సాధారణంగా మీకు బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? కనీసం పది నుంచి పదిహేను నిమిషాలైతే తప్పనిసరి. మరి, బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా ఆరు ఇడ్లీలు (idlis) తినడానికి మీరు ఎంత సమయం తీసుకుంటారు? కనీసం పది నిమషాలు కదా.. కానీ నిమిషంలో ఆరు ఇడ్లీలను తినేసి పోటీలో గెలిచేసిందో బామ్మ. 60 సంవత్సరాల వయసున్న ఈ బామ్మ.. 60 సెకన్లలోనే ఆరు ఇడ్లీలు తినడం పెద్ద ఘనత అనే చెప్పుకోవాలి. మైసూరులో (mysore) నిర్వహిస్తోన్న దసరా వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో భాగంగా.. ఓ బామ్మ ఈ ఫీట్‌ని చేసి చూపించిందట.
మైసూరులో ప్రతి సంవత్సరం విజయ దశమి వేడుకలుజజ చాలా ఘనంగా జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. నవరాత్రులు తొమ్మిది రోజులు ఇక్కడ వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగానే.. కొన్ని సరదా పోటీలు కూడా నిర్వహించారు. అందులో ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమే నిర్వహించిన ఓ సరదా పోటీ.. ఈ ఇడ్లీలు తినే కాంపిటీషన్. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పాల్గొనే వీలుంది. ఒక్క నిమిషం సమయంలో తమ ముందు పెట్టిన ఇడ్లీలలో.. ఎక్కువ ఇడ్లీలు ఎవరైతే తినగలరో వారికే బహుమతి అందుతుందని నిర్వాహకులు ప్రకటించారు కూడా. ఇడ్లీ, సాంబార్‌తో పాటు సులువుగా గొంతులో దిగేందుకు.. నీళ్లను కూడా అందుబాటులో ఉంచారు.
ఈ పోటీలలో భాగంగా హుల్లహల్లి ప్రాంతానికి చెందిన సరోజమ్మ.. ఒక్క నిమిషం వ్యవధిలోనే ఆరు ఇడ్లీలను సునాయాసంగా తినేసి పోటీ విజేతగా నిలిచింది. ఈ పోటీలో గెలిచేందుకు ఆమె పెద్దగా ఇబ్బంది పడినట్లుగా కూడా కనిపించలేదు. అరవై సంవత్సరాలున్న సరోజమ్మ చాలా వేగంగా ఒక్కో ఇడ్లీని.. ముక్కలు ముక్కలు చేసుకొని సాంబార్‌లో ముంచుకుంటూ.. మిగిలిన వారందరి కంటే వేగంగా వాటిని తినేసింది.
అంతేకాదు.. ఈ వ్యవధిలో ఒక్కసారి కూడా ఆమె నీళ్లు తాగకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ ఇడ్లీలు తినే పోటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ షేర్ చేసిన ఈ వీడియోను చూస్తూ.. లైకులు, షేర్లు చేయడంతో పాటు.. నెటిజన్లందరూ ఇడ్లీలు వేగంగా తిన్న ఈ బామ్మపై ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు.
మైసూర్‌లో జరిగే దసరా వేడుకలను కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. దీన్ని వారు నద హబ్బ (మన పండుగ) అని కూడా పిలుచుకుంటుంటారు. ఇక్కడి చాముండేశ్వరీ అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలు, అలంకరణలు, పూజలు చూసేందుకు.. మైసూరు ప్రాంతానికి విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు రావడం విశేషం.
విజయనగర రాజులు 15వ శతాబ్దం నుండే.. ఇక్కడ దసరా వేడుకలను నిర్వహించడం ప్రారంభించారు. వారి తర్వాత మైసూరుకు రాజులైన వడయార్ వంశస్థులు కూడా.. ఈ వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తుండడం విశేషం. విజయ దశమి రోజున ప్రత్యేకంగా మైసూర్ ప్యాలెస్‌లో రాజ దర్బారును నిర్వహిస్తారు. ఈ దర్బారులో రాజ కుటుంబీకులతో పాటు.. బంధువులు, అతిథులు, అధికారులు, ప్రజలు అందరూ పాల్గొంటారు.
2013లో మైసూర్ రాజ కుటుంబానికి చెందిన శ్రీకంఠ వడయార్ మరణించిన తర్వాత.. ఆ బంగారపు సింహాసనంపై రాజు కూర్చోవాల్సిన చోట రాజఖడ్గాన్ని ఉంచి.. దర్బారును నిర్వహిస్తున్నారు. దీనికోసం మహర్నవమి రోజే ఈ ఖడ్గాన్ని.. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి పూజలు కూడా నిర్వహిస్తారు.
దర్బారు తర్వాత విజయ దశమి సందర్భంగా.. అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఏనుగు అంబారీ పై అమ్మవారిని ఉంచి నగరమంతా ఊరేగిస్తారు. ఊరేగింపు తర్వాత జమ్మి కోట వద్దకు అమ్మవారు చేరుకున్నాక.. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు చేసి ఉత్సవాలను ముగిస్తారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.