ఆకాశ మేఘాల్లో విందు ఆరగించాలని ఉందా..? అయితే హైదరాబాద్‌లో 'క్లౌడ్ డైనింగ్' ట్రై చేసేయండి

ఆకాశ మేఘాల్లో విందు ఆరగించాలని ఉందా..? అయితే హైదరాబాద్‌లో 'క్లౌడ్ డైనింగ్' ట్రై చేసేయండి

Unique Idea of Cloud Dining Restaurant in Shilparamam, Hyderabad City

ఈరోజుల్లో హైదరాబాద్ మహానగరంలో సగటు వ్యక్తులు తమ కుటుంబంతో హాయిగా, ఆనందంగా గడపడానికి వీలుగా.. ఎన్నో వైవిధ్యమైన పర్యాటక ప్రదేశాలు, టూరిస్ట్ స్పాట్‌లు, రెస్టారెంట్లు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఈ క్రమంలో ఈ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. మార్కెట్‌లో ప్రజల అభిరుచిని అంచనా వేస్తూ.. ఆ పోటీలో నిలవాలంటే.. ఎంతో వైవిధ్యంగా ఆలోచిస్తే తప్ప సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. 

అలాంటి ఒక వైవిధ్యమైన ఆలోచనతోనే హైదరాబాద్‌లోని  శిల్పారామం ఎదురుగా క్లౌడ్ డైనింగ్  పేరిట ఒక రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్  ప్రత్యేకత ఏంటంటే.. కస్టమర్లను ఒకేసారి 160 ఫీట్లతో గాల్లో తేలేలా చేస్తారట. ఒక ట్రిప్‌కి దాదాపు 26 మందిని తీసుకువెళ్లి.. అక్కడ వారికి నచ్చిన ఆహారాన్ని వడ్డించడం ఈ రెస్టారెంట్ స్పెషాలిటి.

మీరు కూడా ఒక్కసారి ఊహించుకోండి. భూమి నుండి దాదాపు 160 ఫీట్ల పైన గాలిలో తేలుతూ, చల్లటి గాలి మిమ్మల్ని తాకుతుండగా.. మీకు నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించడం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో.  అయితే గాలిలో అలా తేలుతూ విందు చేయడం అంటే..  ఒక వైపు థ్రిల్ కలిగినా.. మరోవైపు చాలా భయంగా ఉండడం కూడా సహజం. కాని కస్టమర్స్ ఎలాంటి ఆందోళనకూ గురికావాల్సిన అవసరం లేదని ఈ రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.

హైదరాబాద్ కి మణిహారం.. చౌమహల్లా ప్యాలెస్ గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?

ఎందుకంటే..ఈ డైనింగ్ ప్లాట్ ఫార్మ్‌ని చాలా ప్రత్యేకంగా సిద్ధం చేశారట. ఈ ప్లాట్ ఫార్మ్‌కి నలువైపులా 26 కుర్చీలని ఏర్పాటు చేశారు. ఆ కుర్చీలు కూడా 360 డిగ్రీలు తిరిగేలా తయారు చేయించారు. దీనితో గాలిలో ఉన్నప్పుడు మనం కుర్చీలో ఉన్నచోటు నుండే అన్నివైపులా తిరుగుతూ చూసే అవకాశం ఉంది.

ఇక ఈ 26 మందికి ఆహారాన్ని వడ్డించడానికి ఈ ప్లాట్‌ఫార్మ్ మధ్యలో కొందరు సిబ్బంది ఉంటారు. అయితే పైకి వెళ్ళాక.. వీరికి ఏమాత్రం అసౌకర్యం & ఇబ్బంది లేకుండా.. దాదాపు ఒక్కో కుర్చీకి మూడు బెల్ట్స్‌తో రక్షణ ఏర్పాట్లను కూడా చేశారట.

ఇక ఒక్కో డిన్నర్ సెషన్ దాదాపు 45 నిముషాలు ఉంటుంది. అలాగే మనం ఈ క్లౌడ్ డైనింగ్‌కి సీట్ రిజర్వ్ చేసుకునే సమయంలోనే మనకి ఏ ఆహార పదార్ధాలు కావాలో ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. సగటున 5 రకాల ఆహార పదార్ధాలను మాత్రమే ఈ డైనింగ్‌లో భాగంగా వడ్డించడం జరుగుతుంది. ఇక ధర విషయానికి వస్తే, ఒక్కో వ్యక్తి ఈ క్లౌడ్ డైనింగ్ కోసం రూ 4999/- (ఇది సోమవారం నుండి శుక్రవారం వరకు) లేదా రూ 5500/- (శనివారం & ఆదివారం) చెల్లించాల్సి ఉంటుందట.

అలాగే గర్భిణీ స్త్రీలు లేదా 4 అడుగుల 5 అంగుళాలకి తక్కువ ఉండే వ్యక్తులు.. ఈ క్లౌడ్ డైనింగ్ చేయడానికి అనుమతి లేదని యాజమాన్యం తెలపడం గమనార్హం. ఇక 18 ఏళ్ళ లోపు వ్యక్తులను.. తమ కుటుంబసభ్యుల లిఖిత పూర్వక అనుమతితోనే ఈ డైనింగ్‌కి అనుమతిస్తారట.

హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలివే...

ఇక 160 ఫీట్ల ఎత్తుకి కస్టమర్లు చేరాక.. గాలి బాగా వీస్తుందని అనిపిస్తే.. ఒక 20 ఫీట్ల ఎత్తుకి ప్లాట్ ఫార్మ్‌ని దించుతారట. అలాగే ఈ క్లౌడ్ డైనింగ్ క్రేన్ ఫిట్నెస్ మొదలైన రక్షణ చర్యలని పర్యవేక్షించే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఎల్లప్పుడూ..  ఈ రెస్టారెంటులో అందుబాటులో ఉంటారని  నిర్వాహకులు చెబుతున్నారు.

నిబంధనలకు లోబడి లేదా ఇతర కారణాలతో ఈ క్లౌడ్ డైనింగ్ చేయలేని వారికోసం క్రిందనే ఒక రెస్టారెంట్‌ని నిర్వహిస్తున్నారు యాజమాన్యం. ఇందులో కేవలం రూ 499/- కే 50 రకాల ఆహార పదార్ధాలని బఫెట్ రూపంలో అందిస్తున్నారు. దీనితో క్లౌడ్ డైనింగ్ చేయలేకపోయినా.. ఈ యాజమాన్యం నిర్వహించే మామూలు రెస్టారెంట్‌లోని బఫెట్‌లో అయినా 50 రకాల వంటకాలని రుచి చూడవచ్చు.

ఇక ఈ వంటకాలు అన్ని కూడా ప్రముఖ చెఫ్, మాస్టర్ చెఫ్ విజేతైన రిపు ధమన్ హండా నేతృత్వంలో సిద్దమవ్వడం విశేషం. ఈయన వంటకాలు రుచి చూడాలనుకునే ఎంతోమంది కూడా.. ఈ రెస్టారెంట్‌కి క్యూలు కడుతున్నారు.

తెలుసుకున్నారుగా.. గాలిలో తేలుతూ, మంచి సంగీతం వింటూ, నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించే ఈ క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్  గురించి. మరింకెందుకు ఆలస్యం.. మీలో ఎవ్వరికైనా ఈ థ్రిల్లింగ్ డిన్నర్ చేయాలనిపిస్తే.. వెంటనే క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సీట్ రిజిస్టర్ చేసుకోండి.

సంప్రదించండి : సర్వే నెంబర్ 68, ఏబీసీ, హైటెక్ సిటీ రోడ్, శిల్పారామం ఎదురుగా, మాదాపూర్, హైదరాబాద్ 500081

Image: Google Reviews

హైదరాబాద్ కి షాన్.. "ఉస్మానియా బిస్కెట్స్" చరిత్ర మీకోసం...!