ఆ విషయంలో ప్రభాస్, నేను ఒకేలా ఆలోచిస్తాం : పూజా హెగ్డే

ఆ విషయంలో ప్రభాస్, నేను ఒకేలా ఆలోచిస్తాం : పూజా హెగ్డే

పూజా హెగ్డే (Pooja Hegde).. తెలుగులో చేసినవి నాలుగైదు సినిమాలే అయినా..  టాప్ హీరోలందరి సరసన నటించిన అందాల నటి. బాలీవుడ్‌లోనూ వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకొని.. తన కెరీర్‌‌ని అద్భుతంగా కొనసాగిస్తోంది పూజ. తాజాగా "హౌజ్ ఫుల్ 4"లో అక్షయ్ సరసన నటించిన పూజ.. ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన మరోసారి "అల వైకుంఠపురములో" సినిమాలో కనువిందు చేయనుంది. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటోంది ఈ ముంబయి భామ. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ (Prabhas) సరసన "జాన్" అనే పిరియడ్ డ్రామాలో నటించేందుకు కూడా సైన్ చేసిందట పూజ. 

"బాహుబలి" తర్వాత ప్రభాస్‌కి కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఏర్పడ్డారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం బహుభాషా చిత్రంగా రూపొందుతోన్న "జాన్"లో ప్రభాస్ సరసన నటిస్తోన్న పూజ  కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో నేను కలిసిన అత్యద్భుతమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు. తనంత మంచి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. తను చాలా సింపుల్. అంత పెద్ద స్టార్ అయినా.. ఆ ఫీలింగ్ తనలో అస్సలు కనిపించదు. అంత మంచి వ్యక్తి కాబట్టే బాహుబలి లాంటి సినిమా అంత కష్టపడి.. అన్నేళ్ల పాటు సమయం వెచ్చించి మరీ చేయగలిగాడు.

తన ఫ్యాన్స్ ఎలాంటివాళ్లో "సాహో" విజయంతో అందరికీ అర్థమైంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్‌ని ఇంటర్నేషనల్ స్టార్‌గా నిలబెట్టాయి. ఓసారి నేను అమెరికా వెళ్లినప్పుడు అక్కడి వారు నన్ను నా దేశం గురించి అడిగారు. నేను ఇండియన్ అని చెప్పగానే.. ఓహ్.. "మీరు ప్రభాస్ దేశానికి చెందినవాళ్లా?" అనడం నన్ను చాలా ఆశ్చర్యపర్చింది. తను ఓ పెద్ద స్టార్. సినిమా ఎలా ఉన్నా సరే.. ప్రభాస్ నటనను చూసేందుకు అయినా అభిమానులు థియేటర్‌కి వస్తారు. ఇక స్క్రిప్టు బాగుంటే.. మరిన్ని కలెక్షన్లు వస్తాయి. సల్మాన్, ప్రభాస్ లాంటి వారి సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్లు అవసరం లేదు. వాటిని చూసేందుకు జనాలు అలా వచ్చేస్తారంతే" అని చెప్పుకొచ్చింది పూజ.

అంతేకాదు.. ప్రభాస్ చాలా పెద్ద భోజన ప్రియుడని చెప్పిన పూజ.. తను కూడా వాళ్ల ఇంటి నుంచి బిర్యానీ తెప్పించుకొని తింటానని వెల్లడించింది. "ప్రభాస్ ఎంత పెద్ద ఫుడీ అనేది తన ఫ్యాన్స్‌కి, తనతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరికీ తెలుసు. తనకు భోజనం అంటే ఎంతో ఇష్టం. నాక్కూడా అదంటే ఇష్టం. ఈ విషయంలో మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. కాబట్టి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. వాళ్ల కుక్ చాలా మంచి వంటకాలు చేస్తారు. ముఖ్యంగా వాళ్ల ఇంటి నుంచి వచ్చిన బిర్యానీ అంటే నాకెంతో ఇష్టం. నేను సిగ్గులేకుండా తనని మాటిమాటికీ.. మీ ఇంటి నుంచి మటన్ బిర్యానీ తీసుకురండి అని అడిగి మరీ తెప్పించుకొని తింటున్నాను. అందుకే నా కుటుంబంతో కలిసి షూటింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చింది పూజ.

ఇక తన సినిమా "జాన్" గురించి కూడా చెప్పుకొచ్చింది పూజ. "ఇది ద్విభాషా చిత్రం. హిందీ, తెలుగు రెండు భాషల్లో రూపొందుతోంది. 2020లో దీన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.. ఈ సినిమా చేయడం నాకెంతో ఆనందంగా అనిపిస్తోంది. ఇది నేను చదివిన స్క్రిప్టుల్లో అత్యద్బుతైన స్క్రిప్టు. సినిమా షూటింగ్ ఇప్పుడిప్పుడే ప్రారంభించాం. ఇది యూరప్‌కి చెందిన పిరియడ్ డ్రామా. పాత కాలం నాటి కథ కాబట్టి.. అప్పటి స్టైల్ యూరోపియన్ కాస్ట్యూమ్స్‌లో మేం కనిపిస్తాం. కొంత షెడ్యూల్ ఇటలీలో, ఆపై మిగిలినది హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాం.. మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది" అని చెప్పుకొచ్చింది పూజ.

ప్రస్తుతం పూజ నటించిన అల వైకుంఠపురములో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ప్యారిస్, హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్‌లో పాల్గొంటోంది పూజ. తెలుగులో చాలామంది కథానాయికలు పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినా డబ్బింగ్ మాత్రం చెప్పుకోలేదు. కానీ రెండు, మూడు సినిమాల్లో నటించిన పూజ మాత్రం "అరవింద సమేత" సినిమా నుంచి డబ్బింగ్ చెప్పుకోవడం ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమె వాయిస్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమాకు డబ్బింగ్ చెప్పిన పూ..జ ఇప్పుడు రెండో చిత్రంలోనూ తన గొంతుకనే వినిపించాలనుకుంటోందట. ఈ సినిమా ఆమెకు అల్లు అర్జున్‌తో రెండో సినిమా. అలాగే త్రివిక్రమ్‌తో కూడా రెండో సినిమా కావడం విశేషం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.