గ్రాడ్యుయేషన్ చేయకపోయినా.. సినిమాలతో కోట్లు సంపాదించేస్తున్నారు..!

గ్రాడ్యుయేషన్ చేయకపోయినా.. సినిమాలతో కోట్లు సంపాదించేస్తున్నారు..!

జీవితంలో ఏదైనా సాధించాలన్నా.. డబ్బు సంపాదించి ఉత్తమ స్థానంలో నిలవాలన్నా.. కనే కలలన్నీ నెరవేర్చుకోవాలన్నా.. చదువు (Education) ఎంతో ముఖ్యమని పెద్దలు చెబుతుంటారు. కనీసం గ్రాడ్యుయేషన్ (graduation) అయినా చేయకుండా జీవితంలో ఏం సాధించలేమన్నది చాలామంది మాట.

కానీ జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి చదువొక్కటే మార్గం కాదు. మనలో టాలెంట్ ఉంటే చాలు.. చదువుకి, సంపాదనకు.. డిగ్రీకి, సక్సెస్‌కి ఏమాత్రం సంబంధం లేదని నిరూపించిన వాళ్లు  చాలామందే ఉన్నారు. అలాంటివారిలో మన టాలీవుడ్ నటీనటులు కూడా కొందరున్నారు. కనీసం గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయని ఆ వ్యక్తులు.. ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయారు. అలాగే టాప్ స్థాయిలోనూ నిలిచారు. వారెవరో చూద్దామా?

Instagram

జూనియర్ ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు.. అలనాటి వెండితెర నటుడు. ఆయన తర్వాత.. ఎన్టీఆర్ వారసులుగా ఆయన కొడుకులతో పాటు మనవళ్లు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే వారిలో విజయవంతంగా దూసుకుపోతున్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటారు.

అభిమానులంతా తారక్ అని ముద్దుగా పిలుచుకునే ఈ యంగ్ టైగర్.. బాల నటుడుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత పదిహేడేళ్లకే ఇంటర్ పూర్తి చేసి.. 2001లో సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు.

తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోవడంతో.. గ్రాడ్యుయేషన్ చేసే సమయం కూడా తనకు దొరకలేదు. దాంతో ఇంటర్‌తో చదువు ఆపేసినా.. టాలీవుడ్ టాప్ కథానాయకుల్లో ఒకడిగా నిలిచి ప్రతి సినిమాకి కోట్లలో పారితోషికాన్ని తీసుకుంటున్నాడు తారక్. తన టాలెంట్‌తో చదువు లేకున్నా సరే.. సక్సెస్‌ని సాధించి తనలాంటి వారికి ఆదర్శంగా నిలిచాడు.

తారక రాముడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా? (ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్)
Twitter

పవన్ కల్యాణ్

జీవితంలో ఓటమి ఎదుర్కొనే వారికి పవన్ కల్యాణ్ కథ ఓ పాఠం. చిన్నతనం నుండి ఆస్తమాతో బాధపడిన పవన్ ఎనిమిదో తరగతి తర్వాత.. ఏ క్లాసూ ఫెయిలవ్వకుండా దాటింది లేదట. పదో తరగతిలోనూ మ్యాథ్స్ ఫెయిలైన పవన్.. అప్పటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరావు పదో తరగతి విద్యార్థులకిచ్చిన ఐదు గ్రేస్ మార్కులతో పాసై ఇంటర్‌లోకి అడుగుపెట్టారు. పదో తరగతి అయితే ఏదోవిధంగా పాసయ్యారు కానీ.. ఇంటర్ మాత్రం గట్టెక్కించలేకపోయారు.

మ్యాథ్స్ అంటే ఉన్న భయంతో కామర్స్ గ్రూప్ తీసుకున్నా.. అందులోనూ పాస్ కాలేకపోయారట. ఇంటర్ ఫెయిలైన తర్వాత రెండు మూడు సార్లు ప్రయత్నించి.. ఇక తన వల్ల కాదని నిర్ణయించుకున్నారు. తర్వాత చనిపోవాలని కూడా అనుకున్నారు. అయితే ఇంట్లో వాళ్లు ఆ విషయాన్ని ముందే పసిగట్టి చదువు ఉంటేనే సక్సెస్ కాదని.. సినిమా రంగంలోకి తీసుకొచ్చారని అంటారు. ఇవన్నీ స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

మొదటి సినిమా సమయానికి పెద్దగా ఏమీ తెలియకపోయినా.. అన్నీ నేర్చుకుంటూ ఇప్పటిదాకా వచ్చారట. ఎందులోనైనా సరే.. నచ్చిన విద్యను గుర్తించి దాన్ని నేర్చుకునే తత్వం ఉంటే చాలు రాణించగలుగుతామని పవన్ చెబుతారు.

Instagram

రామ్

గ్రాడ్యుయేషన్ పూర్తి కాకపోయినా.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి నిలదొక్కుకున్న హీరోల్లో రామ్ కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ తమ్ముడు మురళి పోతినేని కొడుకైనా.. తన కష్టంతో తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్. తమిళనాడులో తన స్కూలింగ్ పూర్తి చేసిన రామ్.. ఇంటర్ మాత్రం కంప్లీట్ చేయలేదట. ఈ విషయాన్ని తను ఇటీవలే ఓ ఇంటర్యూలో తెలిపాడు.

తెలంగాణ‌లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించి బాధపడిన రామ్ మాట్లాడుతూ, ఇంటర్ పూర్తి చేయనంత మాత్రాన జీవితంలో ముందుకు వెళ్లలేమని కాదని.. సచిన్ టెండుల్కర్ లాంటివాళ్లంతా ఇంటర్ పూర్తి చేయని వాళ్లేనని తెలిపాడు. ఆఖరికి తానూ ఇంటర్ పూర్తి చేయలేదని ట్వీట్ చేశాడు.

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ టాక్ - పూరి జగన్నాధ్ మార్క్ హీరోగా రామ్
Instagram

ఛార్మి

ఛార్మి.. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన తార. శ్రీ ఆంజనేయం, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, రాఖీ, మంత్ర వంటి చాలా సినిమాల్లో నటించి ఇండస్ట్రీ టాప్ కథానాయికగా మారింది. అయితే ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం అనుకోకుండా వచ్చిందట.

ఆమెకు పద్నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి ఆమెను చూసి 'నీతోడు కావాలి' సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడట. సెలవుల్లో నటించేందుకు ఒప్పుకొని.. ఆమె అందులో కథానాయిక పాత్రను పోషించింది. ఆ సినిమా విడుదలయ్యాక వరుసగా ఆఫర్లు రావడంతో.. చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో నటించిన ఛార్మి.. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Instagram

హన్సిక

ముంబయికి చెందిన హన్సిక చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాల నటిగా సినిమాల్లో నటించింది. చాలా సీరియళ్లు, సినిమాల్లో నటించింది. పదహారేళ్ల వయసులోనే అనగా పన్నెండో తరగతి చదువుతున్నప్పుడే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'దేశ ముదురు' సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోవడంతో.. పన్నెండో తరగతితోనే తన చదువును ఆపేయాల్సి వచ్చింది. అయితేనేం.. ప్రస్తుతం తమిళంలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న హన్సిక.. తెలుగులోనూ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది.

పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ తారలది..!
Instagram

తమన్నా

'డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయిపోయాను' అని సరదాగా ఇండస్ట్రీకి వచ్చేవారు చెబుతారు. కానీ వారికంటే తమన్నా అంకితభావం చాలా గొప్పదనే చెప్పుకోవాలి. చిన్నతనం నుంచి తాను హీరోయిన్ కావాలనే కలలు కనేదట. ముంబయిలో చదువుకున్న తమన్నా.. పదమూడో సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటనలో శిక్షణ తీసుకొని పదిహేనో ఏట తెలుగు సినిమాలో నటించింది.

మంచు మనోజ్ సరసన ఆమె నటించిన 'శ్రీ' సినిమా 2005లో విడుదలైంది. అప్పటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు మాత్రమే. చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం వల్ల.. పదో తరగతితోనే తన చదువును ఆపేయాల్సి వచ్చింది తమన్నా. 'హ్యాపీ డేస్' సినిమా షూటింగ్ సమయంలో.. ఈ విషయాన్ని తానే వెల్లడించింది. ఇండస్ట్రీకి రావడం వల్ల కాలేజీకి వెళ్లి చదువుకోలేకపోయాననే బాధ.. 'హ్యాపీడేస్' సినిమా షూటింగ్‌తో తీరిపోయిందని చెప్పింది తమన్నా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.