ఇంట్లో ఈ మొక్కలు పెంచితే చాలు.. సమస్యలే ఉండవట ..!

ఇంట్లో ఈ మొక్కలు పెంచితే చాలు.. సమస్యలే ఉండవట ..!

భారతీయ సంప్రదాయం ప్రకారం వాస్తుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే ఈ వాస్తు శాస్త్రంలో (Vastu) కేవలం ఇంటి నాలుగు గోడలు ఎలా ఉండాలో మాత్రమే చెప్పలేదు. ఇంట్లో ఉండాల్సిన, ఉండకూడని మొక్కలు, (plants) చెట్ల గురించి కూడా ప్రస్తావన ఉంది. భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం.. మనం జీవించేందుకు ఆహారం, నీరు, గాలి ఎంతగా అవసరమో.. మన చుట్టూ పచ్చని చెట్లు ఉండడం కూడా అంతే అవసరమని చెబుతారు.

ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే.. ఆరోగ్య సమస్యలు కూడా మన దరి చేరవట. అయితే ప్రతి ఇంట్లోనూ చెట్లు నాటడానికి గార్డెన్ ఉండదు కాబట్టి.. కొన్ని మొక్కలకైనా తప్పనిసరిగా చోటు కల్పించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి, ఇంట్లో తప్పక పెంచుకోవాల్సిన.. ఆ మొక్కలేంటో తెలుసుకుందామా?

చెట్లు, మొక్కలు మనం జీవించడానికి ఎంతో అవసరం. ఇంట్లో పచ్చని చెట్లు ఉండడం వల్ల మన గ్రహ స్థితి బాగుంటుందని.. దుష్ట శక్తుల నుంచి అవి మనల్ని దూరంగా ఉంచుతాయని చాలామంది నమ్మకం. ప్రస్తుతం చాలామంది చెట్లను.. తమ ఇంటి డెకరేషన్‌లో భాగంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. మనం పెంచుకునే ప్రతి మొక్క మన ఇంటిని అందంగా మార్చగలదేమో కానీ.. నెగెటివ్ ఎనర్జీని మాత్రం దూరం చేయలేదు.

పైగా కొన్ని రకాల మొక్కలు  నెగెటివ్ ఎనర్జీని బాగా ఆకర్షిస్తాయి కూడా. అలాంటి వాటి జోలికెళ్లకుండా.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపే మొక్కలకే చోటు కల్పించాలి. అలాంటి మొక్కలు మనల్ని ఆకర్షించి.. మనలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు వ్యాధులను కూడా దూరంగా చేస్తాయి.

తులసి

ఇంట్లో తులసి మొక్క లేని ఇళ్లు చాలా తక్కువగానే ఉంటాయి. మన దేశంలో అందరూ పూజించే మొక్కల్లో ముఖ్యమైంది ఇదే. ఈ మొక్కకి ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని బయటకు పారదోలే శక్తి కూడా ఉంటుందట. దీన్ని క్వీన్ ఆఫ్ మెడిసిన్స్, హెర్బ్ క్వీన్ అనే పేర్లతో పిలుస్తారు. అంటే ఇంటి వైద్యానికి ఉపయోగపడే మొక్కల్లో ఇది చాలా ముఖ్యమైనదన్నమాట.

తులసి ఆకులు, పువ్వుల్లో ఎన్నో రకాల కెమికల్ ఎలిమెంట్స్ ఉంటాయట. ఇవి వివిధ రకాల వ్యాధులను రాకుండా చేయడంతో పాటు.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను తొలిగిస్తాయట. అందుకే తులసి ఆకులను వివిధ రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. కేవలం తులసి ఆకులనే కాదు.. కాండం, పువ్వులు, గింజలు.. ఇలా అన్ని భాగాలను నేచురోపతి, ఆయుర్వేద చికిత్సలలో ఉపయోగిస్తారు. అటు క్యాన్సర్ నుంచి ఇటు జలుబు వరకూ.. ప్రతి పెద్ద, చిన్న వ్యాధులను తగ్గించడంలో తులసి ప్రధాన పాత్ర పోషిస్తుంది. 

మల్లె

మల్లె మొక్క ఇంట్లో ఉండడం కూడా ఎంతో ప్రత్యేకమనే చెబుతారు. ఈ మొక్క చక్కటి వాసనతో ఇంటిని నింపేయడం మాత్రమే కాదు.. పూజకు కూడా ఉపయోగపడుతుంది. మల్లెలో చాలా రకాలున్నాయి. వీటిలో ఏ రకానైనా మీరు పెంచుకోవచ్చు. ఈ మొక్కను కాస్త సూర్యరశ్మి తగులుతూ.. నీడ ఎక్కువగా ఉండే ప్రదేశంలో పెంచుకోవాలి. దీని వాసన అద్భుతమే కాదు.. ఇందులోని గుణాలు కూడా అద్భుతం. అందుకే మల్లెను అరోమా థెరపీలో ఉపయోగిస్తారు. మల్లె చర్మ సంబంధిత సమస్యలను మాత్రమే కాదు.. చెవి నొప్పిని కూడా తగ్గించడంలో తోడ్పడుతుంది.

ఉసిరి

మీ ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే.. మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి. అంతేకాదు.. ఇంట్లోని ఈశాన్య మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిదట. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు బాధలను కూడా తగ్గిస్తుందట.

మనీ ప్లాంట్

ఇంట్లో పెంచుకునే మొక్కల్లో.. ఎక్కువ మంది ఉపయోగించే మొక్క మనీ ప్లాంట్. ఈ మొక్కను చాలామంది ఇండోర్ ప్లాంట్‌గా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇంటిని అందంగా కనిపించేలా చేయడంతో పాటు.. మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అలాగే గాలిని శుభ్రం చేస్తుంది.

వాస్తు ప్రకారం కూడా.. ఇంట్లో మనీ ప్లాంట్స్‌ను పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయట. ఈ మొక్క ఎంత పచ్చగా ఉంటే.. ఇంటి ఆదాయం కూడా అంత మెరుగ్గా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతారు. అందుకే ఈ మొక్కను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా భావిస్తారు.

అందుకే దీన్ని మనీ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ మొక్కను ఆగ్నేయంలో నాటడం వల్ల.. ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయట.

జమ్మి

ఇది నవగ్రహాలతో సంబంధం ఉన్న చెట్లలో ఒకటి. దీని గురించి చాలా పురాణాల్లో కూడా లేఖనాలు కనిపిస్తాయి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఇంట్లో జమ్మి చెట్టుని నాటి దాన్ని పూజించాలట. ఇది కూడా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. దీన్ని ఇంటి గుమ్మానికి ఎడమ వైపు ఉన్న.. ఖాళీ ప్రదేశంలో నాటడం మంచిది. ఈ చెట్టు ఎవరి ఇంట్లో ఉంటుందో వారు అప్పులు, బాధలు, వ్యాధుల నుండి బయటపడతారు. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో జీవితాన్ని గడుపుతారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.