(Waterfalls in India)
జలపాతాలు – ఇవే అసలు సిసలైన ప్రకృతి అందాలు. ఎత్తైన కొండల పైనుండి.. నీరు ధారాళంగా ప్రవహిస్తూ వస్తుంటే … ఆ ప్రవాహాన్ని చూసేవారికి సాక్షాత్తు పాల సముద్రమే ఉప్పొంగి వస్తుందా? అన్న భావన కలగకమానదు. దర్శకుడు శంకర్ … తాను దర్శకత్వం వహించిన జీన్స్ చిత్రంలో నయాగరా ఫాల్స్ అందాలని చాలా చక్కగా చూపించాడు. వాటిని చూస్తే చాలు. ఎవరికైనా అవి సెవెన్ వండర్స్‌లో ఎందుకు స్థానం సంపాదించుకున్నాయో ఇట్టే అర్థమైపోతుంది.
అయితే ఇప్పుడు అలాంటి జలపాతాలను (Waterfalls) చూడడానికి అమెరికా వరకూ వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు కదా. అయినా నిరుత్సాహ పడక్కర్లేదు. ఎందుకంటే మన దేశంలోనే ఎన్నో చూడదగిన అద్భుత జలపాతాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు దేశ విదేశాల నుండి కూడా పర్యాటకులు వచ్చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అంతెందుకు, బాహుబలి చిత్రంలో మనం చూసిన జలపాతం ఎంత అద్భుతంగా ఉందో తెలుసు కదా. అయితే అందులో కొంత గ్రాఫిక్స్ అయినప్పటికి.. ఎక్కువ శాతం సహజమైన జలపాతాన్నే మనకి చూపే ప్రయత్నం చేశారు.
ట్రెక్కింగ్ సాహసాలు చేసేద్దాం.. ఈ ప్రదేశాలు సందర్శించేద్దాం..!
ఈ క్రమంలో మేం కూడా మన భారతదేశంలో (India) ప్రముఖ జలపాతాలకు ప్రసిద్ధి గాంచిన .. ప్రాంతాల గురించి విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మరి.. మీకు నచ్చిన జలపాతం దగ్గరికి వెళ్లి ప్రకృతి అందాలని ఆస్వాదించి వచ్చేయండి.
ఉత్తర భారతదేశంలోని ప్రముఖ జలపాతాలు
ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశంలోని ప్రముఖ జలపాతాల వివరాలు
* భీమ్లాట్ జలపాతాలు
రాజస్థాన్ రాష్ట్రంలోని భీమ్లాట్ మహాదేవ్ గుడి సమీపంలో కనిపించే.. ఈ జలపాతాలు పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి జలపాతాలను చూడడానికి వచ్చేవారు భీమ్లాట్ మహాదేవ్ గుడిని కూడా సందర్శిస్తుంటారు.
సందర్శనకు అనువైన సమయం – జూన్ నుండి అక్టోబర్ వరకు
ఎలా చేరుకోవాలి – రాజస్థాన్‌లోని కోటా ఎయిర్ పోర్ట్ నుండి రవాణా సదుపాయం ఉంది. అలాగే కోటా నుండి వివిధ రవాణా మార్గాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.
* ధుంధార్ జలపాతాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ జిల్లాలోని భేదా ఘాట్ వద్ద ధుంధార్ జలపాతాలు కనిపిస్తాయి. ఈ జలపాతాలకి ఈ పేరు రావడానికి కారణం- సుమారు 30 మీటర్ల ఎత్తు నుండి నీరు క్రిందకి పడుతుంటే.. అది చూడడానికి ఒక తెల్లటి పొగ రూపంలో కనిపిస్తుందట. అందుకే ఈ జలపాతాలకి ఈ పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ ప్రాంతానికి వెళ్లడానికి కేబుల్ కార్ సౌలభ్యం కూడా ఉంది.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలంలో వచ్చే పౌర్ణమి రోజు
ఎలా చేరుకోవాలి – జబల్ పూర్ నుండి రవాణా సౌకర్యం ఉంది.
కేంప్టి జలపాతాలు
దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరలో ఉన్న జలపాతం ఈ కేంప్టి జలపాతం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రి ఘర్వాల్ జిల్లాలోని రామ్ గావ్‌లో ఉంది ఈ జలపాతం. 1835లో ఒక బ్రిటిష్ అధికారి ఈ జలపాతాన్ని గుర్తించి.. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 40 ఫీట్ల ఎత్తు నుండి జలాలు ధారాళంగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి.
సందర్శించడానికి అనువైన సమయం – మార్చి, ఏప్రిల్ & అక్టోబర్, నవంబర్
ఎలా చేరుకోవాలి – ఢిల్లీ నుండి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశం. ఢిల్లీ నుండి ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కలదు.
పళని జలపాతాలు
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కులు ప్రాంతానికి దగ్గరలో ఈ పళని జలపాతాలు కనిపిస్తాయి. ఈ పళని జలపాతాలను సందర్శించి.. మనం కూడా ఆ ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరచ్చు. ఈ జలపాతాలు చూడడానికి వెళ్లాలంటే.. ఢిల్లీ నుండి కూడా రవాణా సదుపాయం ఉంది.
సందర్శించడానికి అనువైన సమయం – మార్చి & ఏప్రిల్
ఎలా చేరుకోవాలి – ఢిల్లీ నుండి 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశ రాజధాని నుండి రవాణా సౌకర్యం కూడా ఉంది.
చాడ్విక్ జలపాతాలు
ఈ జలపాతం కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాకి దగ్గరలో ఉంది. ఈ జలపాతాన్ని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రతియేటా వస్తుంటారు.
సందర్శించడానికి అనువైన సమయం – జూన్ నుండి ఆగష్టు వరకు
ఎలా చేరుకోవాలి – ఢిల్లీ నుండి కూడా రవాణా సౌకర్యం కలదు.
ఈశాన్య భారతదేశ జలపాతాలు
ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించే ప్రకృతి సోయగాలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రకృతి అందాలలో జలపాతాలు కూడా ఒక భాగమే. నోసింగ్ థియాంగ్ జలపాతాలు, ఖందాహార్ జలపాతాలు , చిత్రకోట్ జలపాతాలు, బరేహిపాణి జలపాతాలు మొదలైనవి ఈశాన్య ప్రాంతాలలో పర్యటకులు తప్పక చూడాల్సిన జలపాతాలు.
* నోసింగ్ థియాంగ్ జలపాతాలు
మేఘాలయ రాష్ట్రంలో కనిపించే ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలోని మాస్మై గ్రామంలో ఈ నోసింగ్ థియాంగ్ జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ జలపాతం చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా కొన్ని చిన్న జలపాతాలు ఉన్నాయి. అయితే ఈ జలపాతానికి ఉన్న ఆదరణ వాటికి లేదు. పైగా ఈ జలపాతాన్ని సెవెన్ సిస్టర్ ఫాల్స్ అని పలువురు పర్యటకులు పేర్కొనడం విశేషం. కారణం ఈశాన్య రాష్ట్రాలలో ఇంతటి పెద్ద జలపాతం మరొకటి లేదు.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలం
ఎలా చేరుకోవాలి – మేఘాలయ రాష్ట్ర రాజధాని నుండి ఇక్కడికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం కలదు.
* ఖందాహార్ జలపాతాలు
దాదాపు 244 మీటర్ల ఎత్తు నుండి ప్రవహించే ఈ జలపాతాలు చూపరులని ఇట్టే ఆకర్షిస్తాయి. ఒడిశా రాష్ట్రంలోని సుందర్ ఘర్ జిల్లాలోని నందపాని ప్రాంతంలో ఈ జలపాతాలు కనిపిస్తాయి. ఈ జలపాతానికి ఖందహార్ అని పేరు రావడానికి కారణం – ఈ ప్రవాహం పర్యటకులకు ఖడ్గపు ఆకారంలో కనిపిస్తుందట. అందుకే ఖడ్గం అని అర్థం వచ్చేలా.. ఖందాహార్ అనే పేరు పెట్టారట.
సందర్శించడానికి అనువైన సమయం – జులై నుండి అక్టోబర్
ఎలా చేరుకోవాలి – రూర్కెలా పట్టణం నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉంది. రూర్కెలా నుండి ఇక్కడికి చేరుకోవడానికి రవాణా వసతి కలదు.
* చిత్రకోట్ జలపాతాలు
ఇంద్రావతి నది పై కనిపించే ఈ చిత్రకోట్ జలపాతాలు.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బస్టర్ జిల్లాలోని జగదల్పూర్కి పశ్చిమ దిశలో ఉన్నాయి. ఈ జలపాతాలని ఇండియన్ నయాగరా ఫాల్స్‌గా కూడా అభివర్ణిస్తుంటారు.
సందర్శించడానికి అనువైన సమయం – జూన్ నుండి అక్టోబర్ వరకు
ఎలా చేరుకోవాలి – విశాఖపట్నం నుండి జగదల్ పూర్‌కి ప్రత్యేక రైలు నడుస్తుంది. ఆ రైలులో చేరుకోవచ్చు.
* బరేహిపాణి జలపాతాలు
రెండు పాయలుగా ఈ జలపాతం చూపరులకు కనిపిస్తుంది. ఒడిస్సా రాష్ట్రంలోని మయూర్ భంజ్ జిల్లాలోని సీంళీపాల్ నేషనల్ పార్క్‌లో ఈ బరేహిపాణి జలపాతాలు కనిపిస్తాయి. ఈ జలపాతాన్ని చూడడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలం
ఎలా చేరుకోవాలి – జిల్లా కేంద్రం నుండి ఇక్కడికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఉంది.
* వాంతాంగ్ జలపాతాలు
మిజోరం రాష్ట్రంలోని వాతాంగ్ జలపాతాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి మూడు పాయలుగా క్రిందకి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ జలపాతం సెర్చిప్ జిల్లాలోని థేంజాల్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వన్వా నది నుండి వచ్చే నీరు ఈ జలపాతం ద్వారా కిందకి ప్రవహిస్తుంటుంది. వాంత్వాంగా అనే ఒక సాహసికుడి పేరు మీద ఈ జలపాతానికి నామకరణం చేయడం జరిగింది.
సందర్శించడానికి అనువైన సమయం – జులై నుండి అక్టోబర్ వరకు
ఎలా చేరుకోవాలి – మిజోరాం రాజధాని నుండి రవాణా సౌకర్యం ఉంది.
వర్షాకాలంలో మనం తప్పక సందర్శించాల్సిన.. పర్యాటక ప్రదేశాలు ఇవే..!
పశ్చిమ భారతదేశం జలపాతాలు
భారతదేశానికి సంబంధించి పశ్చిమ దిశలో కనిపించే జలపాతాలు చాలా ప్రత్యేకం. ఈ జలపాతాల్లో దూద్ సాగర్ జలపాతాలు, తోసేఘర్ జలపాతాలు & కూనే జలపాతాలు ప్రముఖమైనవి.
* దూద్ సాగర్ జలపాతాలు
మన దేశంలోని పర్యాటక కేంద్రాల మీద అవగాహన ఉండే ఎవరికైనా తెలిసే ప్రదేశం ఈ దూద్ సాగర్. కర్ణాటక, గోవా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో ఈ జలపాతం కనిపిస్తుంది. మడగావ్, బెల్గావి రైలు మార్గంలో ఉన్నది ఈ దూద్ సాగర్ జలపాతాన్ని చూడచ్చు. ఈ సుందర జలపాతాలని చూడడానికి ట్రైన్ మార్గం ఒకటి కాగా.. మరొకటి రోడ్డు మార్గం. అయితే ప్రస్తుతం రైలు మార్గాన్ని మూసివేసినట్టు సమాచారం. ఈ జలపాతం వద్దే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చిత్రం “చెన్నై ఎక్స్‌ప్రెస్” షూటింగ్ జరిగింది.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలం
ఎలా చేరుకోవాలి – రైలు, రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే కర్ణాటక, గోవా రాజధాని పనాజీ నుండి కూడా రవాణా సౌకర్యం ఉంది.
* తోసేఘర్ జలపాతాలు
మహారాష్ట్రలోని సతారా పట్టణం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోసేఘర్ అనే చిన్న గ్రామం పరిధిలో ఈ జలపాతం ఉంది. అనేక పాయలుగా విడిపోయి ఈ జలపాతం ఏర్పడగా.. సుమారు 500 మీటర్ల ఎత్తుతో ఉంటుంది ఈ తోసేఘర్ జలపాతం.
సందర్శించడానికి అనువైన సమయం – జులై నుండి నవంబర్
ఎలా చేరుకోవాలి – పూణే జిల్లా సతారా నుండి బస్సు సౌకర్యం ఉంది.
* కూనే జలపాతాలు
మీరు లోనావాలా వెళితే తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఈ కూనే జలపాతాలు. ముంబై – పూణే హైవే నుండి ఈ జలపాతాలను చాలా తక్కువ సమయంలో చేరవచ్చు. ఈ జలపాతాలు ఈ మధ్యకాలంలో టూరిస్టులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదేశం పూణే నుండి 70 కిలోమీటర్లు, ముంబై నుండి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలం మొత్తం
ఎలా చేరుకోవాలి – పూణె, ముంబై నుండి రోడ్డు మరియు రైలు మార్గంలో చేరుకోవచ్చు.
దక్షిణ భారతదేశ జలపాతాలు
మన దేశం మొత్తంలోనే ఎక్కువ జలపాతాలు కనిపించేవి దక్షిణ భారతదేశంలోనే. అందులో ప్రధానమైన జాగ్ జలపాతాలు, అతిరాప్పిల్లి జలపాతాలు, కుట్రాలం జలపాతాలు, తలకోన జలపాతాలు, ఇఱుప్పు జలపాతాలు , సూచిపారా జలపాతాలు , భోగత జలపాతాలు గురించిన వివరాలు సంక్షిప్తంగా మీకోసం
* జాగ్ జలపాతాలు
కర్ణాటకలోని సాగర ప్రాంతంలో కనిపించే జాగ్ జలపాతాలు.. ఈ మధ్యకాలంలో పర్యాటకులని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. షరావతి నది ద్వారా వచ్చే నీరు.. ఈ జలపాతం ద్వారా కిందకి పారుతుంది.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలం
ఎలా చేరుకోవాలి – ఇక్కడికి చేరుకోవడానికి తలగుప్ప, సాగర ప్రాంతాల నుండి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి.
* అతిరాప్పిల్లి జలపాతాలు
కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలోని చాలకుడి తాలూకా అతిరప్పిల్లి పంచాయతీ పరిధిలో కనిపించే జలపాతమే ఈ అతిరాప్పిల్లి జలపాతం. చాలకుడి నది ప్రవాహం ద్వారా ఏర్పడిన ఈ జలపాతాన్ని చూడడానికి.. ప్రతి యేడు లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. దాదాపు 20 భాషలకి చెందిన సినిమాల చిత్రీకరణ ఇక్కడ జరపడం జరిగింది.
సందర్శించడానికి అనువైన సమయం – జూన్ నుండి సెప్టెంబర్
ఎలా చేరుకోవాలి – బస్సు మార్గం ద్వారా అయితే కొచ్చి, చాలకుడి నుండి రవాణా సదుపాయం ఉంది. అలాగే రైలు మార్గం ద్వారా కూడా చాలకుడికి చేరుకొని.. అక్కడి నుండి ఇక్కడ వరకు రోడ్డు మార్గం ద్వారా రావచ్చు.
* కుట్రాలం జలపాతాలు
తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో కనిపించే కుట్రాలం జలపాతాలకి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. తమిళనాడులోని తిరునల్వెలి జిల్లాలోని టెంకసి అనే పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ కుట్రాలం జలపాతం ఉంది. ఇక ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్ధం.. ప్రతి సంవత్సరం జులై నుండి సెప్టెంబర్ వరకు బోటు షికారు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
సందర్శించడానికి అనువైన సమయం – జూన్ నుండి అక్టోబర్ వరకు
ఎలా చేరుకోవాలి – తమిళనాడు , కేరళ రాష్ట్రంలోని అన్ని మూలాల నుండి కూడా రవాణా సౌకర్యం ఉంది.
* తలకోన జలపాతాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్య పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న ప్రాంతం తలకోన. ఈ ప్రాంతంలోని జలపాతాలు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచడం విశేషం. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ తలకోన జలపాతాలు పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే అతి పొడవైన జలపాతం.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలం
ఎలా చేరుకోవాలి – తిరుపతి నుండి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కలదు.
హైదరాబాద్ ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!
* ఇఱుప్పు జలపాతాలు
కర్ణాటక, కేరళ సరిహద్దుకు సమీపంలో ఉండే మరొక జలపాతం ఈ ఇఱుప్పు జలపాతం. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని బ్రహ్మగిరి రేంజ్లో ఇది కనిపిస్తుంది. లక్ష్మణ తీర్థ ఫాల్స్ అని కూడా దీనికి మరో పేరు కలదు. లక్ష్మణ తీర్థ అనే నది ఈ జలపాతానికి మూలం కాబట్టి.. దానికి ఈ పేరు వచ్చింది.
సందర్శించడానికి అనువైన సమయం – జూన్ నుండి అక్టోబర్ వరకు
ఎలా చేరుకోవాలి – కర్ణాటకలోని విరాజ్ పెట్ నుండి ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని ఇతర ప్రదేశాల నుండి కూడా రవాణా సౌకర్యం ఉంది.
* సూచిపారా జలపాతాలు
కేరళలోని వయనాడ్ జిల్లా పరిధిలోకి వస్తాయి ఈ సూచిపారా జలపాతాలు. ఈ సూచిపారా జలపాతాలకి ఉన్న మరోపేరు – సెంటినెల్ రాక్ వాటర్ ఫాల్స్. నీడిల్ ఆకారంలో కనిపించే రాళ్లు ఇక్కడ ఉండడంతో.. ఆ పేరు కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలం
ఎలా చేరుకోవాలి – వయనాడ్ జిల్లా కేంద్రం నుండి రవాణా సౌకర్యం ఉంది.
* బొగత జలపాతాలు
తెలంగాణ రాష్ట్రంలో ‘తెలంగాణ నయాగరా’గా పేరు పొందిన జలపాతం ఈ బొగత జలపాతం. వాజేడు మండలం కోయవీపురం దగ్గరలో కనిపించే ఈ జలపాతానికి.. పర్యాటకుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.
సందర్శించడానికి అనువైన సమయం – వర్షాకాలం
ఎలా చేరుకోవాలి – ములుగు, వరంగల్, భద్రాచలం నుండి రోడ్డు మార్గం కలదు.
* శివనసముద్ర జలపాతాలు
కావేరి నదీ పై భాగంలో కనిపించే జలపాతమే ఈ శివనసముద్ర జలపాతం. కర్ణాటకలోని చామరాజ్ నగర్ జిల్లాలోని శివనసముద్ర అనే ఊరిలో ఈ జలపాతం ఆవిర్భవించడంతో.. దానికి ఆ పేరు సంక్రమించింది అంటారు.
సందర్శించడానికి అనువైన సమయం – జులై నుండి నవంబర్
ఎలా చేరుకోవాలి – బెంగుళూరు నుండి నేరుగా ఈ ప్రదేశానికి స్పెషల్ బస్సు సౌకర్యం ఉంది.
ఇవండీ.. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించే ప్రముఖ జలపాతాలు & వాటి వివరాలు. మరింకెందుకు ఆలస్యం.. వచ్చే రెండు నెలల్లో పైన పేర్కొన్న ఏదో ఒక జలపాతాన్ని సందర్శించి ప్రకృతి అద్భుతాలను కనులారా వీక్షించండి.