హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు.. ఈ విషయాల గురించి బాగా తెలుసు..!

హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు.. ఈ విషయాల గురించి బాగా తెలుసు..!

చదువుకునే రోజుల్లో లేదా ఉద్యోగం చేసే కొత్తలో.. హాస్టల్ లేదా పేయింగ్ గెస్ట్ అకామడేషన్‌లో ఉండే ఉంటారు కదా. నేను కూడా అంతే. చదువుకునే రోజుల్లో కాదు గానీ.. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం తెచ్చుకున్న కొత్తలో హాస్టల్లో ఉన్నా. అప్పటి వరకు ఇంటి వాతావరణానికి దూరంగా వెళ్లలేదు కాబట్టి.. హాస్టల్లో చేరిన కొత్తలో చాలా కొత్తగా, వింతగా అనిపించేది. అప్పటివరకు పరిచయం లేని వారితో రూమ్ పంచుకోవాల్సి రావడం, భోజనం కోసం ప్లేటు పట్టుకెళ్లడం.. అంతా చాలా కొత్తగా అనిపించేది.

కానీ ఆ తర్వాత ఆ వాతావరణం బాగా అలవాటైపోయింది. ఎంతలా అంటే సెలవుల కోసం ఇంటికి వచ్చినప్పటికీ మళ్లీ ఎప్పుడెప్పుడు హాస్టల్‌కి (hostel)  వెళ్దామా అనిపించేది. అప్పుడప్పుడూ ఇంటిని కూడా మిస్సవుతున్నట్టనిపించేది. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగా లేనప్పుడు పక్కన అమ్మ ఉంటే.. బాగుంటుందనిపించేది.

బహుశ హాస్టల్లో ఉండేవారందరికీ.. ఇది అనుభవమే అయి ఉంటుంది. మనలో చాలామంది కొంత వయసు వచ్చిన తర్వాత.. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకాలని భావిస్తారు. అలాంటి వారు కచ్చితంగా హాస్టల్లోనే చేరతారు. ఎందుకంటే.. అక్కడైతే.. తమకు కావాల్సిన స్వేచ్ఛతో పాటు.. సెక్యూరిటీ కూడా ఉండటమే దీనికి కారణం. హాస్టల్లో ఉన్నవారికి చాలానే మధుర జ్ఞాప‌కాలు (memories) ఉంటాయి. రూమ్మేట్స్ ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. మీరు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు.. ఇలాంటి అనుభవాలే ఎదురై ఉంటాయి కదా.

నో రూల్స్.. నో కండిషన్స్..

ఇంటి నుంచి హాస్టల్‌కి వెళుతున్నామంటే.. ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన.. "ఇక నేను చాలా ఫ్రీగా ఉండచ్చు" ఎలాంటి కండిషన్స్ ఉండవు. ఇంట్లో పని చేయాల్సిన అవసరం రాదు. ఇలానే ఉంటాయి మన ఆలోచనలు. పైగా సినిమాల్లో చూపించే హాస్టల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మన ఊహలు కూడా అవే రేంజ్‌లో ఉంటాయి. కానీ మన ఆలోచనలకు భిన్నంగానే.. హాస్టల్ వాతావరణం ఉంటుంది. అయినా కొన్ని రోజులు గడిచేటప్పటికి.. మనకు హాస్టల్ చాలా బాగా నచ్చేస్తుంది.

Giphy

కొత్త స్నేహితులు.. కొత్త జీవితం

హాస్టల్లో ఉన్నామంటే.. కచ్చితంగా మనం మరొకరితో రూం షేర్ చేసుకోవాల్సి రావచ్చు. అది ఒకరా, ఇద్దరా, ముగ్గురా అనేది హాస్టల్‌ని బట్టి ఉంటుంది. కానీ వారితో గడిపే ప్రతి క్షణం కొత్తగానే ఉంటుంది. హాస్టల్లో చేరినప్పటి నుంచి మన సంతోషాన్ని, బాధను పంచుకునేది మన రూమ్మేట్సే. ఎన్ని కబుర్లు, ఎన్ని కథలు.. అవన్నీ తలుచుకుంటే.. కొన్ని సార్లు హాస్టల్ లైఫ్ మిస్సయ్యామనిపిస్తుంది.

Giphy

రాత్రి పూట బయటకు వెళ్లడం

నిజం చెప్పాలంటే.. హైదరాబాద్ హాస్టళ్లలో.. రాత్రి పది తర్వాత ఎవరినీ బయటకు వెళ్లనీయరు. వాస్తవానికి  మనల్ని సేఫ్‌గా ఉంచేందుకే అలా చేస్తారు. కానీ అప్పుడప్పుడూ సినిమాకి, రెస్టారెంట్‌కి వెళ్లి లేటుగా వస్తే తాళం వేసేస్తారు. అప్పడు వార్డెన్‌కి ఫోన్ చేసి తాళం తీయమని చెప్పడం.. వాళ్లు తిట్టుకుంటూ.. మనల్ని తిడుతూ తాళం తీయడం భలే సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడూ వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే.. రాత్రంతా బయటే ఉండాలేమో అనే కంగారు కూడా వస్తుంది.

బడ్జెట్ వేసుకోవడం..

చదువుకోసం హాస్టల్లో ఉన్నా.. లేదా ఉద్యోగం చేస్తూ హాస్టల్లో ఉన్నా.. మనకు అలవాటయ్యే మంచి లక్షణం ఏంటో తెలుసా? డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టడం. ఇంటి నుంచి డబ్బు పంపిస్తే హాస్టల్ ఫీజులు పోను.. మిగిలిన డబ్బును నెలంతటి అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు పెడితే.. నెల చివర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే హాస్టల్లో ఉన్న అమ్మాయిలు.. ఆ తర్వాత కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

Giphy

మన పని మనం చేసుకోవడం

హాస్టల్లో మనం చేసే పని పెద్దగా ఏమీ ఉండదు. కానీ కొన్ని పనులు మాత్రం స్వయంగా చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దుస్తులు ఉతుక్కోవడం. అక్కడ మన దుస్తులు ఉతికేవారుండరు. ఒకవేళ ఉన్నప్పటికీ.. వారికి ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది. వారికిచ్చే బదులు.. మనమే ఉతుక్కుంటే.. ఆ డబ్బు ఏదో ఒక అవసరానికి పనికొస్తుందనే భావన చాలామందికి ఉంటుంది. అందుకే తమ బట్టలు తామే ఉతుక్కుంటూ ఉంటారు. నిజం చెప్పొద్దూ.. మొదట్లో ఇలా ఉతికేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ రాన్రానూ అలవాటు పడిపోతారు. అలాగే రూంను అందంగా సర్దడం, అలంకరించుకోవడం లాంటివి బాగా చేస్తారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది