రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగేద్దాం.. ఎన్నో అద్భుత ప్రయోజనాలు పొందేద్దాం..!

రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగేద్దాం.. ఎన్నో అద్భుత ప్రయోజనాలు పొందేద్దాం..!

నీళ్లు (water) .. ఈ భూమ్మీద లభించే వనరులలో ఎంతో ముఖ్యమైనవి. ఎలాంటి క్యాలరీలు లేని ఈ నీళ్లు దేనితోనైనా కలిసిపోతాయి. మనకు ఆరోగ్యానికి నీళ్లు ఎంతగా తోడ్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అత్యద్భుతమైన  ప్రయోజనాలున్న మ్యాజికల్ డ్రింక్ వాటర్.

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిసినా.. వాటిని తాగని వారు చాలామందే ఉంటారు. దీనికి కారణం వారికి గుర్తు లేకపోవడమో.. నిర్లక్ష్యమో లేక మాటిమాటికీ బాత్రూంకి వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయమో కావచ్చు. అయితే కాస్త ఇబ్బందిని అధిగమిస్తే చాలు.. నీళ్లు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. 

నేనైతే రోజుకి ఐదు లీటర్లు (liters) నీళ్లు తప్పకుండా తాగుతాను. ఈ అలవాటు నాకందించిన ప్రయోజనాలను గురించి తెలిసాక.. మీరు కూడా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తారని నా నమ్మకం.

మా అమ్మ నా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే నేను సాధారణంగానే కాస్త ఎక్కువగా నీళ్లు తాగేదాన్ని. దీనివల్ల నా జీర్ణ శక్తి బాగుండేది. అలాగే  పెద్దగా బరువు కూడా పెరిగేదాన్ని కాదు. 

అయితే ఇటీవలే మెడిసిన్ చదువుతున్న నా స్నేహితురాలు.. నాకు నీళ్ల గురించి ఓ రహస్యం చెప్పింది. నీళ్లు తాగడం వల్ల స్వతహాగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలుంటాయని ఆమె తెలిపింది. శాస్త్రీయంగా కూడా అది రుజువైందని ఆమె పేర్కొంది.

నీటి ద్వారా అదనపు ప్రయోజనాలు పొందాలంటే.. సాధారణ నీటిని మాత్రమే కాకుండా డీటాక్స్ వాటర్, నిమ్మరసం వంటివి కూడా తాగి చూడమని నా స్నేహితురాలు తెలిపింది. అంతేకాదు.. కనీసం ఓ నెల పాటు రోజుకి తప్పనిసరిగా.. ఐదు లీటర్ల నీళ్లు తాగి తేడా చూడమని నాకు ఛాలెంజ్ విసిరింది. సవాళ్లంటే ఇష్టపడే నేను నీళ్లను ఎక్కువగా తాగడానికి సిద్ధపడ్డా. ఎలాగూ మూడు లీటర్ల వరకూ నీటిని తాగుతున్నా కదా.. మరో రెండు లీటర్లు తాగడం వల్ల ఇబ్బందేమీ ఉండదని భావించాను. పైగా ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో తెలుసుకోవాలని అనుకున్నాను. 

నేను అలా నీళ్లు తాగడం ప్రారంభించినప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి వచ్చింది. తొలుత రోజంతా నీళ్లు తాగేదాన్ని. కానీ రాత్రుళ్లు నిద్రకి భంగం కలగకుండా ఉండేందుకు.. మూడు నుంచి మూడున్నర లీటర్ల నీటిని మధ్యాహ్నం లోపే తాగేయడం ప్రారంభించాను. సాయంత్రం అవుతున్న కొద్దీ నీటి శాతాన్ని తగ్గించేదాన్ని. ఇంకా చెప్పాలంటే మధ్యాహ్న భోజనానికి ముందు మూడు లీటర్లు.. అలాగే భోజనం తర్వాత రెండు లీటర్ల నీళ్లు తాగడం మంచి పద్ధతని తర్వాత తెలుసుకున్నాను. 

ఈ పద్ధతి బాగా అలవాటయ్యాక.. నేను ఉదయం లేవగానే ఓ లీటర్ నీటిని తాగేసేదాన్ని. కొన్ని రోజులు అలవాటయ్యే వరకూ.. ఇలా అన్ని నీళ్లు ఒక్కసారే తాగడం వల్ల వాంతి వచ్చినట్లు అయ్యేది. కానీ ఓ వారం రోజులు అలవాటయ్యాక ఈ పద్ధతి సులువుగానే అనిపించింది. వారం రోజుల పాటు ఏమీ కలపకుండా.. కేవలం గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాను. రెండో వారం నుండి నీటిలో నిమ్మరసం కలిపేదాన్ని. దీనివల్ల నేను ఒక లీటర్ నీళ్లు తాగినా సరే.. అది నాకు చాలా సులభంగా అనిపించేది.

ఇక మిగిలిన నాలుగు లీటర్లను ఎలా తాగాలన్న ఆలోచన మొదలైంది. అందుకే భోజనానికి ముందు రెండు లీటర్లు తాగాక.. తర్వాత రెండు లీటర్లను ప్రతి అరగంటకోసారి కొద్దికొద్దిగా తాగేదాన్ని. అయితే ఓ చిన్నమాట. నీళ్లు తాగేందుకు ప్లాస్లిక్ బాటిళ్లను మాత్రం ఉపయోగించకండి. ప్లాస్లిక్ పర్యావరణానికి మాత్రమే కాదు. మన ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. గాజు గ్లాస్ లేదా రాగి బాటిల్ మాత్రమే ఉపయోగించండి. ప్రతి రెండు మూడు గంటలకోసారి నీళ్లు అయిపోగానే వాటిని తిరిగి నింపుకొని తాగండి. ఇది చాలా మంచి పద్ధతి.

నీళ్లు తాగడం ప్రారంభించిన తర్వాత.. కొన్నాళ్లకు నాలో నాకే మార్పులు కనిపించాయి. అవి నీళ్లు తాగడం వల్ల జరిగాయని.. నేను నమ్మడానికి కాస్త సమయం పట్టింది. కానీ ఆ తర్వాతే అర్థమైంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని ప్రతి భాగానికి ప్రయోజనం అందుతుందని. నేను నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల.. నా చర్మ సమస్యలు దూరమయ్యాయి.

మొటిమలు, మచ్చలు వంటివన్ని తగ్గుముఖం పడుతూ.. చర్మం పరిశుభ్రంగా మెరుస్తూ తయారైంది. సాధారణంగా రోజూ ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు కాలుష్యం నిండిన రోడ్ల గుండా ప్రయాణించాల్సి రావడం.. అలాగే ఏసీ గదుల్లో కూర్చోవడం వల్ల చర్మం రంగు తగ్గుతుంది. కానీ నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల.. మీ సహజ చర్మ ఛాయ తిరిగి మీ సొంతమవుతుంది. 

కేవలం చర్మం మాత్రమే కాదు.. నా జుట్టు కూడా మెరుస్తూ పట్టులా షైనీగా, స్మూత్‌గా మారడాన్ని నేను గమనించాను. అలాగే డల్ హెయిర్ కూడా క్రమంగా మాయమైపోయింది. చుండ్రు  సమస్యలు కూడా లేవు. వీటితో పాటు నేను మరింత బరువు తగ్గాను. 

పిరియడ్స్ కూడా రెగ్యులర్‌గా మారాయి. ఇప్పుడు అద్దం ముందు.. నన్ను నేను చూసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ పద్ధతిని నేను ఎప్పటికీ పాటించాలని నిర్ణయించుకున్నా. మరి, మీరూ ఓ నెలరోజులు ఈ "5 లీటర్ వాటర్ ఛాలెంజ్" తీసుకొని మీలో మార్పులను గమనించేయండి మరి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.