పెళ్లికి ముందు.. నుదుట బాసికం ఎందుకు కడతారో మీకు తెలుసా..?

పెళ్లికి ముందు.. నుదుట బాసికం ఎందుకు కడతారో మీకు తెలుసా..?

వివాహం (marriage).. ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేసే తంతు ఇది. పెళ్లితో ఒక్కటైన జంట జీవితాంతం కలిసి ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనేది ఓ ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పుకోవాల్సిందే. వివాహమనగానే ఒక్కోచోట ఒక్కో రకమైన సంప్రదాయం ఉండడం మనం చూస్తుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లోని పెళ్లిళ్లలో నిశ్చితార్థం, స్నాతకం, కాశీయాత్ర, గౌరీ పూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, పాణిగ్రహణం, మధుపర్కం, మంగళ సూత్ర ధారణ, బ్రహ్మముడి, సప్తపది, స్థాలీపాకం, నాగవల్లి, అరుంధతీ నక్షత్రం, అప్పగింతలు అంటూ ఎన్నో పద్దతులు ఉన్నాయి.

ప్రతి పద్ధతికి వెనుక ఆచార, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అలాగే పెళ్లిలో వధువు, వరుడికి నుదుట బాసికం కడతారు. దాని వెనుక కూడా ఎన్నో కారణాలున్నాయి. ఈ క్రమంలో మనం కూడా వివాహాల్లో బాసికం (basikam) కట్టడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం రండి..

Instagram

పూర్వకాలంలో ప్రతి పనికి ముందు దేవుడిని పూజించి సంప్రదాయం ప్రకారం తంతు జరిపేవారు. దీనివల్ల పనులన్నీ సక్రమంగా సాగుతాయని నమ్మేవారు. ఆ సంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చరిత్రకారులు కూడా చెప్పడం విశేషం. అలాంటిదే ఈ బాసికం కట్టడం కూడా. పెళ్లికి కొన్ని గంటల ముందు వధు, వరులను పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసిన తర్వాత.. వారి నుదుట బాసికం కట్టడం ఆచారంగా వస్తోంది. నుదుటి భాగంలో బ్రహ్మ దేవుడు కొలువై ఉంటాడని.. బ్రహ్మ మన భవిష్యత్తుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా నుదుట రాస్తాడని కూడా తెలిసిందే. అందుకే నుదుట చేతులు పెట్టుకోవడం అరిష్టం అంటుంటారు. 

Instagram

సాధారణంగా ఒక పెళ్లికి వందలాది మంది బంధుమిత్రులు వస్తారు.  ఈ క్రమంలో వధూవరులను ఎంతో అందంగా సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వారిని చూసి దిష్టి పెడతారని కొందరి భావన. దోషాలు ఉన్నవారి కళ్లు మనపై పడితే.. ఆ నర దిష్టి వల్ల తర్వాత జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా తలరాత ఉన్న ముఖ్యమైన నుదురు భాగాన్ని అందరూ చూడడం సరికాదని.. దాన్ని దాచేలా నుదురు మొత్తాన్ని కప్పి ఉంచేలా బాసికాన్ని కట్టేవారు. రాను రానూ బాసికం పరిమాణం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు చాలా చిన్న సైజులో.. రెండు కనుబొమ్మలు కలిసే చోట నుదిటిపైన ఈ బాసికాన్ని కడుతున్నారు.

Instagram

బాసికం కట్టడం కేవలం ఆచారం మాత్రమే కాదు.. దీనివల్ల శాస్త్రీయ పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. మన శరీరంలో దాదాపు 72 వేల నాడులు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి 14 నాడులు. ఇవి మన శరీరాన్ని ఉత్తేజపర్చడంలో తోడ్పడతాయి. ఈ పద్నాలుగులోనూ ఇడ, పింగళ, సుషమ్న అనే నాడులు ముఖ్యమైనవి. వీటిలో ప్రధానమైన సుషమ్న నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండు నుదిటి భాగంలో కలుస్తాయి.

ఈ రెండూ కలిసే భాగం అర్థ చంద్రాకారంలో ఉంటుందట. ముహూర్త సమయంలో వధు,వురులు ఒకరినొకరు ఆ భాగంలో చూడడం వల్ల ఇద్దరి దాంపత్య బంధం ఆనందంగా సాగుతుందని పెద్దలు నమ్ముతారు. అంతేకాదు.. బాసికం ఆ నాడులపై ఒత్తిడి కలిగిస్తుందట. ఆ ఒత్తిడి వల్ల  నాడులు యాక్టివేట్ అవుతాయట. ఎప్పుడైతే ఆ నాడులు ఉత్తేజాన్ని కలిగిస్తాయో.. పెళ్లి సమయంలో వధూవరులు కూడా అంతే ఉల్లాసంగా, ఉత్తేజంగా  పెళ్లిని ఎంజాయ్ చేయగలుగుతారట.

Instagram

సాధారణంగా ఇంతకుముందు బాసికాన్ని బియ్యంతో తయారుచేసేవారు. వెదురు ముక్కకు బియ్యాన్ని అంటించి లేదా దారంతో కుట్టి  బాసికాలను తయారుచేసేవారు. కానీ ఇప్పుడు వాటిని అట్టముక్కలు, థర్మాకోల్, కుందన్స్ వంటివాటితో తయారుచేస్తున్నారు.

ఒకప్పుడు వీటిని కేవలం అర్ధచంద్రాకారం లేదా త్రికోణాకారంలో మాత్రమే తయారు చేసేవారు. ఇప్పుడు మాత్రం అన్ని షేపుల్లోనూ తయారుచేస్తున్నారు. బాసికాన్ని ఉపయోగించేముందు.. పాలలో ముంచి తీయడం శుభ పరిణామమని ప్రతీతి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Featured Image : Savyasaachi photography Facebook