ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
రెడ్ లైట్ ఏరియా అమ్మాయిని.. అమెరికన్ యూనివర్సిటీకి చేర్చిన ప్రేమ..!

రెడ్ లైట్ ఏరియా అమ్మాయిని.. అమెరికన్ యూనివర్సిటీకి చేర్చిన ప్రేమ..!

మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు.. అప్పుడప్పుడు మనకు చేదు అనుభవాలనూ మిగులుస్తాయి. అయితే చిత్రమేంటంటే.. మనకు తెలియకుండానే మనం కోల్పోయినదాని కంటే ఎక్కువే మనకు తిరిగొస్తుంది. ప్రతీసారి అదృష్టం మనల్ని మోసం చేయాలని ఏమీ లేదు. కొన్నిసార్లు దేవుడు కూడా మన పక్షాన నిలుస్తాడు. ఈ తొలి ప్రేమ కథ వింటే.. మీరు కూడా ఈ మాటను కచ్చితంగా నమ్ముతారు. మన ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. అవి మన భవిష్యత్తును నిర్ధారించలేవు. 

ఈ వాదనను నిజమని నిరూపించింది..  రెడ్ లైట్‌‌కు చెందిన ఓ అమ్మాయి ప్రేమ కథ. చీకటి దారుల నుండి వెలుగు రేఖ వైపు పయనించిన ఓ అమ్మాయి జీవితం ఇది. తన పేరు  చెప్పకుండా తన జీవితంలో జరిగిన సంఘటనలను వెల్లడించిన.. ఆ అమ్మాయి కథ నిజంగానే స్ఫూర్తిదాయకం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఆ కథను మీరూ చదవండి.

నా పేరు రోషిణి. నేను ఆదిలాబాద్ జిల్లాలో ఓ చిన్న పల్లెటూరికి చెందిన అమ్మాయిని. నాకు పన్నెండేళ్ల వయసున్నప్పుడే మా అమ్మ, నాన్న చనిపోయారు.  నేను నాలుగో తరగతి వరకే చదువుకున్నాను. అమ్మ.. నాన్న చనిపోయాక.. మా దూరపు బంధువులైన భార్యభర్తలిద్దరు.. నన్ను వాళ్లింటికి తీసుకెళ్లారు. నేను వారిని  అత్తా, మామ అని పిలిచేదాన్ని. వాళ్లతో పాటు నేను కూడా హైదరాబాద్‌కి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాక నాకు కష్టాలంటే ఏంటో అర్థమయ్యాయి. అత్తయ్యకి నేను వాళ్లింట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు.

నన్నెప్పుడూ తిడుతూ, కొడుతూ ఉండేది. నన్ను స్కూల్‌కి పంపలేదు సరికదా.. రాత్రుళ్లు నిద్ర కూడా పోనియకుండా పని చేయించుకునేవారు. జంతువుల కంటే హీనంగా చూసేవారు. ఒక రోజు మామయ్య నన్ను ఓ చోటికి తీసుకెళ్లాడు. అక్కడి వ్యక్తులతో కలిసి కొన్ని రోజులు ఉండమన్నాడు. కానీ అతడు నన్ను అమ్మకానికి పెట్టడానికే, ఆ చోటుకి తీసుకొచ్చాడని నాకు నెమ్మదిగా అర్థమైంది. అది ఓ రెడ్ లైట్ ఏరియా (Red Light Area). ఆ విషయం నాకు వేగంగానే అవగతమైంది.  చిమ్మ చీకటిలో.. వాసన వేస్తూ ఉండే ఆ చోట నేను ఉండనని మామయ్యను కాళ్లు పట్టుకొని బతిమాలాను.

ADVERTISEMENT

కానీ తను నా మాట వినకుండా వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడున్న కమలత్త నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. మా అమ్మ తర్వాత.. నాతో అంత ప్రేమగా మాట్లాడిన వ్యక్తి ఆమె మాత్రమే. “నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నుంచి ఇదే నీ ఇల్లు. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండచ్చు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భావించినా.. బాధపడుతున్నట్లు తెలిసినా.. ఇక్కడున్నవాళ్లు నీ జీవితాన్ని మరింత కఠినంగా మారుస్తారు. నీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేవరకూ ఇక్కడే ఉండు. ఆ తర్వాత నీతో సొంతంగా వ్యాపారం పెట్టించడం లేదా నిన్ను వేరేవాళ్లకు అప్పగించడం చేస్తాను” అంటూ చెప్పింది.

 

చూస్తుండగానే రెండేళ్లు పూర్తయిపోయాయి. నేను కూడా నా పరిస్థితిని ఒప్పుకొని వాళ్లతోనే ఆనందంగా జీవించడం ప్రారంభించాను. కమలత్త నన్ను తన కూతురిలా చూసుకునేది. పద్దెనిమిదేళ్లు వచ్చాక.. నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఆలోపే.. నాకు మిగిలిన ఈ కొద్దిపాటి సమయంలోనే నేను చదువుకోవాలనుకున్నా. రేపటి గురించి ఆలోచించి.. ఈరోజును నాశనం చేసుకోవాలనుకోలేదు.

ADVERTISEMENT

నా కోరికను కమలత్తకు చెప్పాను. ఆమె మా దగ్గరికి వచ్చే ఓ సోషల్ వర్కర్‌కి నా గురించి చెప్పింది. ఆమె వారి సంస్థ ఆఫీసులో నేను చదువుకోవడానికి ఏర్పాట్లు చేసింది. నా ఆనందానికి అవధులు లేవు. ఆ సంస్థలో నాకు చదువు చెప్పేవారిలో సుశీల్ కూడా ఒకరు. ఆయన పీహెచ్‌డీ చేస్తూ సోషల్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నాకు పాఠాలు చెబుతున్న సందర్భంలో.. ఆ పరిచయం నా జీవితాన్ని మార్చేస్తుందని నేను అస్సలు భావించలేదు.

ఆ సంస్థలో సుశీల్‌తో పాటు ఐదారుగురు టీచర్లు ఉన్నారు. వారందరూ నాలాంటివాళ్లకు చదువు చెబుతుంటారు. ఒక్క సంవత్సరంలోనే ఐదు సంవత్సరాల చదువు చెప్పి.. పదో తరగతి పరీక్షలు రాయిస్తారు. ఆ తర్వాత ఇంకా చదువుకోవడానికి స్కాలర్ షిప్ కూడా అందేలా చేస్తారు. అలా నేను పదో తరగతి పరీక్షలు పూర్తిచేశాను. ఈలోపు నాకు సుశీల్ పై చాలా ప్రేమ ఏర్పడింది. ఆయనతో ఎప్పుడూ అలా మాట్లాడుతూనే ఉండిపోవాలనిపించేది. ఈలోపు నా ఇంటర్ పరీక్షలు దగ్గర పడ్డాయి.

“నేను ఈ పరీక్షలు బాగా రాస్తే.. నేను అడిగింది ఇస్తానని” సుశీల్ చెప్పాడు. నేను చాలా బాగా చదివి అద్భుతమైన మార్కులు సంపాదించడంతో పాటు.. అమెరికాలో చదువుకోవడానికి స్కాలర్ షిప్ కూడా సంపాదించాను. చిత్రమేంటంటే.. నేను ఏ యూనివర్సిటీలో చదవడానికి స్కాలర్ షిప్ పొందానో.. అదే యూనివర్సిటీలో సుశీల్ రీసర్చ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు రావడానికి సుశీల్ పనిచేస్తున్న ఎన్జీఓ ఎంతగానో తోడ్పడింది. నేను వెళ్లిపోతున్న సమయంలో.. కమలత్త నన్ను చూసి బాగా ఏడ్చేసింది. ఆ తర్వాత నేను అమెరికా వెళ్లిపోయాను”

 

ADVERTISEMENT

వెళ్లేముందు సుశీల్ “నీకేం కావాలి” అని అడిగినప్పుడు.. నేను బదులిస్తూ ” నువ్వే కావాలి” అని చెప్పా. తనకు అర్థం కాకపోతే “ఐ లవ్ యూ” అంటూ తనని ప్రపోజ్ చేశాను. ఈ విషయం తనకు చెప్పడానికి నేను చాలా భయపడ్డాను. కానీ ధైర్యం కూడగట్టుకొని చెప్పా. కానీ తన రిప్లై విని.. నేను చాలా బాధపడ్డా.

నేను ప్రపోజ్ చేయగానే “నీలాంటి వాళ్లు చేతి వేలు అందిస్తే.. చేయి పట్టుకోవాలనుకుంటారు. నీలాంటివాళ్లు కేవలం ఆనందం పొందేందుకు మాత్రమే. కానీ ప్రేమించి పెళ్లాడేందుకు పనికి రారు” అని నిర్మోహమాటంగా చెప్పాడు. “నన్ను ఆ నరక కూపం నుండి బయటకు తీసుకొచ్చిన వ్యక్తేనా.. ఇలాంటి మాటలు అంటుంది..” అని నన్ను నేనే నమ్మలేకపోయాను.  అది వినగానే ‘నేను నా తాహతుకు మించి అడిగానేమో’ అనిపించింది. నాలాంటి వాళ్లు ప్రేమకు ఎందుకు పనికిరారు? నేనేం తప్పు చేశాను.. అంటూ ఆరోజు చాలా ఏడ్చాను.

ఆ తర్వాత నన్ను నేను నిరూపించుకునేందుకు అమెరికా వెళ్లా. కానీ తనని మర్చిపోలేకపోయా. దీనికి తోడు సుశీల్ కూడా నేను చదివే యూనివర్సిటీలోనే రీసర్చ్ చేస్తుండడంతో.. మేమిద్దరం ఎదురెదురు ఫ్లాట్స్‌లోనే ఉండేవాళ్లం. తనని అలా తరచూ చూడడం నన్ను చాలా బలంగా మార్చింది. తనకు నేనంటే ఏంటో నిరూపించి.. నాలాంటి వాళ్లు కూడా జీవితంలో అన్నీ సాధించగలరని.. అనుకున్న స్థాయికి చేరుకోగలరని నిరూపించాలనుకున్నా. కష్టపడి చదివా. మంచి మార్కులతో పాసవ్వడం మాత్రమే కాదు.. మంచి ఉద్యోగం కూడా సంపాదించాను.

ADVERTISEMENT

ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చాక జరిగిన సంఘటన గురించి మాత్రం.. నేను కలలో కూడా ఊహించలేదు. నేను ఎయిర్ పోర్ట్‌లో దిగగానే కమలత్త బ్యాండ్ బాజాతో నన్ను రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత ఓ అబ్బాయి నా దగ్గరికి వచ్చి నన్ను ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగాడు. అతడు ఎవరో కాదు.. సుశీల్. “తను ముందు నుంచే నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. అయితే నా ప్రేమను స్వీకరిస్తే.. నేను అతనితోనే ఉండిపోయి.. చదువుకి స్వస్తి చెప్పేస్తాను. అలాగే స్కాలర్ షిప్ కూడా వదిలేస్తాను కాబట్టి.. నేను జీవితంలో ఏదైనా సాధించాలన్న కోరికతో తను నాకు అలా అబద్ధం చెప్పాడని… నన్ను కించపర్చేలా మాట్లాడాడని” చెప్పాడు. ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం.

మా పెళ్లయి ఇప్పుడు పది సంవత్సరాలు అయింది. మాకు ఐదేళ్ల పాప కూడా ఉంది. నేను ఉద్యోగంతో పాటు సోషల్ వర్క్ కూడా చేస్తున్నా. కమలత్త తన పని మానేసి.. నాతో పాటు ఉండిపోయింది. అలా రెడ్ లైట్ ఏరియాకి చెందిన అమ్మాయిల జీవితంలో వెలుగును నింపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
27 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT