'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!

(Pawan Kalyan and Renu Desai Love Story)

'ప్రేమకథ అంటే కచ్చితంగా అది సక్సెస్ అయ్యే తీరాలి. ఆ ప్రేమ కలకాలం అలాగే ఉంటుంది... ఉండాల్సిందే..' అని చెప్పలేం. తెరపై జీవితాలను పక్కన పెడితే.. నిజ జీవితంలో కొన్ని ప్రేమ ప్రయాణాలు జీవిత కాలం కొనసాగకపోవచ్చు. అలా అని ఆయా ప్రేమకథలు గొప్పవి కాకుండా పోవు.. అలాగే ఆ ప్రేమికులు కూడా ఒకరిపై మరొకరు ప్రేమతో ఉండకుండా పోరు.

కృష్ణవంశీ - రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

ఇప్పుడు చెప్పబోయేది కూడా దాదాపు అలాంటి ఒక ప్రేమకథ. ఆయన సినిమా హీరోగా అప్పటికే  ఓ రైజింగ్ స్టార్ .. ఆయనతో మాట్లాడాలంటేనే చాలా మందికి కంగారు, భయం. దీనికి తోడు ఆయన పెద్ద ఇంట్రోవర్ట్. ఇలాంటి లక్షణాలున్న మనిషితో.. ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా మాటలు కలిపేసింది ఓ మహారాష్ట్ర భామ. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?  తానే పవన్ కళ్యాణ్.. అలాగే ఆ మహారాష్ట్ర భామ పేరు - రేణు దేశాయ్.

ఈ ఇద్దరి తొలి పరిచయం.. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన  'బద్రి' సినిమా షూటింగ్ స్పాట్‌లో జరగడం విశేషం. అప్పటికే తొలిప్రేమ, తమ్ముడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన హీరోగా పవన్‌ క్రేజ్ ఎక్కడో ఉంది. అలాంటి సమయంలో.. ఒక 16 ఏళ్ళ అమ్మాయి హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం.. ఆమె తొలి చిత్రం పవన్ కళ్యాణ్ పక్కన కావడంతో.. తన  దశ తిరిగిందనే అనుకున్నారంతా.

అయితే పవన్ కళ్యాణ్ మనసుని గెలుచుకునే ఆ అమ్మాయి..  'రేణు దేశాయ్'  అవుతుందని బహుశా అప్పుడు ఎవరు ఊహించి ఉండరు. 'బద్రి' సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు కూడా.. పవన్ కళ్యాణ్‌తో ఆమె కలిసి నటించింది. పరభాషా వ్యక్తి అయినా కూడా..  ఎటువంటి ఇబ్బంది, తొట్రుపాటు లేకుండా తెలుగులో రేణు మాట్లాడే పద్ధతి పవన్‌ను బాగా ఆకట్టుకుంది. అలా ఇద్దరికి కూడా.. ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది.

ఆ ఇష్టమే స్నేహంగా.. తరువాతి కాలంలో ప్రేమగా మారిపోయింది. అయితే అప్పటికే వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ తన భార్యతో ఏర్పడిన విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నాడు. పైగా వారి వైవాహిక జీవితాన్ని ముగించుకొనే క్రమంలో.. విడాకుల కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగిందట.

ఆ విడాకుల కేసు నడుస్తున్నప్పుడే.. పవన్, రేణులు వివాహం చేసుకోవడానికి చట్టరీత్యా వీలుకాకపోవడంతో సహజీవనం చేయడం ప్రారంభించారు. ఆ తరువాతి కాలంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు  మొదలైన చిత్రాలకి సంబంధించి ఏదో ఒక శాఖలో పనిచేసేవారు రేణు దేశాయ్. చాలా కాలం పాటు పవన్‌కి.. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేయడం జరిగింది.

'అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల' ప్రేమకథ.. సినిమా కథని మరిపించేలా ఉంటుంది తెలుసా...!

సహజీవనం చేస్తున్న కాలంలోనే పవన్, రేణులు 2004లో అకీరానందన్ అనే బాబుకి జన్మనిచ్చారు.  ఇక పవన్ కళ్యాణ్‌కి, తన తొలి భార్య నందినితో విడాకులు మంజూరయ్యాక.. 2009లో పవన్, రేణులు చట్ట ప్రకారం భార్యాభర్తలుగా మారారు.  వీరిద్దరి వివాహం.. పవన్ ఇంట్లోనే కుటుంబసభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. వీరి వివాహం కోసం ప్రింట్ చేయించిన ఆహ్వాన పత్రికల్లో 'మా అమ్మ నాన్నల పెళ్ళికి రావాలి' అంటూ అకీరానందన్ పిలిచినట్టుగా.. పెళ్లి పత్రికలు ముద్రించడం అప్పట్లో సంచలనమైంది. 2010లో పవన్, రేణు దంపతులకు ఓ పాప జన్మించింది. తన పేరే ఆద్య.

పవన్, రేణుల సహజీవనం అప్పట్లో ఎంత సంచలనమైందో.. వీరిద్దరి వివాహం కూడా అంతే సంచలనం రేపింది. ఎన్నో మలుపుల మధ్య వీరి బంధం ముడిపడిందని అందరూ అనుకున్నారు. కానీ అదే రీతిలో వీరిద్దరి వివాహ బంధం కూడా కొన్ని సంవత్సరాల వ్యవధిలో తెగిపోయింది. అసలు వీరిరువురు విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు..? పైగా పవన్‌ను ఆరాధించే అభిమానులు కూడా.. ఈ పరిణామాన్ని చాలా రోజుల వరకు జీర్ణించుకోలేకపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి రేణు దేశాయ్ కారణమని కొందరంటే.. మరికొందరేమో వేరే కారణాలున్నాయని అభిప్రాయపడ్డారు.

ఏదేమైనప్పటికి 2012లో పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్‌లు విడిపోవడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే అంశం పై మాత్రం ఎవరికీ స్పష్టత రాలేదు.  ప్రస్తుతం వీరి పిల్లలు  అకీరానందన్, ఆద్యలు రేణు దేశాయ్ సంరక్షణలోనే పెరుగుతున్నారు. రేణు దేశాయ్ కూడా ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తూ.. రచనలు చేస్తూ ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, 2013లో అన్నా లెజ్నెవా అనే విదేశీయురాలిని తను వివాహం చేసుకున్నాడు. ఆమెకి ఇద్దరు సంతానం. ప్రస్తుతం పవన్ సినిమాలకి స్వస్తి చెప్పి.. ప్రజాసేవ నిమిత్తం ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి.. క్రియాశీల రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

అలా తెలుగు చిత్రసీమలో సహజీవనం చేసిన ప్రేమజంటగా ట్రెండ్ సృష్టించిన పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ల లవ్ స్టోరీ .. ఎప్పటికీ టాలీవుడ్ చరిత్రలో నిలిచే ఉంటుంది. వీరి వివాహ బంధం కలకాలం నిలబడకపోయినా.. ఉన్నన్నాళ్లు అందరినీ ఆకర్షించిందనే చెప్పాలి. 

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ - మెగా బిజినెస్ ఉమన్ ఉపాసనల.. ప్రేమ బంధం గురించి తెలుసుకుందామా?