యాడ్ షూట్‌లో కలిసి జీవితాంతం ఒకరికి ఒకరై : విరాట్ - అనుష్కల అద్భుత ప్రేమకథ ..!

యాడ్ షూట్‌లో కలిసి జీవితాంతం ఒకరికి ఒకరై : విరాట్ - అనుష్కల అద్భుత ప్రేమకథ ..!

విరాట్ కోహ్లీ (Virat Kohli) & అనుష్క శర్మ (Anushka Sharma).. మన దేశంలో ఎక్కువ మంది ఆరాధించే సెలబ్రిటీ జంటల్లో వీరూ ఒకరు.  ఒకరేమో మన దేశంలో ఎక్కువమంది ఆరాధించే మన దేశపు క్రికెట్ జట్టుకి కెప్టెన్ కాగా.. మరొకరు బాలీవుడ్‌లో టాప్ కథానాయికగా పేరు తెచ్చుకున్న అందాల నటి.

'ఉప్పెనంత ప్రేమ'కి సాక్ష్యం అంటున్న.. డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి

వీరి మధ్య ప్రేమ చిగురించడం.. క్రమంగా అది పెళ్లి వరకు దారి తీయడం.. ఈ క్రమంలో ఇప్పుడు వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం  మనందరికీ తెలిసిన విషయాలే. అయితే వారి ప్రేమ గురించి బయటకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు విరాట్ కోహ్లీ జన్మదినం సందర్భంగా .. తన ప్రేమ కథ (Love story) గురించి మరోసారి తెలుసుకుందాం..

2013లో ఒక యాడ్ షూటింగ్‌లో తొలిసారి కోహ్లీ, అనుష్కలకు  పరిచయమైంది. "మొదటిసారి అనుష్కను కలిసినప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యా. దాన్ని దూరం చేసుకోవడానికి తన హీల్స్ గురించి ఓ జోక్ వేశా. నేను ఆరు అడుగుల ఎత్తు లేను కాబట్టి.. మీరు మరీ ఎత్తైన హీల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదంటూ జోక్ చేశాను. దాంతో ఇద్దరం నవ్వుకున్నాం. కానీ అలా అన్నందుకు నాకే ఏదోలా అనిపించింది. కానీ ఆ తర్వాత ఇద్దరం క్లోజ్ అయ్యాం. ఆ షూటింగ్ మూడు రోజుల పాటు కొనసాగింది. ఆ మూడు రోజుల్లో మేమిద్దరం.. మంచి స్నేహితులుగా మారిపోయాం" అంటూ తమ పరిచయం గురించి విరాట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులగా కొనసాగినా.. తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. సరిగ్గా వీరి ప్రేమ కథ మొదలైన తరువాతి సంవత్సరం.. అనగా 2014లో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన విరాట్ కోహ్లీ తన ఫామ్‌ని కోల్పోయాడు. అప్పుడు విమర్శకులందరూ కూడా అనుష్క శర్మనే దీనికి కారణంగా చూపడం జరిగింది.

ఇక ఆ తరువాత ఏడాది 2015 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడగా.. లక్ష్య ఛేదనలో మన జట్టు తడబడింది. అదే క్రమంలో విరాట్ కోహ్లీ కూడా విఫలం అయ్యాడు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న అనుష్క శర్మనే మరోసారి బాధ్యురాలిని చేస్తూ విమర్శలు వచ్చాయి.

అయితే ఈ విమర్శల పై వీరిరువురు ఎటువంటి కామెంట్ చేయలేదు. 2015లో అనూహ్యంగా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ఒకరికొకరు దూరమయ్యారన్న భావనను కలిగించారు. ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయన్న భావనను కలిగేలా చేశారు. దీనితో వీరిద్దరి మధ్య బంధం తెగిపోయింది. అందరూ ఊహించినట్టుగానే 'ఓ సినిమా నటి, క్రికెటర్‌ల మధ్య ప్రేమలు ఎక్కువ కాలం మనలేవు' అనడానికి వీరి జంట కూడా ఒక సాక్ష్యం అంటూ కామెంట్స్ వచ్చాయి.

కాకపోతే వీరిద్దరూ మీడియా దృష్టిని మరల్చడానికి మాత్రం.. ఇది వారు వేసిన ఓ ఎత్తుగడ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2015 సంవత్సరం పూర్తయ్యేసరికి విరాట్ కోహ్లీ తాను కోల్పోయిన ఫామ్‌ని మరలా పొందగలిగాడు. ఇక ఆ సమయం నుండి ఇప్పటివరకు తను వెనుతిరిగి చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఒక బ్యాట్స్ మెన్‌గా ఏవైతే రికార్డులు సాధించాలో అన్నీ సాధించి.. అందులో దాదాపు 90 శాతం రికార్డులని తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికి కూడా అలా దూసుకుపోతూనే ఉన్నాడు.

'అమల - నాగార్జునల' ప్రేమకథ ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అంతే స్ఫూర్తినీ నింపుతుంది..!

ఇక మళ్ళీ తన ఫామ్ పొందిన తరువాత.. తన పునరాగమనానికి కారణం అనుష్క శర్మ అని చెప్పకనే చెప్పడంతో పాటు.. స్టాండ్స్‌లో అనుష్క ఉన్నప్పుడు మైదానం నుంచి ఆమెకు ముద్దులు సైతం విసిరాడు. ఆమెకు తన గెలుపును అంకితం చేయడం లాంటి సంఘటనలు.. వీరి మధ్య ఉన్న బంధం ఎంత దృఢమైనదో అందరికి తెలియజేశాయి. 

అలా వీరి ప్రేమ బంధంతోనే విమర్శకులకు సమాధానం చెప్పిన ఈ జంట, తమ బంధాన్ని మూడు ముళ్ళతో కలకాలం నిలుపుకొనేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వీరిరువురు ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్‌లో కుటుంబసభ్యుల మధ్య 11 డిసెంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ముందు అసలు ఎవరికీ ఏమాత్రం సమాచారం ఇవ్వకపోవడం విశేషం.

వీరి పెళ్లికి కూడా కేవలం 42 మందిని మాత్రమే ఆహ్వానించారట. అందులో వారి దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే ఉన్నారు. అయితే ఈ వివాహ వేడుక తర్వాత దిల్లీలో ఒకటి, ముంబైలో ఒకటి.. రెండు రిసెప్షన్లు ఇచ్చి తమ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులతో పాటు సెలబ్రిటీలందరినీ ఆహ్వానించారు. 

ఇక వీరిప్పుడు భార్యాభర్తలుగా కూడా ఎంతోమంది నూతన జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రికెట్ ఆడేటప్పుడు తన ధ్యాస ఎలాగైతే పక్కకి మళ్ళదో.. అదే సమయంలో క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా తన భార్యతో తప్ప మరెక్కడా కూడా కనిపించడు విరాట్ కోహ్లీ. కాస్త సమయం దొరికినా సరే.. వీరిరువురు ఏదైనా ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటారు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ పుట్టినరోజు (Virat Kohli Birthday) సందర్భంగా ఈ ఇద్దరు కూడా ప్రకృతితో గడపడానికి ట్రెక్కింగ్ చేస్తూ.. కొండల మధ్య ప్రకృతి ఒడిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఏదేమైనా.. ఎన్ని అడ్డంకులు, విమర్శలు లేదా ప్రతికూలాంశాలు ఎదురైనా సరే.. నమ్మకంతో, ధైర్యంతో ముందుకి వెళ్ళాలని ఈ జంట నిరూపించారు.

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!