సీతాఫలం.. తింటే చాలు అందేను సౌందర్యం, ఆరోగ్యం, బలం ..!

సీతాఫలం.. తింటే చాలు అందేను సౌందర్యం, ఆరోగ్యం, బలం ..!

సీతాఫలం (custard apple).. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకూ వచ్చే ఈ ఫలాలు మనల్ని ఎంతగా నోరూరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో సీతాఫల్ లేదా షరీఫా అని.. ఇంగ్లిష్‌లో కస్టర్డ్ యాపిల్ లేదా షుగర్ యాపిల్ అని పిలిచే ఈ పండులో ఎన్నెన్నో పోషకాలుంటాయి. దక్షిణ అమెరికా, వెస్టిండీస్, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ చెట్లు పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే మన దగ్గరి అడవుల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయి. చాలా ఎక్కువ క్యాలరీలున్న ఈ పండులో (fruit) సహజసిద్దమైన చక్కెరలు ఉంటాయి. అందుకే ఇది తీపి తినాలనే కోరికను తగ్గించే మంత్రం. అంతేకాదు.. పోషకభరితమైన స్నాక్ కూడా. మరి, ఈ సీతాఫలంలో ఉండే పోషకాలు.. దానివల్ల మన ఆరోగ్యానికి, అందానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రండి..

Table of Contents

  సీతాఫలంలోని పోషక విలువలు

  Shutterstock

  చూడగానే నోరూరించే సీతాఫలం రుచికి సాటి.. ఇంకే పండూ రాదంటే అతిశయోక్తి కాదు. తియ్యతియ్యని ఈ పండు తింటే చాలు.. కడుపు నిండి పోతుంది కానీ మనసే నిండదు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. కేవలం కడుపు నింపడమే కాదు.. ఇందులో ఎన్నో పోషకాలు కూడా నిండి ఉన్నాయి. సీతాఫలంలో కేవలం కార్బొహైడ్రేట్లే కాదు.. ప్రొటీన్లు, ఫ్యాట్లు కూడా ఎక్కువ మోతాదులోనే లభ్యమవుతాయి. వీటితో పాటు చాలా ఎక్కువ మోతాదులో విటమిన్ సి కూడా ఇందులో ఉంటుంది. విటమిన్ బీ6, ఫోలిక్ యాసిడ్‌లతో పాటు బీ కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ ఇందులో లభిస్తాయి. ఈ పండ్లలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, కాపర్ వంటి మినరల్స్ కూడా లభించడం వల్ల.. వాటి లోపాలు ఏవైనా మన శరీరంలో ఉంటే ఈ పండు తినడం వల్ల అవి తొలిగిపోతాయి.

  సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు

  సీతాఫలంలో ఎన్నో పోషకాలుంటాయి. వీటివల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయి. అవేంటంటే..

  మెటబాలిజం పెరుగుతుంది

  సీతాఫలం స్నాక్స్ రూపంలో తీసుకోవడానికి చక్కటి ఆహారం. ఆకలిని తగ్గించేందుకు చక్కటి మందు. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. శరీరంలోని మెటబాలిజం రేటును పెంచడంతో పాటు బరువును కూడా పెంచుతుంది. మెటబాలిజం పెరగడం వల్ల ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి ఇది మంచి ఎంపిక.

  రక్తహీనతను తగ్గిస్తుంది.

  సాధారణంగా రక్తహీనతతో బాధపడేవారికి తమ డైట్‌లో ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలంటే దానికి చాలా ఆప్షన్లు ఉంటాయి. కానీ ఆరోగ్యంతో పాటు.. రుచికరంగా కూడా ఉండే ఆహారం తీసుకోవాలంటే దానికి సీతాఫలమే మంచి ఆప్షన్. ఇందులో ఐరన్ మాత్రమే కాదు.. దానితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి రక్తహీనతను దూరం చేస్తుంది. దీంతో పాటు విటమిన్ బీ6 డెఫీషియన్సీని కూడా ఇది తగ్గిస్తుంది.

  అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

  సీతాఫలాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండడం వల్ల.. మన రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం రక్తనాళాలను వెడల్పుగా చేస్తుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. అధిక రక్తపోటు వల్ల వచ్చే గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.

  రక్తంలో చక్కెర స్థాయులను అదుపుచేస్తుంది.

  డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి సీతాఫలాన్ని మంచి పండుగా చెప్పుకోవచ్చు. ఇందులో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి. కానీ దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర ఒకేసారి పెరగదు. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే ఫైబర్ దీనికి కారణం. ఇవే రక్తంలో చక్కెరలు కలిసే వేగాన్ని తగ్గిస్తాయి. అందుకే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు.. చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం శక్తి అందేలా చేసేందుకు ఈ పండును తీసుకోవడం మంచిది.

  జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కాపాడుతుంది

  జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడడంలో సీతాఫలం చాలా బాగా తోడ్పడుతుంది. ఈ పండు మన జీర్ణాశయంలో ఉన్న టాక్సిన్లను బయటకు పంపుతుంది. ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే రోజుకో పండు తీసుకోవడం వల్ల అల్సర్లు తగ్గుతాయి. డయేరియాను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని తింటే మలబద్ధకం కూడా తగ్గుతుంది.

  గాయాలను తగ్గిస్తుంది.

  గాయాలను మాన్పడంలోనూ సీతాఫలం చాలా బాగా తోడ్పడుతుంది. దీనికి సీతాఫలంతో పాటు.. సీతాఫలం ఆకులు కూడా పనిచేస్తాయి. సీతాఫలం గుజ్జును లేదా ఆ ఆకుల మిశ్రమాన్ని గాయాలు అయిన ప్రదేశంలో పూయడం వల్ల తొందరగా గాయాలు తగ్గిపోతాయి.

  గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు పోషకాలనిస్తుంది.

  సీతాఫలం కళ్లు తిరగడం, వాంతులు వంటివి తగ్గేలా చేస్తుంది. అంతేకాదు... ఇందులోని కాపర్ గడువుకు ముందే నొప్పులు రాకుండా చేస్తుంది. అంతేకాదు.. ఐరన్ స్థాయులను పెంచి గర్భస్థ పిండం పెరుగుదల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు.. రోజూ ఓ సీతాఫలం తీసుకున్నవారిలో గర్భస్థ పిండం మెదడు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది.

  చెడు కొలెస్ట్రాల్‌‌ని తగ్గిస్తుంది

  సీతాఫలంలో నియాసిన్ అనే విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది. దీంతో పాటు సీతాఫలంలో ఎక్కువగా ఉండే ఫైబర్ కూడా కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఈ ఫైబర్ మన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.

  అందానికి సీతాఫలం అందించే ప్రయోజనాలు

  సీతాఫలం వల్ల మన శరీరంతో పాటు చర్మం, జుట్టు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతాయి. అవేంటంటే..

  ఎగ్జిమా, సొరియాసిస్‌ని తగ్గిస్తుంది.

  ఎగ్జిమా, సొరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఉంటే సీతాఫలం తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. రెగ్యులర్‌గా తగిన మోతాదులో సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కేవలం దీన్ని తినడం వల్లనే కాదు. ఈ చెట్టు బెరడు నుంచి వచ్చే జిగురు కూడా.. చర్మ సమస్యలను తగ్గిస్తుందట. ఈ జిగురును చర్మ సమస్యలు ఉన్న చోట పూయడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి.

  చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.

  సీతాఫలంలోని విటమిన్లు, మినరల్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ముడతల్లేకుండా చేస్తాయి. అంతేకాదు.. మన చర్మంలోని కొల్లాజెన్ బంధాలు బలంగా మారేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

  మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.

  చర్మం ఆరోగ్యంగా మెరవాలంటే మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండాలి. సీతాఫలంలో వీటితో పాటు ఎన్నో మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి చరర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మొటిమలను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. చర్మరంధ్రాలను శుభ్రంగా ఉంచి యాక్నే, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి రాకుండా చేస్తాయి.

  చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.

  సీతాఫలంలో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మంలో ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ని తగ్గిస్తాయి. అంతేకాదు.. సూర్య కిరణాల నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. అంతేకాదు.. సీతాఫలం కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహించి చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. అలాగే సీతాఫలాలు ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించడంతో పాటు.. పిగ్మంటేషన్‌ని కూడా తగ్గిస్తాయి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల.. ఇవి చర్మాన్ని తేమతో నింపుతాయి.

  జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది.

  సీతాఫలం గింజల నుంచి తీసిన నూనె.. జుట్టును చాలా అందంగా మార్చడంతో పాటు మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు.. సీతాఫలంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి.. దీన్ని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.

  జుట్టు రాలడం తగ్గిస్తుంది.

  సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కాపర్ ఎక్కువగా ఉండడం వల్ల.. అవి ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ని తగ్గించి జుట్టును తెల్లబారకుండా కాపాడుతాయి. దీంతో పాటు ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల.. జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు పొడవుగా పెరుగుతుంది.

  సీతాఫలాన్ని ఎలా తీసుకోవాలంటే..

  - సీతాఫలాన్ని నేరుగా తీసుకోవడంతో పాటు.. వివిధ రకాల ఆహార పదార్థాల్లోనూ భాగం చేసుకోవచ్చు. నేరుగా అయితే.. బాగా పండిన సీతాఫలాన్ని తీసుకొని.. దానిని రెండు భాగాలు చేసి నోట్లో పెట్టుకొని గింజలు వూస్తూ తినొచ్చు. లేదా స్పూన్ సాయంతో గింజలను తొలగించి మిగిలిన భాగాన్ని తినొచ్చు.

  - సీతాఫలం రుచిని ఇష్టపడని వారు ఉండరు. కానీ ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొడితే.. దానిపై కాస్త ఉప్పు జల్లి, నిమ్మరసం పిండి తీసుకోవచ్చు.

  - తెలంగాణ, ఆంధ్రకి చెందిన కొన్ని ప్రాంతాల్లో.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీతాఫలాలు పండకముందే వాటిని కాల్చి నల్లగా మారిన తర్వాత.. లోపలి గుజ్జును తింటుంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది కూడా.

  - సీతాఫలాలను వివిధ వంటకాల్లో భాగంగా తీసుకోవచ్చు. సీతాఫల్ కలాకండ్, ఖీర్, కేక్స్, మఫిన్స్ వంటివన్నీ ఇందులో భాగమే.

  - దీన్ని పాలు లేదా పెరుగుతో పాటు మిక్సీలో గ్రైండ్ చేయచ్చు. ఆ మిశ్రమం తింటే చాలా రుచిగా ఉంటుంది.

  సీతాఫలం హెయిర్ ప్యాక్స్

  చుండ్రును తగ్గించడం నుంచి పేలను దూరం చేయడం వరకూ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది సీతాఫలం. మరి, ఈ ప్రయోజనాలను అందేందుకు వీటిని కేవలం తినడం మాత్రమే కాదు.. ఇలా హెయిర్ ప్యాక్స్‌గానూ ప్రయత్నించి చూడండి.

  సీతాఫలం, నూనెతో..

  కావాల్సినవి
  సీతాఫలం - ఒకటి
  నూనె - తగినంత

  తయారీ
  సీతాఫలం పైనున్న తొక్కను తీసి మిక్సీలో వేసి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. తర్వాత అందులో మీ జుట్టు పొట్టిదైతే ఒక టేబుల్ స్పూన్.. పెద్దదైతే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఓ గంట పాటు ఉంచుకొని తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.

  ప్రయోజనాలు
  ఇలా వారానికి మూడు సార్లు తలకు నూనెను పట్టించి తలస్నానం చేయడం వల్ల.. కొద్దిరోజుల్లోనే చుండ్రు తొలగిపోతుంది. సీతాఫలం తిన్న తర్వాత.. మిగిలిన తొక్కలతోనే ఈ ప్యాక్ వేసుకుంటాం కాబట్టి.. వృథా కూడా ఏమీ ఉండదు. పైగా దీనివల్ల జుట్టులోనూ తేమ పెరుగుతుంది.

  సీతాఫలం గుజ్జుతో..

  కావాల్సినవి
  సీతాఫలం - ఒకటి

  తయారీ
  సీతాఫలాన్ని గింజలు తీసి మిగిలిన భాగాన్ని మొత్తం మిశ్రమంగా చేసుకోవాలి. ఈ గుజ్జును జుట్టుకు అప్లై చేసుకోవాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసుకొని అరగంట పాటు ఉంచుకొని తలస్నానం చేయాలి.

  ప్రయోజనాలు
  సీతాఫలంలోని గుణాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. జుట్టు మాయిశ్చరైజ్ అవ్వడానికి తోడ్పడతాయి.

  సీతాఫలం గింజల పొడితో..

  కావాల్సినవి
  సీతాఫలం గింజలు - గుప్పెడు
  నీళ్లు - తగినన్ని

  తయారీ
  సీతాఫలం గింజలను మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

  ప్రయోజనాలు
  తరచూ ఈ గింజల పేస్ట్‌ని తలకు పట్టించడం వల్ల పేల సమస్య తగ్గిపోతుంది. చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటివన్నీ తగ్గిపోతాయి.

  సీతాఫలం ఫేస్ ప్యాక్స్

  సీతాఫలం కేవలం జుట్టుకే కాదు.. చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అవి అందుకునేందుకు సీతాఫలాన్ని ఎలా ఉపయోగించాలంటే..

  సీతాఫలం, నిమ్మరసంతో..

  కావాల్సినవి
  సీతాఫలం గుజ్జు - నాలుగు టీస్పూన్లు
  నిమ్మరసం - నాలుగైదు చుక్కలు

  తయారీ
  సీతాఫలం గుజ్జులో నిమ్మరసం వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఆ పేస్ట్‌ని ముఖానికి రాసుకొని.. పదిహేను నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

  ప్రయోజనాలు
  సీతాఫలంలోని గుణాలకు, నిమ్మరసంలోని ఆస్ట్రింజెంట్ గుణాలు కలిసి అవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మంపై మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తాయి.

  సీతాఫలం, పసుపు ఫేస్ ప్యాక్

  కావాల్సినవి
  సీతాఫలం - ఒకటి
  పసుపు - చిటికెడు

  తయారీ
  సీతాఫలాన్ని ఒలిచి గింజలు, తొక్కలు తొలిగించాలి. మిగిలిన మిశ్రమాన్ని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. ఈ గుజ్జులో పసుపు కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. పావుగంట పాటు ఉంచుకొని చన్నీళ్లతో కడిగేసుకోవాలి. పసుపు రంగు ఇష్టంలేని వారు ఫేస్ వాష్ ఉపయోగించవచ్చు.

  ప్రయోజనాలు
  సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్లు, పసుపులోని యాంటీబయోటిక్ గుణాలతో కలిసి.. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు మొటిమల మచ్చలు, పిగ్మంటేషన్ వంటివి ఉంటే వాటిని కూడా తొలగిస్తాయి.

  సీతాఫలం, చక్కెరతో స్క్రబ్

  కావాల్సినవి
  సీతాఫలం - ఒకటి
  చక్కెర - రెండు టీస్పూన్లు

  తయారీ
  ముందుగా సీతాఫలాన్ని గింజలు, తొక్కలు తీసేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. ఈ గుజ్జును ముఖానికి అప్లై చేసుకొనేముందు.. అందులో కొంత చక్కెర వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసుకొని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఐదు నిమిషాల పాటు చేసిన తర్వాత.. మరో పది నిమిషాల పాటు ఉంచుకొని గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

  ప్రయోజనాలు
  సీతాఫలంలోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మెరుపును తీసుకొస్తాయి. చక్కెర మంచి స్క్రబ్‌లా పనిచేసి డెడ్ స్కిన్‌ని తొలగిస్తుంది. దీంతో చర్మానికి మంచి మెరుపు అందుతుంది.

  తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు

  1. సీతాఫలాన్ని గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోవచ్చా?

  సీతాఫలంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఎంతో అవసరం. ముఖ్యంగా ఇందులోని కాపర్ మన శరీరం హిమోగ్లోబిన్ తయారుచేసుకునేలా చేస్తుంది. కడుపులో బిడ్డ పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. కాబట్టి గర్భిణులు దీన్ని ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. అయితే గింజల విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. పాలిచ్చే తల్లులకు కూడా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, క్యాల్షియం వంటివి అవసరమవుతాయి. కాబట్టి వారు కూడా దీన్ని తీసుకోవచ్చు.

  2. డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలాన్ని తీసుకోవచ్చా?

  సీతాఫలంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. దాన్ని డయాబెటిస్ ఉన్నవారు తినకూడదు అని అంతా భావిస్తుంటారు. కానీ సీతాఫలం గ్లైసిమిక్ ఇండెక్స్ 54. గ్లైసిమిక్ లోడ్ 10.2 కాబట్టి.. దీన్ని తీసుకోగానే రక్తంలోని చక్కెర స్థాయులు పెరిగే అవకాశాలు తక్కువ. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.

  3. సీతాఫలం గింజలు విషపూరితమా? వాటిని అనుకోకుండా తింటే ఏమవుతుంది?

  సీతాఫలం గింజల్లో ఎన్నో టాక్సిన్లు ఉంటాయి. అవి మన శరీరానికి విషంలా పనిచేస్తాయి. గర్భిణులు వీటిని తినడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలుంటాయి. ఒకవేళ ఈ గింజల రసం కళ్లల్లో పడితే.. కంటిచూపు మందగించే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే దీన్ని జుట్టుకు పెట్టడం వల్ల పేలు, బ్యాక్టీరియా వంటివి తగ్గుతాయి. కాబట్టి సీతాఫలం తినేటప్పుడే జాగ్రత్తగా గింజలను కూడా తీసి తినాలి. అనుకోకుండా ఒకటీ రెండు గింజలు తింటే ఫర్వాలేదు. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ వీటిని జీర్ణం చేసుకోలేదు కాబట్టి.. అవి తిరిగి మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి.

  4. సీతాఫలం తినడం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

  అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఏదైనా సరే.. ఆహారం ఎక్కువగా తీసుకుంటే దానివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సీతాఫలం కూడా అలాంటిదే. దీన్ని మోతాదు ప్రకారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో.. ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఈ పండ్లను తీసుకోవడం వల్ల.. ఎక్కువగా బరువు పెరగడం, ఐరన్ ఎక్కువగా అందడం వల్ల అల్సర్లు రావడం వంటివి జరుగుతాయి. ఇక పొటాషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గిపోయి గుండె సంబంధిత సమస్యలు రావడం.. కళ్లు తిరగడం, డీహైడ్రేషన్ వంటివి కూడా ఎదురవుతాయి. అంతేకాదు.. ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోవడం మన శరీరానికి మంచిది కాదు. కాబట్టి సీతాఫలాలను రోజుకు రెండు లేదా మూడు వరకూ మాత్రమే తీసుకోవడం మంచిది.

  POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

  క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.