అల్లం (ginger).. ప్రతి ఇంట్లోనూ రోజూ తప్పనిసరిగా ఉపయోగించే వస్తువు ఇది. వంట దినుసుగా లేదా వాంతులు, వికారం.. ఇలా చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే మనలో చాలామందికి తెలీని విషయం ఏంటంటే.. అల్లం కేవలం మన ఆరోగ్య సమస్యలకే కాదు.. అందాన్ని కాపాడుకోవడానికి కూడా తోడ్పడుతుంది. అటు చర్మం, ఇటు జుట్టు అందంగా మెరిసిపోయేలా చేయడంలో అల్లం చాలా బాగా తోడ్పడుతుందట. మరి, అల్లం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో.. దాన్ని చర్మ సంరక్షణకు, అందమైన కేశాలకు ఎలా వాడాలో తెలుసుకుందాం రండి.
అల్లం మన శరీరానికి సంజీవనిగా చెప్పుకోవచ్చు. దీనివల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అందులో కొన్నింటిని తెలుసుకుందాం రండి.
శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు.. అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజూ అల్లాన్ని తీసుకోవడం వల్ల పిత్తాశయంలో పైత్య రసం విడుదలవుతుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఇలా చేయడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉన్న పోషకాలన్నీ శరీరానికి అందే వీలుంటుంది. అంతేకాదు.. కడుపు నొప్పి, డయేరియా, గ్యాస్ సమస్యలను కూడా అల్లం తగ్గిస్తుంది.
అల్లం వాంతులను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజూ కనీసం రెండు గ్రాముల అల్లం తీసుకుంటే మామూలు వాంతులతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో, క్యాన్సర్ చికిత్స సమయంలో వచ్చే వాంతులను కూడా ఇది అరికడుతుంది. ఇందులోని ప్రోస్టాగ్లాండిన్లు నొప్పిని, వాపును కలిగించే రక్తనాళాలపై పనిచేసి వాటిని వెడల్పుగా మారుస్తాయి. తద్వారా తలనొప్పి, మైగ్రేన్ వంటివి కూడా తగ్గుతాయి.
నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి మొదలైనవి చాలామందికి ఎదురయ్యే సమస్యలే. అయితే అల్లంతో వీటిని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. రుతుక్రమం ప్రారంభమైన రోజు నుంచి.. అది పూర్తయ్యే రోజు వరకూ రోజూ అల్లాన్ని టీలో భాగంగా తీసుకోవడం వల్ల.. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు చాలావరకూ తగ్గుతాయి.
అల్లాన్ని రోజూ తీసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్యతో పాటు కొలెస్ట్రాల్ స్థాయులు కూడా తగ్గుతాయట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఎస్సెన్షియల్ ఆయిల్స్ కీళ్ల సమస్యలు, జ్వరం, దగ్గు, పంటి నొప్పి, బ్రాంకైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, టెండానైటిస్ వంటి వాటిని తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయులను కూడా తగ్గిస్తాయి. రక్తనాళాలను వెడల్పుగా చేసి.. రక్త పోటును కూడా తగ్గించే గుణం అల్లంలో ఉందట. దీనివల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోయే సమస్య కూడా ఎదురవదట.
అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పితో పాటు ఆస్టియో ఆర్థైటిస్ వంటి సమస్యలున్నవారికీ ఉపశమనం కలిగిస్తాయి. అల్లం ఓ మంచి పెయిన్ కిల్లర్ మందులా పనిచేస్తుంది. కేవలం కండరాల నొప్పులే కాదు.. కీళ్ల నొప్పులను కూడా తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. దీనికోసం అల్లం టీ తాగడంతో పాటు అల్లం, పసుపు పేస్ట్ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి అల్లం చాలా బాగా తోడ్పడుతుంది. అల్లాన్ని చాలా మంచి ఫ్యాట్ బర్నర్‌గా చెబుతుంటారు. దీనివల్ల సాధారణంగా బరువు తగ్గడంతో పాటు శరీరంలో కరగకుండా ఉండిపోయిన మొండి కొవ్వు కూడా కరగడం ప్రారంభమవుతుంది. దీనికోసం అల్లాన్ని తీసుకోవడంతో పాటు.. అల్లంతో తయారు చేసే సప్లిమెంట్లను భోజనం తర్వాత తీసుకోవడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది.
అల్లం కేవలం మన జీర్ణ క్రియ సరిగ్గా పనిచేయడానికి మాత్రమే కాదు.. జుట్టుకు, చర్మానికి అప్లై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అల్లాన్ని జుట్టుకు, చర్మానికి రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..
అల్లంలో జింజెరాల్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. అందుకే జుట్టుకు అల్లాన్ని అప్లై చేసుకోవడం వల్ల.. కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్లు గట్టిపడతాయి. తద్వారా జుట్టు రాలడం కూడా చాలావరకూ తగ్గుతుంది.
తలలో చర్మం పొడిబారిపోవడం వల్ల.. జుట్టు రాలడం ఎక్కువవుతుంది. అల్లం కుదుళ్ల నుంచి మృత కణాలను తొలిగిస్తుంది. తద్వారా చుండ్రును కూడా తొలిగించి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
అల్లం ఓ మంచి యాంటీ ఆక్సిడెంట్, టోనర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగానూ మారుతుంది. కేవలం వారానికి ఒక్కసారి.. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల అందమైన మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మం రంగును కూడా ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.
అల్లం పవర్ ఫుల్ యాంటీసెప్టిక్‌గా, క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. సున్నితంగా మచ్చల్లేకుండా మారుస్తుంది. అంతేకాదు.. ఇది సహజసిద్ధమైన మొటిమల క్రీంలా పనిచేసి మొటిమలు రాకుండా చేస్తుంది. మొటిమలు వచ్చేలా చేసే బ్యాక్టీరియాను తొలగించి.. ఆ సమస్యను తగ్గిస్తుంది.
అల్లంలో ఎన్నో రకాల ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్‌తో పాటు ఎన్నో రకాల విటమిన్లు కూడా ఉంటాయి. ఇవన్నీ జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
ఇది చర్మంలోని టాక్సిన్లను తొలిగించి.. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. దీని వల్ల చర్మానికి ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి వాటివల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని మరింత యవ్వనంగా మారుస్తుంది.
జుట్టు బలంగా పెరగడంతో పాటు చుండ్రు తగ్గడానికి కూడా అల్లం ఎంతగానో తోడ్పడుతుంది. దీనికోసం అల్లాన్ని ఎలా ఉపయోగించాలంటే..
కావాల్సినవి
అల్లం పేస్ట్ - టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె - టేబుల్ స్పూన్
తయారీ
అల్లాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకొని దాన్ని నూనెలో కలుపుకోవాలి. తర్వాత జుట్టును పాయలుగా చేసుకొని వేళ్ల సాయంతో కుదుళ్లకు బాగా అప్లై చేసుకోవాలి. తల మొత్తానికి అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట పాటు అలా ఉంచుకోవాలి. ఇది జుట్టుకు రక్త ప్రసరణను పెంచుతుంది. తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
ప్రయోజనాలు
అల్లానికి జుట్టును కండిషన్ చేసే గుణాలు ఉంటాయి. నూనెలోని గుణాలు మీ జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
కావాల్సినవి
అల్లం తురుము - రెండు టేబుల్ స్పూన్లు
నువ్వుల నూనె - మూడు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - అర టీస్పూన్
తయారీ
ఈ పదార్థాలన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని వెంట్రుకల కుదుళ్లకు అప్లై చేసుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
ప్రయోజనాలు
నిమ్మరసంలో కొల్లాజెన్ బూస్టింగ్ గుణాలు ఉంటాయి. ఇది తలలోని పీహెచ్ స్థాయులను మార్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అల్లంలోని యాంటీమైక్రోబియల్ గుణాలు చుండ్రును తొలిగిస్తాయి.
కావాల్సినవి
అల్లం పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు - తగినన్ని
తయారీ
అల్లంలో నీళ్లు పోసి కొద్దిగా వదులుగా ఉండేలా రుబ్బుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంట పాటు ఉంచుకోవాలి. తర్వాత తలస్నానం చేయాలి.
ప్రయోజనాలు
అల్లంలో యాంటీ మైక్రోబియల్ గుణాలుంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి. జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు తిరిగి పెరిగేలా చేస్తాయి.
కావాల్సినవి
అల్లం తురుము - టేబుల్ స్పూన్
మునగ ఆకులు - గుప్పెడు
నీళ్లు - కప్పు
తయారీ
ఒక ప్యాన్‌లో అల్లం తురుము, మునగ ఆకులు వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఆపై వడకట్టి పక్కన పెట్టుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలపై నుంచి పోసుకొని జుట్టును ఆరబెట్టుకోవాలి.
ప్రయోజనాలు
మునగాకుల్లో క్యాల్షియం, జింక్, ఐరన్, కాపర్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటివన్నీ ఉంటాయి. అంతేకాదు.. ఇందులో విటమిన్ ఎ,సి, డి, ఈ, ఎ విటమిన్లు కూడా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఇంకా ఎన్నెన్నో పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు డ్యామేజ్ లేకుండా చేస్తాయి. అల్లంతో పాటు దీన్ని చేర్చడం వల్ల.. జుట్టు ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది.
కావాల్సినవి
అల్లం తురుము - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి (తురుముకోవాలి)
తయారీ
అల్లం, ఉల్లిపాయ తురుమును ఒక బట్టలో వేసి రసం పిండుకోవాలి. ఆ తర్వాత ఓ కాటన్ బాల్‌తో దీన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. తర్వాత.. ఓ ఇరవై నిమిషాల పాటు ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది.
ప్రయోజనాలు
ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రాలిపోయిన జుట్టును తిరిగి పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలిపోయి.. ఆ తర్వాత కొత్త జుట్టు రాకుండా ఉన్న కుదుళ్ల నుంచి.. కొత్త జుట్టు పెరిగేలా చేసి జుట్టును లావుగా మార్చుతుంది.
అల్లాన్ని చర్మ సమస్యలు తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. అల్లాన్ని ఫేస్ ప్యాక్‌గా ఎలా ఉపయోగించాలంటే..
కావాల్సినవి
తేనె - టీస్పూన్
అల్లం పేస్ట్ - టీస్పూన్
తయారీ
ఒక బౌల్‌లో అల్లం పేస్ట్, తేనె కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత ముఖం కడుక్కొని టోనర్ రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.
ప్రయోజనాలు
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాలుష్యం నుంచి కాపాడతాయి. ఈ ప్యాక్ వల్ల మొటిమలతో పాటు మచ్చలు కూడా తగ్గుతాయట.
కావాల్సినవి
అల్లం పేస్ట్ - టేబుల్ స్పూన్
నీళ్లు - తగినన్ని
తయారీ
అల్లం తురుములో నీళ్లు పోసి కాస్త జారుడుగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పావు గంట పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి.
ప్రయోజనాలు
ఇది హైపో పిగ్మంటేషన్, నలుపు రంగు మార్క్స్‌ను తగ్గిస్తుంది. చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది.
కావాల్సినవి
అల్లం తురుము - టేబుల్ స్పూన్
నిమ్మరసం - టేబుల్ స్పూన్
తయారీ
అల్లం తురుములో నిమ్మరసం పోసి.. బాగా కలిపి దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట పాటు ఉంచుకొని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికోసారి చేయాలి.
ప్రయోజనాలు
అల్లంలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. నిమ్మరసంలో ఎసిడిక్ గుణాలుంటాయి. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల మొటిమల మచ్చలతో పాటు పిగ్మంటేషన్ మచ్చలు కూడా తొలగిపోతాయి.
కావాల్సినవి
చక్కెర - అరకప్పు
ఆలివ్ నూనె - పావు కప్పు
అల్లం పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ
ఈ మూడింటినీ కలిపి శరీరం మొత్తాని..కి ముఖ్యంగా సెల్యులైట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్క్రబ్ లా అప్లై చేసుకోవాలి. తర్వాత బ్రష్‌తో రుద్దుకోవాలి. ఆపై పావుగంట పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి.
ప్రయోజనాలు
అల్లంలో మన శరీరాన్ని లోపలి నుంచి డీటాక్సిఫై చేయడంతో పాటు.. కొవ్వును ఉత్తేజితం చేసే గుణాలు ఉంటాయి. కాబట్టి సెల్యులైట్‌ని తొలగిస్తుంది.
కావాల్సినవి
చక్కెర - నాలుగు టేబుల్ స్పూన్లు
నూనె - టీస్పూన్
అల్లం పేస్ట్ - టేబుల్ స్పూన్
తయారీ
ఈ మూడింటినీ బాగా కలిపి వెంటనే ముఖం, మెడ, చేతులు వంటి భాగాలకు అప్లై చేసుకొని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత పది నిమిషాల పాటు అలా ఉంచుకొని కడిగేసుకుంటే సరి.
ప్రయోజనాలు
అల్లంలోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మంపై ఉన్న బ్యాక్టీరియా వంటివన్నీ తొలగిస్తే.. చక్కెర స్క్రబ్‌లా పనిచేసి మురికిని తొలగిస్తుంది. ఇక నూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.
అల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తుంది. అయితే రోజుకు నాలుగైదు గ్రాముల కంటే.. ఎక్కువ అల్లాన్ని తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
రోజూ అల్లాన్ని తీసుకోవడం మంచిదే. కానీ మరీ ఎక్కువగా దీన్ని తీసుకుంటే మాత్రం.. గుండెల్లో మంట, కడుపు నొప్పితో పాటు రక్తస్రావం ఎక్కువవడం వంటివి కూడా ఎదురవుతాయి.
అల్లాన్ని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది. చుండ్రు తగ్గుతుంది. జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. అయితే తాజా అల్లాన్ని కాకుండా.. అల్లం పొడిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు కాస్త రంగు మారే అవకాశం ఉంటుంది. కానీ ఇది తెల్ల జుట్టుకు మాత్రం కారణం కాదు. తాజా అల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. పొడి బదులుగా దాన్ని ఉఫయోగించడం మంచిది.
అల్లం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. అల్లం మన శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. అందుకే కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు.. అల్లాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతారు. అంతేకానీ దీన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రావు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.