20 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఏకైక మహిళ 'మిథాలీ రాజ్ .. ఇదో అరుదైన రికార్డ్

20 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఏకైక మహిళ 'మిథాలీ రాజ్ .. ఇదో అరుదైన రికార్డ్

(Mithali Raj becomes first woman to complete 20 years in International Cricket)

భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గత నెలలో టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మిథాలీ రాజ్.. దాదాపు 20 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఏకైక మహిళా క్రికెటర్‌గా వార్తల్లోకెక్కింది. ఆమె క్రికెట్ కెరీర్ ప్రారంభించి ఇప్పటికి 20 సంవత్సరాల 105 రోజులు కావడం విశేషం. 1999లో ఇండియా తరఫున తన తొలి మ్యాచ్ ఆడిన మిథాలీ రాజ్.. 205 వన్డేలు, 10 టెస్టు మ్యాచ్‌లు, 89 టీ20లు ఆడడం విశేషం. 

మహిళల క్రికెట్‌కు సంబంధించి అత్యధిక వన్డేలు ఆడిన ఘనత కూడా మిథాలీ రాజ్‌దే కావడం గమనార్హం. ఈమె తర్వాతి స్థానాలలో 191 వన్డేలు ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్ చార్లొట్ ఎడ్వర్డ్స్ నిలవగా.. ఆమె తర్వాతి స్థానంలో 178 మ్యాచ్‌లు ఆడిన మరో భారతీయ క్రికెటర్ జులన్ గోస్వామి నిలవడం విశేషం. తన కెరీర్‌లో 9758 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్.. 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకి ఎంపికైంది. అది కూడా వరల్డ్ కప్ టీమ్‌కి కావడంతో.. అప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

శభాష్ మిథాలీ రాజ్.. మరో చరిత్ర తిరగరాసిన క్రికెట్ దిగ్గజం

అయితే ఆమెది మరీ చిన్నవయసు కావడంతో.. తనను మేనేజ్‌మెంట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదట. అయితే తనను తాను వేగంగానే నిరూపించుకుంది మిథాలీ రాాజ్. తను ఆడిన మూడవ టెస్టులోనే మంచి ఫామ్‌‌తో పాటు.. మంచి అనుభవం కలిగిన ఆటగాళ్లతో నిండిన ఇంగ్లాండ్ జట్టుపై డబుల్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మిథాలీ రాజ్. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 9758 పరుగులు చేసిన మిథాలీ.. ఇంకా దూసుకుపోతూనే ఉంది. 

మహిళా క్రికెట్ నేపథ్యంలో.. తొలి తెలుగు సినిమా ‘కౌసల్య కృష్ణ‌మూర్తి’

 

37 సంవత్సరాల మిథాలీ రాజ్ ఇటీవలే ఓ ప్రకటన చేసింది. 2021 వన్డే వరల్డ్ కప్‌లో ఆడడమే తన లక్ష్యమని ఆమె చెప్పింది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కూడా ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఆమె తన ఆలోచనలను కూడా పంచుకుంది. "కనీసం మీడియా కవరేజీ లేని రోజులనుండీ నేను క్రికెట్ ఆడుతున్నాను. మహిళలు క్రికెట్ ఆడడం అనేది ఎంత క్లిష్టమైన అంశమో నాకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నేడు మహిళా క్రికెట్‌కు కూడా పెద్ద సంఖ్యలోనే అభిమానులున్నారు" అని ఆమె తన మనసులోని భావాలను పంచుకుంది. 

హైదరాబాద్ కీ షాన్.. సూపర్ టాలెంట్ ఈ క్రీడాకారిణుల సొంతం

మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కలిగిన క్రికెటర్స్‌లో (పురుషులు, మహిళలు కలిపి) ఆమె నాల్గవ స్థానంలో ఉంది. తొలి స్థానంలో 22 ఏళ్ల 91 రోజులు క్రికెట్ ఆడిన సచిన్ టెండుల్కర్ నిలవగా.. 21 ఏళ్ల 184 రోజులు క్రికెట్ ఆడిన సనత్ జయసూర్య రెండవ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి తర్వాత 20 ఏళ్లు 272 రోజులు క్రికెట్ ఆడిన పాకిస్తాన్ ఆటగాడు జావెద్ మియాందద్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంత గొప్ప లెజెండ్స్ సరసన.. మిథాలీ రాజ్ కూడా స్థానం సంపాదించుకోవడం విశేషం. 

Featured Image: Instagram.com/Mithali Raj

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.