ADVERTISEMENT
home / Home & Garden
ఈ రంగురంగుల ముగ్గులు.. మీ ఇంటికి పండగ శోభను తెచ్చిపెడతాయి

ఈ రంగురంగుల ముగ్గులు.. మీ ఇంటికి పండగ శోభను తెచ్చిపెడతాయి

రోజూ ఉదయాన్నే లేచి ఇంటి ముందు బియ్యప్పిండి, రంగులతో ముగ్గులు (rangoli)వేయడం మన తెలుగు సంప్రదాయం. తెల్లవారకముందే ఇంటిముందు ముగ్గులు వేయడం మన మహిళల అలవాటు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ముగ్గు వేయడానికి ఉదయాన్నే లేచి వాకిలి మొత్తం ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గు వేయడం మన శరీరానికి మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. అంతే కాదు.. ఉదయాన్నే లేవడం వల్ల ప్రశాంతమైన వాతావరణం చూస్తూ ఆహ్లాదంగా రోజు ప్రారంభించవచ్చు. ఉదయాన్నే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

 

అసలు ముగ్గు మొదట ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కానీ మన పురాణాల్లో ముగ్గు గురించి చెప్పిన మాటలు ఉన్నాయి. సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలు గీయడంతో ఈ ముగ్గులు ప్రారంభమయ్యాయట. ఇవి సింధూ నాగరికతలో కూడా ఉన్నాయని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. మొదట్లో రామాయణ, భాగవతాలను ముగ్గులో గీయడం కూడా జరిగేదట. ఆ తర్వాతే మామూలు ముగ్గులు ప్రారంభమయ్యాయి. తరతరాల నుంచి వస్తున్న ఈ కళారూపాన్ని అరవై నాలుగు కళల్లో ఒకటిగా చేర్చారు. ముగ్గు వేయడం శరీరానికి వ్యాయామం మాత్రమే కాదు.. మనసుకు మంచి మెడిటేషన్ లా ఉంటుందట. చుక్కలు పెట్టి వాటిని కలపడానికి వాటి గురించే ఆలోచిస్తుంటాం.

ADVERTISEMENT

కాబట్టి కొంత సమయం పాటు మిగిలిన అన్ని విషయాలను మర్చిపోయి కేవలం ముగ్గు గురించే ఆలోచిస్తూ ఉంటాం. పైనున్న నక్షత్ర మండలం కింద కనిపించేలా ఈ ముగ్గు మనకు జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా జీవించాలనే సిద్ధాంతాన్ని కూడా చెబుతుంది. ఈ రోజు వేసిన ముగ్గు ఎంత అందంగా ఉన్నా.. అందులో రంగులు, పూలు ఎన్ని వేసి తయారుచేసినా మరుసటి రోజుకి ఆ ముగ్గును చెరిపేసి వాకిలి ఊడ్చి కొత్త ముగ్గు వేయాల్సిందే. మన జీవితంలో కూడా గతం ఎంత అందమైనదైనా.. లేక ఇబ్బందికరమైనదైనా దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని ముగ్గు చెబుతుంది.

ముగ్గుల్లో రకాలు

ముగ్గులు మహిళల్లోని ఊహా శక్తిని, సృజనాత్మకతను చాటే డిజైన్లుగా చెప్పుకోవచ్చు. ఇంటి వాకిలినే కాన్వాస్ గా మార్చుకొని మహిళలు వేసే పెయింటింగ్స్ ఈ ముగ్గులు.. వీటిలో మహిళలను తలదన్నే వారు ఎవరూ ఉండరు. ఒకప్పుడు స్త్రీలు చదువుకోవడానికి వీల్లేదు. నాట్యం వంటివి కూడా చేయడానికి వీలుండేది కాదు. ఇక వారికి వీలున్నదల్లా పాటలు పాడడం, ముగ్గులు వేయడం.. అలా నాగరికత తెలియని రోజుల నుంచే ముగ్గులను వేస్తూ తమ మనసులోని ఊహలను బయటపెట్టేవారు మహిళలు.

ADVERTISEMENT

కానీ ఈ ముగ్గుల్లోనూ ఎన్నో రకాలున్నాయి అని మీకు తెలుసా? రోజూ వేసే ముగ్గులు వేరు.. ధనుర్మాసం ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, దీపావళి, దసరా వంటి వేడుకలకు వేసే ముగ్గులు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఏ పండగ అయినా ఇంటికి ఆ పండగ కళ రావాలంటే ఇంటి ముందు రంగురంగుల రంగవల్లిక ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే ఈ ముగ్గుల్లో ఎన్ని రకాలుంటాయో తెలుసుకుందాం రండి..

చుక్కల ముగ్గులు

ముగ్గు కేవలం తెలుగు వారి సంప్రదాయం మాత్రమే కాదు.. వివిధ రాష్ట్రాల్లో ముగ్గులు కనిపిస్తాయి. తమిళులు వీటిని కోళం అంటారు. కన్నడిగులు రంగవల్లి అంటే.. కేరళలో విడల్ అని, మధ్యప్రదేశ్ లో చౌక పూర్ణ అని, గుజరాత్ లో సథియా అని పిలుస్తారు. ఇంటి ముందు వేసే ముగ్గుల్లో చుక్కల ముగ్గులు చాలా ముఖ్యమైనవి.. ఈ చుక్కల ముగ్గుల్లోనూ రకాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

సంప్రదాయ ముగ్గు – ఇది ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను వరుసగా పెట్టి వాటిని కలుపుతూ వేస్తారు. ఇందులో పూలు, జంతువులు, రకరకాల వస్తువులు వచ్చేలా ముగ్గు వేస్తుంటారు.

ADVERTISEMENT

మెలిక ముగ్గు – మామూలుగా వేసే సంప్రదాయ ముగ్గులో చుక్కలను కలుపుతూ వేస్తారు. ఈ ముగ్గును వంపులు తిప్పుతూ వేయడం మాత్రమే కాదు.. కొన్ని చుక్కలను కలపడం.. మరికొన్ని చుక్కలను మధ్యలో ఉంచుతూ వేయడం జరుగుతుంటుంది.

పిండితో వేసే ముగ్గు – సాధారణంగా ముగ్గు వేయడానికి బియ్యప్పిండిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం దీంతో పాటు ప్రస్తుతం బట్టీలో తయారు చేసినది, నత్త గుల్లలు, ముగ్గు రాళ్లను పొడి చేసి ముగ్గు వేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ పండగల సమయంలో మాత్రం సంప్రదాయబద్ధంగా పిండితోనే ముగ్గును పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.


ఈ ముగ్గులను చుక్కల సంఖ్య ఆధారంగా వివరిస్తారు. 21 చుక్కల ముగ్గు, ఆరు చుక్కల ముగ్గు.. చుక్క విడిచి చుక్క.. మధ్య చుక్క అంటూ ఈ ముగ్గును వివరిస్తుంటారు.

బాత్ రూమ్‌ను ఆహ్లాదంగా మార్చేసే.. అలంకరణ వస్తువులు ఇవే..!

ADVERTISEMENT

డిజైన్ ముగ్గులు

సాధారణంగా వేసే ముగ్గుల్లో చుక్కలు పెట్టి వాటిని కలుపుతూ ముగ్గు వేయడం మనం చూస్తుంటాం. కానీ అవేవీ లేకుండా కేవలం డిజైన్ నేరుగా వేస్తూ వేసే ముగ్గు ఈ డిజైన్ ముగ్గు. ఈ డిజైన్ మధ్యలో కావాలంటే రంగులు వేసుకొని నింపుకోవచ్చు. లేదా అలాగే ఉంచేయొచ్చు.

ఫ్లోరల్ ముగ్గులు

మామూలుగా చుక్కల ముగ్గు లేదా డిజైన్ ముగ్గులు ఏవి వేసినా వాటిని రంగులతో నింపడం సంగతి మనకు తెలిసిందే. అయితే వాటిని పూలతో నింపితే ఇంటికి ప్రత్యేకమైన పండగ కళ వచ్చేస్తుంది. దీనికోసం పూలు, పూల రెక్కలు ఉపయోగిస్తారు. గులాబీ, చామంతి, బంతి, కలువ పూలతో పాటు కరివేపాకు, మామిడి ఆకు వంటి వాటిని ముక్కలు చేసి వేయడం కూడా చేస్తుంటారు. సాదారణంగా ఓనమ్, దీపావళి పండుగకు ఇలాంటి ముగ్గులు వేయడం సహజంగా జరుగుతుంది.

ADVERTISEMENT

ఫ్లోటింగ్ రంగోలీ

మామూలు ముగ్గులకు ఇది విభిన్నం. ఇందులో భాగంగా రంగోలీ ని నీటిపై వేస్తారు. ఓ వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో నీటిపైన తేలియాడేలా కొద్ది కొద్దిగా ముగ్గు పొడి, రంగులను వేసి ముగ్గు పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఈ గిన్నెను పూలతో డెకరేట్ చేయడం వల్ల ప్రత్యేకమైన లుక్ అందుతుంది. పూల రెక్కలను కూడా ఈ ముగ్గుపై వేయడం చూడొచ్చు. దీపావళి పండుగ సందర్భంగా ఇలాంటి ముగ్గులు వేసి దీపాలు పెట్టడం కనిపిస్తుంది.

బీడ్స్, కుందన్స్ తో చేసిన ముగ్గు

సాధారణంగా ముగ్గును ముగ్గు పిండి, రంగులు, పూలతో వేయడం చూస్తుంటాం. కానీ ముగ్గు మరింత అందంగా కనిపించేందుకు అందులో కుందన్లు, స్టోన్స్ వంటివి పెట్టి ముగ్గు వేస్తుంటాం. ఇవి మాత్రమే కాకుండా గ్లాస్ పై కేవలం కుందన్స్ సాయంతో వేసే ముగ్గులు కూడా ఉంటాయి. ఇవి కూడా ఇంటికి అందమైన లుక్ తీసుకొస్తాయి.

ADVERTISEMENT

ఫ్రీ హ్యాండ్ రంగోలీ

కొన్ని రకాల ముగ్గులకు ముగ్గు పొడి అవసరం ఉండదు. కేవలం రంగుల సాయంతో వాటిని రూపుదిద్దవచ్చు. ఇలాంటి ముగ్గులను ఫ్రీహ్యాండ్ రంగోలీ అంటారు. వీటిలో భాగంగా నాలుగైదు రంగులను ఎంచుకొని ఒకదాని పక్కన మరొకటి వేస్తూ రంగవల్లిక ను పూర్తి చేస్తారు. నునుపుగా ఉండే చోట ఎక్కువగా వేసే ఈ రకం ముగ్గులు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి కూడా.

మీరు పెట్ పేరెంటా? ఈ పెట్ ఫ్రెండ్లీ మొక్కలతో ఇంట్లో పచ్చదనాన్ని నింపేయండి

రంగుల ముగ్గులు

రంగుల ముగ్గులు సాధారణంగా ప్రతి రోజు కాకుండా ఏదైనా ప్రత్యేకమైన రోజు ఉంటే ఆ సందర్భంగా వేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. చుక్కలతో ముగ్గు వేసి లేదా డిజైన్ ముగ్గులు వేసి ఇలాంటివి వేస్తూ ఉంటారు. ఇందులో రంగులను చేత్తో లేదా చిన్న పాటి జల్లెడ సాయంతో వేయడం వల్ల ముగ్గుకు చాలా అందమైన లుక్ వస్తుంది.

ADVERTISEMENT

ప్రింటింగ్ ముగ్గులు

గతంలో అయితే మహిళలందరికీ ముగ్గులు వేయడం వచ్చేది. కానీ ఇప్పుడు మనలో చాలా మంది ముగ్గులంటే ఏంటో తెలియకుండా ఉన్నారు. అపార్ట్ మెంట్ కల్చర్ వల్ల ముగ్గు వేయడానికి పెద్ద స్థలం కూడా ఉండడం లేదు. ఉన్న స్థలంలోనే చిన్నగా ముగ్గు వేసేందుకు వీలుగా స్టెన్సిల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని నేలపై పెట్టి ప్రింటింగ్ ప్రెస్ లో అచ్చు వేసినట్లుగా వీటిపై రంగు వేసి రుద్దితే సరిపోతుంది. ముగ్గు నేలపై పడిపోతుంది. వీటిని వేయడం నిమిషాల్లో పని. ఎక్కువ సమయం లేనివారు కూడా దీన్ని ఎంచుకోవచ్చు.

పెయింట్ తో వేసే ముగ్గులు

పెయింట్ తో వేసే ముగ్గులను ఎక్కువగా దేవాలయాల్లో చూస్తుంటాం. మనలో చాలామంది ముగ్గు ఎప్పటికీ చెరిగిపోకూడదు అనుకుంటూ ఉంటారు. ఇలాంటివారు పెయింట్ తో ముగ్గు వేయడం వల్ల అది చాలా కాలం పాటు అలా నిలిచి ఉంటుంది. ఇందులో రంగులు కూడా నింపి ఉంచవచ్చు. దీనివల్ల ఇల్లు అందంగా కనిపిస్తుంది. రోజూ ఇంటి ముందు ముగ్గు పెట్టేందుకు సమయం లేనివారు కూడా ఇలా చేసుకోవచ్చు.

ADVERTISEMENT

పండగలకు వేసే ముగ్గులు

మామూలుగా వేసే ముగ్గులకు పండగ సమయంలో వేసే ముగ్గులకు చాలా తేడా ఉంటుంది. దీపావళి వేసే దీపాల ముగ్గులు, పూల ముగ్గులతో పాటు ధనుర్మాసంలో వేసే ముగ్గులు ప్రత్యేకంగా ఉంటాయి.

సంక్రాంతి ముగ్గులు

ADVERTISEMENT

సంక్రాంతి ధనుర్మాసంలో వస్తుంది. డిసెంబర్ లో ప్రారంభం అయ్యే ఈ నెల జనవరిలో పూర్తవుతుంది. ఈ సందర్భంగా పిండితో ముగ్గులు పెట్టి వాటిపై గొబ్బెమ్మలు పెట్టడం తెలుగింటి సంప్రదాయం. ఈ ముగ్గు చీమల్లాంటి చిన్న జీవాలకు ఆహారం అవుతుందట. గొబ్బెమ్మల వల్ల ఇంట్లోకి ఎలాంటి హానికారక క్రిములు రావని నమ్మకం. అందుకే సంక్రాంతి పండగ సందర్భంగా ఉదయాన్నే చలిలో లేచి వాకిలి శుభ్రం చేసి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. మామూలు సమయంలో వేసే ముగ్గులకు ధనుర్మాసం ముగ్గులకు చాలా తేడా ఉంటుంది. ఈ ముగ్గులను నాలుగైదు వరుసల సరళ రేఖలుగా వేస్తుంటారు.

ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఇలా వేసే ముగ్గులు చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేసే మార్గాలు అని చెబుతారు. ఈ ముగ్గుల్లో డిజైన్లకు ప్రాధాన్యం తక్కువే. ఇవి కాకుండా సంక్రాంతి కి వేరే రంగుల ముగ్గులు వేరుగా ఉంటాయి. చుక్కల ముగ్గులు వేసి వాటిలో రంగులు నింపడం మనం చూడొచ్చు. సంక్రాంతి సమయంలో వేసే ముగ్గుల్లో నాగ బంధం, గుమ్మడి కాయలు, చేపలు, పద్మాలు, కలువలు, చెరకు గడలు, తులసి కోటలతో వేసే ముగ్గులు ఎక్కువగా ఉంటాయి.

రథం ముగ్గులు

సాధారణంగా సంక్రాంతి మరుసటి రోజైన కనుమ రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగుపెట్టడానికి ప్రతీకగా ప్రతి ఇంటి ముందు రథం ముగ్గును వేస్తారు. ఈ రథం ముగ్గు కు తాడులా ఓ గీతను గీసుకుంటూ వెళ్లి పక్కింటి రథానికి కలుపుతారు. ఇలా చేయడం వల్ల స్నేహ సంబంధాలు కూడా పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు. పండుగను ఘనంగా సాగనంపేందుకు చేస్తారని మరో వాదన కూడా ఉంది. సంక్రాంతి సందర్భంలో మాత్రమే కాకుండా సూర్యభగవానుని పుట్టిన రోజైన రథ సప్తమి సందర్భంగా కూడా ఈ తరహా ముగ్గును వేయడం మనం చూడొచ్చు.

ADVERTISEMENT

ఇవే కాకుండా జన్మాష్టమి కి కృష్ణుడి పాదాలు, ఉయ్యాల వేస్తుంటారు. పూజల సమయంలో శంఖు చక్రాలు గీస్తారు. వివిధ పండగలప్పుడు ఆవు పాదాలను కూడా వేస్తుంటారు. ఏడు వారాల ముగ్గుల్లో భాగం ఆది వారం రెండు త్రికోణాలు, సోమ వారం శివపీఠం, మంగళవారం కాళీ పీఠం, బుధ వారం స్వస్తిక్, గురు వారం నక్షత్రం, శుక్రవారం కమలం, శనివారం తార వంటివి కొందరు వేస్తుంటారు.

రంగురంగుల ముగ్గులు

ముగ్గు కేవలం ముగ్గు పిండితో పెట్టడం సాధారణంగా చేసేదే. చాలామంది ఉదయం పేడ నీళ్లతో కల్లాపి జల్లి పెద్ద ముగ్గు వేస్తే సాయంత్రం కేవలం నీళ్లు మాత్రమే చల్లి చిన్న ముగ్గు వేస్తుంటారు. ఇంకొందరు రోజుకు ఒకేసారి ముగ్గు వేస్తారు. ఇది సహజంగా జరిగేది. కానీ సింపుల్ గా కాకుండా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ముగ్గు వేయాలంటే మాత్రం అందులో రంగు తప్పనిసరిగా నింపాల్సిందే. అప్పుడు ముగ్గు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీ ఇంటికి అందమైన లుక్ వస్తుంది. ఇప్పటికీ పల్లెల్లో అందరి కంటే నా ముగ్గు అందంగా ఉండాలి. చాలా పెద్దగా ఉండాలి అంటూ పోటీలు పడి మరీ ముగ్గులు పెట్టేవారు చాలామంది. పండగల సమయంలో ప్రత్యేకమైన ముగ్గులతో ఆకట్టుకోవాలంటే వీటిని ప్రయత్నించండి.

ADVERTISEMENT

సంక్రాంతి కుండల ముగ్గు

మామూలు సమయంలో వేసే ముగ్గుల కంటే సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులు విభిన్నం. పండగ కళ మొత్తం ముగ్గులో కనిపించేలా హరిదాసులు, పాల కుండలు, చెరుకు గడలు, గంగిరెద్దులు వంటివన్నీ ఉండేలా ముగ్గులు వేస్తుంటారు. వీటిలో ఎక్కువగా పాలు పొంగుతున్న కుండల ముగ్గును మాత్రం చాలామంది కనీసం ఒక్కసారైనా వేస్తారు. ఈ ముగ్గు వేయడం కూడా పెద్ద కష్టం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మాత్రం తప్పక ప్రయత్నిస్తారు. ఈ ముగ్గు వేసి మధ్యలో గొబ్బెమ్మలు, పూలు పెట్టి గొబ్బియల్లో గొబ్బియల్లో అంటూ ఆడుతూ సంక్రాంతి శోభను ఇంటి ముందుకు తీసుకొచ్చేస్తారు.

నెమలి డిజైన్ ముగ్గు

ఇప్పుడు చాలామంది ఇంటి ముందు డిజైన్ రంగోలీ వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివాటిలో నెమలి డిజైన్, పూల డిజైన్ ముఖ్యమైనవి. వీటిని వేయడానికి ముగ్గు పిండిలో కానీ ఇసుకలో కానీ రంగులు కలిపి వేయాల్సి ఉంటుంది. అన్ని రంగులు ఒక్కచోట వేసిన తర్వాత నెమలి కంటే అందమైన డిజైన్ ఇంకోటి ఉండదని చెప్పవచ్చు.

ADVERTISEMENT

మిక్స్ కలర్ రంగోలీ

ఈ రకమైన ముగ్గులో భాగంగా ముందు ముగ్గును ఒక రంగుతో నింపి ఆ తర్వాత దానిపై మరో రంగు వేసి రుద్దడం వల్ల కలర్ కాంబినేషన్ ఏర్పడుతుంది. ముందుగా చుక్కల్లా పెట్టి వాటిని డిజైన్ లా చేసే తరహా ముగ్గులకు ఈ మిక్స్ డ్ కలర్స్ నప్పుతాయి.

రెయిన్ బో రంగోలీ

ఒకటి రెండు రంగులు కాకుండా.. రకరకాల రంగులు వేసి ఇంధ్ర ధనస్సులా రూపొందించడమే ఈ ముగ్గుల్లోని ముఖ్యాంశం. రంగులన్నీ వేసి ఇంటి ముందు హరివిల్లును ఆవిష్కరించడంతో ఇంటి లుక్ ని మార్చేయడం ఈ కొత్త రకం ముగ్గులకే చెల్లుతుంది.

ADVERTISEMENT

తరచూ అడిగే ప్రశ్నలు

1. ముగ్గు వేసే ముందు దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి?

స్వస్తిక్, ఓం వంటి ముగ్గులను తులసి కోట వద్ద మాత్రమే వేయాలి. ఇంటి ముందు అందరూ తొక్కే ప్రదేశం లో వేయకూడదు. లక్ష్మీ దేవి పాదాలు వేస్తే అవి లోపలికి వస్తున్నట్లు మాత్రమే వేయాలి. ముగ్గులు వేసినప్పుడు వాటికి చుట్టూ బోర్డర్ గా గీతలు తప్పనిసరిగా పెట్టాలి. దక్షిణం వైపు దిశ ఉండేలా ముగ్గులను వేయకూడదు.

2. ముగ్గు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

ADVERTISEMENT

ముగ్గు వేయడం చాలా రకాలుగా ప్రయోజనకరం.. ఇది మన ఆరోగ్య పరంగా, శాస్త్రీయ పరంగా మాత్రమే కాదు సంప్రదాయబద్ధంగానూ ముఖ్యమైనవి.

* ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివాసం ఉంటుందట. దీంతో చెడు శక్తులేవీ ఇంట్లోకి అడుగుపెట్టవు. తద్వారా ఇంట్లో ఎప్పుడూ ఆనందం, ఐశ్వర్యం నిండి ఉంటాయి. మామూలుగా పొందే ఆశీర్వాదాలకు మూడు రెట్లు ముగ్గు వేయడం వల్ల పొందవచ్చట.

* ఉదయాన్నే చల్ల గాలిలో లేచి వాకిలి ఊడవడం, కళ్లాపి జల్లడం, వంగుని లేదా కూర్చొని ముగ్గు వేయడం శరీరానికి మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. ఉదయం గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ మన మెదడు వేగంగా పని చేసేలా చేస్తుంది. ముగ్గు వేయడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ఈ సమయంలో వేరే పని గురించి ఆలోచించడం కుదరదు. అందుకే ఈ సమయం మెడిటేషన్ గా ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాదు.. ముగ్గు ఊహా శక్తిని, తెలివితేటలను పెంపొందిస్తుంది.

* బియ్యప్పిండి తో పెట్టే ముగ్గు వల్ల చిన్న చిన్న చీమలు, పురుగుల వంటి వాటికి ఆహారం దొరుకుతుంది. వేల మందికి ఆహారం పెట్టే స్థోమత అందరికీ ఉండదు. కానీ ఇలా బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల వేల జీవాలకు ఆహారం పెట్టినట్లవుతుంది. అంతే పుణ్యఫలం లభిస్తుంది.

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్ ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

19 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT