ADVERTISEMENT
home / Fitness
టాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ రకుల్.. నాజూకు శరీరం, అందం వెనుక రహస్యాలివే..!

టాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ రకుల్.. నాజూకు శరీరం, అందం వెనుక రహస్యాలివే..!

(Tollywood Actress Rakulpreet Singh Beauty and Fitness secrets)

రకుల్ ప్రీత్ సింగ్.. దిల్లీలో పుట్టి పెరిగిన పంజాబీ అమ్మాయి. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మొదటి హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్‌లో టాప్ కథానాయికగా మారింది.

అయితే సినిమాల కంటే ముందు.. టాలీవుడ్‌లో తన ఫిట్‌నెస్‌తో అందరి చూపునూ తనవైపుకి తిప్పుకున్న కథానాయిక ఆమె. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఈ భామ అందులో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది.

టైటిల్ గెలవకపోతేనేం.. తన ఫిట్‌నెస్‌తో ఎప్పుడూ బ్యూటీ పోటీలకు సిద్ధమా అన్నట్లుగా కనిపిస్తుంది రకుల్. వ్యాయామం అంటే ఎంతో ఇష్టపడే.. ఈ అందాల భామ ఫిట్‌నెస్, డైట్, బ్యూటీ  సీక్రెట్ల గురించి తెలుసుకుందాం రండి..

ADVERTISEMENT

 

రకుల్ వర్కవుట్ రొటీన్

వర్కవుట్ అంటే రకుల్‌కి చాలా ఇష్టం. ఎప్పుడూ కుదురుగా కూర్చోకుండా.. తనని తాను యాక్టివ్‌గా ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందట. వారంలో ఆరు రోజుల పాటు వర్కవుట్ చేసే రకుల్.. ఖాళీ దొరికితే చాలు.. కనీసం చిన్న చిన్న వ్యాయామాలైనా చేస్తుందట. లేదంటే అటూ ఇటూ తిరగడం అయినా చేస్తుంటుందట. ముందు నుంచే తక్కువ బరువుతో ఉన్న రకుల్.. తన ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి మాత్రమే వ్యాయామాలు చేస్తుంటుంది.

వ్యాయామం చేస్తూ చెమటోడ్చడం అంటే.. తనకెంతో ఇష్టమని చెబుతోంది రకుల్. “నాకు వ్యాయామం అంటే ఇష్టం. ఏదైనా పని ఉండి రెండు మూడు రోజులు వ్యాయామం చేయకపోతే చాలు.. నాకు ఆరోగ్యం పాడైనట్లుగా అనిపిస్తుంది. వ్యాయామం చేయకుండా నాకు రోజు గడవదు. అందుకే వారంలో ఏడు రోజులు వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తా. కుదరకపోతే ఆరు రోజులు మాత్రం తప్పనిసరిగా చేస్తాను” అంటూ చెప్పుకొస్తుంది రకుల్.

ADVERTISEMENT

కేవలం ఫిట్‌నెస్ ద్వారా అందరికీ స్పూర్తినివ్వడం మాత్రమే కాదు.. అందరినీ ఫిట్‌గా మార్చే దిశగా “ఎఫ్ 45 జిమ్ ఫ్రాంచైజీ”కి ఓనర్‌గా మారింది. ఈ ఫ్రాంచైజ్ ప్రారంభించిన సందర్భంలో.. దానికి గల కారణాన్ని కూడా వెల్లడించిందామె. తనకు కేవలం ఫిల్మ్స్, ఫుడ్, ఫిట్‌నెస్ మాత్రమే అర్థమవుతాయని.. అందుకే ఆ రంగాల్లోనే తాను ఉండాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది రకుల్. అంతేకాదు.. చాలామందికి జిమ్ అంటే  ట్రెడ్ మిల్, ఎలిప్టికల్ ట్రైనర్ వంటివి మాత్రమే కనిపిస్తాయని.. కానీ వీటితో పాటు బరువులు ఎత్తడం, తాళ్లతో, వేలాడే బార్లతో వ్యాయామం చేయడం ఎంతో అవసరమని కూడా చెబుతోంది రకుల్.  

కరాటేలో బ్లూ బెల్ట్

Instagram

మీకు తెలుసా? రకుల్ ప్రీత్‌కి కరాటే చాలా బాగావచ్చు. కరాటేలో ఆమె బ్లూ బెల్ట్ కూడా సాధించింది. మోడలింగ్‌లోకి అడుగుపెట్టకపోతే.. ఆ రంగంలోకి వెళ్లేదని స్నేహితులు అంటూ ఉంటారట. దీని గురించి ఆమె చెబుతూ.. “నేను కాలేజీలో ఉన్నప్పుడు ఫిట్‌నెస్ అంటే చాలా ఆసక్తి చూపించేదాన్ని. నా స్నేహితులైతే నువ్వు కరాటే టీచర్‌ లేదా జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌వి అవుతావు అనేవారు.

ADVERTISEMENT

చిన్నతనం నుంచి నేను ఒక్కటే ఆలోచించేదాన్ని. మన చర్మంపై దుమ్ముపడితే.. ముఖం కడుక్కుంటాం. అలాగే శరీరంలోని హానికరమైన విషతుల్యాలను బయటకు పంపాలి. లేదంటే శరీరం కూడా పాడవుతుంది. వర్కవుట్ చేయడం వల్ల కేవలం బరువు అదుపులో ఉండడం మాత్రమే కాదు.. మనల్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

నాకు వ్యాయామం అంటే ఎంతో ఇష్టం. దాన్ని నేను ఎప్పుడూ ఇబ్బందిగా భావించను” అని చెప్పే రకుల్ కార్డియో, వెయిట్ ట్రైనింగ్‌తో పాటు.. యోగా, కిక్ బాక్సింగ్ వంటివి కూడా చేస్తూ తన బాడీకి తనే అప్పుడప్పుడూ సర్ప్రైజ్ ఇస్తుంటుందట. 

రకుల్ రోజువారీ వ్యాయామం ఎలా ఉంటుందటే..

రకుల్ రోజూ ఉదయాన్నే వర్కవుట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. దానివల్ల రోజంతా ఉత్సాహంగా సాగుతుందని తన ఫీలింగ్. అలాగే వర్కవుట్‌కి ముందు వార్మప్ వ్యాయామాలు కూడా చేస్తుంది. దాని తర్వాత కార్డియో కూడా పూర్తి చేసి.. వెయిట్ ట్రైనింగ్‌కి సిద్ధమవుతుంది. ఆ తర్వాత కూల్ డౌన్ అవ్వడానికి యోగాసనాలు కూడా చేస్తుందట ఈ బ్యూటీ. వార్మప్‌లో భాగంగా స్ట్రెచింగ్ వ్యాయామాలు, జంపింగ్ జాక్స్ వంటివి చేస్తుందట. కార్డియో మామూలుగా కాకుండా.. హై ఇంటెన్సిటీ‌లో ఉండేలా చూసుకుంటుంది.

అందులో భాగంగా కిక్ బాక్సింగ్, ట్రెడ్ మిల్ పై వేగంగా పరుగెత్తడం.. ఆపకుండా స్కిప్పింగ్ చేయడం వంటివి చేస్తుంటుందట. అరగంట పాటు కార్డియో చేసిన తర్వాత.. వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తుంటుంది. దీనికోసం ఒకరోజు స్ట్రెంథెనింగ్ వ్యాయామాలతో పాటు.. లోయర్ బాడీ, అప్పర్ బాడీ వెయిట్స్, శాండ్ బ్యాగ్, టైర్, బాడీ వెయిట్ వ్యాయామాలు చేస్తుంటుంది. ఇక అవన్నీ పూర్తయ్యాక.. సూర్య నమస్కారాలతో పాటు ఇతర సులువైన యోగాసనాలు వేస్తుంది. వాటితో పాటు బాడీ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు కూడా చేస్తుందట.

ADVERTISEMENT

మిలిటరీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో.. రకుల్‌కి చిన్నప్పటి నుంచే క్రమ శిక్షణ అలవడింది. ఉదయాన్నే తెల్లవారకముందే నిద్ర లేచి.. రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటితో పాటు.. కప్పు బటర్ కాఫీ తాగి వ్యాయామం చేసేందుకు జిమ్‌కి వెళ్తుంది రకుల్. ఇప్పటివరకూ ఎన్నో బరువులు ఎత్తిన రకుల్ పర్సనల్ రికార్డ్.. 170 కేజీలు. 140 కేజీల బరువుతో.. ఐదు సార్లు డెడ్ లిఫ్ట్ చేయగలిగే సామర్థ్యం రకుల్ సొంతం.  దీనితో పాటు తాజాగా అనుష్క యోగా ఫిట్‌నెస్ సెంటర్‌లో.. ఏరియల్ యోగా నేర్చుకుంటోంది రకుల్. 

రకుల్ డైట్ ప్లాన్

Instagram

ADVERTISEMENT

సాధారణంగా చాలామంది హీరోయిన్లు, డైట్ పాటించే సమయంలో కార్బొహైడ్రేట్స్‌కి దూరంగా ఉండడం మనం చూస్తుంటాం. కానీ రకుల్ మాత్రం కార్బొహైడ్రేట్స్ కూడా ఎక్కువగానే తీసుకుంటుందట. కార్బొహైడ్రేట్స్‌కు దూరంగా ఉండడం వల్ల..  శరీరంలో సత్తువ తగ్గిపోయి.. కొవ్వును కరిగించే శక్తి కూడా తగ్గుతుందన్నది రకుల్ అభిప్రాయం.

అందుకే రోజూ ఆమె అన్నం లేదా రోటీని ఆహారంలో భాగంగా చేసుకుంటుంది. ప్రొటీన్లు, ఫ్యాట్లు, కార్బొహైడ్రేట్స్ బ్యాలన్స్‌డ్‌గా ఉన్న డైట్ తీసుకుంటే చాలు.. శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు.. అధిక బరువు సమస్య కూడా మన జోలికి రాదట. వీటితో పాటు ఉడికించిన లేదా పచ్చి కూరగాయలు తినడం రకుల్‌కి ఎంతో ఇష్టం. అయితే వేయించిన ప్యాకేజ్డ్ ఫుడ్‌తో పాటు.. స్వీట్లకు తను చాలా దూరంగా ఉంటుందట.

ఇంట్లో చేసే వంటకాలంటే ఇష్టపడే రకుల్.. షూటింగ్‌లో భాగంగా వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా తనతో పాటు ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్తుంది. తన అసిస్టెంట్‌ని అన్నం, పప్పు వండి పెట్టమని చెబుతుందట. బ్రెడ్, పిజ్జా, బిస్కట్లు, కేక్‌లు వంటివాటికి ఎంతో దూరంగా ఉండే రకుల్.. అప్పుడప్పుడూ ఆలూ పరాటాలు, గులాబ్ జామూన్లు తింటుందట.

రకుల్ రోజువారీ డైట్ ఎలా ఉంటుందంటే..

ADVERTISEMENT

Instagram

రకుల్ రోజూ ఉదయాన్నే లేవగానే.. రెండు గ్లాసుల నీళ్లు తాగుతుంది. ఆ తర్వాత బటర్ కాఫీ తాగుతుంది. ఆ తర్వాత జిమ్‌కి వెళ్లొచ్చాక.. జొన్న రొట్టె, గుడ్లు, అవకాడో మొదలైనవాటిని బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్‌లో భాగంగా.. బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయలు, పప్పు, రొట్టె, కూర, గ్రిల్ చేసిన కూరగాయలు తీసుకుంటుంది. అలాగే చికెన్, సలాడ్, చేపలు వంటివాటిని కూడా ఆహారంలో భాగం చేసుకుంటుంది. 

డిన్నర్‌లో మాత్రం సలాడ్స్, గ్రిల్ చేసిన చేపలు, కూరగాయలు వంటివి ఉండేలా చూసుకుంటుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత.. కార్బొహైడ్రేట్స్‌కి దూరంగా ఉంటుంది రకుల్. వీటితో పాటు విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటుందట. వీటితో పాటు రాశి చౌదరి చెప్పిన ‘విటమిన్ సి’ సిరప్, గ్లుటమైన్ వంటివి కూడా తీసుకుంటుందట.

ఇవి తన శరీరంలో కొవ్వు కరగడానికి మాత్రమే కాకుండా.. తన చర్మం మెరుస్తూ ఉండేందుకు కూడా తోడ్పడతాయని ఆమె చెబుతోంది. సాధారణంగా భోజనం మధ్యలో స్నాక్స్ తినడానికి.. రకుల్ పెద్దగా ఆసక్తి చూపించదు. అయితే బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం చిలగడదుంప, అవకాడోతో పాటు డ్రైఫ్రూట్స్ తినడానికి మొగ్గు చూపిస్తుందట. 

ADVERTISEMENT

సినిమా కోసం ప్రత్యేకం..

Instagram

సాధారణంగా కడుపు మాడ్చుకోవడానికి రకుల్ చాలా వ్యతిరేకం. డైట్ అంటే కడుపు నిండా.. ఆరోగ్యకరమైన ఆహారం తినడం.. వ్యాయామం చేయడం అని చెబుతోంది ఆమె. అయితే సినిమా కోసం ఏం చేయాలన్నా.. దానికి సిద్ధంగా ఉంటుంది తను. ‘పరేషానురా’ పాట కోసం.. సన్నని నడుముతో మెరిసిపోవాల్సి వచ్చినప్పుడు.. ఆమె దానికోసం తన కడుపు మాడ్చుకుందట. పొట్ట చాలా ఫ్లాట్ కనిపించేందుకు.. ఇది తోడ్పడిందని చెబుతోంది రకుల్. ఆ సమయంలో రోజుకి కేవలం ఐదు బాదం పప్పులు, కొన్ని డ్రైఫ్రూట్స్, ఒక పండు, చాలా తక్కువ మోతాదులో నీళ్లు మాత్రమే తీసుకునేదట.

ప్యాకప్ తర్వాత.. చాలా ఎక్కువ మోతాదులో నీళ్లు తాగి వ్యాయామం చేసేదట రకుల్. అలాగే వ్యాయామం తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు తీసుకునేదట. ఇక రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకూ.. అస్సలు నీళ్లు తీసుకునేది కాదట. షూటింగ్ గ్యాప్‌లో కూడా నీళ్లు ఎక్కువగా తాగితే.. పొట్ట ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి కేవలం కొన్ని నీళ్లు మాత్రమే తాగేదట. ఇలా నాలుగు రోజుల పాటు నీళ్లు, ఆహారం లేకుండా జీవించింది. అంతేకాదు.. హిందీలో ఆమె నటించిన తాజా చిత్రం ‘దేదే ప్యార్ దేదే’ సినిమాలో.. యాభై ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడే అమ్మాయిగా కనిపించింది.

ADVERTISEMENT

దీనికోసం ‘కాక్ టెయిల్’  సినిమాలో దీపికలా బరువు తగ్గి అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని దర్శకుడు చెప్పగానే.. నెల రోజుల పాటు కఠినమైన వ్యాయామాలతో పాటు. డైట్ పాటించి పది కేజీల బరువు తగ్గింది రకుల్. దీనికోసం వారం రోజుల పాటు.. క్రాష్ డైట్ తీసుకొని.. మరో వారం కండలు పెరిగేలా ఆహారం తీసుకుందట. దాంతో పాటు రోజూ నాలుగు గంటల పాటు.. కఠినమైన వ్యాయామాలు చేసేదట. తన జీవితంలోనే తాను ఎక్కువగా కష్టపడిన నెల అదేనని అంటుందామె. ఇలా సినిమా కోసం తన డైట్‌ని మార్చుకోవడానికి.. రకుల్ సిద్ధంగా ఉంటుంది.

మెరిసే చర్మానికి రకుల్ చిట్కాలు

Instagram

ADVERTISEMENT

రకుల్ సినిమాల కోసం మేకప్ ఉపయోగించినా.. షూటింగ్ అయిపోగానే దాన్ని తొలగిస్తుందట. క్లినిక్ క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని కడుక్కోవడంతో పాటు.. ఎలిజబెత్ ఆర్డెన్ మాయిశ్చరైజర్ కూడా రాసుకుంటుంది. అంతేకాదు.. ఇంటినుంచి ఎప్పుడు బయటకు వెళ్లినా.. సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటుంది. రాత్రి పడుకునేటప్పుడు.. ముఖంపై ఏ మాత్రం మేకప్ ఉండకూడదని.. అలా ఉంటే చర్మం పాడవుతుందని రకుల్ నమ్ముతుంది.

అంతేకాదు.. ఖరీదైన సెలూన్ ట్రీట్‌మెంట్ల కంటే.. ఇంటి చిట్కాలకే రకుల్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. శనగ పిండి, పసుపు, నిమ్మరసం, తేనె వంటి..వి తను అందమైన చర్మం కోసం తరచూ ఉపయోగిస్తుంటుంది. అంతేకాదు.. అరటి పండ్లు, పెరుగు, గుడ్డులోని తెల్ల సొనను ఉపయోగించి.. హెయిర్ మాస్క్ కూడా తయారుచేసుకుంటుంది రకుల్. ఇక కంటి చుట్టూ.. నల్లటి వలయాలు ఏర్పకుండా కీర దోస, బంగాళాదుంపల రసాన్ని ఉపయోగిస్తుందట.

రకుల్ ఉపయోగించే మేకప్ ఉత్పత్తులు

ADVERTISEMENT

Instagram

సాధారణంగా రకుల్ మేకప్.. సినిమాను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం.. తన మేకప్‌ని వీలైనంత సింపుల్‌‌గా ఉంచుకోవడానికి.. రకుల్ ఆసక్తి చూపుతుందట. తనకెంతో ఇష్టమైన మేకప్ ఉత్పత్తి.. టార్ట్ షేప్ టేప్ కాంటూర్ కన్సీలర్ అని.. దానితో పాటు ‘జార్జియో అర్మానీ లుమినస్ సిల్క్ ఫౌండేషన్’ని.. తాను ఎప్పుడూ ఉపయోగిస్తుంటానని చెబుతుంది రకుల్.

అంతేకాదు.. రాత్రి ఎంత ఆలస్యమైనా.. మేకప్ తొలిగించి ‘కియెల్స్ క్రీమీ ఐ ట్రీట్ మెంట్ విత్ అవకాడో’ అనే క్రీమ్ లేదా వర్జిన్ కొకొనట్ ఆయిల్ ఉపయోగించి తన చర్మాన్ని శుభ్రం చేసుకుంటుందట. ఆ తర్వాత ముఖం కడుక్కొని పడుకుంటుందట. తన జుట్టు కోసం కెరట్రేస్ ఉత్పత్తులను ఉపయోగిస్తుందట రకుల్.

లిప్ స్టిక్‌ని పెద్దగా ఇష్టపడని రకుల్.. కార్మెక్స్ మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ ఉపయోగిస్తుందట. ఇక వీటితో పాటు బాబీ బ్రౌన్ ఫౌండేషన్, మాక్ శాటిన్ లిప్ స్టిక్, లా షీల్డ్ సన్ స్క్రీన్, హూలా క్వికీ కాంటూర్ స్టిక్ వంటివి తనకు నచ్చే ఉత్పత్తులని చెబుతుందీ అందాల తార.

ADVERTISEMENT

అందం, ఆరోగ్యం, ఫిట్ నెస్ గురించి తనేం చెబుతుందంటే..

Instagram

మేకప్ చాలా తక్కువగా వేసుకోవడం.. సన్ స్క్రీన్ రాసుకోవడం.. తన చర్మ సంరక్షణకు సహజ ఉత్పత్తులను ఉపయోగించడం తన సౌందర్య రహస్యాలని చెబుతుంది రకుల్. అంతేకాదు.. వ్యాయామం చేయడం వల్ల.. తన శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి కాబట్టి.. చర్మం క్లియర్‌గా ఉంటుందని చెప్పుకొస్తుంది రకుల్. వ్యాయామం చేయకుండా.. కనీసం ఒక్కరోజు కూడా ఉండలేనని.. అందుకే అవుట్ డోర్ షూటింగ్‌లలో భాగంగా కూడా.. తాను వ్యాయామం చేస్తానని తాను చెబుతుంది.

ADVERTISEMENT

తాను కడుపు నిండా కూరగాయలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల.. అది తనకి ఆకలై జంక్ ఫుడ్ తినకుండా.. బరువు పెరగకుండా కాపాడుతుందని తన ఫిట్‌నెస్ రహస్యాన్ని చెప్పుకొస్తుంది రకుల్. డైటీషియన్ రాశీ చౌదరి చెప్పినట్లుగా తన ఆహార శైలిని మార్చుకున్న తర్వాత.. తన ఎనర్జీ లెవెల్స్‌లో చాలా మార్పు వచ్చిందని చెబుతోంది రకుల్. బరువులు ఎత్తడం వల్ల తను ఫిట్‌గా, సరైన షేప్‌లో ఉన్నానని చెప్పే రకుల్.. అప్పుడప్పుడూ స్విమ్మింగ్, డ్యాన్సింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రయత్నిస్తుందట.

ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ని తమ ఆరోగ్య రహస్యంగా మార్చుకోవాలని.. అందరికీ చెబుతుంటుంది రకుల్. ఫిట్‌నెస్ పై అవగాహన పెంచేందుకు.. వీలున్నప్పుడల్లా తన వర్కవుట్ రొటీన్‌తో పాటు డైట్‌ని కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులకు ఆ విషయాలపై అవగాహన కూడా కల్పిస్తూ ఉంటుంది. శరీరం ఫిట్‌గా ఉన్నప్పుడే.. మనసు ఆనందంగా ఉండడంతో పాటు.. ఆరోగ్యం కూడా మన సొంతమవుతుందని.. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన  ఆహారపుటలవాట్లతో పాటు.. వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కూడా చెబుతోంది రకుల్. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT

 

23 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT