సినిమా స్టోరీని తలపించేలా.. దర్శకుడు "పూరి జగన్నాధ్ - లావణ్య"ల లవ్ స్టోరీ..!

సినిమా స్టోరీని తలపించేలా.. దర్శకుడు "పూరి జగన్నాధ్ - లావణ్య"ల లవ్ స్టోరీ..!

పూరి జగన్నాధ్ సినిమాలకన్నా.. ఆ సినిమాల్లోని హీరోల పాత్రలంటే ప్రేక్షకులకి విపరీతమైన పిచ్చి. ఆయన హీరోలు వాళ్ళని వాళ్ళు "ఇడియట్" అని తిట్టుకున్నా... లేదా కొంచెం మెంటల్ అని చెప్పుకున్నా.. అదంతా కాదు.. 'నేనెంత ఏదవనో నాకే తెలియదు' అని క్రెడిట్ ఇచ్చుకున్నా.. అది వారికే చెల్లింది.

పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో.. మనకు కనిపించే 5 'ఇస్మార్ట్' విషయాలు..!

అయితే ఇలాంటి వైవిధ్యమైన పాత్రలని సృష్టించిన పూరి జగన్నాధ్ స్వతహాగా ఎలా ఉంటాడు? అతని అభిరుచులు ఏమిటి? అలాగే ఆయన లవ్ స్టోరీ ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో మనం కూడా పూరి జగన్నాధ్ (Puri Jagannadh) , ఆయన భార్య లావణ్యల (Lavanya) ప్రేమ కథ (Love Story) గురించి తెలుసుకుందామా... చిత్రమేంటంటే.. ఆయన ప్రేమకథ కూడా దాదాపు ఒక సినిమా స్టోరీ లానే ఉంటుంది.

పూరి జగన్నాధ్ ప్రేమకథలోకి వెళితే ...

పూరి జగన్నాధ్ దర్శకుడు కాకముందు ... దూరదర్శన్‌లో ఒక ధారావాహికకి దర్శకత్వం (ఘోస్ట్ డైరెక్టర్) వహించడానికి హైదరాబాద్‌కి వచ్చారట. ఈ క్రమంలో రెండు రోజుల షూటింగ్ నిమిత్తం రామాంతపూర్‌కి వెళ్లడం జరిగింది. ఓ ఇంటి ప్రాంగణంలో  షూటింగ్ జరుగుతున్న సందర్భంలో.. మొదటిసారిగా ఆయన లావణ్యని చూశారట... చూసిన వెంటనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తనకు అనిపించిందట.

అలా అనిపించిన మరుక్షణం.. తన విజిటింగ్ కార్డుని ఓ అమ్మాయి చేతికిచ్చి ఆయన లావణ్యకి పంపించారట. అలా పంపించే సమయంలోనే.. తనని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే, ఆ కార్డు పైన ఉన్న నంబర్‌కి ఫోన్ చేయాలి అని చెప్పి పంపించాడట. ఊహించని ఈ సంఘటనకి ఖంగుతిన్న లావణ్య... ఆ కార్డుని వెంటనే తిప్పి పంపించేసిందట. అయితే పూరి జగన్నాధ్.. పట్టు వదలకుండా.. ఆమె కార్డుని తీసుకునే వరకు ఆ అమ్మాయిని తన దగ్గరకు పంపిస్తూనే ఉన్నాడట.

ఇది జరిగిన ఒక వారం తరువాత.. లావణ్య నిజంగానే ఆ కార్డు పైన ఉన్న నంబర్‌కి ఫోన్ చేయడం గమనార్హం. అయితే అది పూరి జగన్నాధ్ ఇంటి నంబర్ కాదట. ఆయన అద్దెకి ఉండే ఇంటి నంబర్ కావడంతో.. ఆమె మరొక షాక్ తిన్నారట. కానీ ఎట్టకేలకి పూరి జగన్నాధ్‌తో ఫోన్ మాట్లాడారట. అలా మాట్లాడుతూ - "ఇలా పరిచయం లేని అమ్మాయిలకి ఫోన్ నంబర్ ఇవ్వడమేనా నీ పని! ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలకి ఫోన్ నంబర్ ఇచ్చావు?"  అంటూ ఆమె రకరకాల ప్రశ్నలు వేయడంతో.. వీరి తొలి సంభాషణ మొదలైందట.

"వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే" సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు తప్పక చూడండి..!

అలా మొదలైన వారి ఫోన్ సంభాషణలు.. తరువాతి కాలంలో వారి మధ్య స్నేహాన్ని పెంచాయి.అదే స్నేహం.. తరువాతి కాలంలో ప్రేమగా మారిందట. వారి ప్రేమ కథ నడిచే రోజుల్లోనే.. ఒకసారి ఓ రెస్టారెంట్‌కి వాళ్లిద్దరూ వెళ్లారట. అక్కడ లావణ్య చేసిన ఫుడ్ ఆర్డర్‌కి సరిపోయే డబ్బులు.. తన వద్ద ఉన్నాయో లేవో అన్న టెన్షన్‌తో 'పూరి' ఏమీ తినలేదట. కానీ ఇవేమి పట్టించుకోకుండా.. "తనకు కాబోయే శ్రీమతి.. ఆర్డర్ చేసిన ఫుడ్ మొత్తం తినేసింది" అంటూ ఆ రోజులని గుర్తు తెచ్చుకుంటాడు పూరి. అలా జరిగిన తరువాత ఆమెను చూస్తే భయం కూడా వేసిందని.. కానీ ప్రేమలో అవి సహజమని కూడా తెలిపారాయన. 

ఇలా మంచి ఎంటర్‌టైనింగ్‌గా  సాగుతూ వచ్చిన వీరి ప్రేమకథ.. పెళ్లి వరకు వచ్చింది. ప్రేమ గురించి ఇరువురి ఇళ్లల్లో చెప్పి ఒప్పించిన తరువాత కూడా.. పెద్దల సమక్షంలో కాకుండా.. ఎవరికి చెప్పకుండా స్నేహితుల సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నారట . ఎందుకంటే, అప్పటికే జీవితంలో ఇంకా స్థిరపడని వీరి కోసం పెద్దలు డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం వృధా అనిపించి.. ఇలా గుడిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.

తొలిచూపులోనే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని... ఏమాత్రం కూడా తడబాటు లేకుండా సరాసరి పెళ్లి ప్రస్తావన తీసుకురావడం పూరి జగన్నాధ్‌‌కి మాత్రమే చెల్లింది. తన సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా.. తను చాలా బోల్డ్‌గా ఉంటాడు అనడానికి ఆయన ప్రేమకథే పెద్ద ఉదాహరణ.

వీరి ప్రేమకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే - "ఇడియట్" చిత్రంలో హీరోయిన్‌ని చూసిన వెంటనే.. "ఐ లవ్ యు" అని హీరో చెప్పేస్తాడు. అదేంటి చూడగానే వెంటనే లవ్? అని ఆమె అంటే - "గంట ఆగి చెప్పాలా? రేపు చెప్పాలా? ఒక వీక్ ఆగి చెప్పాలా? ఎప్పుడు చెప్పినా ఒకటే.. గుండెల్లో ఏది ఉంటే అదే వస్తుంది" అంటాడు హీరో. ఈ సన్నివేశం కూడా దాదాపు వారి ప్రేమకథ నుండి స్ఫూర్తి పొంది రాసిన సన్నివేశమే అని చెబుతారు.

అలా పూరి జగన్నాధ్ - లావణ్యాల ప్రేమకథ ఒక అందమైన ప్రేమకథ అనే చెప్పాలి.

వర్షాకాలంలో మనం తప్పక సందర్శించాల్సిన.. పర్యాటక ప్రదేశాలు ఇవే..!