(6 Types of fights every married couple should have)
సాధారణంగా భార్యాభర్తలిద్దరూ ఏదైనా చిన్న గొడవ పడితే.. పెద్దవాళ్లు వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి గొడవలు పడడం సరికాదని.. అవి ఇద్దరినీ దూరం చేస్తాయని చెబుతుంటారు. నిత్య జీవితంతో ఇలాంటి ఘటనలు మనం చూస్తుంటాం. ఆలుమగలిద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా.. జీవితాంతం ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని కోరుకోవడం సహజమే.
అయితే కొన్ని సార్లు.. పలు అంశాలకు సంబంధించి భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం ఎంతో అవసరమట. ఈ గొడవలు మీ బంధాన్ని మరింత బలంగా మార్చడంతో పాటు.. ఇద్దరి మధ్య ప్రేమను కూడా పెంచుతాయట. మరి, అవి ఎలాంటి గొడవలు అంటే..
కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గొడవ
కమ్యూనికేషన్ అనేది ప్రతి బంధానికి ఎంతో ముఖ్యమైందిగా చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య పెద్దగా మాటలే లేకపోతే.. వారిరువురు దగ్గరవ్వడం అనేది జరగనే జరగదు. అందుకే.. ఒకరి మాటలను మరొకరు అర్థం చేసుకోవాలి. ప్రతి విషయం గురించి చర్చించుకోవాలి. అప్పుడే ఇద్దరూ జీవితాంతం కలిసి జీవించే వీలుంటుంది. ఒకవేళ మీ భాగస్వామి మీతో మాట్లాడడానికి.. తనకు సంబంధించిన విషయాలను చర్చించడానికి ఆసక్తి చూపించకపోతే.. ఈ విషయం గురించి తనని తప్పనిసరిగా అడగండి.
ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ఇద్దరికీ ఎంతో ముఖ్యమైంది. అదే గనుక లేకపోతే.. ఇరువురి మధ్య మరింత దూరం పెరుగుతుంది. అలా దూరం పెరగకుండా.. ముందుగానే మాట్లాడుకోవడం మరీ అవసరం. ఈ క్రమంలో తనతో గొడవ పడడం కూడా మంచిదే. అదే గొడవ మీరు ఎలా ఫీలవుతున్నారో.. అవతలివారికి వివరిస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్యా దూరం తగ్గే వీలుంటుంది.
పని ఒత్తిడి వల్ల జరిగే గొడవ
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే.. ఇంటి పనులను కూడా ఇద్దరూ కలిసే పంచుకోవాలి. అలా కాకుండా.. మీ భాగస్వామి మీపైనే ఇంటి పని భారం మొత్తం వేయడం తగదు. ఈ క్రమంలో తను ఆఫీసు నుంచి రాగానే.. ఏ పనీ చేయకుండా.. విశ్రాంతి తీసుకుంటుంటే మాత్రం దాని గురించి అతడితో చర్చించే అధికారం మీకుంది. అవసరమైతే గొడవ పెట్టుకునే హక్కు కూడా మీకు ఉంటుంది.
ఈ గొడవ వల్ల మీ భాగస్వామి మీ పని ఒత్తిడిని.. కాస్త షేర్ చేసుకోవడం మంచి పరిణామమే కదా. దాంతో మీ జీవితంలో మీకంటూ కాస్త ఖాళీ సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని మీరు మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడిపే వీలు దొరుకుతుంది.
ఒంటరిగా ఫీలై పెట్టుకునే గొడవ
ప్రస్తుతం జనాల లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ బిజీబిజీ జీవితంలో చాలామంది.. తమ భాగస్వామి ఒంటరిగా ఫీలవుతారన్న విషయాన్ని గమనించరు. సాధారణంగా భార్యాభర్తల్లో ఏ ఒక్కరికైనా సరే.. తాము ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగితే.. వెంటనే మీ భాగస్వామితో మాట్లాడండి. ఈ క్రమంలో గొడవ కూడా పెట్టుకోవాల్సిందే. ఇలా చేయడం వల్ల మీ మనసులోని బాధ మొత్తం.. అవతలి వారికి అర్థం అవుతుంది. వారు మీతో సమయాన్ని గడిపే వీలుంటుంది.
స్నేహితుల గురించి గొడవ
స్నేహితులు, బంధువుల గురించి గొడవ పెట్టుకోని జంట ఎవరైనా ఉంటారా చెప్పండి? మీ సర్కిల్లో మీ భాగస్వామికి.. అస్సలు నచ్చని స్నేహితులు, బంధువులు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అలాగే వారి విషయంలో.. మీకు నచ్చని వ్యక్తులు కూడా ఉంటారు. వారు ఇంటికి రావడం లేదా వారి ఇంటికే మిమ్మల్ని రమ్మనడం వంటివి జరిగినప్పుడు.. ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. అయితే ఇలాంటప్పుడు కోపాన్ని మనసులోనే దాచుకోకుండా.. ఎప్పటికప్పుడు మీ ఫీలింగ్స్ చెప్పుకొని.. ఆ విషయాన్ని అక్కడితో వదిలేయడం మంచిది.
ఆర్థిక విషయాల గురించి గొడవ
భార్యాభర్తలు గొడవ పడే అంశాల్లో ముఖ్యమైంది – డబ్బు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఎక్కువగా ఖర్చు చేసినా లేదా ఎక్కువ పొదుపు చేసినా.. అవి వాదోపవాాదాలకు తావిస్తాయి. అప్పుడప్పడు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బు ఖర్చు పెట్టినా సరే.. గొడవలు జరుగుతాయి. అందుకే ఇలాంటప్పుడు గొడవలు పెట్టుకోవడం కంటే.. ఇద్దరూ కలిసి చర్చించుకొని ఒకరి అవసరాలు మరొకరు గమనించాలి. ఇద్దరి ఆదాయాలు, ఖర్చులతో కూడిన ఓ ఫైనాన్షియల్ ప్లాన్ రూపొందించుకోవాలి. జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు డబ్బు ఎంతో అవసరం. కానీ అదే మీ గొడవలకు దారి తీయకూడదు కదా.
లైంగిక ఆసక్తుల విషయంలో గొడవ
ఒక్కోసారి భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు సెక్స్‌ని కోరుకుంటున్నప్పుడు.. మరొకరు అలసిపోయి లేదా ఇష్టం లేక నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి తరచూ జరిగితే.. అవతలి వ్యక్తి మనసులో నిరాశ పెరిగిపోతుంది. ఇలాంటివి తరచూ జరుగుతుంటే.. ఇద్దరి మధ్య గొడవ జరగడం కూడా సహజం. ఈ సమయంలో ఒకరి మనసులోని భావాలని మరొకరితో చెప్పుకొని.. భాగస్వామి కోరికలను కూడా గమనించడం.. దానికి తగినట్లుగా వ్యవహరించడం మంచిది.
గొడవలు బంధాల్లో దగ్గరితనాన్ని పెంచుతాయి. కానీ ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడం వల్ల ప్రేమ పెరగదు. సరి కదా.. తగ్గుతుంది. అందుకే గొడవ పెట్టుకోవడం అలవాటుగా మార్చుకోకుండా.. మీ ప్రేమను పెంచుకోవడానికి దానిని మార్గంగా ఎంచుకోవడం మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.