నా జీవితంలో సమయం (time) అనేక గాయాలను మాన్పుతుందని.. ఓ విలువైన పాఠం నేర్చుకున్నా. నా కెరీర్ విషయంలో అయితేనేం.. ఇతరులతో నాకు ఏర్పడే గొడవలు, నేను ఫీలయ్యే ఎమోషన్స్ వంటివి తగ్గడానికి అయితేనేం.. ఏ విషయంలోనైనా సమయమే సరైన సమాధానం అని నేను భావించేదాన్ని. మనసులోని బాధలను తగ్గించే శక్తి కూడా దానికి ఉందని నేను నమ్మేదాన్ని. అదే నిజమని.. నా జీవితంలో ఎదురైన ప్రేమ నాకు చాటి చెప్పింది.
నాకు 19 సంవత్సరాల వయసున్నప్పుడు అతడిని కలిశాను. మేమిద్దరం ఒకే కాలేజీ.. ఒకే బ్రాంచీ. టీం ప్రజెంటేషన్స్ సమయంలో.. అలాగే క్లాసులు జరిగేటప్పుడు అతడిని చూశాననుకుంటా. కానీ నాకు తన ముఖం అంతగా గుర్తు లేదు. ఒకసారి తను విచిత్రమైన డ్యాన్స్ చేస్తుంటే చూసి నవ్వుకున్నా. ఆ తర్వాత ఓ పార్టీలో తను నన్ను వైన్ తాగుతూ.. నవల చదువుతుండడం చూశాడు
చూడగానే నా దగ్గరికి వచ్చి “వైన్, విలియమ్స్ షేక్ స్పియర్ నవల.. ఈ రెండింటి కాంబినేషన్ కంటే టార్చర్ ఇంకొకటి ఉంటుందా?” అంటూ నవ్వుతూ నన్ను కామెంట్ చేశాడు. అప్పుడే నేను తనని మొదటిసారి దగ్గరిగా చూడడం. ఆ తర్వాత ఓ గంటసేపు.. మేమిద్దరం మాట్లాడుకున్నాం. తనకు కూడా నవలలను చదివే అలవాటు ఉందని తెలిసి.. మా ఇద్దరికీ నచ్చిన ఓ నవల గురించి మాట్లాడుకున్నాం.
అప్పుడే నాకు అర్థమైంది. అతను నా మాటల కంటే.. నన్ను చూడడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడని. ఆ తర్వాత ఆకాశంలోని తారలన్నీ మమ్మల్ని కలిపినట్లు.. మేమిద్దరం కలిశాం. మా ఇద్దరి అభిప్రాయాలు, ఆసక్తులు, ఇష్టాలు అన్నీ వేరు. కానీ అవి మమ్మల్ని ప్రేమలో పడకుండా చేయలేదు.
ఆ తర్వాత వందలాది డేట్లు, టూర్లు, లాంగ్ డిస్టెన్స్ ప్రేమలు.. అన్నింటినీ మించి వివిధ నగరాల్లో ఉద్యోగాలు .. వీటన్నింటి మధ్య మేమిద్దరం 10 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే.. మేమిద్దరం ఒకరినొకరం పిచ్చిగా ప్రేమించుకున్నాం. నా 29వ పుట్టిన రోజున.. నన్ను పెళ్లి చేసుకుంటానని తను ప్రపోజ్ చేశాడు. అప్పుడు తనకోసం ఏం చేయడానికైనా.. నేను సిద్ధంగా ఉన్నా. మా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ .. ఎంతో ఆనందంగా గడుపుతూ ఉండిపోయాం.
అయితే నా జీవితంలోనే అత్యంత ఆనందాన్ని పంచిన ఆ రోజు.. అదే సమయంలో బాధాకరమైన రోజుగా మారుతుందని నేను ఊహించలేకపోయాను. కారణం.. ఎప్పటినుంచో తన కుటుంబం నన్ను ఇష్టపడట్లేదట. వాళ్లు నన్ను ఇష్టపడేందుకు ఏం చేయాలో.. అవన్నీ నేను చేశాను.
కానీ వారి నుంచి మాత్రం తగిన రెస్పాన్స్ ఎప్పుడూ రాలేదు. నన్ను చూసి వాళ్లు పలకరించే విధానం కూడా.. ఎంతో ఫేక్‌గా ఉండేది. ఆ విషయం పెళ్లి గురించి మాట్లాడేందుకు వెళ్లినప్పుడే తెలిసింది. వాళ్లు నన్ను మాత్రమే కాదు.. నా కుటుంబాన్ని కూడా ఇష్టపడట్లేదని. మేం వారిలా.. ఉన్నత కుటుంబానికి చెందినవాళ్లం కాకపోయినా.. మాకూ సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉంది.
అలాంటి మా అమ్మానాన్నలను.. వారికి నచ్చిన ప్రశ్నలు వేస్తూ ఇబ్బందికి గురిచేశారు. మా వాళ్లు నాకోసం అదంతా భరించారు. ఆ తర్వాత నాకు మరో షాక్ తగిలింది. పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరిపించాలని వారు కోరారు. వారి బంధువులకు ఖరీదైన బహుమతులు, కానుకలు ఇవ్వాలని ఆర్డర్ వేశారు. నేను కూడా పెళ్లిలో ఖరీదైన నగలు మాత్రమే ధరించాలని పూసగుచ్చినట్లు చెప్పారు. పదేళ్లు నన్ను ప్రేమించిన వ్యక్తి మాత్రం.. ఇవేవీ పట్టించుకోలేదు. ఇవన్నీ మూములు విషయాలే అన్నట్లు.. తను ప్రవర్తించాడు. ఓ పక్క నిలబడి చూడడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఈ విషయం నన్ను ఎంతగానో బాధపెట్టింది.
అప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఆ ఇంటికి నేను కోడలిగా వెళ్తే.. నా పరిస్థితి ఎలా ఉంటుందోనని. ఆ వ్యక్తులతో కలిసి చేసే ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుందో కూడా అర్థమైంది. అంతకు మించి.. నేను ప్రేమించిన వ్యక్తి నాకు ఏమాత్రం కూడా సహకారం అందించడని అర్థమైంది. ప్రేమ ఒక్కటే కాదు.. గౌరవం కూడా అవసరమేనని నేను అప్పుడు తెలుసుకున్నాను.
అలా అనుకున్నదే తడవుగా ఇంటికొచ్చేశాను. రెండు రోజుల పాటు తన కోసం నిరీక్షించాను. తను నాకు క్షమాపణ చెబుతాడని అనుకున్నాను. అలాగే మెసేజ్‌లు , కాల్స్ వస్తాయని కూడా భావించా. నేను మామూలుగా ముభావంగా ఉన్నప్పుడు.. నన్ను బతిమాలినట్లు బతిమాలతాడని కూడా భావించా. నాకోసం వాళ్ల కుటుంబంతో తను పోరాడతాడని.. మమ్మల్ని అంత అవమానించినందుకు.. ఇళ్లు వదిలి వచ్చేసేందుకు కూడా సిద్ధమవుతాడని నేను అనుకున్నాను. కానీ వారం రోజుల పాటు.. అస్సలు కాల్స్ లేదా మెసేజ్‌లు రాలేదు. ఏడో రోజు తన దగ్గరి నుంచి ఓ ఉత్తరం మాత్రం వచ్చింది.
‘సారీ’ చెప్తాడేమో అనుకొని దానిని ఓపెన్ చేశాను. “మీ అమ్మానాన్నలు ఏం నిర్ణయించుకున్నారు ?” అని మాత్రమే ఆ మెసేజ్‌లో ఉంది. విషయం ఇంత దూరం వచ్చాక.. “తనకి లేకపోయినా.. నాకైనా బుద్ధుండాలని” భావించాను. వెంటనే తనకు బ్రేకప్ చెప్పేశాను.
ఆ తర్వాత సమయం నా గాయాన్ని మానేలా చేయడమే కాదు.. నేను ఆనాడు ప్రేమించిన వ్యక్తి కంటే.. ఎన్నోరెట్లు గొప్ప వ్యక్తిని నా జీవితంలోకి తీసుకొచ్చింది. నా బ్రేకప్ అయిన రెండేళ్ల తర్వాత.. మా నాన్న తన ఫ్రెండ్ కొడుకును నాకు పరిచయం చేశాడు.
మా ఇద్దరికీ ఉన్న కామన్ ఇష్టాలు ఆహారం, ట్రావెల్, అడ్వెంచర్స్. ఇవన్నీ మమ్మల్ని మరింత దగ్గరయ్యేలా చేశాయి. ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం జీవితంలోనే కాదు.. వ్యాపారంలో కూడా భాగస్వాములయ్యాం. నేను ఇప్పుడు మా అత్తమామలతో కలిసే ఉన్నాను. వారు నన్ను.. అమ్మానాన్నల కంటే ఎక్కువ ప్రేమతో చూస్తారు. నా భర్త కోసం నేను వేచి చూసిన సమయం ఎక్కువే అయినా.. మంచి జరగాలంటే వేచి చూడడంలో తప్పులేదనిపించింది. ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా చెప్పగలను.. పది సంవత్సరాలు (10 years) ప్రేమించిన ఆ వ్యక్తిని వదిలేయడం.. నా జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ (Decision) అనేది నా ఫీలింగ్.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.