'కొత్త' అమ్మాయిలైనా.. తమ నటనతో 'ఫిదా' చేసేశారు (Top Telugu Debut Actresses in 2019)

'కొత్త' అమ్మాయిలైనా.. తమ నటనతో 'ఫిదా' చేసేశారు  (Top Telugu Debut Actresses in 2019)

Top Telugu Debut Actresses in Tollywood - 2019

ప్రతి సంవత్సరం చిత్ర పరిశ్రమలోకి ఎందరో కొత్త నటీనటులు అడుగుపెడుతూనే ఉంటారు. వారిలో అతితక్కువ మంది మాత్రమే పరిశ్రమలో నిలదొక్కుకుంటారు. మిగతావారు మాత్రం అదృష్టం కలిసిరాక.. అవకాశాలు అందక వెనుతిరిగి పోతుంటారు. ఇక నటీమణుల విషయానికి వస్తే.. ఈ మాట నిజమే అనిపిస్తుంది. 

కారణం - హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ అనేది ఎప్పుడూ వారి సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే వయసు ఇక్కడ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ప్రారంభించినా.. లైమ్ లైట్‌లో ఉండే నటీమణుల సంఖ్య కూడా రోజు రోజుకీ తగ్గుముఖం పడుతోంది.

అందుకనే ప్రతి సంవత్సరం ఎంతమంది కొత్త నటీమణులు వచ్చినా..  అందులో ఎందరు సక్సెస్‌ని అందుకుని సినీ కెరీర్‌లో దూసుకుపోతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. 

ఇక ఈ కథనం విషయానికి వస్తే.. 2019 సంవత్సరంలో  తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన నటీమణులలో.. నిజంగానే ప్రేక్షకుల మనసును దోచిన టాప్ 10 హీరోయిన్ల జాబితాల మీకోసం ప్రత్యేకం. 

ఒకప్పటి బాల నటులు... నేడు స్టార్ హీరో హీరోయిన్లు.. వారెవరంటే..?

అనన్య నాగళ్ల (మల్లేశం) 

పరభాషా హీరోయిన్లు టాలీవుడ్‌లో రాజ్యమేలుతున్న క్రమంలో.. ఓ చక్కటి తెలుగింటి అమ్మాయి అనన్య నాగళ్ల ఈ ఏడాది తెరంగేట్రం చేసింది. ప్రముఖ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో.. మల్లేశం భార్య పాత్రలో అనన్య ఒదిగిపోయి నటించింది. ఆమె నటన ఎంత సహజంగా ఉందంటే.. ఆమె తప్ప మరొకరు ఈ పాత్రకు న్యాయం చేయలేరని మనం కచ్చితంగా చెప్పవచ్చు. అనన్యకి చాలా మంచి భవిష్యత్తు ఉందని.. పలువురు సినీ విశ్లేషకులు కూడా  అభిప్రాయపడడం విశేషం. 

 

ప్రియాంక అరుళ్ మోహన్  ( గ్యాంగ్ లీడర్)

నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో హీరోయిన్‌‌గా చేసిన నటి ప్రియాంక అరుళ్ మోహన్. చెన్నై నుండి వచ్చిన ఈ భామ తన పాత్ర పరిధి మేరకు బాగా నటించి.. మంచి హీరోయిన్‌‌గా పేరు తెచ్చుకోగలిగిందని మాత్రం చెప్పవచ్చు.

 

శ్రద్ధ శ్రీనాధ్  (జెర్సీ)

'జెర్సీ' చిత్రంలో హీరో నానితో పాటు నటించిన శ్రద్ధ శ్రీనాథ్ తన మార్క్ నటనతో అందరినీ ఆకట్టుకుంది. పలు సన్నివేశాలలో భావోద్వేగాలను కూడా ఎంతో బాగా పండించింది. ఇప్పటికే కన్నడంలో 'యు టర్న్' వంటి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అందరి చేత శభాష్ అనిపించుకున్న శ్రద్ధ.. తెలుగులో కూడా 'జెర్సీ' చిత్రం ద్వారా మంచి నటిగా మార్కులు కొట్టేసింది.

 

దివ్యాన్ష కౌశిక్  (మజిలీ)

నాగ చైతన్య - సమంతలు నటించిన 'మజిలీ' చిత్రంలో కథని మలుపు తిప్పే పాత్రలో నటించిన దివ్యాన్ష కౌశిక్.. తన నటన ద్వారా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకోగలిగింది. అదే సమయంలో తెలుగులో తొలి చిత్రమే అయినప్పటికి కూడా.. మంచి అభినయంతో తన పాత్రకి ఆమె న్యాయం చేసిందనే చెప్పాలి.

 

శ్రద్ధ కపూర్  (సాహో)

శ్రద్ధ కపూర్.. ఈ పేరు తెలియని వారుండరు. అయితే ఆమె హిందీలో గత 5 ఏళ్ళ నుండి నటిస్తున్నప్పటికి.. తెలుగులో మాత్రం ఈ ఏడాదే తెరంగేట్రం చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'సాహో' చిత్రం ద్వారా.. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా శ్రద్ధ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.

 

జరీన్ ఖాన్  (చాణక్య)

హిందీలో పదుల సంఖ్యలో చిత్రాలు చేసిన జరీన్ ఖాన్.. తెలుగులో మాత్రం తెరంగేట్రం చేసింది  2019 సంవత్సరంలోనే. ఈ సంవత్సరంలో గోపీచంద్ హీరోగా వచ్చిన 'చాణక్య' చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేయడం జరిగింది. మరి ఈ చిత్రం తర్వాత.. మరిన్ని తెలుగు చిత్రాలు ఆమె చేసే అవకాశం ఉందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.

 

సలోని మిశ్రా  (ఫలక్ నుమా దాస్)

హైదరాబాద్ నగర్ సంస్కృతిని ప్రతిబింబించేలా తెరకెక్కించిన 'ఫలక్ నుమా దాస్' చిత్రంలో నటించి.. తెలుగు తెరకి పరిచయమైన నటి సలోని మిశ్రా. ఈ సినిమాతో ఆమెకి తెలుగులో మంచి అవకాశాలు రావచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

వివాదాస్పద వెబ్ సిరీస్ "లస్ట్ స్టోరీస్" తెలుగు వెర్షన్‌లో.. అందాల భామ ఈషా రెబ్బా ..!

 

శృతి శర్మ  (ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ)

ఈ 2019 సంవత్సరంలో విడుదలైన చిత్రాలలో.. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు ముందుకి వచ్చి అపూర్వ విజయాన్ని అందుకున్న చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'.. ఈ చిత్రం మొత్తం కూడా హీరో పక్కనే ఉంటూ.. కథనంలో కూడా కీలక భాగస్వామైన పాత్రలో శృతి శర్మ నటించింది. ఈమె అభినయం సినిమాకి ఒక రకంగా ప్లస్ అనే చెప్పాలి.

 

అన్య సింగ్  (నిను వీడని నీడను నేనే)

బాలీవుడ్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ పరిచయం చేసిన నటి అన్య సింగ్. అయితే ఆమెకి హిందీలో పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికి.. తెలుగులో మాత్రం ఓ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ చిత్రమే - నిను వీడని నీడను నేనే. ఇందులో ఆమె పాత్రకి మంచి మార్కులే పడ్డాయి.

 

సాష ఛెత్రి  (ఆపరేషన్ గోల్డ్ ఫిష్)

ఎయిర్ టెల్ గర్ల్‌గా దేశవ్యాప్తంగా పేరుపొందిన సాష ఛెత్రి.. ఈ ఏడాది తెలుగులో నటిగా తెరంగేట్రం చేసింది. కశ్మీర్ నేపథ్యంలో సాగే కథలో... ఆమెకి కీలక పాత్ర సైతం లభించింది. మరి ఈ చిత్రం తర్వాత.. ఆమెకి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

 

వీరేనండీ.. 2019లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన.. టాప్ 10 నటీమణులు. మరి ఇందులో ఎంతమంది తమ కెరీర్ సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తారు అనేది కాలమే చెప్పాలి. 

తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తమిళ హీరోలు & దర్శకులు ఎవరో తెలుసా...