బర్త్ డే స్పెషల్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.. టాప్ 20 ఆసక్తికర విశేషాలు..!

బర్త్ డే స్పెషల్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.. టాప్ 20 ఆసక్తికర విశేషాలు..!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా తనకంటూ ఉన్న గుర్తింపును పక్కన పెట్టి.. స్వయంగా ఒక ఇమేజ్ సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్. హిట్, ఫ్లాప్ అనే విషయాలను పక్కన పెడితే.. ఆయన సినిమాలకంటూ ఒక ప్రత్యేకత ఉంది. కెరీర్‌లో ఆయన ఎన్ని భారీ విజయాలు చూశారో.. అన్నే అపజయాలు కూడా చూశారు. నటుడిగా రాణించినా.. దర్శకుడిగా కూడా ప్రయత్నించారు.

పవన్ మంచి సాహితీ పిపాసి కూడా. ఒకప్పుడు తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో "యువ రాజ్యం" బాధ్యతలు స్వీకరించినా.. ఆ పార్టీ సక్సెస్ కాకపోవడంతో కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు పవన్. ఆ తర్వాత జనసేన పేరుతో తానే స్వయంగా పార్టీ స్థాపించారు.

పవన్ కళ్యాణ్‌కు నేడు లక్షలమంది అభిమానులున్నారు. ఆయన పేరు మీద అనేక అభిమాన సంఘాలూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకవేళ పవన్ సినిమాలు చేస్తానని మాటివ్వాలే గానీ.. ఆయన ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే ఉండవు. 

ఈ రోజు పవన్ కళ్యాణ్ 49వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఆయన జీవన ప్రస్థానంలో ఆసక్తికరమైన విషయాలు మీకోసం

* పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. సెప్టెంబరు 2, 1971లో బాపట్లలో జన్మించిన పవన్.. కేవలం ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్స్‌లో డిప్లొమా చేశారు. తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద మక్కువతో.. అందులో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు. 

* 1996లో "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన పవన్ కళ్యాణ్.. తన తొలి చిత్రం యావరేజ్‌గా ఆడినా.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. 

* గోకులంలో సీత, సుస్వాగతం లాంటి సినిమాలు చేసినా.. ఆ తర్వాత రిలీజైన "తొలి ప్రేమ" చిత్రం పవన్ కళ్యాణ్ జీవితాన్నే మార్చింది. ఆ సంవత్సరం విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాలలో "తొలి ప్రేమ" కూడా ఒకటి.  ఈ చిత్రం 21 సెంటర్లలో 100 రోజులు, రెండు సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు కూడా గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రం 6 నంది అవార్డులను కైవసం చేసుకోవడం గమనార్హం. 

* 2003లో పవన్ కళ్యాణ్ నటించి, దర్శకత్వం వహించిన "జానీ" చిత్రం విడుదలైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం.. అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. 

*పవన్ కళ్యాణ్ ఇప్పటికి తన కెరీర్‌లో ఉత్తమ నటుడిగా ఒకే ఒక్క ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. 2012లో విడుదలైన  "గబ్బర్ సింగ్" చిత్రానికి ఆయన ఆ అవార్డు పొందారు. 

 

 

* పవన్ కళ్యాణ్ గొప్ప సాహితీ పిపాసి. 1922లో హెర్మన్ హెస్సే రాసిన బుద్ధుని జీవిత చరిత్ర "సిద్ధార్థ" ఆయనకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి. అలాగే రాబర్ట్ స్కబోడా రాసిన అఘోరా, మైఖేల్ మార్పుగో రాసిన షాడో, శివాజీ సావంత్ రాసిన యుగంధర్ మొదలైనవి కూడా పవన్ అభిమాన పుస్తకాలే. తెలుగు సాహిత్యమంటే కూడా పవన్‌కు ఎంతో మక్కువ. గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన "ఆధునిక మహాభారతం" కొత్త ఎడిషన్‌కు పవన్ ఆర్థిక సహాయం చేశారు.

* అమితాబ్ బచ్చన్, ఎస్వీ రంగారావులను తన అభిమాన నటులుగా పవన్ గతంలో పేర్కొన్నారు. అల్ పాసినో, రాబర్డ్ డీ నిరో లాంటి హాలీవుడ్ నటులు కూడా పవన్‌కు ఇష్టమే.

*అలాగే జపనీస్ దర్శకుడు అకీరా కురసోవా చిత్రాలంటే పవన్‌కు అమితమైన మక్కువ. అందుకే తన బిడ్డకు కూడా అకీరా అని పేరు పెట్టుకున్నారు. 

* సావిత్రి తన అభిమాన నటి అని తెలిపే పవన్ కళ్యాణ్.. రేలంగి, సూర్యకాంతం హాస్యాన్ని కూడా ఇష్టపడతారు. 

* అలాగే మణిరత్నం సినిమాలంటే కూడా పవన్ కళ్యాణ్‌కు చాలా ఇష్టం. అలాగే పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీని కూడా ఇష్టపడతారు. 

బర్త్‌డే స్పెషల్ : మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలోని.. 10 కీలక మైలురాళ్లు ..!

 

* పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన నాయకుడు "చేగువేరా". ఆయనే తనకు రాజకీయాల్లో స్ఫూర్తి అని పవన్ గతంలో పలు మార్లు తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందే.. పవన్ కళ్యాణ్ "కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్" అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. 


* తన సినిమాల్లో అప్పుడప్పుడు హిందీ, ఇంగ్లీష్ పాటలకు కూడా స్థానమిస్తుంటారు పవన్. బద్రి చిత్రంలోని "ఐ యామ్ ఏన్ ఇండియన్"..  అలాగే  తమ్ముడు సినిమాలోని "లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్" అనే పాటలే అందుకు ఉదాహరణ.

* పవన్ కళ్యాణ్ ఇప్పటికి తన కెరీర్‌లో అత్యధికంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మూడు సినిమాలు (జల్సా, అత్తారింటికి దారేది, అజ్నాతవాసి) చేయగా.. కరుణాకరన్‌తో రెండు చిత్రాలు (తొలిప్రేమ, బాలు).. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రెండు చిత్రాలు (బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు).. భీమనేని శ్రీనివాసరావుతో రెండు చిత్రాలు (సుస్వాగతం, అన్నవరం) .. కిషోర్ కుమార్ పార్థసానితో (గోపాల గోపాల, కాటమరాయుడు), ఎస్ జే సూర్యతో  రెండు చిత్రాలు (ఖుషీ, కొమరం పులి) చేశారు.


* కొత్త దర్శకులతో కూడా పవన్ అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు. గుడుంబా శంకర్ (వీరశంకర్), బంగారం (ధరణి), పంజా (విష్ణువర్థన్) లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ.

* ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన తొలుత 1997లో నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తర్వాత ఆమెకు విడాకులిచ్చి.. 2009లో నటి రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నారు.  పవన్ కళ్యాణ్ నటించిన బద్రి, జానీ చిత్రాలలో ఆమె కథానాయికగా నటించారు. తర్వాత ఆమెకు కూడా విడాకులిచ్చి.. రష్యన్ వనిత అన్నా లెజ్నెవాని వివాహం చేసుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" మేకింగ్ వీడియోలో.. హైలైట్స్ ఇవే..!

 

* 2013, 2017, 2018 సంవత్సరాలలో "ఫోర్బ్స్ టాప్ 100 ఇండియన్ సెలబ్రిటీస్" జాబితాలో పవన్ కళ్యాణ్ కూడా స్థానం సంపాదించుకున్నారు. 

* 2014లో "జనసేన" పార్టీని సంపాదించిన పవన్ కళ్యాణ్.. పలు సంవత్సరాలు తర్వాత.. ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా మారనున్నట్లు తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తాను కూడా స్వయంగా పోటీ చేశారు. అయితే జనసేన ఈ ఎన్నికలలో అనుకున్నంత ప్రభావం చూపలేదు. 

* ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన ఆఖరి చిత్రం.. అజ్ఞాతవాసి. ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రం "లార్గో వించ్"ను పోలి ఉందని విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్వయానా.. ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సాలే కూడా స్పందించారు. 

* నవంబరు 2017 లో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి అంతర్జాతీయ వేదికపై పవన్ గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకున్నారు.

* అదే సంవత్సరం పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలలో చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలియజేస్తూ.. వారికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని తెలిపారు. అలాగే అవయవ దానాన్ని ప్రోత్సహించే "జీవన్ దాన్" సంస్థకు కూడా పవన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. 

"సైరా" టీజర్‌లో .. టాప్ 10 ఆసక్తికర విశేషాలు ఇవే..!