ఈ అందాల భామలు కూడా.. వెండితెరపై పాఠాలు చెప్పినవారే..!

ఈ అందాల భామలు కూడా.. వెండితెరపై పాఠాలు చెప్పినవారే..!

టీచర్ (Teacher).. జీవితంలో ఎవరు ఏ వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడాలన్నా అందుకు అవసరమైన పాఠాలు నేర్పించేది మాత్రం ఉపాధ్యాయులే. అందుకే ఈ వృత్తిని, మనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులనూ మనం ఎంతగానో గౌరవిస్తాం. అయితే కథపరంగా అవసరం వచ్చినప్పుడు.. కొందరు అందాల భామలు (Actresses) సైతం టీచర్లుగా వెండితెరపై కనిపించి ప్రేక్షకులను కనువిందు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగులో విడుదలైన "రాక్షసుడు" సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ సైతం పాఠాలు వల్లించే ఉపాధ్యాయురాలిగా మెరిసింది.

సినిమాలో ఆమె పాత్ర నిడివి కాస్త తక్కువే అయినప్పటికీ.. కథపరంగా ప్రాధాన్యం కలిగిన పాత్ర కావడంతో ఇందులో నటించేందుకు అంగీకరించింది అనుపమ. అంతేకాదు.. తాను ఎంపిక చేసుకున్న పాత్రకు వంద శాతం న్యాయం కూడా చేసేందుకు ప్రయత్నించింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై ఇలా టీచర్‌గా మెరిసే ప్రయత్నం చేసిన కథానాయికల్లో ఈమేమీ మొదటి వ్యక్తి కాదు.

అనుపమ కంటే ముందే ఈ జాబితాలో చాలామంది అందాల ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. మరి, వారు ఎవరు? ఏ సినిమాలో టీచర్‌గా నటించారు? వారు ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేశారు?? మొదలైన ప్రశ్నలకు మనం కూడా ఓసారి సమాధానం తెలుసుకుందాం రండి..

అనుపమ పరమేశ్వరన్..

రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం రాక్షసుడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అనుపమ ఓ ఉపాధ్యాయురాలిగా నటించింది. ఆమె నటనకు ప్రేక్షకుల నుంచే కాదు.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించడం విశేషం. కృష్ణవేణిగా తన కెరీర్‌లో  ఓ చక్కని పాత్రకు ప్రాణం పోసి.. తనలోని నటప్రతిభను మరోసారి నిరూపించుకుంది.

శ్రుతిహాసన్..

ప్రేమమ్.. ఈ సినిమా పేరు వినని సినీ అభిమాని ఉండరంటే అది అతిశయోక్తి కాదు. మలయాళంలో రూపొంది హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో రూపొందించారు చందు మొండేటి. ఇందులో కాలేజ్ టీచర్ పాత్రలో..  శ్రుతిహాసన్ నటించింది. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు.. డ్యాన్స్ స్టెప్స్ కూడా నేర్పించే సితార టీచర్ పాత్రలో తన నటనతో అందరినీ మెప్పించింది శ్రుతి. మలయాళ వెర్షన్‌లో ఇదే పాత్రలో సాయిపల్లవి నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం మనకు విదితమే.

అసిన్..

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అతికొద్ది రోజుల్లో మంచి కథానాయికగా గుర్తింపు సంపాదించుకోవడమే కాదు.. తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల్లోనూ పలు చిత్రాల్లో నటించింది అసిన్. తెలుగులో ఆమె విక్టరీ వెంకటేష్ సరసన నటించిన చిత్రం ఘర్షణ. ఇందులో మాయ అనే టీచర్ పాత్రలో పిల్లలకు పాఠాలు నేర్పిస్తూ, వారితో ఆడుతూపాడుతూ సరదాగా నటించింది అసిన్. ఈ పాత్ర కూడా ప్రేక్షకులపై బాగానే ముద్ర వేసింది.

ఇలియానా..

టాలీవుడ్‌లో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న గోవా భామ ఇలియానా. ఈ చిన్నది తన కెరీర్‌లో భాగంగా రకరకాల పాత్రల్లో నటించింది. ఈ క్రమంలోనే మాస్ మహారాజ్ రవితేజ సరసన ఖతర్నాక్ చిత్రంలో టీచర్‌గా కనిపించిందీ భామ. నక్షత్ర అనే టీచర్‌గా ఓ వైపు.. తన అందాలతో కవ్విస్తూనే మరోవైపు విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయినిగా మెరిసింది.

View this post on Instagram

These cuties ❤️❤️!!!

A post shared by Lavanya T (@itsmelavanya) on

లావణ్య త్రిపాఠి..

తన లావణ్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన చిన్నది లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు మెగాహీరో వరుణ్ తేజ్ సరసన నటించిన "అంతరిక్షం" చిత్రంలో టీచర్‌గా నటించింది. పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ పిల్లలకు క్రమశిక్షణ పాఠాలు వల్లిస్తూ చక్కగా నటించిందీ సొగసరి.

View this post on Instagram

Chitta Suit😍🥰

A post shared by MEHREEN ✨🌟 (@mehreenpirzadaa) on

మెహరీన్..

ప్రస్తుత కథానాయికల్లో అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారిలో మెహరీన్ కూడా ఒకరు. ప్రముఖ కథానాయకుడు గోపీచంద్ నటించిన 25వ చిత్రం "పంతం"లో ఈ అమ్మడు కూడా టీచర్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

అమలాపాల్..

ఇటీవలే ‘ఆమె’ చిత్రంతో తానో బోల్డ్ నటీమణినని నిరూపించుకున్న ముద్దుగుమ్మ అమలాపాల్. ఈ అమ్మడు తన కెరీర్‌లో భాగంగా సూర్యతో కలిసి నటించిన ‘మేము’ చిత్రంలో స్కూల్ టీచర్‌గా నటించింది. ఇందులో అల్లరితో మోత మోగించే గడుగ్గాయిలను తెలివిగా అదుపుచేస్తూ.. వారిని సక్రమంగా తీర్చిదిద్దే పాత్రలో ఆమె ఒదిగిపోయిందంటే అతిశయోక్తి కాదు.

కార్తికా నాయర్..

మునుపటి తరం నటీమణి రాధ తనయగా సినీ పరిశ్రమకు పరిచయమైన అందాల భామ కార్తికా నాయర్. అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన తొలి చిత్రం "జోష్". ఇందులో ఈ భామ నర్సరీ చదివే పిల్లలకు టీచర్‌గా నటించింది. ఓ వైపు టీచర్‌గా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే తనలోని విద్యార్థిని సైతం బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది కార్తిక.

స్వాతీ రెడ్డి..

తెలుగు సినీ పరిశ్రమలో నటిగా, బుల్లితెరపై యాంకర్‌గా రాణించి అందరిలోనూ గుర్తింపు సంపాదించుకున్న భామ స్వాతీ రెడ్డి. సుమంత్ సరసన ఈ అమ్మడు  ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రంలో టీచర్‌గా మెరిసింది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంగ్లిష్ టీచర్‌గా చక్కని నటప్రతిభను కనబరిచిందీ స్వాతి.

సమంత..

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత కూడా రెండు సినిమాల్లో టీచర్‌గా కనిపించింది. వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన రామయ్యా వస్తావయ్యా కాగా; మరొకటి రాజు గారి గది 2. ఈ సినిమాల్లో సమంత టీచర్ రూపంలో కనిపించేది చాలా తక్కువ సమయమే అయినప్పటికీ.. ఆ పాత్రలోనూ తాను చక్కగా ఒదిగిపోగలనని నిరూపించుకుంది సామ్.

వీరే కాదు.. హ్యాపీ డేస్ చిత్రంలో గ్లామరస్ ఇంగ్లిష్ టీచర్‌గా మెరిసిన కమలినీ ముఖర్జీ, ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన "గణేష్" చిత్రంలో ట్యూషన్ టీచర్‌గా మెరిసిన కాజల్ అగర్వాల్, తిరునాల్ అనే తమిళ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసిన నయనతార, కరెంట్ తీగ చిత్రంలో టీచర్‌గా మెరిసిన గ్లామర్ స్టార్ సన్నీ లియోనీ.. వీరందరూ ఇప్పటికే ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న కథానాయికలు కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

అమ్మాయిలూ.. పెళ్లికి ముందే పెళ్లికొడుకుని ఈ ప్రశ్నలడగండి..!

డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ - ప్రతి అమ్మాయికి ఒక 'కామ్రేడ్' అవసరం

రాక్షసుడు మూవీ రివ్యూ - థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారి కోసం ..!