయాన్నే కొంచెం తింటారు.
ఆ రోజు వారికి అదే ఆహారం. మరునాడు ఉదయం కృష్ణుడికి పూజ చేసిన తర్వాత పదిమందికీ భోజనాలు పెట్టి ఆ తర్వాత భోజనం చేస్తారు. అలాగే పిల్లలు ఇష్టంగా తినే ఆహార పదార్థాలైన జంతికలు, చేగోడీలు, పాలముంజెలు.. వంటివి యథాశక్తి తయారు చేసి పిల్లలకు పంచిపెడతారు.
శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)
కృష్ణుడికి వెన్న అంటే బాగా ఇష్టం. కాబట్టి కృష్ణాష్టమి రోజు దాన్నే కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. అయితే శాస్త్రం ప్రకారం కృష్టాష్టమి నాడు 102 రకాల పిండి వంటలు చేయాలి. ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి. వాటిని ముందు మనం ఆరగించి ఇతరులకు పంచిపెట్టాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శెనగపప్పు వంటి వాటిని కూడా నివేదన చేస్తారు.
అలాగే శొంఠితో తయారుచేసిన కట్టెకారం, పంచదార కలిపిన మినప్పిండి కూడా ప్రసాదంగా పెడతారు. ఈ రెండూ బాలింతలకు పెట్టే ఆహారం కావడం గమనించదగిన విషయం. ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించాడు. అంటే ఆయనకు జన్మనిచ్చిన దేవకీ దేవి, మాయకు జన్మనిచ్చిన యశోదా దేవి ఇద్దరూ బాలింతలే. కాబట్టి ఇలాంటి ఆహారం పెట్టడానికి వారే కారణమై ఉండచ్చు. కృష్ణాష్టమి నాడు చిన్నికృష్ణుడికి పెట్టే కొన్ని రకాల ప్రసాదాలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
అటుకులు, బెల్లం లడ్డు (Jaggery Laddu)
కావాల్సినవి: అటుకులు రెండు కప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు, పుట్నాలు అరకప్పు, బెల్లం పొడి కప్పు, వేడిపాలు తగినన్ని.
అటుకులు, కొబ్బరిముక్కలు, పుట్నాలపప్పును విడివిడిగా మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారుచేసుకోవాలి. ఓ పళ్లెంలో వీటన్నింటినీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బెల్లం పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోసి కలుపుతూ గుండ్రటి ఉండల్లా చుట్టుకోవాలి.
కొబ్బరి లడ్డు (Coconut Laddoo)
కావాల్సినవి: కొబ్బరి కాయ – ఒకటి, పాలు – లీటరు, బొంబాయి రవ్వ – అరకప్పు, చక్కెర – సరిపడినంత, యాలకుల పొడి కొద్దిగా
కొబ్బరికాయను పగలగొట్టి తురుము తీసి పక్కనపెట్టుకోవాలి. బొంబాయి రవ్వలో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో నీరు కలపని పచ్చిపాలు, కొబ్బరి తురుము, చక్కెర వేసి మరగనివ్వాలి. మిశ్రమం చిక్కబడే సమయంలో బొంబాయి రవ్వ, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాల తర్వాత గిన్నెను పొయ్యి మీద నుంచి దింపి చల్లారిన తర్వాత లడ్డూల మాదిరిగా తయారుచేసుకుంటే సరిపోతుంది.
శెనగపప్పు పాయసం
కావాల్సినవి: శెనగపప్పు – కప్పు, బెల్లం పొడి – ముప్పావు కప్పు, పాలు – కప్పు, నెయ్యి – టేబుల్ స్పూన్, యాలకుల పొడి – కొద్దిగా, జీడిపప్పు, బాదంపప్పు – కొద్దిగా.
కుక్కర్లో కప్పున్నర నీరు పోసి దానిలో శెనగపప్పు వేసి.. నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఈ లోపు బెల్లం పాకం సిద్ధం చేసుకోవాలి. దీని కోసం గిన్నెలో పావుకప్పు నీరు పోసి స్టవ్ పై పెట్టాలి. దీనిలో బెల్లం తురుము వేసి సన్నని మంటపై నీరు ఇంకేదాకా మరిగించాలి.
మరో ప్యాన్‌లో నెయ్యి వేసి.. అది వేడెక్కిన తర్వాత మెత్తగా ఉడికిన శెనగపప్పు వేసి.. రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత దీనిలో పాలు పోసి.. సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లంపాకం, యాలకుల పొడి వేసి స్టవ్ మీద రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి. చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు, బాదంపప్పు వేస్తే సరిపోతుంది.
కృష్ణాష్టమి రోజు ఇంట్లో కృష్ణ పాదాలు ఎందుకు వేస్తారు? (Reason Behind Painting Krishna Padalu On Floor On The Day Of Krishna Astami)
కృష్ణాష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గరి నుంచి.. పూజ మంటపం వరకు శ్రీ కృష్ణ పాదాలను వేస్తుంటారు. ఈ ప్రక్రియ భారతదేశమంతటా కనిపిస్తుంది. దీని కోసం ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల పాద ముద్రలను కాగితంపై తీసుకుని.. దాన్ని కట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని నేలపై ఉంచి చుట్టూ సుద్దతో గీసి తర్వాత సున్నంతో వేస్తారు. మరికొందరు చేత్తోనే పాద ముద్రలు వేస్తారు. ఇప్పుడైతే మార్కెట్లో పాదముద్రలు వేయడానికి వీలుగా మౌల్డ్స్ దొరుకుతున్నాయి.
అసలు ఇలా వేయడం వెనక ఉన్న అంతరార్థం ఏమిటి? నేలపై పాదముద్రలు వేసి వాటిని అలంకరించడం ద్వారా బాల కృష్ణుణ్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖసంతోషాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్టుగా వేస్తారు. పూజా మందిరాన్ని మన అంతరంగంగా భావిస్తే.. కృష్ణ పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకొనేలా చేసే దిక్సూచిగా చెబుతారు.
ఉట్టి కొట్టడం (Significance of Utti(Dahi Handi))
కృష్ణాష్టమి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా సందడి కనిపిస్తుంది. ఆ రోజు ఉట్టి కొడతారు. దీన్నే ఉత్తర భారతంలో ‘దహీ హండి’ అని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లరడబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి.. ఆ తర్వాత పొడవైన తాడు కట్టి లాగుతూ ఉంటారు. సాధారణంగా ఉట్టిని ఒకరు పైకి కిందకు లాగుతుంటే.. మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకరి తర్వాత ఒకరు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక్కరిగా కొట్టడం విఫలమైతే సమష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు.
చేయీ చేయీ కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి దాన్ని పగలగొడతారు. ఈ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి ముఖాలపై వసంతం నీళ్లు పోస్తుంటారు. అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే.. సమష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధాన్నైనా అధిగమించవచ్చు. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం చిన్నతనంలో గోపాల కృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్న కుండలను పగలగొట్టి.. దాన్ని గోప బాలకులకు పంచిపెట్టేవాడు. నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందమేమిటో లోకానికి చాటి చెప్పాడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు.
Shutterstock
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాలు (Famous Krishna Temples In Telugu States)
శ్రీకృష్ణాష్టమి రోజు.. గోపాలుడి దేవాలయాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. గీతాపఠనం, ఉట్టి కొట్టడం, గ్రామోత్సవం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే శ్రీకృష్ణ, వేణుగోపాలస్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ చారిత్రక ప్రాధాన్యమున్న దేవాలయాలు కొన్ని ఉన్నాయి. వీలుంటే వాటిని ఓ సారి సందర్శించండి.
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి ( Sri Venkateswara Swami Temple, Tirupati)
కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే వేంకటేశ్వరుని సన్నిధానంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేంకటేశ్వరుని సన్నిధిలో ఉన్న గోపాల కృష్ణుని విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉట్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు ఈ రోజున పెద్ద ఎత్తున తిరుపతికి తరలి వస్తారు.
మీసాల కృష్ణ దేవాలయం, పులిదిండి (Krishna Temple, Pulidindi)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్రేయపురం మండలంలోని.. పులిదిండి గ్రామంలో మీసాల కృష్ణుడు కొలువు దీరి ఉన్నాడు. అఖండ గోదావరి వశిష్ఠ, గౌతమీ పాయలుగా విడవడిన ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. సాధారణంగా కృష్ణుడి విగ్రహాలకు మీసాలుండవు. కానీ పులిదిండి క్షేత్రంలో మాత్రం మీసాలుంటాయి. అందుకే ఈ కృష్ణుణ్ని మీసాల కృష్ణుడు అని పిలుస్తారు. రాజమండ్రి నగరానికి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే రాజమండ్రి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
శ్రీకృష్ణ దేవాలయం, నాంపల్లి (Sri Krishna Temple, Nampally)
హైదరాబాద్ నగర నడిబొడ్డున శ్రీకృష్ణ దేవాలయం ఉంది. నాంపల్లిలో ఉన్న ఈ దేవాలయం ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ కూడా కృష్ణాష్టమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
వేణుగోపాలస్వామి దేవాలయం, హంసలదీవి ( Venugopalaswamy Temple, Hansala Devi)
కృష్ణా జిల్లా హంసలదీవిలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ వేణుగోపాలుడు రుక్మిణీ. సత్యభామ సమేతుడై పూజలందుకుంటున్నాడు.
వేణుగోపాలస్వామి దేవాలయం, మొవ్వ (Venugopalaswamy Temple, Movva)
కృష్ణా జిల్లాలో కూచిపూడి సమీపంలో మొవ్వ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో కొలువు దీరిన వేణుగోపాల స్వామి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. స్వామి చేతిలో వేణువు గాలి వూదే రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే స్వామి వారి విగ్రహానికున్న మకరతోరణంలో దశావతరాలుంటాయి. క్షేత్రయ్య రాసిన పదాలన్నీ ఈ మువ్వ గోపాలుని మీదే. విజయవాడ నుంచి 50 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది.
శ్రీకృష్ణ దేవాలయం, బహదూర్ పుర ( Sri Krishna Temple, Bahadurpura)
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కి చేరువలో ఉందీ దేవాలయం. 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
వేణుగోపాల స్వామి దేవాలయం, ఏదులాబాద్ ( Venugopala Swamy Temple, Edulabad)
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్‌కు సమీపంలో ఉన్న ఈ దేవాలయంలో వేణుగోపాలస్వామి రుక్మిణీ, సత్యభామ సమేతుడై కొలువుదీరాడు. ప్రాచీన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో స్వామి స్వయంభూగా వెలిశాడని భక్తులు విశ్వసిస్తారు.
వారిజల వేణుగోపాలస్వామి దేవాలయం, గోపలాయపల్లె ( Warijala Venugopalaswamy Temple, Gopalaayapalle)
నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి రెండు కి.మీ దూరంలో ఉంది ఈ క్షేత్రం. హైదరాబాద్ – విజయవాడ హైవేకు అతి సమీపంలో ఉంటుంది. గోపలాయపల్లెలో కృష్ణుడు కొలువుదీరిన గుట్టను గోవర్థన గిరి అని పిలుస్తారు. ఈ గుట్ట మీద ఉన్న వారిజల చెట్టు కింద ఓ పుట్ట ఉండేదట. ఆ పుట్టలో వెలసిన బాల కృష్ణుడు కాబట్టి.. ఈ క్షేత్రం వారిజల వేణుగోపాల స్వామి క్షేత్రంగా పేరుపొందింది. ఈ క్షేత్రంలో కృష్ణాష్టమికి విశేష ఉత్సవాలు జరుగుతాయి.
వేణుగోపాల స్వామి దేవాలయం, నేలకొండపల్లి (Venugopala Swami Temple, Nelakkondapalli)
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనది. ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.
కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)
- చిన్ని కృష్ణుడు మీ ఇంట సందడి చేయాలి. తన మాయతో మీ బాధలు, కష్టాలు తొలగించి మీ ఇంట సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నా. కృష్ణాష్టమి శుభాకాంక్షలు
- అసురత్వాన్ని అంతం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి వాసుదేవుడు పుట్టిన కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో సుఖసంతోషాలను నింపాలి. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మీకు దక్కాలి.
- మహాభారత యుద్ధంలో అర్జునుడికి దారి చూపినట్లుగా.. మీ జీవితంలోనూ కృష్ణుడు దారి చూపించాలి. ఆ పరమాత్ముని ఆశీస్సులతో మీకంతా శుభమే జరగాలి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
- మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయండి. అందులో దురాశ, అహం, కోరిక కనిపించకూడదు. అందులో ప్రేమ, కరుణ, భక్తి, వినయం ఉండాలి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు
- జీవం మొదలెక్కడో తెలియదు. తుది ఏమిటో తెలియదు. మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. తెలియని దాని కోసం విచారించాల్సిన అవసరం లేదు – భగవద్గీత
- ఆత్మను ఏ ఖడ్గం చీల్చలేదు. ఏ మంటలు దహించివేయలేవు. ఎంత నీరైనా కరిగించలేదు. ఎంత గాలి వీచినా కదిలించలేదు. జన్మాష్టమి శుభాకాంక్షలు.
- మనసు దృఢంగా ఉన్నవారి బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. అలా లేని వారి బుద్ధి పరి పరి విధాలుగా మారిపోతుంది – భగవద్గీత.
- శ్రీకృష్ణుడి వేణుగానమంత మధురమైన ప్రేమ మీ జీవితంలో నిండాలని, ఆ గీతాచార్యుని ఆశీస్సులు మీకు దక్కాలని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
- ఏది సాధించాలన్నా కష్టించాల్సిందే. కష్టపడనిదే అదృష్టం సైతం కలసి రాదు. మీరు చేసే పనికి అదృష్టం తోడవ్వాలని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
- ఈ కృష్ణాష్టమి మీ జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రేమ, వాత్సల్యాలతో ఈ పండగను జరుపుకుని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.
Feature Image: Instagram, Instagram, Instagram
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది