2019 Tollywood Review : అభిమానుల అంచనాలు పెంచాయి.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి

2019 Tollywood Review : అభిమానుల అంచనాలు పెంచాయి.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి

(Top 6 Movies in Tollywood which disappointed their fans and audience)

ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో చిత్రాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన చిత్రాల్లో కొన్నింటిపై ప్రేక్షకులకు ప్రత్యేకమైన అంచనాలుంటాయి. కొన్ని సినిమాలు అయితే.. ప్రి రిలీజ్‌కు ముందే విపరీతమైన క్రేజ్‌‌ను సొంతం చేసుకోగా.. మరికొన్ని చిత్రాలు మాత్రం కచ్చితంగా విజయం సాధిస్తాయనే నమ్మకాన్ని అభిమానులకు విడుదలకు ముందే కలిగించేస్తాయి.

అయితే అప్పుడప్పుడు ప్రేక్షకుల ఆశలు  గల్లంతవుతుంటాయి. ఎందుకంటే కొన్ని సార్లు.. కొన్ని సినిమాల కథలు ప్రేక్షకులను మెప్పించలేకపోవచ్చు. మరి కొన్నిసార్లు కథ, కథనం కూడా పక్కదారి పట్టి.. సినిమాకు నష్టాన్ని చేకూర్చవచ్చు. ఏదేమైనప్పటికి ప్రేక్షకులు నిరాశ చెందితే.. నిర్మాతలకు మిగిలేది ఆర్థిక భారమే.

'ప్రేమించిన వాడితో పెళ్లికి.. 9 ఏళ్ళ పాటు నిరీక్షించిన అనసూయ'.. ఓ అందమైన ప్రేమకథ మీకోసం

2019 లో కూడా అభిమానుల అంచనాల మీద విడుదలై.. ఆ తర్వాత చతికిలబడ్డ చిత్రాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం

ఎన్టీఆర్ బయోపిక్

తెలుగు సినిమా పరిశ్రమకి పెద్దదిక్కుగా.. ఎన్నో కోట్లమంది ప్రజానీకానికి ఆరాధ్య దైవంగా వెలుగొందిన ఎన్టీఆర్ జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన ఆయన బయోపిక్ పై.. తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న మాట నిజం. అయితే  ఈ చిత్రం రెండు భాగాలు కూడా ఒకదానితో ఒకటి పొంతన లేకుండా రూపుదిద్దుకోవడంతో.. కలెక్షన్ల పరంగా సినిమా రాణించలేకపోయింది. దీనికి తోడు ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ చిత్రం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇక బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో కనిపించేసరికి.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్న వారంతా కూడా సినిమా చూసాక నిరుత్సాహానికి గురికావాల్సి వచ్చింది.

వినయ విధేయ రామ

రంగస్థలం వంటి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రంలో నటించిన తరువాత.. మంచి కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు రామ్ చరణ్. దీనితో ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా  పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందనే అందరూ భావించారు. అలాగే సంక్రాంతికి చిత్రం విడుదల కావడంతో..  వసూళ్లకు తిరుగుండదనే ఊహాగానాలు చెలరేగాయి. కానీ అవన్నీ ఊహలే అని సినిమా విడుదలయ్యాక తెలిసింది. ఆడియన్స్ ముక్త కంఠంతో ఈ సినిమాని ఫ్లాప్‌గా డిక్లేర్ చేసేశారు.

మిస్టర్ మజ్ను

వరుస ఫ్లాపులతో సరైన ఎంట్రీ కోసం తంటాలు పడుతున్న హీరో అఖిల్. ఆ పరిస్థితుల్లో ఇతన్ని డైరెక్ట్ చేయడానికి 'తొలిప్రేమ' వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి ముందుకి రావడం జరిగింది. పైగా సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ కూడా పెట్టడంతో.. ఒక మంచి ప్రేమకథతో అఖిల్ తొలి హిట్ అందుకోబోతున్నాడని అందరూ అంచనాలు వేశారు. ఇక సినిమా విడుదలయ్యాక చూస్తే మాత్రం.. హిట్ కోసం అఖిల్ మళ్లీ ఇంకొక చిత్రం వరకు వేచి చూడాల్సిందేనని తేలింది.

డియర్ కామ్రేడ్

వరుస విజయాలతో ఎంతో క్రేజ్ సంపాదించి.. ఇప్పుడు తెలుగు యువతలో అతిపెద్ద ఫాలోయింగ్ కలిగిన హీరో విజయ్ దేవరకొండ. ఈయన నుండి సినిమా వస్తుందంటే.. అది కచ్చితంగా హిట్ అవుతుందనే అనుకున్నారంతా. కానీ 'డియర్ కామ్రేడ్' అంటూ 'గీత గోవిందం' చిత్రం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. రష్మిక మంధానని ఈ సినిమాకి హీరోయిన్‌గా తీసుకోవడం జరిగింది.

అలాగే ఈ చిత్రాన్ని దక్షిణాదిలో ఉన్న నాలుగు భాషల్లో విడుదల చేసేసరికి.. అభిమానుల అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం.. చిత్రం అనుకున్న స్థాయిలో లేదని తేల్చేశారంతా. ఏదో ఊహించి థియేటర్‌కి వస్తే మరేదో చూపించారంటూ ప్రేక్షకులు ఒకింత అసహనానికి కూడా గురయ్యారు. సినిమాకి వసూళ్లు ఒక మోస్తరులో వచ్చినప్పటికీ.. విజయ్ స్థాయిలో కలెక్షన్స్ రాలేదన్నది మాత్రం అక్షర సత్యం.

"ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు" - నటి 'రాశి' ఆసక్తికర లవ్ స్టోరీ ..!

మన్మథుడు 2

17 ఏళ్ళ క్రితం విడుదలైన 'మన్మథుడు' చిత్రానికి ఇప్పటికి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఇన్ని సంవత్సరాల తరువాత.. నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' అంటూ ఒక చిత్రం వస్తుంటే.. మరోసారి వెండితెర పైన ఆ మ్యాజిక్ కనపడుతుందని ప్రేక్షకులు ఊహించారు. ఈ క్రమంలో 'మన్మథుడు' సినిమాలో మాదిరిగానే మంచి హాస్యం, పాటలు ఉంటాయని భావించి సినిమాకి వచ్చిన వారందరికీ తీరని నిరాశే ఎదురైంది.

సాహో

దాదాపు 400 కోట్ల బడ్జెట్.. అలాగే 'బాహుబలి' తరువాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో.. హిందీలో కూడా అత్యంత భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమైంది 'సాహో'. దాంతో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు సైతం ఉండడంతో.. 'సాహో' చిత్రం 1000 కోట్ల మార్కు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు సైతం భావించాయి. చివరికి సినిమా విడుదల తరువాత.. అంచనాలు కాస్త తలకిందులయ్యాయి. 1000 కోట్ల మార్కు కాస్త రూ. 430 కోట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా కచ్చితంగా 2019 సంవత్సరంలో  అందరినీ  తీవ్రంగా నిరాశపరిచిన చిత్రంగా మిగిలిపోయింది.

ఈ పైన పేర్కొన్న ఆరు తెలుగు చిత్రాలు.. 2019లో సినీ అభిమానులు, అలాగే హీరోల డై హార్డ్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచాయి.

జీవిత - రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ అనాల్సిందే