పచ్చని కొండలు.. అందమైన జలపాతాలు.. మెలి తిరిగిన రహదారులు, కొండ గుహల్లోంచి రైలు ప్రయాణం వెరసి అరకు లోయను (Araku valley) పర్యటక ప్రాంతంగా (tourist spot) మార్చేశాయి. ఏడాదంతా పచ్చదనంతో కళకళలాడే అరకు వ్యాలీని సెప్టెంబర్ నుంచి మార్చి నెల వరకు సందర్శించవచ్చు. ఈ సమయంలోనే ఎందుకంటే.. వర్షాకాలం తర్వాత అరకు మరింత అందంగా తయారవుతుంది. అయితే ఎక్కువ మంది పర్యటకులు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో సందర్శించడానికి ఇష్టపడతారు.
మంచు దుప్పటి మాటు నుంచి దాగి చూసే పసుపు పూల సోయగం చూసి మురిసిపోతుంటారు. భూలోక స్వర్గం లాంటి ఈ ప్రదేశానికి వెళ్లిన తర్వాత.. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయో తెలియక చాలామంది అనసవరంగా వచ్చామనే భావనకి గురవుతారు. అయితే.. ఇక్కడ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ప్రకృతి అందాలెన్నో ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎలా చేరుకోవాలో తెలుసుకుంటే… అరకు వ్యాలీ టూర్‌ను (Araku valley tour) చక్కగా ఎంజాయ్ చేయచ్చు.
1. చాపరాయి వాటర్ ఫాల్స్
దీన్ని డుంబ్రిగూడ జలపాతం అని కూడా పిలుస్తారు. అరకు లోయలో చాలా పాపులర్ టూరిస్ట్ స్పాట్ ఇది. దీనికి కారణం ఈ జలపాతానికి ఉన్న ప్రత్యేకతే. ఈ జలపాతం చాలా తెలుగు సినిమాలు, సీరియళ్లలో కూడా కనిపిస్తుంది. నునుపుగా ఉన్న కొండరాళ్ల మీద నుంచి.. అలా జాలువారుతున్న జలపాతాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ఈ జలపాతం అరకు నుంచి పది కి.మీ. దూరంలో ఉంటుంది. మీరు మొదటిసారి అరకు వెళుతున్నట్లయితే.. ఈ జలపాతాన్ని చూడకుండా మీ ట్రిప్ ముగించుకుంటే అది అసంపూర్ణమే అవుతుంది.
2. బొర్రా గుహలు
చాలా తెలుగు సినిమాల్లో ఈ బొర్రా గుహలు కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా? మన దేశంలోనే అత్యంత లోతైన గుహలివి. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలను 1807లో గుర్తించారు. ఇవి సున్నపు రాయి గుహలు. అంటే క్యాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. కొండ గుహలో బొట్లు బొట్లుగా కారే నీటితో క్యాల్షియం చర్య జరపడం వల్ల రకరకాల ఆకారాలు ఏర్పడ్డాయి. వీటిలో శివపార్వతులు, ఆవు, తల్లీబిడ్డలు, రుషి.. ఇలా జీవం ఉట్టిపడే ఆకారాలు మనకు కనిపిస్తాయి. బొర్రాగుహలకు రోడ్డు.. అలాగే రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు.
3. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్
అరకు నుంచి రెండున్నర కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ బొటానికల్ గార్డెన్స్ కూడా చాలా ప్రముఖమైనవి. సైట్ సీయింగ్‌కు వెళ్లాలనుకునేవారు కచ్చితంగా దీన్ని సందర్శించాల్సిందే. దీనికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. సుమారు 26 ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న.. ఈ పద్మాపురం గార్డెన్స్‌ను 1942లో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు అవసరమైన ఆహారాన్ని పండించడానికి ఏర్పాటు చేశారు.
ఇక్కడ హార్టీకల్చర్ నర్సరీతో పాటు చాలా అరుదైన పుష్పజాతులను మనం చూడచ్చు. ఈ గార్డెన్స్ మొత్తం చూడాలంటే టాయ్ ట్రైన్ ఎక్కాల్సిందే. చెట్లను ఆసరాగా చేసుకుని నిర్మించిన మంచెల్లాంటి కుటీరాలు అదనపు ఆకర్షణ. ఇక్కడ ఉన్న రోజ్ గార్డెన్ సైతం మీ మనసు దోచుకుంటుంది.
4. మత్య్స గుండం
అరకు వ్యాలీ నుంచి 35 కి.మీ., పాడేరు నుంచి 15 కి.మీ దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. మాచ్ఖండ్ నదిలో భాగంగా ఉన్న ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మఠం అనే గ్రామం దగ్గర.. ఈ ప్రకృతి వింత మనకు కనిపిస్తుంది. ఇక్కడ నదికి అడ్డంగా కొండరాళ్లు ఉంటాయి. అక్కడి వరకు ఉరకలెత్తుతూ ప్రవహించే మాచ్ఖండ్ నది.. ఇక్కడకు వచ్చేసరికి కొండల మధ్య చిన్న కాలువలా మారిపోతుంది.
మళ్లీ వంద గజాల దూరంలో తన వెడల్పు పెంచుకుంటుంది. ఈ ప్రవాహం మళ్లీ పెరిగే ప్రాంతంలోనే గుండం ఏర్పడింది. ఇక్కడ మీకు లెక్కలేనన్ని చేపలు చిన్న పెద్ద సైజుల్లో కనిపిస్తాయి. మీరు వాటికి ఆహారాన్ని అందించవచ్చు. వాటిని తాకొచ్చు. కానీ వాటిని పట్టుకోకూడదు. ఇక్కడ గిరిజనులు వాటిని పూజనీయమైనవిగా భావిస్తారు.
5. అనంతగిరి కొండలు
విశాఖపట్నం, అరకు లోయ మధ్యలో ఉన్న చిన్న హిల్ స్టేషన్ అనంతగిరి. విశాఖపట్నంలో ఉండేవారు వారాంతాల్లలో ఇక్కడికొచ్చి సేద తీరుతుంటారు. కొండవాలుల్లో పెంచే కాఫీ తోటల అందాలు మనల్ని కట్టిపడేస్తాయి. అసలు అనంత గిరి కొండల్లో అడుగు పెట్టగానే కాఫీ తోటల సువాసన మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీరు కాఫీ లవర్ అయతే కచ్చితంగా ఇక్కడకు వెళ్లాల్సిందే. ఇక్కడ ఏపీ టూరిజం రిసార్ట్ నిర్వహిస్తోంది. అనంతగిరి కొండలకు 10 కి.మీ. దూరంలో ఉన్న జంగిల్ బెల్స్ రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. బొర్రా గుహలు సైతం అనంత గిరికి చేరువగా ఉంటాయి. అనంతగిరి కొండలకు మూడు కి.మీ.దూరంలో తాడిమడ జలపాతం ఉంటుంది.
6. కటికి జలపాతం
బొర్రా గుహలకు దగ్గరగా ఉన్న మరో ప్రకృతి కేంద్రం కటికి జలపాతం. అరకు నుంచి 39 కి.మీ దూరంలో ఉన్న ఈ జలపాతం బొర్రా గుహలకు 7 కి.మీ. దూరంలో ఉంటుంది. వంద అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే ఈ జలపాతమే.. గోస్తనీ నదిగా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ జలపాతం దగ్గర క్యాంపింగ్ చేయడానికి వంట చేసుకోవడానికి అనుమతి ఉంది. ఈ జలపాతం దగ్గరకు చేరుకోవడానికి ఎలాంటి ప్రజా రవాణా సౌకర్యం ఉండదు. ఇక్కడి ఘాట్ రోడ్ల పరిస్థితుల కారణంగా సొంత వాహనాల్లో వెళ్లడం కంటే.. జీపుల్లో వెళ్లడం శ్రేయస్కరం. ఇక్కడికి చేరుకోవడానికి గట్టివలస నుంచి జీపులు అందుబాటులో ఉంటాయి.
7. టైడా నేచర్ క్యాంప్
నేచర్ క్యాంపింగ్‌ను ఇష్టపడేవారు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు. అరకు నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఇది ఉంది. దీన్నే జంగిల్ బెల్స్ రిసార్ట్స్ అని పిలుస్తారు. ఈ రిస్టార్ట్స్‌లో మంచెలపై నిర్మించిన ఇళ్లల్లో విడిది చేయవచ్చు. ఎకోటూరిజంకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, బాణాలు సంధించడం వంటివి నేర్చుకోవచ్చు. అలాగే లోకల్ గైడ్ సాయంతో ఇక్కడి గిరిజనుల భాషను నేర్చుకోవచ్చు.
8. అరకు ట్రైబల్ మ్యూజియం
అరకు లోయ వివిధ తెగలకు చెందిన గిరిజనులకు ఆలవాలంగా ఉంది. ఇక్కడ సుమారు 19 తెగలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. వారంతా వేర్వేరు భాషలు మాట్లాడతారు. వేర్వేరు సంస్కృతులు, జీవనశైలిని పాటిస్తున్నారు. వారి జీవన విధానం గురించి అవగాహన పెంచడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఉపయోగించే పనిముట్లు, నగలు, ఆయుధాలు ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడే ఉన్న స్టోర్‌లో గిరిజనులు తయారుచేసిన కళాత్మక వస్తువులను విక్రయిస్తారు.
Feature Image: Instagram.com/Offroads India
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది