ఆ గాయమే.. వారిద్దరి మధ్య బంధాన్ని పెంచింది : 'అజిత్, షాలిని'ల అందమైన ప్రేమకథ ..!

ఆ గాయమే.. వారిద్దరి మధ్య బంధాన్ని పెంచింది : 'అజిత్, షాలిని'ల అందమైన ప్రేమకథ ..!

(Actress Shalini Birthday Special)

"ప్రేమ పుస్తకం"  సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు అజిత్. కానీ పరిచయమైంది తెలుగు చిత్రంతోనైనా.. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకున్న వ్యక్తి ఆయన. ఇక షాలిని సంగతి చెప్పక్కర్లేదు. దక్షిణాది చిత్రాలలో బాలనటిగా తన ప్రస్థానం చాలా పెద్దది. తన చెల్లెలు షామిలితో పోటీ పడి నటించేది ఆమె.  బ్రహ్మ పుత్రుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి తెలుగు చిత్రాలలో షాలిని నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. తమిళ, మలయాళ, కన్నడ భాషలలో దాదాపు 50 పైగా చిత్రాలలో షాలిని బాలనటిగా నటించిందంటే అతిశయోక్తి కాదు. 

అయితే.. తమిళ చిత్ర పరిశ్రమతో పాటు.. తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ ఇద్దరు తారలు.. ఒకానొక సందర్భంలో ప్రేమలో పడి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారనే విషయం చాలామందికి అప్పట్లో ఆశ్చర్యమే కలిగించింది. అయితే వీరి బంధానికి నాంది పలికింది కూడా ఓ సినిమా షూటింగే కావడం విశేషం. ఆ సినిమా పేరే "అమర్ కాలమ్". 1999లో విడుదలైన ఈ చిత్ర షూటింగ్ సందర్భంలో.. హీరో, హీరోయిన్ల మధ్య ఒక చిన్న పాటి యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. అనుకోకుండా షాలిని చేతికి గాయమైందట. అది తన వల్లే జరిగిందని భావించి అజిత్ చాలా కంగారుపడిపోయారట. 

#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!

వెంటనే తనను క్షమించమని షాలినిని అడిగి.. ఆమెను అక్కడి నుండి హాస్పటిల్‌కి తీసుకెళ్లారట. అయితే "అమర్ కాలమ్" సినిమా షూటింగ్‌కు ముందే.. అజిత్‌కు షాలినికి పరిచయముండడం విశేషం. ఆ సినిమాలో నటించడానికి ఆమె తొలుత ఒప్పుకోలేదట. అందుకు కారణం ఆమె అప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ విషయం తెలిసి.. అజిత్ డైరెక్టర్‌తో మాట్లాడారట. ఆ సినిమాలో పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని.. అందుకే ఆమె పరీక్షలు పూర్తి అయ్యేవరకూ షూటింగ్ వాయిదా వేయమని కోరడంతో.. నిర్మాతలతో మాట్లాడి తను వారిని ఒప్పించడం గమనార్హం. 

షాలిని నటించిన మొదటి చిత్రం "కాదలక్కు మర్యాదై"లో నటనను చూసి.. ఆమెను అజిత్ "అమర్ కాలమ్" సినిమాకి రికమెండ్ చేశారట. అలాగే షాలిని ఎగ్జామ్స్ పూర్తయ్యాక.. తను నటించిన కొత్త సినిమా "కాదల్ మన్నన్" ప్రీమియర్‌కి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారట అజిత్. అయితే ఆ ప్రీమియర్‌కి షాలిని కర్లీ హెయిర్‌తో రావడం అజిత్‌కి నచ్చలేదు. "నేను ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దు. మీకు కర్లీ హెయిర్ అంతగా బాగాలేదు. "కాదలక్కు మర్యాదై" సినిమాలో చూడండి.. ఎంత బాగున్నారో.. మీ హెయిర్‌ను ఓపెన్‌గా వదిలేస్తేనే అందంగా కనిపిస్తారు" అని ఆయన మొహమాటం లేకుండా చెప్పేయడంతో షాలిని ఆశ్చర్యపోయిందట. 

'న్యాచురల్ స్టార్ నాని - అంజన'ల.. న్యాచురల్ ప్రేమకథ మీకు తెలుసా!!

అయితే తను అలా నిర్మొహమాటంగా, నిజాయితీగా మాట్లాడడమే తనకు నచ్చిందని షాలిని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. "అమర్ కాలమ్" షూటింగ్‌‌లో షాలినికి అయ్యింది చిన్న గాయమైనా.. ఆ తర్వాత తనను కంటికి రెప్పలా కాపాడుకొనేవారట అజిత్. చాలా ఎక్కువగా కేర్ తీసుకొనేవారట. ఈ క్రమంలోనే ఒకానొక సందర్భంలో ఆమెను ప్రేమిస్తున్నానని తన మనసులోని మాటను కూడా చెప్పేశారట అజిత్. తొలుత తటాపటాయించినా.. తర్వాత షాలిని కూడా ఒప్పుకోవడంతో.. ఆమె అజిత్‌కు శ్రీమతిగా మారింది. తను అప్పటికే సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసి.. ఆమె అజిత్‌ను పెళ్లి చేసుకోవడం విశేషం. ఆమె చివరిగా నటించిన సినిమాలలో మణిరత్నం దర్శకత్వం వహించిన "అలైపయుతే" కూడా ఒకటి. మాధవన్ సరసన ఈ చిత్రంలో షాలిని నటించగా.. ఇదే చిత్రం తెలుగులో "సఖి" పేరుతో డబ్ చేయబడి.. ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది. 

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ - మెగా బిజినెస్ ఉమన్ ఉపాసనల.. ప్రేమ బంధం గురించి తెలుసుకుందామా?