హైదరాబాద్ ట్రెండ్స్: ఈ ఫేమస్ స్వీట్స్ మీరు రుచి చూశారా??

హైదరాబాద్ ట్రెండ్స్: ఈ ఫేమస్ స్వీట్స్ మీరు రుచి చూశారా??

ఏదైనా శుభవార్త విన్నా లేదా  స్పెషల్ అకేషన్ వచ్చినా.. ప్రత్యేకంగా తయారుచేసిన స్వీట్స్ (Sweets) రుచి చూడాలని మనసు తహతహలాడడడం సహజమే. దీనికి తోడు ప్రతి ప్రాంతంలోనూ కొన్ని రకాల స్వీట్స్ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. అందుకే ఆయా ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయా స్వీట్స్ రుచి చూడాలని అంతా ఆశిస్తూ ఉంటారు. మరి, హైదరాబాద్ (Hyderabad) సిటీలో అలా ప్రత్యేకం అని చెప్పుకోదగిన కొన్ని స్వీట్స్ ఏంటో మీకు తెలుసా?? అవేంటో ఓసారి మనమూ తెలుసుకుని రుచి చూడడానికి ప్రయత్నిద్దాం రండి..

1. కుబానీ కా మీఠా..

హైదరాబాదీ స్వీట్ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది కుబానీ కా మీఠా. బాదం, ఆప్రికాట్స్, క్రీమ్, గులాబ్ జల్.. వంటివి ఉపయోగించి తయారు చేసే ఈ స్వీట్ రుచి చాలా బాగుంటుంది. అందుకే తీపిని ఇష్టపడే చాలామంది.. జీవితంలో ఒక్కసారైనా దీనిని రుచి చూడాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు.

Delight foods

2. జౌజి హల్వా

నిజాంల కాలం నాటికి చెందిన ప్రసిద్ధమైన వంటకాల్లో ఈ జౌజి హల్వా కూడా ఒకటి. అందుకే దీనిని హైదరాబాదీ ప్రత్యేక వంటకాల జాబితాలో ఒకటిగా చెప్పుకుంటారు. హైదరాబాదీ నిజాం రాజుకు ఈ స్వీట్ రుచి బాగా నచ్చడంతో.. ఇది అమ్మే షాపుకు ఆయన పుత్రుడి పేరునే పెట్టారు. నవాబుల కాలం నాటి నుంచే గుర్తింపు పొందింది కాబట్టి.. దీనిని రాయల్ స్వీట్ డిష్ అని కూడా అంటారు.

3. షాహీ తుక్డా

హైదరాబాద్‌కి చెందిన ఫేమస్ స్వీట్స్‌లో షాహీ తుక్డా పేరు కూడా ముందు వరుసలోనే ఉంటుంది. దీనినే డబుల్ కా మీఠా అని కూడా అంటారు. వేయించిన బ్రెడ్ ముక్కలను పాలలో నానబెట్టి తయారుచేసే ఈ స్వీట్‌ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరంటే అది అతిశయోక్తి కాదేమో. పైగా చాలామంది హైదరాబాదీలకు ఇది ఫేవరెట్ స్వీట్ కూడా.

4. షీర్ కుర్మా

హైదరాబాద్‌లో పండగలు, ప్రత్యేక సందర్భాలు.. వంటి సమయంలో ఎక్కువగా వినిపించే స్వీట్ పేరు షీర్ కుర్మా. ముఖ్యంగా ఈద్ ఉల్ ఫితర్, ఈద్ అల్ అదా.. వంటి పండగల సమయంలో దీనిని ప్రత్యేకంగా తయారుచేస్తారు. పర్షియన్ భాషలో షీర్ కుర్మా అంటే.. పాలతో మిక్స్ చేసిన ఖర్జూరాలని అర్థం.

Shutterstock

5. మౌజ్ కా మీఠా

అరటిపండ్లు ఉపయోగించి తయారుచేసే ఈ స్వీట్ కూడా.. ఇప్పటికీ నగర నలుమూలల్లో మనకు ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. దీనినే బనానా స్వీట్ అని కూడా అంటారు. దీని తయారీలో అరటిపండ్లతో పాటు పాలు, చక్కెర, నెయ్యి, నట్స్.. కూడా ఉపయోగిస్తారు.

6. బాదం కీ జాలీ

బాదం ఉపయోగించి తయారు చేసే కుకీలను బాదం కీ జాలీ అంటారు. ఇవి కూడా హైదరాబాదీ స్వీట్స్‌లో చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. అయితే ఈ వంటకం ఇప్పుడు తయారుచేయడం చాలా తక్కువనే చెప్పుకోవాలి. తరాలు మారే కొద్దీ ఈ స్వీట్ గురించి విన్నవారే తప్ప.. రుచి చూసేవారు తక్కువగానే ఉంటున్నారు.

Wikimedia commons

7. షాజానీ మీఠా

టొమాటోలను ఉపయోగించి తయారు చేసే ప్రత్యేకమైన స్వీట్ ఇది. దీనినే టొమాటో హల్వా అని కూడా పిలుస్తారు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. దీని తయారీ కూడా చాలా సులభం.

8. అక్కరవడిసల్

దీనినే అక్కర అడిసిల్ అని కూడా అంటారు. ఇది చూడడానికి అచ్చం మనం తయారు చేసే చక్కెర పొంగలిలానే కనిపిస్తుంది. కాకపోతే దీని తయారీలో బియ్యం, బెల్లం, పాలు.. వంటివి మాత్రమే ఉపయోగిస్తారు. ముఖ్యంగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో దీనిని ఎక్కువగా తయారుచేస్తారు.

Shutterstock

9. హైదరాబాద్ మిష్రీ మావా

ఈ స్వీట్‌ని చిన్న చిన్న మట్టి కుండల్లో సర్వ్ చేస్తారు. పైగా ఇది హైదరాబాదీ స్పెషల్ డిజర్ట్స్‌లో ఒకటి. మామూలుగానే దీని రుచి చాలా బాగుంటుంది. ఇక మట్టి కుండల్లో సర్వ్ ఈ చేసే స్వీట్ రుచి అయితే.. పదింతలు ఎక్కువగానే ఉంటుందంటే మీరు నమ్ముతారా?? కావాలంటే మీరే ఓసారి ప్రయత్నించి చూడండి..

10. హైదరాబాద్ మావా కచోరి

చూడడానికి కచోరీలానే కనిపించే ఈ స్వీట్ హైదరాబాదీ స్పెషల్స్‌లో ఒకటి. అయితే రుచిలో ఇవి అమోఘం అని అనిపించినా.. రెండు లేదా మూడు కంటే ఎక్కువ వీటిని తినలేము. కారణం అవి అంత హెవీగా అనిపిస్తాయి. నట్స్‌తో బాగా గార్నిష్ చేసే ఈ స్వీట్‌ని రుచి చూసేందుకు.. మీరూ ఓసారి ట్రై చేయండి.

ఇవే కాదు.. గిల్ – ఇ- ఫిర్డస్, లౌకి హల్వా, క్యారట్ హల్వా, ఫిర్నీ.. మొదలైన స్వీట్స్ కూడా హైదరాబాద్‌లో ఫేమస్ అని చెప్పచ్చు. కాబట్టి మీరు హైదరాబాద్‌లోనే నివసించే వారైతే వీలు చూసుకుని వీటిని రుచి చూసేందుకు ప్రయత్నించండి. లేదంటే ఈసారి మీరు హైదరాబాద్ సందర్శించినప్పుడు.. వీటిలో మీకు నచ్చిన స్వీట్‌లను రుచి చూడడం మరచిపోకండి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ కా షాన్.. ఫలక్ నుమా ప్యాలెస్ గురించి మీకు ఈ విశేషాలు మీకు తెలుసా?

హైదరాబాద్ ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!

హైదరాబాద్ ట్రెండ్స్: బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్ కోసం వెతుకుతున్నారా..? ఈ లిస్ట్ చెక్ చేయండి