ఈ సులభమైన పనులతో.. ప్రతి వారం కొంత డబ్బు పొదుపు చేయండి..

ఈ సులభమైన పనులతో.. ప్రతి వారం కొంత డబ్బు పొదుపు చేయండి..

7 easy ways to save money every week

మనలో చాలామంది నెలలో మొదటి వారం గడిపినట్లుగా.. ఆఖరి వారం గడపలేరు. మొదటి వారం జీతం రాగానే ఎక్కువగా ఖర్చు చేసేసి.. ఆఖరి వారం వచ్చాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా  సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ప్రతి వారం కొన్ని ఖర్చులను తగ్గించుకొని.. మిగిలిన డబ్బును పొదుపు చేస్తే చాలు.. ఆఖరి వారంతో పాటు.. అత్యవసర సమయాల్లోనూ డబ్బు కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. అయితే.. దీనికి మీరు చేయాల్సిందల్లా.. మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకోవడమే. 

1. చిల్లర దాచేయండి..

ప్రతి రోజు మన దగ్గర ఎంతో కొంత చిల్లర మిగులుతుంది. కిరాణా షాపులో వస్తువులు తీసుకున్నప్పుడు లేదా బయట ఎక్కడైనా టీ, కాఫీ తాగినప్పుడు.. మన వద్ద ఎన్నో కొన్ని చిల్లర నాణేలు లేదా నోట్లు మిగలడం సహజం. ఇలాంటి చిల్లరను మనం మళ్లీ మరో దగ్గర వాడుతుంటాం. కానీ అలా కాకుండా.. ఈ చిల్లరను ఎప్పటికప్పుడు జమ చేయండి. పైగా మీ రోజువారీ ఖర్చులోనే ఈ చిల్లరను కూడా లెక్కబెట్టేస్తారు కాబట్టి.. పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలో ప్రతి రోజు మీ దగ్గర మిగిలే  పది, ఇరవై రూపాయల నోట్లు లేదా రెండు, ఐదు రూపాయల నాణేలను ఒకచోట భద్రపరచండి.  ఏవైనా అనుకోని ఖర్చులకు.. ఇలా ఆదా చేసిన డబ్బును వాడవచ్చు. 

2. ప్రతి వారం పార్లర్ కా?

మనలో చాలామంది వారానికోసారి లేదా రెండు వారాలకు ఒకసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వ్యాక్సింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఆ విధంగా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ దీనికోసం పార్లర్‌కి తరచూ వెళ్లడం వల్ల.. మీ బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. అందుకే హెయిర్ రిమూవల్ కోసం ఎపిలేటర్‌ని ఉపయోగించవచ్చు. మీరు కాస్త కష్టపడి.. దీంతో మీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలు.. చాలా ఎక్కువ మొత్తం పొదుపు చేసుకోవచ్చు.

3. స్నాక్స్, నీళ్లు తీసుకెళ్లండి.

మీరు బయటకు వెళ్లేముందే మీ వెంటే మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్‌తో పాటు.. ఓ వాటర్ బాటిల్‌ని తీసుకెళ్లండి. పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో పాటు.. హెల్తీ బిస్కట్స్ వంటివి కూడా తీసుకెళ్లవచ్చు. ఇలా చేయడం వల్ల..  అటు ఆరోగ్యం బాగుండడంతో పాటు డబ్బులు కూడా మిగులుతాయి. బయటకు వెళ్లినప్పుడు ఆకలి వల్ల లేదా బోర్ డమ్ వల్ల ఏదైనా చిరుతిండి తినాలనిపించినా.. డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది.

4. కాఫీ పెట్టుకొని తాగండి..

కాఫీ తాగాలని అనిపించినప్పుడల్లా.. మీ కెఫెటేరియా లేదా బయట కాఫీ షాప్‌‌లోకి అడుగుపెట్టడం వల్ల.. డబ్బు ఖర్చు తప్ప మరో ఉపయోగం ఏమీ ఉండదు. దీనికి బదులు ఉదయం, సాయంత్రం.. రోజూ ఇంట్లోనే మంచి కాఫీ పెట్టుకొని తాగండి. దీని వల్ల కొంత డబ్బు ఆదా అవుతుంది. ఎప్పుడో ఒకసారి కావాలంటే.. బయటకు వెళ్లి మీ ఫేవరెట్ కాపచ్చినో వంటివి తాగచ్చు. 

5. ప్రయాణాలు ఇలా..

నేను రోజూ ఆఫీస్‌కి క్యాబ్‌లో వెళ్లేదాన్ని. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌ ద్వారా ప్రయాణిస్తే.. ఈ మొత్తం మరింత తక్కువవుతోందని భావించి దానికి మారిపోయాను. మీరూ ఇలా ప్రయత్నించవచ్చు. ఒకవేళ మీ ఆఫీస్ ఉన్న ప్రదేశానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం సరిగ్గా లేకపోతే షేర్ క్యాబ్ తీసుకోండి. లేదా కార్ పూలింగ్ చేసుకోండి. దీనివల్ల తక్కువ ఖర్చు అవుతుంది. రోజూ ప్రయాణం చేసే వారికి ఓలా , ఊబర్ సంస్థలు పాస్‌లు అందిస్తున్నాయి. ఇందులో చాలా డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.

6. లిస్టు తయారు చేసుకోండి.

సూపర్ మార్కెట్‌కి నాలుగు వస్తువులు కొనడానికి వెళ్లి.. పది వస్తువులతో తిరిగి రావడం మనలో చాలామంది చేసే పనే. ఇందులో ఎక్కువగా జంక్ ఫుడ్ ఉంటుంది. ఇది అటు ఆరోగ్యానికి మంచి కాదు.. ఇటు మన బడ్జెట్‌కి కూడా మంచిది కాదు. అందుకే సూపర్ మార్కెట్‌కి వెళ్లేముందు లిస్ట్ రాసుకోవడం వల్ల చాలా ఖర్చులు తగ్గించుకోవచ్చు.

7. డేటా ప్లాన్ మార్చండి.

మామూలుగా మనం తక్కువ ఖర్చుతో రీఛార్జ్ అయిపోవాలని.. మొబైల్ డేటా తక్కువగా వచ్చే ప్లాన్‌ని ఎంచుకుంటాం. ఆ తర్వాత అది అయిపోగానే మళ్లీ డేటా అవసరం కాబట్టి.. మరోసారి రీఛార్జ్ చేయిస్తాం. ఇలా నెలకు ఒకటికి రెండు సార్లు రీఛార్జ్ చేయించడం వల్ల ఖర్చు పెరుగుతుంది. దీనికి బదులు ముందే కాస్త ఖర్చు ఎక్కువైనా.. ఎక్కువ రోజులు వచ్చేలా డేటా, టాక్ టైం రెండింటినీ అందించే ప్లాన్ తీసేసుకోవడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.