హైదరాబాద్ (hyderabad) నగరానికి ఉన్న చరిత్రకు సాక్ష్యంగా ఇప్పటికీ ఎన్నో కోటలు, కట్టడాలు నగరమంతటా విస్తరించి ఉన్నాయి. అలా నిజాం రాజుల వైభవానికి ప్రతీకగా నిలిచిన కట్టడం – చౌమహల్లా ప్యాలెస్. ఇక విదేశీయులు హైదరాబాద్ నగరానికి వస్తే, వారు తప్పకుండ సందర్శించే ప్రదేశాల్లో ఈ చౌమహల్లా ప్యాలెస్ ప్రధానమైంది. ఒకప్పుడు నిజాం రాజుల అధికారిక నివాసంగా ఉన్న ఈ ప్యాలెస్ ఇప్పుడు మ్యూజియంగా అందరినీ ఆకర్షిస్తోంది.
హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలివే…
అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్ (chowmahalla palace) గురించిన విశేషాలు (interesting facts) మీకోసం-
* హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్యాలెస్ ఇరాన్ లోని షా ప్యాలెస్ ని పోలి ఉంటుంది. చౌ అంటే నాలుగు, మహల్లా అంటే ప్యాలెస్ లు అని అర్థం. నాలుగు ప్యాలెస్ లు కలిసి ఉన్నట్లుగా ఉండే ఈ కట్టడానికి చౌమహల్లా అని పేరు వచ్చింది.
* మన దేశంలో రాజరిక వ్యవస్థని రద్దు చేశాక.. తరువాత ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి ప్యాలెస్ లు నిరుపయోగంగా మారాయి. మిగిలి ఉన్న నిజాం వారసులు కూడా విదేశాల్లో స్థిరపడడంతో వారి ప్యాలెస్ లు ఇక్కడ శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. కాగా 2000వ సంవత్సరంలో హైదరాబాద్ లో ఉన్న ప్యాలెస్ లని మళ్లీ వాటి పూర్వస్థితికి తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి చౌమహల్లా ప్యాలెస్ యజమాని ముఖర్రం ఝా (Mukkaram Jah) మొదటి భార్య రాణి ఇస్రా.
* అలా రాణి ఇస్రా తీసుకున్న నిర్ణయంతో చౌమహల్లా ప్యాలెస్ 2005వ సంవత్సరంలో మొదలైన పునర్నిర్మాణ పనులు 2010వ సంవత్సరంలో ముగిశాయి. చౌమహల్లా ప్యాలెస్ పూర్వవైభవం సంతరించుకున్న తరువాత దానిని తాజ్ గ్రూప్ అఫ్ హోటల్స్ కి లీజ్ కి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ నిర్వహణ మొత్తం తాజ్ గ్రూప్ అఫ్ హోటల్స్ సంస్థ చూస్తోంది.
* ఇక అసలు ఈ చౌమహల్లా ప్యాలెస్ ని కట్టడం ఆరంభించింది 18వ శతాబ్దంలో కాగా అది పూర్తయ్యే సరికి 19వ శతాబ్దం వచ్చేసింది. సలాబత్ జంగ్ (salabat jung) ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణం 1750లో మొదలుపెడితే ఈ నిర్మాణం పూర్తయ్యేవారికి 1869 అయింది.
* ఈ ప్యాలెస్ నిర్మించిన తరువాత ఎక్కువ కాలం పాటు నిజాం రాజులు ఈ ప్యాలెస్ నే తమ అధికారిక నివాసంగా ఉపయోగించుకున్నారు.
* సుమారు 50 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రస్తుతం అక్రమ చొరబాట్లు & నిర్వహణ లోపం కారణంగా దాదాపు 12 ఎకరాల విస్తీర్ణానికి తగ్గిపోయింది.
* ఈ చౌమహల్లా ప్యాలెస్ మెయిన్ గేట్ పైన ఉన్న గడియారాన్ని ఖిల్వత్ క్లాక్ అని పిలుస్తుంటారు. ఇది దాదాపు 250 ఏళ్లుగా నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది. ఈ గడియారాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు వంశపారంపర్యంగా ఒక కుటుంబం ఉండడం విశేషం
* బెల్జియం నుండి ప్రత్యేకంగా తెప్పించిన 19 శాండ్లియర్లని ఖిల్వత్ దర్బార్ హాలులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ప్యాలెస్ కి పూర్వవైభవం తెచ్చేందుకు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది.
హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!
* ఈ చౌమహల్లా ప్యాలెస్ యజమాని, అతని తమ్ముడు కుటుంబాలతో సహా ప్రస్తుతం లండన్ లో నివాసముంటున్నారు. ఏదైనా అధికారిక పర్యటన ఉంటే తప్ప వారు హైదరాబాద్ కి రావడం జరగదు.
* ఈ ప్యాలెస్ లో ఒక్కప్పటి కౌన్సిల్ హాల్ ని ఇప్పుడు నిజాం రాజులకి సంబంధించిన వస్తువులను ప్రదర్శించే మ్యూజియంగా వినియోగిస్తున్నారు.
* ఇక ఈ ప్యాలెస్ లో అప్పటి నిజాం రాజులు వాడిన రోల్స్ రాయిస్ & మరి కొన్ని వింటేజ్ కార్లని కూడా మనం చూడవచ్చు.
* ఈ ప్యాలెస్ ని సందర్శించడానికి సమయం – ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, శుక్రవారం మినహా వారంలో మిగిలిన అన్ని రోజులు ఈ ప్యాలెస్ ని సందర్శించడానికి వీలుంది. ఈ ప్రదేశం చూసేందుకు పెద్దవాళ్లకు రూ. 50, పిల్లలకు రూ. 10 ఎంట్రీ టికెట్ ఉంటుంది.
తెలుసుకున్నారుగా.. హైదరాబాద్ నగరానికి & ఇక్కడి సంస్కృతికి అడ్డం పట్టేలా ఉన్న చౌమహల్లా ప్యాలెస్ గురించిన విశేషాలు. మీలో ఇప్పటివరకు ఈ ప్యాలెస్ ని చూడని వారు ఎవరైనా ఉంటే, వెళ్ళి సందర్శించండి.