అమ్మవారికి ఏ రోజున.. ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

అమ్మవారికి ఏ రోజున.. ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

"యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో నమః" అంటూ.. ఆ అమ్మవారు (goddess) శక్తి రూపంలో కొలువై అందరినీ చల్లగా కాపాడాలని కోరుతూ... ఆ దేవదేవిని పూజించే వేడుకలే నవరాత్రి పర్వదినాలు. ఈ తొమ్మిది రోజుల పాటు జగన్మాత తొమ్మిది రూపాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమై.. మహర్నవమి వరకూ ఈ వేడుకలు జరుగుతాయి.

ఆ తర్వాత విజయదశమి అయిన దసరా రోజు.. అమ్మవారిని రాజరాజేశ్వరి రూపంలో కొలిచి.. పూజించి నైవేద్యాలను (nivedyams) అర్పిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు.. తొమ్మిది రకాలైన వంటకాలను అమ్మవారికి ప్రసాద రూపంలో నివేదిస్తారు. ఈ ప్రసాదాలు మనకు అమ్మ ఆశీర్వాదాలను అందించడంతో పాటు.. ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఈ క్రమంలో మనం కూడా అమ్మవారికి.. ఏయే రోజున ఏయే పదార్థాలను నైవేద్యాలుగా అర్పించాలో.. వాటి తయారీ విధానమేమిటో తెలుసుకుందాం రండి.

Instagram

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. వేడుకల్లో మొదటి రోజైన పాడ్యమి నాడు.. విజయవాడలో అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా కొలుస్తారు. సాధారణంగా మిగిలిన అన్ని చోట్ల నవ దుర్గ సంప్రదాయాన్ని పాటిస్తారు  కాబట్టి.. అమ్మవారిని శైల పుత్రిగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా అర్పిస్తారు.

పరమాన్నం తయారీ

కావాల్సినవి

పాలు - లీటర్
బాస్మతీ బియ్యం - పావు కప్పు
బెల్లం తురుము - అర కప్పు
యాలకుల పొడి - కొద్దిగా
డ్రైఫ్రూట్స్ - అలంకరణ కోసం

తయారీ

ముందుగా ఒక గిన్నెలో పాలు తీసుకొని.. అందులో నానబెట్టిన బియ్యాన్ని పోసి బాగా ఉడికించండి. మధ్యమధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోండి. ఇది కొద్దిగా ఉడికిన.. తర్వాత బెల్లం తురుము వేసి.. అది కరిగే వరకూ ఉంచాలి. ఆ తర్వాత అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత దించుకోవాలి. దించుకునే ముందు యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ వేసి కలిపితే సరిపోతుంది.

Instagram

రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా కొలుస్తారు. ఇక విజయవాడలో అయితే. ఇదే రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అవతారంలో అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా అర్పిస్తారు.

అటుకుల పాయసం తయారీ

కావాల్సినవి

అటుకులు - కప్పు
పాలు - రెండున్నర కప్పులు
బెల్లం తురుము - అర కప్పు
కొబ్బరి తురుము - రెండు టీస్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
జీడి పప్పు - గుప్పెడు
నెయ్యి - రెండు టీస్పూన్లు

తయారీ

అటుకులను నీళ్లలో వేసి ఓ నిమిషం పాటు నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు ఒంపి పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకోవాలి. అదయ్యాక కొబ్బరి తురుమును కూడా వేయించుకోవాలి. ఇవి తీసేశాక.. అదే కడాయిలో పాలు పోసి మరిగించుకోవాలి. అవి మరుగుతున్నప్పుడే అందులో బెల్లం తురుము వేసి మొత్తం కరిగే వరకూ ఉంచుకోవాలి. ఆ తర్వాత అందులో అటుకులు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇవి త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత యాలకుల పొడి చల్లి.. మొత్తాన్ని కలుపుకొని స్టవ్ కట్టేయాలి. ఆఖరున జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవాలి.

Instagram

మూడో రోజు అమ్మవారిని చంద్ర ఘంటా దేవిగా పూజిస్తారు. ఇదే రోజున విజయవాడలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా పంచుతారు.

అల్లం గారెలు తయారీ

కావాల్సినవి

మినప్పప్పు - రెండు కప్పులు
పచ్చిమిర్చి - మూడు
అల్లం - ఒక అంగుళం ముక్క
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా

తయారీ

ముందుగా మినప్పప్పును రెండు గంటల ముందు నానబెట్టి రుబ్బుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉప్పు ఓ మిక్సీ జార్‌లో వేసుకొని రుబ్బుకోవాలి. తర్వాత దీన్ని మినప పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండితో గారెలు తయారుచేసుకొని.. నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకొని తీసుకుంటే.. అల్లం గారెలు సిద్ధం.

Instagram

నాలుగో రోజు అమ్మవారిని కూష్మాండ రూపంలో కొలుస్తారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మాతను.. ఈరోజు అన్నపూర్ణా దేవిగా అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారికి దద్ద్యోజనం నైవేద్యంగా పెడతారు. కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో.. ఇదే రోజు అమ్మవారికి మాల్పువా అనే తీపి వంటకాన్ని నైవేద్యంగా పెడతారు.

దద్ధ్యోజనం తయారీ

కావాల్సినవి

బియ్యం - అర కేజీ
తాజా పెరుగు - అర లీటర్
చిక్కటి పాలు - పావు లీటర్
నెయ్యి - వంద గ్రాములు
కరివేపాకు - రెండు రెబ్బలు
ఎండు మిర్చి - ఐదు
పచ్చి మిర్చి - ఐదు
అల్లం తురుము - టీస్పూన్
ఆవాలు - టీస్పూన్
ఇంగువ - అర టీస్పూన్
మిరియాలు - టీ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - తగినంత

తయారీ

ముందుగా బియ్యాన్ని కడిగి మెత్తగా అన్నాన్ని ఉడికించుకొని చల్లార్చుకోవాలి. పెరుగులో నీళ్లు పోయకుండా గిలక్కొట్టుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం, పచ్చిమిర్చి తురుము వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాణలిలో నెయ్యి వేసి.. అందులో ఎండు మిర్చి, ఆవాలు, మిరియాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ అన్నీ వేసుకొని.. కాస్త వేగాక పెరుగులో కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసుకొని అన్నాన్ని బాగా కలుపుకోవాలి. అందులో బాగా వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలు కూడా పోయాలి. పెరుగు మాత్రమే వేస్తే.. దద్ధ్యోజనం పులవడంతో పాటు పొడిగా మారుతుంది. పాలు కూడా పోస్తే రుచి పెరుగుతుంది.

Instagram

ఐదోరోజు స్కంధ మాత రూపంలో అమ్మవారిని కొలుస్తారు. అలాగే ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మాతను లలితా త్రిపుర సుందరి అవతారంలో అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా అర్పిస్తారు.

కొబ్బరి అన్నం తయారీ

కావాల్సినవి

కొబ్బరి కాయ - ఒకటి
అన్నం - కప్పు
జీడిపప్పు - గుప్పెడు
పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు
శనగ పప్పు - టేబుల్ స్పూన్
మినప్పప్పు - అర టేబుల్ స్పూన్
నూనె - అర టేబుల్ స్పూన్
ఆవాలు - టీస్పూన్
జీలకర్ర - టీస్పూన్
ఎండు మిర్చి - రెండు
కరివేపాకు - రెండు రెబ్బలు
పచ్చిమిర్చి - మూడు
నువ్వుల పొడి - కొద్దిగా


తయారీ

ముందుగా కొబ్బరి కాయ నుంచి తురుము తీసుకొని పెట్టుకోవాలి. అలాగే బ్రౌన్ రంగు ఉన్న భాగం రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అన్నాన్ని చల్లార్చి.. అందులో ఉప్పు కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలిలో నూనె వేసి అది వేడెక్కాక పల్లీలు, శనగలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి.. అవి వేడెక్కాక కొబ్బరి తురుమును కూడా వేసి.. ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. ఆపై ఇందులో అన్నం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసి దింపుకోవాలి. అంతే కొబ్బరన్నం సిద్ధం.

Instagram

ఆరో రోజున అమ్మవారిని కాత్యాయనీ దేవి రూపంలో కొలుస్తారు. అలాగే విజయవాడలో అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించి..  రవ్వకేసరిని నైవేద్యం పెడతారు.

రవ్వ కేసరి తయారీ

కావాల్సినవి

రవ్వ - కప్పు
పాలు - అర లీటర్
చక్కెర - అర కప్పు
డ్రై ఫ్రూట్స్ - 100గ్రా.
యాలకుల పొడి - పావు టీస్పూన్
నెయ్యి - టేబుల్ స్పూన్
ఫుడ్ కలర్ - చిటికెడు

తయారీ

ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించుకోవాలి. అవి మరిగేలోపే.. పక్కన మరో కడాయి పెట్టుకొని.. అందులో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ను వేయించుకోవాలి. మిగిలిన నెయ్యిలో రవ్వ కూడా వేసి రంగు మారే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను మరుగుతున్న పాలలో వేసి.. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని పది నిమిషాల పాటు బాగా ఉడికించి.. ఆ తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసుకొని మరికాసేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని పాలలో ఫుడ్ కలర్ వేసి.. ఆ పాలను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఆఖరులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే రవ్వ కేసరి సిద్ధం అవుతుంది.

Instagram

ఏడో రోజు అమ్మవారి అవతారం కాళరాత్రి. ఈరోజు సరస్వతీ మాత పుట్టిన మూలా నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి.. అమ్మవారిని సరస్వతీ దేవి అలంకారంలో సిద్ధం చేస్తారు. నైవేద్యంగా పాయసం గుగ్గిళ్లు అర్పిస్తారు.

గుగ్గిళ్ల తయారీ

కావాల్సినవి

శనగలు - కప్పు
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
కరివేపాకు - ఒక రెబ్బ
ఆవాలు - టీస్పూన్
జీలకర్ర - టీస్పూన్
ఎండు మిర్చి - నాలుగు
నూనె - అర టేబుల్ స్పూన్

తయారీ

ముందుగా శనగలను బాగా కడుక్కొని.. రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని కుక్కర్‌లో వేసి ఉప్పు, పసుపు, నీళ్లు బాగా కలపాలి. తర్వాత నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఆ తర్వాత తీసి చల్లార్చుకోవాలి. ఆపై బాణలిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి.. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకుతో మిక్స్ చేసి.. ఆ తాలింపును శనగలతో బాగా కలుపుకోవాలి.

Instagram

ఎనిమిదో రోజు నవదుర్గల్లో మహా గౌరీ దేవిని పూజిస్తారు. అలాగే విజయవాడలో అమ్మవారిని దుర్గా దేవి రూపంలో అలంకరిస్తారు. ఆమెకు నైవేద్యంగా కదంబం పెడతారు.

కదంబం తయారీ

కావాల్సినవి

బియ్యం- కప్పు
కందిపప్పు- కప్పు
చింతపండు గుజ్జు- టీస్పూన్
బంగాళాదుంప, చిలగడదుంప, చేమదుంప, గుమ్మడికాయ, ములక్కాడ ముక్కలు - అన్నీ కలిపి మూడు కప్పులు
సాంబారు పొడి- టీస్పూన్
ఉప్పు - తగినంత
కరివేపాకు- రెండు రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
నూనె- కొద్దిగా

తయారీ

బియ్యం, కందిపప్పును విడివిడిగా ఉడికించి తీసుకోవాలి. మరో గిన్నెలో కూరగాయ ముక్కలు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిని స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు పోయాలి. అందులో చింతపండు గుజ్జు, సాంబారు పొడి, కరివేపాకు, ఉప్పు, కూరగాయముక్కలు వేయాలి. అవి కాసేపు ఉడికాక.. ఉడికించి పెట్టుకున్న పప్పు, అన్నం వేసి సన్నని మంటపై ఉంచాలి. ఈ అన్నం బాగా దగ్గరకు అయ్యాక కొత్తిమీర, నూనె వేసి దింపేయాలి.

Instagram

తొమ్మిదో రోజు అమ్మవారి రూపం సిద్ధ ధాత్రి.. ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దనిగా అలంకరించి కొలుస్తారు. ఇదే రోజు అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు.

చక్కెర పొంగలి తయారీ

కావాల్సినవి

బియ్యం - కప్పు
పెసర పప్పు - అర కప్పు
పాలు - కప్పు
చక్కెర - అర కప్పు
నెయ్యి - ఐదు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - పది
కిస్ మిస్ - పది
కొబ్బరి ముక్కలు - కొన్ని
యాలకుల పొడి - టీస్పూన్

తయారీ

ముందుగా కళాయిలో టీస్పూన్ నెయ్యి వేసి.. అందులో పెసరపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో బియ్యం, పెసరపప్పు కలిపి.. అందులోనే నాలుగు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తర్వాత అందులో చక్కెర, పాలు పోసి కాసేపు ఉంచి.. కొబ్బరి ముక్కలు వేయాలి. పొంగలి బాగా ఉడికిన తర్వాత.. డ్రై ఫ్రూట్స్ జల్లుకొని దింపుకుంటే సరిపోతుంది.

Instagram

పదో రోజు అమ్మవారి రూపం రాజరాజేశ్వరీ దేవి. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన పులిహోర, గారెలు నైవేద్యంగా అర్పించి.. దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

పులిహోర తయారీ

కావాల్సినవి

బియ్యం - కేజీ
చింతపండు - 125 గ్రా
ఎండుమిర్చి - 50 గ్రా
పచ్చిమిర్చి - 50 గ్రా
శనగ పప్పు - 50 గ్రా
మినప్పప్పు - 50 గ్రా
ఆవాలు - 25 గ్రా
నూనె - 125 గ్రా
కరివేపాకు - 3 రెబ్బలు
పసుపు - ఒక చిన్న చెంచా
ఉప్పు - తగినంత
జీలకర్ర - 25 గ్రా

తయారీ

ముందుగా చింతపండును నానబెట్టి తగినంత ఉప్పు వేసి.. చిక్కగా రసం చేసి పెట్టుకోవాలి. తర్వాత అన్నాన్ని పొడిపొడిగా వండుకోవాలి. మరీ మెత్తగా కాకుండా.. కాస్త తక్కువగా ఉడికేలా చేయాలి.  తర్వాత అన్నాన్ని ఓ పెద్ద ప్లేట్‌లో వేసి చల్లార్చుకోవాలి. తర్వాత  ఒక బాణలిలో నూనె వేడిచేసి.. అందులో శనగ పప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కాస్త వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.

కావాలంటే కాస్త ఇంగువ కూడా చేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముప్పావు వంతు తీసుకొని.. దాన్ని అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. మిగిలిన పావు వంతు భాగంలో చింతపండు రసం పోసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత దీన్ని కూడా అన్నంలో వేసుకొని కలుపుకుంటే చింతపండు పులిహోర సిద్ధం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.