ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో దెయ్యాలున్నాయంట. మీకు తెలుసా?

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో దెయ్యాలున్నాయంట. మీకు తెలుసా?

హైదరాబాద్ (Hyderabad).. ది ల్యాండ్ ఆఫ్ నిజామ్స్. ది సిటీ ఆఫ్ పెర్ల్స్. భారతదేశంలోని అతి ప్రధానమైన నగరాల్లోని ఒకటి హైదరాబాద్. చారిత్రకంగా, వాణిజ్య పరంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ నగరంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలు (Haunted Places) ఉన్నాయని చెబుతుంటారు. అవేనండీ.. దెయ్యాలు, ఆత్మలు తిరిగే భవనాలు, ప్రాంతాలు. ఈ ప్రదేశాల్లో దెయ్యాలు తిరుగుతాయనే దాంట్లో ఎంత నిజముందో తెలియదు. కానీ ఈ ప్రాంతాల్లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇవి హాంటెడ్ ప్రదేశాల జాబితాలో చేరిపోయాయి. అవేంటో తెలుసుకోవాలనుందా? మరింకెందుకు ఆలస్యం.. ఈ ప్రదేశాల గురించి మీరూ చదివేయండి.

1. కుందన్ బాగ్

ఈ ప్రాంతంలో ఉండే ఒక ఇంటిని హాంటెడ్ హౌస్ అని పేర్కొంటారు స్థానికులు. కొన్నేళ్ల క్రితం ఓ దొంగ ఈ ఇంట్లోకి దొంగతనం చేయడానికి ప్రవేశించాడు. అయితే ఆ ఇంటి రెండో అంతస్థులో అతనికి మూడు శవాలు కనిపించాయి. అవి ముగ్గురు తల్లీకూతుళ్లవి. అప్పటికే వారు చనిపోయి ఆరు నెలలైందని పోలీసులు గుర్తించారు. చనిపోయి ఆరు నెలలైనా.. చుట్టు పక్కల వారికి అనుమానం రాలేదా? అని ప్రశ్నిస్తే భయంకరమైన నిజాలు తెలిశాయట.

ఆ ఇంటి చుట్టు పక్కల వారు ప్రతి రోజూ ఆ తల్లీ కూతుళ్లను చూస్తున్నారట. అంతేకాదు.. వారు తాంత్రిక శక్తుల కోసం ప్రయత్నించేవారని, కరెంటు లేకుండానే నివసించేవారని చెప్పారట. కొవ్వొత్తులతో ఇంట్లో తిరుగుతూ ఉండేవారట. పైగా ఇంటి ముందు రక్తం నింపిన సీసాను వేలాడదీసి ఉంచేవారట.

ఇవన్నీ చూసి భయపడిన స్థానికులు వారింటి వైపు చూడటానికి సైతం భయపడేవారట. వారి మరణానికి కారణం ఏంటో పోలీసులు కూడా గుర్తించలేకపోయారు. ఇవన్నీ కలిసి ఆ ఇంటిని హాంటెడ్ హౌస్‌గా మార్చేశాయి. అసలు ఆ ఇంటి వైపు చూసే ధైర్యం కూడా ఎవరూ చేయరు.

ADVERTISEMENT

2. దేద్ లాక్ ఘర్

Facebook

దాదాపు నలభై ఏళ్ల క్రితం వారాసిగూడలో నిర్మించిన ఈ బంగ్లా కూడా హంటెడ్ నిర్మాణాల్లో ఒకటి. ఈ ఇంటి కాంపౌండ్‌లో అడుగు పెట్టడానికే కాదు.. ఈ ఇంటి వైపు చూడటానికి సైతం చాలామంది భయపడతారు. ఈ ఇంట్లో నివసించడానికి ప్రయత్నించిన  కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యలు చేసుకున్నారట. ఆ ప్రాంతంలో ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉందని భావిస్తుంటారు. అప్పుడప్పుడూ ఆ ఇంట్లోంచి.. ఓ మహిళ రోదనలు వినిపిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు.

3. ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్

ఒకప్పుడు ఈ కాలేజ్ భవనం ఎప్పుడూ విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం తాండవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సైన్స్ కాలేజీ భవనంలో ఆత్మలు తిరుగుతున్నాయని నమ్ముతుంటారు. ముఖ్యంగా ఇక్కడి ల్యాబుల్లో మృత‌దేహాలకు పరీక్షలు నిర్వహించేవారట. ఈ కాలేజీ ఉన్నప్పుడు లేదా ల్యాబ్‌లో ఉన్నప్పుడు తమకు ఇబ్బందికరంగా ఉంటోందని చాలామంది విద్యార్థులు కంప్లైంట్ చేసేవారట. అంతేకాదు.. ఈ బిల్డింగ్‌కు కాపలా కాస్తున్న వాచ్ మెన్ సైతం అనుమానస్పద పరిస్థితుల్లో మరణించాడు. దీంతో ఈ కాలేజ్ బిల్డింగ్‌ను మూసేశారు. ఎవరూ ఆ కాంపౌండ్‌లోకి అడుగుపెట్టే ధైర్యం చేయరు.

ADVERTISEMENT

4. రవీంద్ర నగర్, సీతాఫల్ మండి

వరుస ఆత్మహత్యల కారణంగా సీతాఫల్ మండిలోని రవీంద్ర నగర్ కాలనీ కూడా హాంటెడ్ ప్రదేశాల జాబితాలోకి చేరిపోయింది. ఐదారేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనల ప్రభావం నేటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కాలనీలో ఉన్న ఓ గుడిని తొలగించిన తర్వాత తమ కాలనీలోకి దుష్టశక్తి ప్రవేశించిందని నమ్ముతారు. రెండు నెలల వ్యవధిలో సుమారుగా 13 మంది ఆత్మహత్య చేసుకొన్నారు. కొన్ని నెలల పాటు కాలనీ వాసులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే.. మరికొందరు దగ్గర్లోనే ఉన్న మరో గుడిలో తలదాచుకొనేవారట. ఇప్పటికీ సాయంత్రం ఆరుగంటలు దాటిన తర్వాత కాలనీలో జనసంచారం కనిపించదు. అంతేకాదు.. ప్రతి ఇంటి గోడమీద ‘జై శ్రీరామ్’ అని రాసి ఉంటుంది. 

5. గోల్కొండ కోట

Telangana Tourism

కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ కోటకు చారిత్రక ప్రాధాన్యం ఎక్కువ. అయితే కొన్ని సంఘటనల కారణంగా ఈ కోట సైతం హాంటెడ్ ప్లేసుల జాబితాలో చేరిపోయింది. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈ కోటలో ఎవరినీ ఉండనివ్వరు. లోనికి వెళ్లనివ్వరు. దీనికి కారణం లేకపోలేదు. సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇక్కడ గజ్జెల చప్పుడు, బాధతో అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయట. మనుషులు లేని నీడలు కనిపిస్తాయట. కుతుబ్ షాహీ సంస్థానంలో ఆస్థాన నర్తకిగా వ్యవహరించిన తారామతి ఇక్కడ ఆత్మరూపంలో సంచరిస్తుందని విశ్వసిస్తారు స్థానికులు. అంత:పుర గోడలపై నాట్యం చేస్తున్నట్టుగా నీడలు కనిపిస్తుంటాయని ఆ నీడలు తారామతివేనని అంటారు.

ADVERTISEMENT

6. శంషాబాద్ ఎయిర్ పోర్ట్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కొంతభాగాన్ని ఓ స్మశాన వాటికపై నిర్మించారు. అంతేకాదు.. ఎయిర్ పోర్ట్ నిర్మాణ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కొందరి ఆత్మలు సైతం ఇక్కడే తిరుగుతుంటాయనే ప్రచారం ఉంది. రాత్రి వేళల్లో విమానం టేకాఫ్ సమయంలో రన్ వే పై ఓ మహిళ ఆత్మ కనిపిస్తుందట. అందుకే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సైతం హాంటెడ్ ప్రదేశాల జాబితాలో చేరిపోయింది.

గమనిక: ఈ కథనాన్ని వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు లేదా విన్న సంఘటనల ఆధారంగా రాయడం జరిగింది. అంతే కానీ.. మూఢనమ్మకాలను పెంపొందించడం లేదా దెయ్యాలుంటాయని తెలియజేయడం మా ఉద్దేశం  ఏ మాత్రం కాదు. 

Featured Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
13 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT