పిల్లల గురించి తన మనసులోని.. మాటను బయటపెట్టిన నాగ చైతన్య..!

పిల్లల గురించి తన మనసులోని.. మాటను బయటపెట్టిన నాగ చైతన్య..!

సమంత(samantha), నాగ చైతన్య (naga chaitanya).. టాలీవుడ్‌లో‌నే క్యూటెస్ట్ కపుల్. ఏం మాయ చేశావే చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ.. కొన్నేళ్ల పాటు ప్రేమించుకొని పెద్దల అనుమతితో తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించారు. వీరి పెళ్లయి మూడు సంవత్సరాలు కావస్తున్నా.. కొత్తగా పెళ్లయిన జంటల్లాగే అద్భుతమైన కెమిస్ట్రీతో పాటు ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు ఈ ఆలుమగలు. సోషల్ మీడియాలో వీరు పెట్టే ఫొటోలు చూస్తుంటే.. ఏ జంటకైనా కపుల్ గోల్స్ అందిస్తున్నట్లుగా ఉంటుంది.

Instagram

సాధారణంగా ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్‌గా పనిచేస్తుంటే.. చాలామంది ముందు కెరీర్ గురించే ఆలోచిస్తూ పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటారు. అలాంటి హీరోలను, హీరోయిన్లను కూడా మనం చాలామందినే చూస్తున్నాం. అలాంటిది కేవలం 29 సంవత్సరాల వయసులోనే.. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం కూడా చాలా ఇంటర్వ్యూల్లో భాగంగా వెల్లడించాడు నాగ చైతన్య. తనకు వ్యక్తిగత జీవితానికి, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధం లేకుండా చూసుకోవడం తెలుసని చెప్పాడీ హీరో. అంతేకాదు.. వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉంటే ప్రొఫెషనల్‌గా కూడా విజయాలను అందుకోవచ్చనే విషయం.. తన కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నానని నాగ చైతన్య చెప్పిన సంగతి తెలిసిందే.

Instagram

కేవలం పెళ్లి విషయంలో మాత్రమే కాదు.. పిల్లల విషయంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించాలనుకుంటున్నారట ఈ జంట. రెండేళ్ల క్రితం (అక్టోబర్ 7, 2017) పెళ్లి చేసుకున్న ఈ జంట తొందరగా తల్లిదండ్రులు కూడా కావాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించాడు చై.

"ప్రస్తుతం నా జీవితం చాలా అందంగా సాగుతోంది. అద్భుతమైన భాగస్వామి, మంచి కుటుంబం, చక్కటి కెరీర్‌తో ఆనందంగా సాగుతోంది. ఇవన్నీ ఇచ్చినందుకు నేను భగవంతుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. ఇంకా ఆయన నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు. పిల్లల గురించి కూడా మేం ఆలోచిస్తున్నాం. తొందర్లోనే మీ అందరికీ ఆ శుభవార్త చెబుతాను" అంటూ నవ్వుతూ చెప్పేశాడు చై.

పిల్లల గురించి అడిగినప్పుడు.. చాలామంది సెలబ్రిటీ జంటలు చిరాకు పడడం మనం గమనించవచ్చు. కానీ అటు సామ్ కానీ, ఇటు చై కానీ.. ఎప్పుడూ దాన్నో మాట్లాడకూడని విషయంగా భావించలేదు. ఆ ప్రశ్నను స్పోర్టివ్‌గానే తీసుకున్నారు.

Instagram

గతంలో ఇదే ప్రశ్న సమంతను అడిగినప్పుడు "నేను పిల్లలను కన్నప్పుడు వాళ్లే నా ప్రపంచం అయిపోతారు. వారిని వదిలి బయటకు రావడం నాకు ఇష్టం ఉండదు. వర్కింగ్ మదర్స్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ నా చిన్నతనం అంత అందంగా ఏమీ సాగలేదు. తమ చిన్నతనంలో అన్ని ఆనందాలను పొందలేని వాళ్లు కనీసం తమ పిల్లల విషయంలో అలా జరగకుండా చూడాలని.. తాము కోల్పోయినవేవీ తమ పిల్లలు కోల్పోకుండా చూడాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే కోరుకుంటున్నా. అందుకే పిల్లలను కన్న తర్వాత నేను కెరీర్‌కి కాస్త బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అందుకే పిల్లలు పుట్టిన తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు నేను కేవలం వారికి తల్లిగా.. వారితోనే సమయాన్ని గడపాలని ఆశిస్తున్నా" అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించింది సమంత.

Instagram

గతంలో ఓసారి తాను గర్భంతో ఉన్నానన్న వార్తకు స్పందిస్తూ అవునా? నిజంగానేనా? అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది సమంత. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో భాగంగా పిల్లలను కనే సమయం ఇంకా రాలేదని చెప్పుకొచ్చింది సమంత. పిల్లలను ఎప్పుడు కనాలో మేం ఓ తేదీ ముందే అనుకున్నాం. ఆ సమయం వచ్చే వరకూ అసలు పిల్లల గురించి ఆలోచించకూడదు అనుకున్నాం. తేదీ ఫిక్సయింది కాబట్టి.. అప్పుడే మేం పిల్లల గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం నాగ చైతన్య 'వెంకీ మామ' సినిమాతో పాటు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి కథానాయికగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. సమంత శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న '96'   సినిమాలో నటిస్తోంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.