ఫ్లాప్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టి.. సక్సెస్ అయిన నటీమణులు వీరే..!

ఫ్లాప్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టి.. సక్సెస్ అయిన నటీమణులు వీరే..!

సాధారణంగా సినిమా రంగంలో రాణించాలంటే.. అందం, అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం అయినా ఉండాలని చెబుతారు. లేదంటే అక్కడ రాణించడం కష్టమని అంటూ ఉంటారు. అయితే ఈ మాటలు అబద్ధమని రుజువు చేసిన వారు సైతం ఉన్నారు. విజయం సాధించాలంటే అపజయాలనే మనం పునాదులుగా మార్చుకోవాలి. ఈ హీరోయిన్లు కూడా అదే సూత్రాన్ని ఫాలో అయినట్టున్నారు. అందుకే కెరీర్ ఆరంభంలోనే అపజయాలు ఎదురైనా.. ఎక్కడా వెనుకంజ వేయకుండా అడుగు ముందుకేశారు. టాలీవుడ్‌లో ఫ్లాప్(flop)లతో కెరీర్ మొదలు పెట్టి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. కాజల్ అగర్వాల్

కాజల్ తొలి సినిమా లక్ష్మీ కల్యాణం. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన హీరోయిన్‌గా నటించింది. పెద్ద అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన కాజల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆమెకు కృష్ణ‌వంశీ చందమామ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది.

2. త్రిష

దక్షిణాదిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా  ఉన్న నటి(Actress) త్రిష. తన కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు పోషించి అందరినీ మెప్పించిన త్రిష తెలుగులో ఓ ఫ్లాప్ మూవీతో తన కెరీర్ మొదలు పెట్టిందనే విషయం తెలుసా? తరుణ్ సరసన హీరోయిన్‌గా ‘నీ మనసు నాకు తెలుసు’లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది. అయితే ఆ సినిమా తర్వాత రిలీజైన వర్షం సినిమాతో బిజీ హీరోయిన్‌గా మారి స్టార్‌గా వెలుగొందుతోంది. ఇటీవల మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ అందరి మెప్పూ పొందుతోంది.

3. అనుష్క శెట్టి

అరుంధతి, బాహుబలి, భాగమతి సినిమాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న అనుష్క తొలి సినిమా సూపర్. తొలి సినిమాలో నాగర్జున సరసన పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో నటించే అవకాశం రావడమంటే మాటలు కాదు. మన స్వీటికి ఆ అవకాశం దక్కింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. పైగా ఈ సినిమాలో ఆమె నటనకు సైతం పెద్దగా గుర్తింపు రాలేదు. ఆరంభంలో ఆమె కెరీర్ హిట్టు ఫ్లాపుల మధ్య ఊగిసలాడుతూ ఉండేది. విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం సినిమాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. కానీ అరుంధతి సినిమాతోనే అనుష్క ప్రతిభ ఏమిటో ఇండస్ట్రీకి, సినీ ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఈ సినిమాతో ఆమె హీరోయిన్‌గా శిఖర స్థాయికి చేరుకుంది.

4. శ్రుతి హాసన్

కమల్ హాసన్ కూతురిగా తెరంగ్రేటం చేసిన శ్రుతి హాసన్‌కు మొదట్లో అన్నీ పరాజయాలే ఎదురయ్యాయి. గబ్బర్ సింగ్ సినిమా వరకు ఆమె కెరీర్‌లో అసలు హిట్ అనే మాటకు చోటు లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇంతకూ శ్రుతి హాసన్ తొలి సినిమా ఏంటో తెలుసా? అనగనగా ఒక ధీరుడు. దీనిలో సిద్ధార్థ హీరోగా నటించాడు. అంతకు ముందే శ్రుతి హాసన్ హిందీలో లక్ అనే సినిమాలో నటించింది. అది కూడా ఫ్లాప్ సినిమానే.

5. పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాథమ్, అరవింద సమేత, మహర్షి సినిమాలతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మీకు తెలుసా?? పూజా హెగ్డే మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటకట్టుకుంది. తెలుగులోనే కాదు.. హిందీలోనూ ఆమె నటించిన తొలి సినిమా మొహంజోదారో కూడా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

6. శ్రియ శరన్

దక్షిణాదిన పెద్ద హీరోలందరి సరసన నటించిన అతి కొద్ది మంది హీరోయిన్లలో శ్రియ శరన్ ఒకరు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్న శ్రియ శరన్ నటించిన మొదటిసినిమా ఏంటో తెలుసా? ఇష్టం. ఈ సినిమాకు రామోజీరావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. అయితేనేం.. ఆమె నటనకు, గ్లామర్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత నాగార్జున సరసన సంతోషం సినిమాలో నటించి హిట్టందుకుంది శ్రియ.

7. తమన్నా

మిల్కీబ్యూటీ తమన్నా పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే సినిమా హ్యాపీడేస్. చాలామంది అదే తమన్నా మొదటి  చిత్రం అనుకుంటారు. కానీ తమన్నా మొదటి సినిమా శ్రీ. ఈ సినిమాలో మంచు మనోజ్ కథానాయకుడిగా నటించారు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో ఈ సినిమా చాలామందికి గుర్తు లేదు. హ్యాపీడేస్ తర్వాత తమన్నా హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది.

8. తాప్సీ పన్ను

బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ ముందు తెరంగ్రేటం చేసింది మాత్రం తెలుగులోనే. ఒకట్రెండు మినహా తాప్సీకి తెలుగులో పెద్దగా హిట్స్ లేవు. ఆమె మొదటి సినిమా ఝుమ్మంది నాదం. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అందంతో పాటు  చక్కని అభినయాన్ని కూడా కనబరచడంతో తాప్సీకి అవకాశాలు వెల్లువెత్తాయి. తనకు అడుగడుగునా పరాజయాలే ఎదురవుతున్నా.. తన ప్రతిభపై ఉన్న నమ్మకంతో అడుగు ముందుకేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. అప్పుడప్పుడూ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటోంది.

9. రెజీనా కసాండ్ర

టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు రెజీనా కసాండ్ర. దీనికి ఆమె నటించిన సినిమాలే నిదర్శనం. ప్రతి సినిమాలోనూ కొత్త రకమైన పాత్రను ఎంచుకుంటుంది రెజీనా. అయితే ఈమె కూడా ఫ్లాప్ సినిమాతోనే తన కెరీర్ మొదలు పెట్టింది. ఎస్ఎమ్మెస్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా.  

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది