ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీ భాగస్వామి మీకు దూరమవుతున్నట్లే..

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీ భాగస్వామి మీకు దూరమవుతున్నట్లే..

మీరు ఎంతగానో ప్రేమించిన మనిషే కావచ్చు. కానీ మీరు ప్రేమించినంతగా మీ భాగస్వామి (partner) మిమ్మల్ని ప్రేమించకపోతే.. ఆ  బంధం (relationship) సమస్యల వలయంలో చిక్కుకొనే అవకాశాలు చాలా ఎక్కువ. మిమ్మల్ని సగం ప్రేమించే వ్యక్తితో మీరు బంధాన్ని జీవితాంతం కొనసాగించడం కష్టమే కాదు.. అసాధ్యం కూడా. ప్రతి ఒక్కరూ ఇంట్లో తమను మాత్రమే ప్రేమించే ఓ భాగస్వామి ఉండాలని.. తనతో జీవితాంతం ఆనందంగా గడపాలని కోరుకుంటారు.

కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా.. తనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకునే వ్యక్తిని ఇష్టపడరు. ప్రతి బంధంలో ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం, అర్థం చేసుకునే తత్వం ఉండాలి. తమ బంధాన్ని ఆనందంగా కొనసాగించాలంటే.. అందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించాల్సి ఉంటుంది. అలా జరగకపోతే మీ బంధం వన్ సైడెడ్ రిలేషన్ షిప్ అన్నమాటే. అందుకే మీ బంధాన్ని ఒకసారి చెక్ చేసుకోండి.

అన్నింటికీ మీరే ముందా..

Shutterstock

తను మీతో ఉన్నప్పుడు సరిగ్గానే ఉంటాడు. కానీ మీ నుంచి దూరంగా వెళ్లిన తర్వాత మాత్రం.. మీ గురించి అస్సలు పట్టించుకోడు. తను మీకు ఫోన్ చేయడం లేదా మెసేజ్ చేయడానికి ఆసక్తి చూపించడు. మీరే ఎప్పుడూ ఫోన్ చేస్తూ ఉంటారు. మీరు కాల్ చేసినా.. అతను చాలా సార్లు ఫోన్ సైతం ఎత్తకుండా..  ఆ తర్వాత "బిజీగా ఉన్నాను అప్పుడు" అని చెప్పి తప్పించుకోవడం మీరు గమనించవచ్చు.

ఇలాంటి సందర్భాలలోనే..  అవతలి వ్యక్తిని ఛేజ్ చేసిన ఫీలింగ్ మీకు కలుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో.. వెంటనే ఓ నిర్ణయానికి రాకుండా కాస్త టైం ఇచ్చి చూడాలి.  అయినా సరే.. నెలల తరబడి ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం.. మీ బంధం గురించి రెండోసారి ఆలోచించడం మంచిది. రోజులో కనీసం ఓ అయిదు నిమిషాలు.. అవతలి వ్యక్తి మీకు ఒక్క ఫోన్ కాల్ లేదా మెసేజ్ చేయకపోవడం అనేది కాస్త సీరియస్ విషయమే.

ఎప్పుడూ మీకు దూరం..

తను ఎప్పుడూ మీకు దూరంగా ఉండాలని భావిస్తాడు. మీకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. రోజూ ఉదయాన్నే ఆఫీస్‌‌కి వెళ్తే అర్థరాత్రి వరకూ తిరిగి రాడు. ఆఫీసులో పనివేళలు ముగిసినా.. ఇంటికి వెంటనే చేరుకోకుండా స్నేహితులతో టైంపాస్ చేస్తాడు. అలాగే తనకు టూర్లకు వెళ్లే అవకాశం వచ్చినా..  మిమ్మల్ని మాత్రం వెంట తీసుకెళ్లే ప్రసక్తే ఉండదు. ఒంటరిగా లేదా తన స్నేహితులతో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తాడు. ఇలాంటి విషయాల్లోనూ మీరు సీరియస్‌గా ఆలోచించాల్సిందే. "మా ఇద్దరి మధ్య గొడవలేం లేవు కదా" అని మీరు సర్దిచెప్పుకున్నంత మాత్రాన.. సమస్య లేదని చెప్పలేం. 

మీ తప్పు లేకపోయినా..

Shutterstock

తను ఎప్పుడూ మిమ్మల్ని ఏడిపిస్తాడు. మీరు చేయని తప్పుకి కూడా మీరు పశ్చాత్తాపపడేలా చేస్తాడు. "తానెప్పుడూ కరెక్టే.. మీరే మాత్రమే తప్పులు చేస్తారని" మీరు నమ్మేలా చేస్తుంటే ఆ బంధం గురించి రెండోసారి ఆలోచించండి. ఇలాంటి బంధంలో చర్చలు అనేవి అస్సలు ఉండవు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ప్రతి చర్చ గొడవకే దారి తీస్తుంది. తనతో ఉంటే మీకు ముళ్లపై నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇలాంటప్పుడు మీ బంధానికి గుడ్ బై చెప్పే ధైర్యం చేయడం బెటర్.

మీ కుటుంబానికీ విలువ లేదా?

మీ భాగస్వామి మీ కుటుంబం చెప్పిన ప్రతి అంశానికి ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వారికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉంటుంది. అంతేకాదు.. వారికోసం కొన్ని సందర్భాలలో  రాజీ పడాల్సి కూడా ఉంటుంది. కానీ మీ భాగస్వామి మీ కుటుంబం పట్ల ఏమాత్రం బాధ్యతతో వ్యవహరించకపోతే.. అలాంటి వ్యక్తి మీ ప్రేమకు కూడా అర్హుడు కాదు అని గుర్తుంచుకోండి.

మీ ఒత్తిడి ఎక్కువే..

Shutterstock

మీరు ఒక బంధంలో ఉంటే అది మీ ఆనందాన్ని పెంచేలా ఉండాలి తప్ప.. మీ ఒత్తిడిని, బాధను పెంచేలా ఉండకూడదు. మీ బంధంలోని గొడవల వల్ల మీరు ఎప్పుడూ కోపం, బాధ, ఒత్తిడి వంటి భావోద్వేగాలకు లోనవుతుంటే.. తన నుంచి దూరంగా ఉండడం మంచిది. మీ మనశ్శాంతి కంటే ఈ లోకంలో ముఖ్యమైనది మరొకటి ఉండదు. ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తిని మనం బలవంతంగా మనల్ని ప్రేమించేలా చేయలేం. అందుకే దీన్ని ఒప్పుకొని.. అతడిని దూరంగా ఉంచడం మంచిది.

అలా అస్సలు మాట్లాడడు

మీరు మీ బంధం గురించి.. మీ ఇద్దరి భవిష్యత్తు జీవితం గురించి మాట్లాడేందుకు నోరు తెరిస్తే చాలు.. అతడు మీతో గొడవ పెట్టుకుంటాడు. లేదా వేరే విషయం గురించి మాట్లాడతాడు. ఇలాంటి టాపిక్ వస్తే చాలు.. దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇది మాత్రమే కాదు.. మీ మధ్య ఎలాంటి చర్చ జరిగినా.. అది ఆఖరికి గొడవకే దారితీస్తుంది. ఇలాంటప్పుడే మీ బంధం గురించి మీరు మళ్లీ ఓసారి పునరాలోచించుకోవాలి. 

మీ గురించి ఆలోచించడు..

Shutterstock

సెక్స్ విషయంలో స్త్రీలు భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తారు. కానీ మీ ఫీలింగ్స్‌కి గౌరవం ఇవ్వకుండా.. ఈ విషమంలో తనదే పై చేయి ఉండాలని భావిస్తూ.. అలాగే ప్రవరిస్తూ.. ఆ తర్వాత కూడా మీతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా అతను నిద్రపోతుంటే కాస్త ఆలోచించండి. చాలామంది ఇలాంటి ప్రవర్తనను తప్పదన్నట్లుగా భరిస్తారు. కానీ అలా భరించడం వల్ల.. భవిష్యత్తులో మీకే నష్టం జరుగుతుందని గుర్తుంచుకోవాలి.

అందరిలో అలా ఉండడు

అందరిలో ఉన్నప్పుడు ప్రేమ చూపిస్తేనే.. ప్రేమ ఉన్నట్లు కాదు. కానీ ప్రేమ ఉన్నప్పుడు దాన్ని కొంతైనా చూపించడంలో తప్పు లేదు. కానీ మీ భాగస్వామి పక్కన మీరు నడుస్తుంటే.. మీరు ఎవరో తెలియని వ్యక్తితో నడుస్తున్నట్లుగా ఫీలవుతున్నారా? అయితే ఆలోచించండి. పబ్లిక్‌లో మరీ ఎక్కువగా దగ్గరితనం చూపించాల్సిన అవసరం లేదు. కానీ మీరు తన భాగస్వామి అని తెలియకుండా చేస్తున్నాడంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.