సెయింట్ మదర్ థెరిసా జీవితం నుంచి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలివే..!

సెయింట్ మదర్  థెరిసా జీవితం నుంచి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలివే..!

ప్రేమ, ఆప్యాయతలతో ఈ ప్రపంచాన్ని అందంగా మార్చేయచ్చిన భావించిన వ్యక్తి సెయింట్ మదర్ థెరిసా(St. Mother Teresa). ఎక్కడో కొసోవోలో ఆగస్ట్ 26, 1910 తేదిన  పుట్టిన  ఆగ్నస్ గోక్షా బొజాక్షు.. భారతదేశం వచ్చి ఇక్కడి వ్యథార్థ జీవులకు అమ్మగా మారింది. అనాథలను, వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకుని ప్రేమతో వారి బాధలను నయం చేసింది. కోల్కతాలో మిషనరీ ఆఫ్ చారిటీని స్థాపించి దాని సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేసింది. అందుకే అందరికీ ఆమె మదర్ అయింది. 1979లో నోబెల్ శాంతి బహుమానాన్ని, భారత రత్న పౌర పురస్కారాన్ని ఆమె అందుకున్నారు.

సెప్టెంబర్ 5, 1997 తేదిన మదర్ కోల్‌కతాలో మరణించారు. ఆమె మరణించి దాదాపు 22 ఏళ్లు గడిచినా.. ఆమె చూపించిన ప్రేమ నేటికీ ఆమెను సజీవంగా మన మధ్యలోనే ఉండేలా చేసింది. ఆమె జీవించి ఉన్నంత కాలం ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు ప్రేమను, సాయాన్ని అందించి మనిషిగా ఎలా జీవించాలో చెప్పి.. అందరికీ ఉదాహరణగా నిలిచారు. మదర్ జీవితాన్ని మన నిశితంగా పరిశీలిస్తే ఆమె నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.  ఈ రోజు మదర్ థెరిసా (Mother Teresa) జయంతి సందర్భంగా ఆమె నుంచి మనం నేర్చుకుని నిత్య జీవితంలో పాటించాల్సిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

ఇతరులకు సంతోషాన్ని కలిగించడం

‘ఎక్కడికి వెళ్లినా ప్రేమను పంచండి. మీ దగ్గరకు వచ్చినవారి జీవితంలో సంతోషం నింపకుండా వారిని వదలిపెట్టొద్దు.’ ఇది మదర్ తరచూ చెప్పే మాట. చెప్పడం మాత్రమే కాదు.. ఆమె దాన్ని చేసి చూపించారు. పేదరికంలో పుట్టిన మదర్ థెరిసా చిన్ననాటి నుంచి సేవా తత్పరత కలిగి ఉండేవారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే.. తాను చేయగలిగినంత సాయం చేసేవారు. దానికి ఆమె ఆర్థిక పరిస్థితి ఎన్నడూ అడ్డంకి కాలేదు.

మదర్‌లా పూర్తిగా జీవితాన్ని సేవకే అంకితం చేయడం మనకు కుదరకపోవచ్చు. కానీ మన దగ్గరకు ఎవరైనా వచ్చి సాయం కోసం అర్థిస్తే.. వారికి మీకున్నంతలో ఎంతో కొంత సాయం చేయడం అలవాటు చేసుకోండి. 

ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి

నమ్మకం కొండలను సైతం కదిలిస్తుందంటారు. ఏ పని చేయాలన్నా సంకల్పం అవసరం. అది పెద్దదైనా, చిన్నదైనా సరే.. దాన్ని పూర్తి చేయగలమనే నమ్మకం మనలో ఉండాలి. మదర్ థెరిసా భారత్‌కు వచ్చినప్పుడు ఆమె దగ్గరేమీ లక్షలకు లక్షలు డబ్బులు లేవు. తన దగ్గరున్న చాలీచాలని డబ్బులతోనే సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. ఆరంభంలో ఆటంకాలు ఎదురైనా.. ఎక్కడా తాను చేసే సేవా కార్యక్రమాలను ఆపేయలేదు. తన సంకల్పంతో తనకెదురైన అడ్డంకులను అధిగమించారు.

ఏ పని చేసినా ప్రేమతో చేయాలి

‘ఈ ప్రపంచంలో మనం సముద్రంలో నీటి బొట్టంతే కావచ్చు. ఆ నీటిబొట్టు కోల్పోతే ఆ మేరకు సముద్రంలో లోటు ఏర్పడినట్టే’ అంటారు మదర్ థెరిసా. అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవద్దని, మనం చేస్తున్న పనిని తక్కువ చేసుకోవద్దనే సందేశం ఆమె మాటల్లో మనకు తెలుస్తుంది. అంతేకాదు.. పనిని ప్రేమించకుండా దాన్ని పూర్తిచేయడానికి ప్రయత్నిస్తే.. అది మనకు చాలా భారంగా అనిపిస్తుందని మదర్ అంటారు. అంతే కాదు.. ఎంత పని చేస్తున్నామనేది కాదు.. ఆ పనిపై ఎంత ఇష్టం ఉందనేది కూడా ముఖ్యమే. అప్పుడే కదా మనం చేస్తున్న పని మనకు భారంగా, బానిసత్వంగా అనిపించదు.

స్థిరమైన లక్ష్యం కోసం పని చేయాలి

మదర్ థెరిసా తన జీవితంలో అరవై ఏళ్లకు పైగా కలకత్తా మురికివాడల్లోని పేదవారికి సేవ చేస్తూనే గడిపారు. వారి కోసం మిషనరీ ఆఫ్ ఛారిటీని ప్రారంభించారు. చాలా చిన్న సేవా సంస్థగా మొదలైన మినషరీ ఆఫ్ చారిటీ సభ్యులు ఇప్పుడు 123 దేశాల్లో 637 సెంటర్ల ద్వారా అనాథలు, రోగగ్రస్థులకు సేవలు అందిస్తున్నారు. ఆమె సేవాభావాన్ని చూసి ఎందరో విరాళాలందించారు. ఇలా ఓ స్థిరమైన లక్ష్యం కోసం నిస్వార్థంగా పనిచేస్తే.. మనకు మిగిలినవారు కూడా తోడ్పాటునందిస్తారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం

మనం ఎంత ఎత్తుకి ఎదిగినా.. కాళ్లు మాత్రం నేల మీదే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. దానికి సరైన ఉదాహరణ మదర్ థెరిస్సా. ఓ నన్‌గా ప్రారంభమైన ..ఆమె తన ప్రయాణంలో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని, నోబెల్ శాంతి బహుమానాన్ని అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. అయినా రోగులకు తానే స్వయంగా సేవలు చేసేవారు. అందుకేనేమో.. అందరూ ఆమెను ప్రేమగా మదర్ అని పిలుస్తారు. మదర్ నుంచి మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిన వాటిలో ఇది ముఖ్యమైనది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.