మీ బ్యూటీ కంటెయినర్‌ని.. తిరిగి ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా?

మీ బ్యూటీ కంటెయినర్‌ని.. తిరిగి ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా?

ప్లాస్టిక్ (plastic)వల్ల మన పర్యావరణానికి ఎంత నష్టమో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ని ఎలా తగ్గించాలో ఆలోచిస్తూ ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి మాత్రమే ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మీరు కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు మీ వంతుగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే బీచ్ క్లీనింగ్, మొక్కలు నాటడం, గ్రీన్ ర్యాలీలు వంటివి చేయడంతో పాటు.. మీరు వ్యక్తిగతంగా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ భూమిలో కరిగిపోదు. నీటిలో కొట్టుకుంటూ పోయి నదులు, సముద్రాలను నాశనం చేస్తుంది. అందులో ఉన్న జీవ రాశులకు హాని కలిగిస్తుంది.

అలాగే మనం ఉపయోగించే ప్రతి బ్యూటీ ఉత్పత్తి కూడా ప్లాస్టిక్ డబ్బాలు, ట్యూబుల్లోనే రావడం వల్ల.. వాటిని ఉపయోగించగానే పడేస్తే ప్లాస్టిక్ వేస్ట్ పెరుగుతుంది. అందుకే వీలైనంత మేరకు ఈ ప్లాస్టిక్ డబ్బాలను (containers) తిరిగి ఉపయోగించే ప్రయత్నం చేయండి. కొన్ని బ్యూటీ బ్రాండ్లు ఇప్పటికే ప్లాస్టిక్ బదులుగా.. గాజును ఉపయోగిస్తుంటే.. మరికొన్ని సంస్థలు మాత్రం ప్లాస్టిక్ ఖర్చు తక్కువ కాబట్టి దాన్నే ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

సంస్థలు ఎంతగా ప్రయత్నించినా.. లేక పట్టించుకోకపోయినా వ్యక్తిగతంగా పర్యావరణానికి హాని కలగకుండా మనం ప్రయత్నించవచ్చు. అందులో మొదటగా ప్లాస్టిక్ ఉపయోగించని బ్రాండ్లను వాడడం మంచి పద్ధతి. కానీ అన్నింటినీ అలా ఉపయోగించలేకపోతే.. వీలైనంత తక్కువగా ప్లాస్టిక్‌ని వాడాల్సి ఉంటుంది. వాడిన తర్వాత కంటెయినర్ డస్ట్ బిన్‌లో పడేయకుండా దాన్ని తిరిగి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

1. టోనర్, మేకప్ రిమూవర్..

ఏ కంటెయినర్ ఉపయోగించాలన్నా.. దాన్ని ముందుగా బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. దాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి పూర్తిగా పొడిగా తయారయ్యేలా చేయాలి. ఓ గుండ్రని స్కిన్ కేర్ కంటెయినర్ తీసుకొని దాన్ని పొడిగా తుడుచుకోవాలి. ఆ తర్వాత కాటన్‌తో తయారుచేసిన ప్యాడ్స్.. చిన్న ముక్కలుగా చేసుకొని.. అందులో ఒక దానిపై మరొకటి పెట్టాలి. అందులో మేకప్ రిమూవర్ లేదా టోనర్ వేసుకొని.. ఒక్కోసారి ఒక్కో కాటన్ ప్యాడ్ తీసి ఉపయోగించుకోవచ్చు. కావాలంటే బేబీ ఆయిల్ వంటివి కూడా వేసి ఉంచవచ్చు. దానితోనూ మేకప్ తుడుచుకోవచ్చు. తర్వాత దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

2. ఫ్లవర్ వేజ్ మాదిరిగా

పెద్ద మూత ఉన్న సిలిండ్రికల్ జార్స్ మీ దగ్గర మిగిలిపోతే దానిని.. మీ ఇంటి అందాన్ని పెంచడానికి ఉపయోగించండి. అందులో మట్టి నింపి.. మరీ పెద్దగా పెరగని పూల మొక్కలు అందులో నాటండి. దాని చుట్టూ తాడు చుట్టి మీ ఇంట్లో అక్కడక్కడా వేలాడదీయండి. చిన్న చిన్న ఎడారి మొక్కలు నాటి ఇంట్లో ఒక దగ్గర ఉంచండి. కాస్త సూర్యరశ్మి.. మరికాస్త నీళ్లు ఉంటే చాలు.. మొక్కలు మీ ఇంటికి మంచి అందాన్నిస్తాయి. ఇక షాంపూ బాటిల్, లోషన్ వంటి సన్న మూత ఉన్న జార్స్‌లో నీళ్లు పోసి.. కొన్ని పూలు పెట్టి దాన్ని ఫ్లవర్ వేజ్‌లా ఉపయోగించండి.

3. ఫేషియల్ మిస్ట్ కోసం..

ఫేషియల్ మిస్ట్ మన చర్మాన్ని తాజాగా ఉంచేందుకు.. ఎండ బారిన పడినా తట్టుకునేందుకు తోడ్పడుతుంది. అయితే దీన్ని మార్కెట్లో కొనాలంటే చాలా ఖర్చవుతుంది. అయితే ఒక్క బాటిల్ కొన్నాక.. అదే డబ్బాలో మీరు ఇంట్లో సులభంగా తయారుచేసుకున్న ఫేషియల్ మిస్ట్ ద్రావణం పోసి పెట్టుకోండి.

నా ఫేవరెట్ అయితే గ్రీన్ టీ మిస్ట్. దీన్ని తయారుచేయడం చాలా సూపర్ ఈజీ. ఇందులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జిడ్డు, కాంబినేషన్ చర్మానికి చక్కటి ఎంపిక. ఇది మీ చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి గంట సేపు అలాగే ఉంచాలి. ఈ నీటిని చల్లార్చి.. అందులో విటమిన్ ఇ ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

4. ఫేస్ ప్యాక్స్ కోసం..

ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్స్‌ని మనలో చాలామంది ప్రయత్నించే ఉంటారు. అయితే వాటిని అప్పటికప్పుడు తయారు చేసుకొని వాడడం.. మిగిలింది పడేయడం చేస్తుంటారు. అయితే మీరూ ఇలాంటివి ప్రయత్నించిన వాళ్లే అయితే.. వాడిన తర్వాత మిగిలిన పదార్థాన్ని పడేయకుండా.. గుండ్రని క్రీమ్ లేదా ఫేస్ ప్యాక్ కంటెయినర్స్‌లో నింపి ఫ్రిజ్‌లో పెట్టండి. ఉదాహరణకు తాజాగా పసుపు, తేనె, చందనం, పాలు కలిపి ముఖానికి పట్టించుకోవచ్చు. దీంతో చర్మానికి మంచి మెరుపు వస్తుంది. మిగిలిన పేస్ట్‌ని పాత కంటెయినర్‌లో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దాన్ని తిరిగి వారం తర్వాత.. మళ్లీ అప్లై చేసుకోవచ్చు. అచ్చం మొదటిసారి ఉపయోగించినప్పుడు.. ఎలాంటి మెరుపు సొంతమవుతుందో.. ఆ తర్వాత కూడా అలాగే తయారవుతుంది.

5. పిగ్గీ బ్యాంక్ ..

గుండ్రని పెద్ద జార్ మీ దగ్గర ఉంటే.. దాన్ని పిగ్గీ బ్యాంక్‌గా ఉపయోగించండి. ఇంట్లో ఉన్న చిల్లర మొత్తం అందులో వేసి దాచుకోవచ్చు. ఈ చిల్లర మీకు అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుంది. చిన్న చిన్న కొనుగోళ్లకు ఈ చిల్లరను ఉపయోగించడం వల్ల.. దాన్ని ఖర్చు చేయవచ్చు. చిల్లరను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా.. ఇలా ఒక దగ్గర ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అయితే ఇలా ఉపయోగించే ముందు.. కొన్ని బ్యూటీ ఉత్పత్తుల సంస్థలు పాత కంటెయినర్ తీసుకొని కొత్త ఉత్పత్తికి కొంత మొత్తాన్ని తగ్గించి ఇస్తున్నాయి. అలాంటివి కూడా ఓసారి ప్రయత్నించి చూడండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.